సంపుకుంట పోదామా..! - చెన్నూరి సుదర్శన్

Sampukunta podama

కనుమసక సమయం.. ఆ వీధి మలుపులో.. ఇంకా నూనూగు మీసాలైనా రాని రామిరెడ్డి, రహస్యంగా దాక్కోని దాహంరత్తయ్య షావుకారు కోసం ఎదురి చూస్తున్నాడు. అతని మనసు రగిలి పోతోంది. ‘రత్తయ్య రక్తం కళ్ళ చూడందే.. ఈ రోజు నిద్రపోను’ అన్నట్టు పళ్ళు నూరుతున్నాడు. అతని చేతిలోని కత్తి రక్తదాహం తీరేది.. ఎప్పుడెప్పుడా! అన్నట్టు తహ తహలాడుతోంది.

పదే, పదే ఉదయం జరిగిన సంఘటన రామిరెడ్డి మనసులో కదలాడుతోంది.

***

అదొక పల్లెటూరు.

నాలుగు వీధుల కూడలికి ఒక మూల మీద రత్తయ్య షావుకారు కిరాణా దుకాణముంది. ఊరంతటికీ అదే పెద్ద దిక్కు. ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు దుకాణానికి విశ్రాంతి ఉండదు.

ఆరోజు దుకాణం తెరవగానే యాదమ్మ రావడం.. ఆశ్చర్య పోయాడు రత్తయ్య. ఆమె కొడుకు రామిరెడ్డి రావడం కద్దు.

“కిలో దొడ్డు బియ్యం కావాలె సేటూ..” ఆడిగింది యాదమ్మ.

“కిలో పది రూపాయలు. అవునూ.. రామిరెడ్డి లేడా? నువ్వు వచ్చినవ్” అన్నాడు ముత్తయ్య కళ్ళు మిటకరిస్తూ.. పెదవి విరిచి. ఆ విరుపులో.. నువ్వేం కొంటావు? అని సాదృశ్యమవుతోంది.

“లేదు సేటూ.. ఒక్క పూట బళ్ళు కదా..! పొద్దుగాలనే పోయిండు. సరే గానీ.. ఇంకా తక్కువ ధరల లేవా” అంటూ బిక్కముఖం పెట్టింది.

“ఎన్కాల గిడ్డంగిల ఉన్నై. కిలో ఎనిమిది రూపాయలు చూపిస్తదా..” అని తన సహాయకారి సత్తయ్యను దుకాణంలో కూర్చో బెట్టి.. గిడ్డంగికి దారి తీశాడు. రత్తయ్యను అనుసరించింది యాదమ్మ.

“రామిరెడ్డి ఇప్పుడు ఆరో తరగతి కదా!” గిడ్డంగి తాళం తీస్తూ అడిగాడు రత్తయ్య. అవునన్నట్టుగా యాదమ్మ తలూపింది.

రత్తయ్య ఒక సంచిలో నుండి పిడికెడు బియ్యం తీసుకుని చూపిస్తున్నట్టే చూపించి.. వెంటనే తిరిగి సంచిలో పోశాడు. యాదమ్మ తృప్తి పడక వంగి బస్తాలోని బియ్యం పరీక్షించసాగింది. అదే అదునుగా యాదమ్మ వీపు మీద చెయ్యి వేశాడు రత్తయ్య.

ఎడం చేత్తో విసిరి కొట్టి.. చట్టుక్కున నిలబడింది యాదమ్మ.

“ఏంది సేటూ.. నీ కండ్లకు ఎట్ల కనబడ్తాన. నీకు అక్క, చెల్లెండ్లు లేరా?” అంటూ ఉరిమి చూసింది.

“ఎందుకు లేరే! అందరున్నరు.. పెండ్లామే లేదు. అది కాలం చేసిన సంది నేను ఉపాసమేనాయే. ఏదో అప్పుడప్పుడు నీ అసోంటోళ్ళు ఎవలైనా దయ తలిస్తే.. ఎంగిలి పడ్తాన. నువ్వు గూడా అంతే కదా!. మొగడు సత్తే మాత్రం ఉప్పూ కారం లేకుంట తిండి తింటానవా?. కడుపుకు తిండి ఎట్లనో.. ఒంటికి అదీ అంతే. అయినా మూడో కంటికీ కనబడకుండా.. నువ్వు బదునాం గాకుండా చూసుకుంటా. జరంత సేపు కండ్లు మూసుకుంటే సాలు. నీకు కావాల్సిన సౌదలన్ని జిందగి మొత్తం ఫిరీగా ఇస్తా..” అంటూ యాదమ్మను అమాంతం హత్తుకున్నాడు రత్తయ్య. అనుకోని పరిణామానికి యాదమ్మ గజ, గజా వణకింది. లిప్తకాలంలో శక్తినంతా కూడగట్టుకొని, గట్టిగా రత్తయ్యను తోసేసింది. రత్తయ్య గోడకు తల గుద్దుకొని దిమ్మ తిరిగి కూలిపోయాడు. యాదమ్మ కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.

“నేను అసోంటి దాన్ని కాదు” అని రత్తయ్య ముఖంమ్మీద కాండ్రించి ఉమ్మేసింది. కడకొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ.. బయటకు పరుగు తీసింది.

యాదమ్మ ఇంటికి వెళ్లి తలుపు తాళం తీస్తుంటే రామిరెడ్డి రావడం ఆశ్చర్య పోయింది.

“కొడుకా బడి లేదారా?. మాయిలమే వస్తివీ” అనుకుంటూ.. ఇంట్లోకి అడుగు పెట్టింది.

“లేదు. ఎవరో సత్తే సెలవిచ్చిండ్లు.. గాని నువ్వు ఎక్కడికి పోయినౌ. ముందుగాల చెప్పు” గద్దించినట్టు అడిగాడు రామిరెడ్డి.

“పురంగ ఇంట్లో బియ్యం నిండుకున్నైరా. తెద్దామని రత్తయ్య దుకాణంకు పోయిన”

“వాడు అసలే మంచోడు కాదని అందరికి తెలుసు కదా!. ఎందుకు పోయినవ్. నేను వస్తాంటే.. రత్తయ్య దుకాన్ల పనిచేసే సత్తయ్య నన్ను పిలిచి యాదమ్మను గిడ్డంగికి తీస్కపోయిండు సేటు.. అని చెప్పిండు. నేను కిటికీల నుండి జరిగిందంతా చూసిన. వాని సంగతి చెప్తా..” అంటూ కోపంగా పుస్తకాలు గూటిలోకి విసిరేసాడు.

“కొడుకా వానికి బుద్ధి చెప్పిన. నువ్వు గివన్ని పట్టిచ్చుకోకు. బుద్ధిగా సదువుకో.. జరిగింది మర్చిపోదాం. ఇంకోసారి వాని దుకాణంల అడుగు పెట్ట. సరేనా!” అని సమాధాన పర్చింది.

కాని రామిరెడ్డి సమాధాన పడలేదు.

***

సత్తయ్య ఉప్పు అందించినట్టు సరిగ్గా అదే దారిలో రత్తయ్య రావడం నిర్థారణ చేసుకున్నాడు రామిరెడ్డి. మరింత వెనక్కి నక్కి, నక్కి దాక్కున్నాడు. రత్తయ్య మూల తిరుగుతుండగా మెరుపు వేగంతో రత్తయ్య కడుపులో కత్తిని దించాడు. గావుకేక పెడుతూ.. కింద పడిపోయాడు రత్తయ్య. వాడు బతక్కూడదు. బతికితే ఊళ్ళోని ఆడవారి బతుకు ఆగమై పోతోందని, మనసులో ఆవేశ పడుతూ.. రత్తయ్య నోరు నొక్కి తిరిగి కత్తిని గొంతులో పొడిచాడు. రత్తయ్య గిల, గిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పటికే రత్తయ్య అరుపులకు నలుగురు పరుగెత్తుకుంటూ వచ్చి.. పారిపోతున్న రామిరెడ్డిని పట్టుకున్నారు. ఒకడు సైకిలు మీద వెళ్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

ఎస్సై జీపులో వాయు వేగంతో వచ్చి రామిరెడ్డిని అదుపులోకి తీసుకున్నాడు.

ఊళ్ళో అంతా రామిరెడ్డి సాహసాన్ని మెచ్చుకున్నారు కాని న్యాయ వ్యవస్థకు కావాల్సింది నేరస్థులను శిక్షించడం. రామిరెడ్డికి పది సంవత్సరాలు జైలుశిక్ష పడింది.. కోర్టు కనికరించి ఒక వెసులుబాటు కలిగించింది. శిక్ష అనంతరం రామిరెడ్డికి ప్రభుత్వం మానవతా దృష్ట్యా ఏదైనా ఒక జీవనోపాధి చూపించాలని తీర్పులో పేర్కొంది. రామిరెడ్డిని బాలనేరస్థుల కారాగారానికి తరలించారు.

ఆ బెంగతో యాదమ్మ ఆనతి కాలంలోనే కన్ను మూసింది.

***

కాలచక్ర గమనంలో పది సంవత్సరాలు గిర్రున తిరిగాయి. రామిరెడ్డి జైలు నుండి విడుదలయ్యాడు. ఊళ్ళోకి వచ్చేసరికి వాతావరణంలో పెద్దగా మార్పు కనబడలేదు. కాని దౌర్జన్యాలు పెరిగాయని తెలిసింది. రత్తయ్య పెద్ద కొడుకు నరేష్, చిన్న కొడుకు సురేష్ ల గాలి బలంగా వీస్తోంది. నరేష్ గ్రామ సర్పంచ్. అతని అండగా చూసుకొని సురేష్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి.

రామిరెడ్డికి నిలువ నీడ లేకుండా చేసి ఊళ్ళో నుండి తరిమెయ్యాలని నరేష్ పథక రచనలో మునిగి పోయాడు. అందులో భాగంగా ఇంటి పన్ను కట్ట లేదని నోటీసు పంపించాడు. రామిరెడ్డి ధైర్యం చెడలేదు. జైలు అధికారి గుండె ధైర్యం చెబుతూ.. తనకు రావాల్సిన డబ్బు అందజెయ్యడంతో.. అది కాస్తా ఆదుకుంది. నరేష్ అవాక్కయ్యాడు. సమయం చూసి దెబ్బ కొట్టాలనుకున్నాడు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్లే అండతో అదే ఊళ్ళో రేషన్ షాపు సంపాదించుకున్నాడు రామిరెడ్డి. కోర్టు ఉత్తర్వుల మూలాన నరేష్ ఏమీ చెయ్యలేక పోయాడు.

ఆనతి కాలంలో రామిరెడ్డి సత్ప్రవర్తనతో ఊళ్ళోని వారందరి అభిమానాన్ని చూరగొన్నాడు. రామిరెడ్డికి ఊరంతా సహాయ సహకారాలందిస్తోంది. ఇక లాభం లేదని నరేష్, సురేష్ లు తమ పథకంలో కొద్ది మార్పులు చేసుకున్నారు. ముందుగా ప్రజల్లో అతనంటే అసహ్యం కలిగేలా.. చెయ్యాలనుకున్నారు. అతని షాపు మీద నిందలు వేయడం ప్రారంభించాడు సురేష్. కానీ ఒక్కటీ నిరూపించలేక పోయాడు. అలా అదీ అతనికే బెడిసి కొట్టింది.

రామిరెడ్డి నూతన గృహం నిర్మించుకున్నాడు. అతని అభివృద్ధి చూసి తమ అమ్మాయినివ్వడానికి గ్రామంలో పోటీ పడ్డారంటే అతిశయోక్తి గాదు. ఇది నరేష్ కు మరింత కన్నెర్రజేసింది.

ఆ సంవత్సరం నరేష్ కు సర్పంచ్ పదవి దక్కలేదు. సురేష్ ఆగడాలు కాస్త తగ్గాయి.

రామిరెడ్డి వివాహం చేసుకున్నాడు. మరో సంవత్సరంలో పండంటి కొడుకు ప్రశాంతరెడ్డి పుట్టాడు. అతని మొదటి పుట్టిన రోజు వేడుక ‘నభూతో నభవిష్యతి’ అన్న రీతిలో ఊరంతా అన్నదాన కార్యక్రమంతో ఘనంగా జరిపాడు రామిరెడ్డి. నరేష్, సురేష్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు కాని ఏమీ చేయ లేని పరిస్థితి. సమయంకోసం ఎదురి చూడసాగారు. ఆ క్రమంలో.. మరో ఆరు వసంతాలు గడిచాయి.

ఆ సంవత్సరం నరేష్ ను గ్రామ సర్పంచ్ పదవి మళ్ళీ వరించింది. సురేష్ తిరిగి తన నిజస్వరూపం ప్రదర్శించసాగాడు.

ప్రశాంతరెడ్డి రెండో తరగతిలో అడుగుపెట్టాడు. సురేష్ రెండవ కొడుకు సుశాంత్ గూడా రెండో తరగతి. ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఒకరింటికి మరొకరు వెళ్ళడం.. రావడం.. కలిసి చదువుకోవడం.. ఆడుకోవడం.. అభిరుచులు కలవడంతో మరింత సన్నిహితులయ్యారు. అది సురేష్ కు నచ్చేది కాదు.

ఒక రోజు నరేష్ తో వాగ్వాదానికి దిగాడు సురేష్.

“అన్నయ్యా.. నువ్వు పూర్తిగా చప్ప పడిపోయావెందుకు? మన నాన్నను చంపిన వాణ్ణి అలాగే వదిలేద్దామా? ఇంకా ఎన్నాళ్ళు వేచి చూద్దాం. త్వరగా ముహూర్తం పెట్టు” అని కోపంతో ఊగిపోయాడు.

“ముహూర్తం పెట్టాను తమ్ముడూ.. ఆవేశ పడకు. ఏ పని చేసినా మన చేతికి మట్టి అంట రాదన్నదే.. నా పాలసీ. వచ్చే హోళీ పండుగ రోజు రామిరెడ్డి పరలోకానికి పోవడం ఖాయం” అంటూ తాను చేబట్టబోయే కార్యాచరణను వివరించాడు. “కాని సురేష్.. బాగా గుర్తుంచుకో.. మనం తెర వెనుకనే ఉండాలి సుమా..!” అంటూ హెచ్చరించాడు.

సురేష్ మనసు కాస్త తేలిక పడింది. హోళీ పండుగ అంటే మరెన్నో రోజులు లేదని సంబరపడ్డాడు. అలాగే అన్నట్టు తలూపాడు.

***

ఆ రోజు హోళీ ఉత్సవం.. ఊరంతా రంగుల మయమయ్యింది. చిన్నా, పెద్దా బేధం లేకుండా రంగులు పులుముకుంటూ.. ఆనందోత్సవాలలో మునిగి తేలుతున్నారు. యువకులంతా ఒక జట్టుగా ఏర్పడి కేరింతలు కొడుతూ.. పాటలు పాడుకుంటూ వీధుల వెంట తిరుగుతున్నారు. ఇంతలో వారి వెనుకాల మరొక బృందం భంగు (గంజాయితో చేసే మత్తు పదార్ధం) పీకల దాకా తాగి వీరావేశంతో నృత్యాలు చేయసాగారు. ఆ దృశ్యం చూసి ఊరు బెంబేలెత్తింది. భయాందోళనతో ఇంట్లో నుండి బయటకు ఎవరూ రావడం లేదు.

భంగుబృందానికి కావాల్సిందీ అదే.. అదును చూసి ఊళ్ళోని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. డ్యూటీలో ఉన్న ఒక్క పోలీసును సెల్లో వేసి తాళం వేసారు. ఈ విషయమంతా బయట పొక్కింది. ఏదో ప్రమాదం జరుగబోతోందని గ్రహించిన రామిరెడ్డికి భయమేసింది. భార్యను పిలిచి సూచనలిచ్చాడు. ఆమె ఇంటి ప్రధాన గుమ్మానికి తాళం పెట్టి ప్రశాంతరెడ్డిని తీసుకొని తన తల్లి గారింటికి పరుగు తీసింది.

రామిరెడ్డి బిక్కు, బిక్కు మంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇంట్లో ఓ మూలాన దాక్కున్నాడు. అతను ఊహించినట్టుగానే.. భంగు బృందం రామిరెడ్డి ఇంటికి వచ్చారు. ద్వారానికి తాళం కప్పను చూసి.. బూతులు తిడుతూ.. “రెడ్డి గాడు దెంకపోయిండ్రా.. “ అని ఒకడు..

”అరేయ్ ఎవడ్రా వానికి మన ప్లాన్ చెప్పిందీ..” అని మరొకడు ఊరంతా దద్దరిల్లేలా అరుస్తున్నారు. రామిరెడ్డి ఇంటి ముందు వాకిట్లో బైఠాయించారు. తెచ్చుకున్న భంగు మరో రౌండ్ లాగించారు. సీసాలు ఖాళీ చేసి గుమ్మం ముందు పగలగొట్టారు. కాసేపు రామిరెడ్డిని ఎప్పుడు లేపేద్దామని చర్చించుకున్నారు. తరువాత మెల్లగా లేచి వీధిలోకి దారి తీసారు.

ఇంటి ముందు ప్రశాంతత ఏర్పడే సరికి రామిరెడ్డి మెల్లగా కిటికీ ఓరగా.. తీసి చూశాడు. అది గమనించిన ఒకడు.. “అరేయ్ రండిరా.. రెడ్డిగాడు ఇంట్లనే ఉన్నడు” అని బిగ్గరగా అరిచాడు. బృందమంతా చెవులు చిల్లులు పడేలా రక, రకాల బూతులు వల్లె వేస్తూ.. వీరావేశంతో వెనుదిరిగారు. తాళంకప్పను పగుల కొట్టి ఇంట్లోకి దూరారు. మంచం కింద దాక్కున్న రామిరెడ్డిని బయటకు లాక్కొచ్చారు. ప్రధాన గుమ్మం గడప మీద రామిరెడ్డి తలను బద్దలు కొట్టారు. ఒకడు రామిరెడ్డి కడుపును భయంకరంగా చీల్చాడు. ప్రేగులు మేడలో వేసుకుని వీధిలోకి పరుగు తీశాడు. వాని వెనుకాల.. “రెడ్డిగాడు సచ్చీ పాయె.. హోళీ పండుగ మురిసి పోయే..” అని నినాదాలిస్తూ.. బుల్లెట్ డాన్సులు చేయసాగారు.

ఇంతలో సీటీ నుండి పోలీసు వ్యాను వస్తోందని తెలుసుకొని భంగుబృందం అంతర్థానమయ్యింది.

***

ఆరోజు రామిరెడ్డి దశదిన కర్మ.

నరేష్ సర్పంచ్ హోదాలో అతని కార్యాలయ సిబ్బందిని తీసుకొని హాజరయ్యాడు. సురేష్ బయలుదేరుతుంటే.. సుశాంత్ గూడా వస్తానని మారాం చేసి సురేష్ బండి ఎక్కాడు.

రామిరెడ్డి ఇంట్లోనే కార్యక్రమం ఆరంభ మయ్యింది. హాల్లో రామిరెడ్డి నిలువుటెత్తు ఫోటో పెట్టారు. ఫోటో నిండా పూలదండలు.. దండల మధ్యలో నుండి చిరునవ్వులు చిందిస్తున్న రామిరెడ్డి మోము చూస్తుంటే.. అతని ఆత్మ సద్గతి పొందాలని ప్రార్థించడానికై వచ్చిన వారందరి మనసు వికలమై పోతోంది. వాతావరణమంతా హృదయవిదారకంగా ఉంది.

పూజా కార్యక్రమం అనంతరం.. ప్రశాంతరెడ్డిని ను ఒక పీట మీదకూర్చో బెట్టారు. బంధుబలగం, రామిరెడ్డి స్నేహితులు ప్రశాంతరెడ్డికి కండువా కప్పుతూ.. తలపై అక్షింతలు వేస్తున్నారు. నరేష్, సురేష్ లు విచార వదనాలను అరువు తెచ్చుకొని ప్రశాంతరెడ్డి దగ్గరకు వచ్చారు. వారి వెనుకాల వస్తున్న సుశాంత్ వేగంగా ముందుకు వచ్చి..

“ప్రశాంతరెడ్డీ.. నువ్వు పెద్దగయ్యాక నన్ను చంపుతావారా?” అంటూ ప్రశ్నించాడు.

ఆ ప్రశ్నతో హాలంతా ఉలిక్కి పడింది. చటుక్కున సుశాంత్ నోరు నొక్కాడు సురేష్.

సుశాంత్ విదిలించుకొని.. “నాకు తెలుసురా.. నువ్వు చంపుతావు. మా తాతయ్యను చంపాడని.. పెద్ద నాన్న , మా నాన్న కలిసి మాట్లాడుకుంటుంటే నేనంతా విన్నాను. వేరే ఊరి నుండి రౌడీలను తెప్పించి భంగు తాగించి మీ నాన్నను చంపించారు” అంటూ ఏడువసాగాడు.

సుశాంత్ వీపు మీద గట్టిగా లాగి కొట్టాడు సురేష్. అతణ్ణి లాక్కుపోతుంటే.. పీట మీద నుండి లేచి అడ్డుకున్నాడు ప్రశాంతరెడ్డి. నరేష్ మోములో నెత్తురు ఇంకి పోయింది. హాలంతా కొయ్యబారి పోయింది. మంత్రాలు చదివే పంతులుగారి నోరు మూత పడి మళ్ళీ తెరుచుకో లేదు.

“సుశాంత్.. అలా ఆలోచించడం తప్పురా.. మీతాతయ్య ఊళ్ళో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. అతణ్ణి పోలీసులకు పట్టివ్వకుండా మా నాన్న చంపి తప్పు చేశాడు. దానికి శిక్ష అనుభవించినా.. మీ పెద్దనాన్న, నాన్న తృప్తి పడలేదు. ఇలా సంపుకుంట పోదామా..! అది అనాగరికం. అడవిలో జంతువులు కూడా అలా చెయ్యవు. ఇది ఇంతటితో ఆగిపోవాలి.

మనం జీవితకాలం ప్రాణస్నేహితులుగానే ఉందాం” అంటూ సుశాంత్ ను హత్తుకున్నాడు ప్రశాంతరెడ్డి.

ప్రశాంతరెడ్డి తల్లి ముందుకు వచ్చి పిల్లలిద్దరినీ అక్కున చేర్చుకుంది.

నరేష్ కళ్ళు చెమర్చాయి. తల దించుకున్నాడు. ఆమె మోమును తలెత్తి చూడ లేక.. ఆమె పాదాలను తాకాడు సురేష్.

అంత చిన్నవయసులో ప్రశాంతరెడ్డి మనసు పరిపక్వత చూసి అంతా కొనియాడారు.*

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి