బంగారు మామిడి - కె. ఉషా కుమారి

Bangaru mamidi

రామయ్య చాలా ఆస్తిపరుడు. నిజాయితీపరుడు అడిగినవారికి లేదనకుండా దానం చేసేవాడు. అతనికి నలుగురు కొడుకులు వాళ్ళు ఎప్పుడు స్వార్థం గానే ఆలోచించేవారు. వారి భార్యలు కూడా అలాగే ఉండేవారు. ఒరేయ్! ఎంత కాలం అయినా మనం నాన్న దగ్గర చేయి చాచాల్సిందే. ఈయన ఆస్తి పంచేలా కూడా లేడు. అవునురా అన్నయ్య, ఈయన ఎప్పటికి కాలం చేస్తాడు, ఎప్పటికి ఆస్తి వస్తుంది", అన్నాడు రెండో కొడుకు. మిగిలిన ఇద్దరు కొడుకులు కూడా అదే విషయం గురించి మాట్లాడుకున్నారు. సమయం చూసి బెదిరించి ఆస్తి మొత్తం రాయించుకున్నారు నలుగురు కొడుకులు. రామయ్య కి ఒక మామిడి చెట్టు ఒక అర ఎకరం భూమి మాత్రమే మిగిలింది. ఆ మామిడి చెట్టు కిందే ఒక పాక వేసుకుని జీవితాన్ని సాగదీసాడు రామయ్య. ఆ మామిడి మొక్కను తన కొడుకుల చిన్నప్పుడు నాటాడు. దానిని చాలా జాగ్రత్తగా పెంచాడు. తన పిల్లలను ఎలా పెంచాడో ఆ మామిడి చెట్టుని కూడా అలాగే పెంచాడు. రామయ్య దాని నీడ లోకి వచ్చిన దగ్గర్నుంచి మామిడి చెట్టు విరగకాసింది. ఆ పళ్ళను దగ్గరలోని సంతకు తీసుకువెళ్లి అమ్ముకునేవాడు. అలా వచ్చిన డబ్బుతోనే జీవితం వెళ్ళదీసాడు. ఆ పళ్ళు చాలా మధురంగా ఉండేవి. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా రామయ్య దగ్గరే మామిడి పళ్ళను కొనుక్కుని తీసుకుని వెళ్లేవారు. ఆ చెట్టు మూడు కాలాల్లోనూ పళ్ళని ఇచ్చింది. ఇది ఎంతో విడ్డూరంగా ఉండేది అందరికీ. అర ఎకరం భూమి అయితే ఉంది గాని అదంతా చవిటి నేల. చుట్టుపక్కల పొలాలు కూడా బీడుగా మారాయి. రామయ్య ఎప్పుడు ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. "మిత్రమా! ఎందుకు దిగులుగా ఉన్నావు", అని అడిగింది మామిడిచెట్టు. రామయ్య చెట్టు కేసి వింతగా చూశాడు. 'చెట్టు మాట్లాడుతుంది ఏమిటి!!!', అని అనుకున్నాడు. "మిత్రమా! ఆశ్చర్య పడకు. నువ్వు నీ పిల్లల్ని ఎలా పెంచావో నన్ను అలాగే పెంచావు నువ్వు నాకు తండ్రితో సమానం", అన్నాది మామిడి చెట్టు. "ఇక్కడ పొలాలన్నీ బీడు భూములుగా మారాయి, ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. చాలా మంది రైతులు ఎంతో బాధ పడుతున్నారు", అన్నాడు రామయ్య. "అయితే నీకు ఉన్న అరెకరం భూమిలో ఒక పెద్ద చెరువు తవ్వించి, తర్వాత నాకున్న వేళల్లో ఆ పెద్ద వేరుని పైకి లాగావంటే బోల్డంత నీరు వస్తుంది. ఆ నీటితో చెరువు నింపు, పక్కన ఉన్న పొలాలను తడుపు, బీడు భూముల్లో బంగారం పంటలు పండుతాయి", అని చెప్పింది మామిడి చెట్టు. రామయ్య అదే విధంగా చేశాడు. చుట్టుపక్కల రైతులు ఎంతో ఆనందించారు. అతడు నీరు ఇచ్చినందుకు కృతజ్ఞతగా రైతులు కొంత ఫలసాయాన్ని రామయ్య కు ఇచ్చారు. రామయ్య దానిని పేదల ఆకలి తీర్చడానికి ఉపయోగించేవాడు. ఆ దేశపు రాజు విక్రమసింహుడు. అతడు ఒక నాడు వేటకు వెళ్ళాడు. వేటాడుతూ అతడు చాలా దూరం వచ్చేసాడు. రాజభటులు వెనుకబడ్డారు. అతడు అలా వెళ్లి, వెళ్లి రామయ్య ఉండే నివాసానికి దగ్గరగా వచ్చాడు. అప్పటికే చీకటి పడింది విపరీతమైన దాహం, ఆకలి అతడ్ని పీడిస్తున్నాయి. రాజుగారిని గమనించి రామయ్య ఇవతలకి వచ్చాడు. "రండి మహారాజా!", అంటూ ఆహ్వానించాడు. పూరి గుడిసె అయినా చాలా అందంగా ఉంది లోపల. రాజుకి దాహానికి నీరు ఇచ్చి, చక్కటి మామిడి పండ్లను కోసి పెట్టాడు రామయ్య. వాటి రుచికి అబ్బురపడ్డాడు రాజు. మెత్తటి గడ్డిని నేలపైన పరిచాడు రామయ్య. దాని మీద పడుకుంటే ఇట్టే నిద్రపట్టింది రాజు కి. మరునాడు ఉదయం కూడా మామిడి పండ్లను ఆరగించాడు రాజు. "ఓ వృక్ష రాజమా! నీ పళ్ళు ఇంత మధురంగా ఎలా ఉన్నాయి" అని అడిగాడు రాజు. "రాజా! రామయ్య నాకు మిత్రుడు, మరియు పితృ సమానులు. ఒక రకంగా నేను అతని ఐదవ కొడుకుని. అందుకే అతనికి మధురమైన ఫలాల్ని పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నాను. అతని నలుగురు కొడుకులు అతన్ని వెళ్లగొట్టారు అయినా అతను దయా ధర్మాలు వదలలేదు. అతని దయకి, ప్రేమకి, నిజాయితీకి, ప్రతీక నా ఫలాలు", అంది మామిడి చెట్టు. రాజు రామయ్య యొక్క దయాగుణం గురించి తెలుసుకొని ఎంతో సంతోషించాడు. చుట్టుపక్కల పది గ్రామాలకు రామయ్యను అధికారిని చేశాడు. దురాశ పరులు అయిన రామయ్య కొడుకులను కఠినంగా శిక్షించాడు. రామయ్య అన్ని గ్రామాల్లో రకరకాల మొక్కలు నాటించాడు. అద్భుతమైన ఫలాలను ఇచ్చే మామిడిచెట్టు ఉండడం వల్ల, ఇంకా ఆ చెట్టుకి బంగారంలాంటి మనసు ఉండడంవల్ల, ఆ ఊరి పేరు బంగారు మామిడిగా ప్రసిద్ధికెక్కింది. సమాప్తం.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి