ఓటమి...!! - డాక్టర్ టి.జితేందర్ రావు

Votami

అది ఇరవై అంతస్థుల భవనం. అందులో నాలుగు వందల పైగా కుటుంబాలు ఉన్నాయి. అక్కడ అదొక్కటే కాదు అక్కడ ఉన్నవన్నీ అటువంటివే. అది చాలా పెద్ద అపార్ట్మెంట్ల కాంప్లెక్స్.అందులో చాలా అతనివే.సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అతను ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ప్రతిసారీ లాభాలు మరింత మరింత పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు. వ్యాపారం మొదలు పెట్టినప్పటి నుండి అతను కొన్ని వందల గ్రామాల్లో కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమిని కొని పలు అంతస్థుల భవనాలు కట్టి అక్కడి వాతావరణనాన్నే మార్చేశాడు.వ్యవసాయ భూములుగా ఉన్న కాలంలో కనీసం ఒక కంకర రోడ్ అయినా ఆ గ్రామాలకు ఉండేది కాదు. ఎడ్ల బండ్లు తప్ప అక్కడి వాళ్లకు మరో వాహనం అంతగా ఉపయోగ పడేది కాదు. వాళ్ళ ఆదాయం కూడా అంతంత మాత్రమే. తిండికి బట్టకు కరువుందేది కాదు కానీ ఎవరి మీదా ఓ నగో నట్రో ఉండేది కాదు. కానీ అతను వచ్చి అక్కడి వాతావరణనాన్నే కాదు వాళ్ళ జీవిత విధానాన్నే మార్చేశాడు. ఇప్పుడు అక్కడ ఎడ్ల బండి కాదు గదా ఒక ఎద్దు, ఒక మేక, చివరకు కోడి, కాకి, పిట్ట కూడా కనిపించదు. చాలా మంది కుక్కలను పెంచుకుంటున్నారు కాబట్టి కొన్ని కుక్కలు మాత్రం కనబడతాయి. అక్కడ అంతా నల్లగా పెయింట్ వేసినట్టు మిల మిలా మెరిసిపోయే రోడ్లు. ఇరవై నాలుగు గంటలూ బుయ్యి బుయ్యి మంటూ కార్లూ, లారీలూ ఇతరవాహనాలు. పగలూ, రాత్రికీ తేడా తెలియకుండా కళ్ళు జిగేలుమనే లైట్లు. అతనికి భూములు అమ్మి వేసిన తరువాత చాలా మంది రైతులు డబ్బుల మూటలు పట్టుకొని పట్నాలకు పోయారు. కొందరు అతను కట్టిన ఇళ్ళు కొనుక్కొని అక్కడే ఉంటున్నారు. అపార్ట్మెంట్ పైకి పోయి నిలబడి చుట్టూ కలియ చూసాడు.అలా చూడడం అతనికి చాలా ఇష్టం. కనుచూపు మేరలో అంతటా ఎన్నో పెద్ద పెద్ద రంగు రంగుల భవనాలు.అన్నీ ఆకాసాన్నటుతున్నట్టు ఉంటాయి. అదంతా చూస్తుంటే అతనికి చాలా గర్వంగా ఉంటుంది. అతనొక్కడి తెలివితేటల వల్ల ఇంత అభివృద్ధి, ఇంత మార్పు. ఆనందంగా చుట్టూ చూస్తున్న అతని చూపు ఓ వైపు చూసినప్పుడు చటుక్కున ఆగిపోయింది. కాసేపు గుండె బాధతో విలవిలలాడింది. అక్కడ ఆవైపు ఆ వెయ్యి ఎకరాల భూమిని ఎన్ని సార్లు అడిగినా ఎంత డబ్బు ఇస్తానన్నా ఆ నలుగురు రైతులు అతనికి ఆ భూమిని అమ్మలేదు. ఆ వెయ్యి ఎకరాల ముక్క ఒక్కటి పచ్చగా ఉంది. కానీ మేడ మీది నుండో విమానంలో నుండో చూస్తే అక్కడేదో నల్లటి మాసిక వేసినట్టుంది. అతని ఇరవై సంవత్సరాల ఈ బిజినెస్ లో ఫెయిల్ అయింది ఈ ఒక్క చోటే. ఈ వొక్క విషయంలోనే వాళ్ళను ఎలా దారికి తేవాలో అతనికి అర్థం కాలేదు. నయానా భయానా అన్నీ రకాలుగా చెప్పాడు, చెప్పించాడు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఆ ఓటమిని జీర్ణంచుకోలేక పోతున్నాడు. మేడ మీదికి వచ్చి చుట్టూ చూసినప్పుడు కలిగే ఆనందమంతా ఆ ఒక్క వైపు చూసే సరికి ఆవిరై పోతుంది. గుండె బరువెక్కుతుంది. నీరసం ఆవహిస్తుంది. వాళ్ళను చూస్తే అమాయకులు అనుకోవాలో మూర్ఖులు అనుకోవాలో అంతు పట్టదు. అతనిచ్చే డబ్బుతో దర్జాగా బ్రతకడమే కాదు ఆ వ్యవసాయంలో వచ్చే ఆదాయానికి కనీసం పదింతలు ఎక్కువ వస్తుంది. కానీ వాళ్లకు అది అర్థం కావడం లేదు. ఆ నలుగురు తప్ప అతనికి భూమి అమ్మిన వాళ్ళందరూ ఒకప్పుడు బురద కాళ్ళతో తిరిగేవారు. ఇప్పుడు బూటు కాళ్ళతో నడుస్తున్నారు. ఎడ్ల బండిలో పోయే వాళ్ళు ఏ.సీ.కార్లలో పోతున్నారు.పప్పులు ఉప్పులు కొనుక్కునే వాళ్ళు నగలూ నట్రా కొనుక్కుంటున్నారు. ఆలోచనలతో మనసు బరువెక్కడంతో మెల్లగా ఇంట్లోకి పోయాడు. బాధను మరిచి పోయేందుకు అతను సాధించిన విజయాలను నెమరు వేసుకున్నాడు. అతను సంపాదించిన డబ్బుకు లెక్కే లేదు. సంపాదన కొన్ని కోట్లల్లో ఉంటుంది. సంపాదననంతా డబ్బు రూపంలో దాచడం కష్టం కావడంతో కొంత భాగాన్ని బంగారం రూపంలోకి మార్చాడు. అది కిలోల్లో తూచే స్థాయిని ఎపుడో దాటి పోయింది. అది కూడా కష్టం కావడంతో ఖరీదయిన రాళ్ళు వజ్రాలు,రత్నాలు, ముత్యాలు లాంటి వాటిలోకి మార్చాడు. వాటిని కూడా కిలోల లెక్కన తూచే స్థాయికి చేరుకున్నాడు. వీటి విలువ రోజు రోజుకూ పెరిగి పోతుంది. ఇప్పుడు లక్షల్లో ఉన్నవి నాలుగు రోజులు పోతే కోట్లల్లోకి మారుతాయి. ఇన్ని సంపాదించిన వాడు ఇన్ని విజయాలను స్వంతం చేసుకున్నవాడు ఆ నలుగురి చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. తప్పదు…..ఎంత ఖర్చు అయినా ఎంత డబ్బు పెట్టయినా ఆ నలుగురి దగ్గర ఆ భూమిని కొనాలి. ఎన్నో పెద్ద పెద్ద భవనాలు కట్టాలి. సాధించాలి…..వాళ్ళ మీద విజయం సాధించాలి. ఆ ఆలోచనల నుండి మనసును మరల్చేందుకు టీ.వీ. ఆన్ చేసాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈసారి వర్షాలు అసలే ఉండవని సాగు నీరే కాదు తాగేందుకు కూడా నీళ్ళు దొరకవనీ ఆహార ధాన్యాల కొరత విపరీతంగా ఉంటుందనీ, ఆహార నిలువలు లేక పోవడం వల్ల విపరీతమైన కరువు ఏర్పడుతుందని చూపెడుతున్నారు. అది చూడగానే అతనికి వేయి ఏనుగుల బలం వచ్చింది. ఇప్పుడు….ఇప్పుడు తెలుస్తుంది ఆ నలుగురికి డబ్బు విలువ ఏమిటో, గొప్పగా బ్రతకడం అంటే యేమిటో భూముల్ని అమ్మక పోవడం ఎంత తెలివి తక్కువ పనో అందువల్ల ఎంత నష్టపోయారో తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు తన కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇంతకు ముందు ఇస్తానన్న ధరలో నాలుగో వంతు కూడా ఇవ్వవద్దు. తన ఆత్మాభిమానానికి పరీక్ష పెట్టిన వాళ్ళను పొరపాటున కూడా క్షమించ కూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మనసు చాలా ప్రశాంత మయింది. వెంటనే నిద్రలోకి జారీ పోయాడు. మూడు నెలలు గడిచింది. మూడు నెలల క్రితం టీ.వీ. లో చూపెట్టిన బ్రేకింగ్ న్యూస్ నిజమవుతున్నది. ఎక్కడా వర్షాలు లేవు. భూగర్భ జలాలు కూడా అడుగంటి పోయాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినపడుతున్నాయి. ఎంతో మంది చనిపోయారు …..బహుశా రైతులే ఎక్కువ మంది చనిపోయుంటారు. కానీ తన లాంటి ధనవంతులు మాత్రం బ్రతికే ఉంటారు. తన లాంటి వాళ్ళు ఎంత డబ్బయినా పెట్టి ఏమయినా కొనుక్కో గలరు. అదో రకమైన సంతోషంలోకి జారి పోయాడు చనిపోయిన రైతుల భూమిని కారు చౌకగా కొనేయోచ్చు. వాళ్లకు డబ్బు అవసరం చాలా ఉంటుంది కాబట్టి చౌకగా అమ్ముతారు. కోట్లలో లాభాలు వస్తాయి. టన్నుల్లో బంగారాన్ని కొనుక్కోవచ్చు. వజ్రాలు,రత్నాలు,ముత్యాలు లాంటి వాటిని పెట్టెల్లో దాయాలి.అసలు ఇంటి లోని కొన్ని గోడలను బంగారు ఇటుకలతో కట్టాల్సి రావొచ్చు. ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది అన్న సామెతను తిప్పి చదువుకుంటే సుబ్బి చావు ఎంకి పెళ్లికోచ్చింది అని అర్థం చేసుకుంటే ఇప్పటి పరిస్థితికి సరిగ్గా సరి పోతుంది. రైతుల చావులు అతని లాంటి వ్యాపారస్తులకు వరాలుగా మారతాయి. భవిష్యత్తు అంతా కొత్త బంగారు లోకంలా కనిపిస్తున్నది. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు కాదు….కాదు..మూడు పువ్వులు అరవై కాయలుగా ఉంటుంది అలా అలా ఆలోచనలు సాగి పోతుంటే నౌకరు వచ్చి అయ్యా అయ్యా అంటూ పిలిచాడు. దుకాణాలు ఏవీ తీసి లేవు. ఏ దుకాణం లోనూ ఏ సరుకూ లేదు. పదిహేను రోజుల క్రితమే సరుకులు అన్నీ అయిపోయాయట. నౌకరు చెప్పాడు. డబ్బుకు ఎక్కువ ఇస్తామని చెప్పక పోయావా? చెప్పనయ్యా, కానీ అసలు సరుకే లేదంటున్నారు అన్నాడు వెధవలు,,దరిద్రులు దాచుకొని అబద్దం చెబుతున్నారు. మరిన్ని డబ్బులు లాగాలని వాళ్ళ ఉద్దేశం. చెప్పమను...ఎంత కావాలో చెప్పమను…. వాళ్ళు అడిగినంత డబ్బు వాళ్ళ ముఖాన కొట్టి తీసుకురా. ఇదుగో ఈ గొలుసు,ఉంగరం కూడా తీసుకు పోయి ఇవ్వు. కుక్కాల్లా తోకాడించుకుంటూ వాళ్లే వచ్చి ఇస్తారు. పళ్ళు కొరుకుతూ అన్నాడు. ఆ విషయం కూడా చెప్పాను కానీ సరుకేదీ లేదంటున్నారు.బియ్యం ఉప్పులూ, పప్పులు ఏవీ లేవంటున్నారు. అన్నాడు. తనకు చక్కెర వ్యాధి ఉంది.ఆకలి అవుతున్నది. ఏదో ఒకటి తినాలి. లేకుంటే షుగర్ లెవెల్ పడిపోయి స్పృహ కోల్పోతాడు. ఇంతలో వాతావరణంలో పెద్ద మార్పు. విపరీతమైన గాలి దుమారం, ఉరుములు,మెరుపులు. కరెంట్ పోయింది.అపార్ట్మెంట్ అంతా గందరగోళంగా ఉంది. ఆ ఒక్క అపార్ట్మెంట్ భవనంలోనే కాదు, చుట్టు పక్కల ఉన్న అన్ని ఇళ్లలోనూ, అపార్ట్మెంట్ భవనాల్లోనూ అదే పరిస్థితి. పిల్లల ఏడుపులు, ముసలి వాళ్ళ మూలుగులూ, ఆడవాళ్ళ అరుపులూ ఏమైనా తినేందుకు దొరుకుతే తేవాలని మగవాళ్ళ పరుగులు. అంతా బీబశ్చంగా ఉంది. అటువంటి పరిస్థితిలో కూడా అతనికి ఓసారి ఆ నాలుగురు ఉన్నవైపు చూడాలనిపించింది. కిటికీలోనుండి చూసాడు. అక్కడి నుండి ఏ అరుపులూ వినపడటం లేదు. అంటే వాళ్ళు అప్పటికే చనిపోయినట్టు ఉన్నారు అనుకున్నాడు. చుట్టు పక్కల నుండి అరుపులూ ఇంకా ఎక్కువయ్యాయి. వర్షం చాలా పెద్ద వర్షం పడుతున్నది. కొద్ది సేపటికే అతను ఉన్న ఇంటి చుట్టూ చాలా నీరు చేరి పోయింది. బయటకు పోయేందుకు వీలు లేదు. అతనికి ఆకలి ఎక్కువవుతున్నది. కొద్దికొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి. నీరసం వచ్చి కళ్ళకు చీకట్లు వస్తున్నాయి. ' అయ్యా ఇక్కడేక్కడా యేమీ లేవు. ఆ రైతుల దగ్గర యేమైనా దొరుకుతుందేమో అడగనా?. నౌకరు అడిగాడు. వాళ్ళ దగ్గరా ?, వాళ్ళ దగ్గర ఏముంటాయి? అసలు వాళ్ళు ఇంకా బ్రతికున్నారా? ' బ్రతికున్నారు కాబట్టే వాళ్ళ దగ్గరి నుండి ఏ అరుపులూ వినపడటం లేదు. వాళ్ళ దగ్గర తిండి గింజలు ఉంటాయి. వాళ్ళు పండించేదీ, దాచుకునేదీ, పది మందికి పెట్టేదీ ఆ తిండి గింజల్నే. ఆ గింజల్లోనే వాళ్ళు భగవంతుణ్ణి చూస్తారు. ఆ గింజలే వాళ్ళ సంపద. ఆ భూమినే తల్లిలా చూసుకుంటారు. అందుకే వాళ్ళ తల్లిని మీకు అమ్మలేదు అన్నాడు ఆవేశం, ఆక్రోశం నిండిన గొంతుతో. ఆ నలుగురి దగ్గర మాత్రమే ఏమైనా దొరుకుతుందని వాళ్ళను బ్రతిమిలాడటం తప్ప మరో మార్గం లేదని అందరితో పాటు అతనికీ అర్థం అయింది. వర్షం ఇంకా పడుతూనే ఉన్నది. చుట్టూ మోకాలు లోతు నీళ్ళు. ఆ నలుగురి వైపు పోవడం చాలా కష్టం. మొత్తం బురద బురదగా ఉంది. కారు, స్కూటరు, చివరకు సైకిలు ఏ వాహనమూ కూడా పోదు. నడవడం కూడా కష్టమే. అందరి చేతుల్లో నోట్ల కట్టలున్నాయి. ఎంత అడిగినా ఇచ్చి కొనుక్కునేందుకు సిద్ధమయ్యారు. కానీ వాళ్ళు అమ్ముతారా అన్నదే సమస్య. అతను కూడా కిందికి దిగాడు. అతనితో పాటు కొన్ని నోట్ల కట్టలు, కొన్ని వజ్రాలు,ముత్యాలు,బంగారం కూడా పట్టుకొచ్చాడు.అవసరమైతే ఎంతైనా ఇచ్చి యేమైనా ఇచ్చి కొన్ని తిండి గింజల్ని కొనుక్కోవలన్నేదే అతని సంకల్పం. అక్కడికి ఎట్లా పోవాలో ఎవరికీ తెలియడం లేదు. అందరి దృష్టీ అటు వైపే ఉంది. ఆ వైపు నుండి ఏదో మెల్లిగా వస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ వచ్చేది కొద్దికొద్దిగా దగ్గరవుతున్నది. అది ఎడ్ల బండి. ఆ వర్షంలో, ఆ బురదలో నడువగలిగే బండి,ఆ బండిని లాగుతున్న ఎద్దులు. ఆ బండిలో ఏవో కొన్ని బస్తాలు. వాటి పైన కూర్చొని ఆ నలుగురు ఇటు వైపే వస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరిలో పట్టరానంత ఆనందం. అందరికీ ప్రాణం లేచి వచ్చినట్టైంది. ఎవ్వరూ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. అందరూ ఒకళ్ళను తోసుకుంటూ మరొకళ్ళు ఆ బండి వైపు దూసుకు పోయారు. ఆ తోపులాటలో చాలామంది చేతుల్లోని డబ్బులు కింద పడిపోయాయి. కొన్ని చిరిగి పోయాయి. కానీ ఎవ్వరూ పట్టించుకొనే స్థితిలో లేరు. అందరి చూపూ, అందరి ద్యాసా ఆ బస్తాల్లోని గింజల మీదే. అతను పరిస్థితిని గమనించాడు. తనంత తానే అక్కడికి పోవాలి. తనకు ఎవ్వరూ తెచ్చి ఇవ్వరు అసలు ఇంకాస్త ఆలస్యమైతే అవి కూడా అయిపోతాయి. తొందర పడాలి అనుకుంటూ అతను కూడా ఆ బురదలో నడవడమే కష్టంగా ఉన్నా ఉరికేందుకు ప్రయత్నించాడు. అందరినీ తోసుకుంటూ పోయే ప్రయత్నంలో బురదలో పడిపోయాడు. కానీ లేని శక్తిని తెచ్చుకొని లేచి బండి దగ్గరికి నడిచాడు. చేతులు చాచి ఆ నలుగురి వైపూ చూసాడు. వాళ్ళు ఆశ్చర్యంగా అతని వైపు చూసారు. అలా ఎందుకు చూస్తున్నారో ముందు అతనికి అర్ధం కాలేదు. అర్థమైన తరువాత సిగ్గు పడ్డాడు. అతను సంచి ఇవ్వకుండా చేతులు చాస్తే గింజలు ఎలా ఇవ్వగలరు. సంచీ ఇవ్వమన్నట్లు సైగ చేశారు. సంచీ కోసం చూసాడు. బంగారం, వజ్రాలు, ముత్యాలు, నోట్ల కట్టలు తెచ్చిన సంచీ భుజానికి వేళ్ళాడుతుంది. క్షణంలో భుజం నుండి సంచీని తీసి లోపల ఉన్నవాటి తో సహా సంచినీ ఇస్తున్నట్టు ముందుకు చాసాడు. ఇవి తిండి గింజలు ప్రాణాలు కాపాడే గింజలు వీటిని అమ్మడం లేదు. ఖాళీ సంచి మాత్రమే ఇవ్వమన్నట్టు సైగ చేశారు. క్షణం కూడా ఆలోచించకుండా భుజానికి ఉన్న సంచిని తీసి అందులో ఉన్నవాటిని కింద కుమ్మరించి ఖాళీ సంచేని వాళ్లకు అందించాడు. ఆ సంచీనీ గింజలతో నింపి అతనికి ఇచ్చారు. అతను రెండు చేతుల్తో ఆ సంచిని అందుకున్నాడు. అది వాళ్లకు దండం పెడుతూ అందుకున్నట్లు ఉంది. వాళ్ళు అతని వైపు తదేకంగా చూస్తున్నారు. అతను మాత్రం వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూడ లేక గింజల సంచీనీ తీసుకొని ఇంటివైపు అడుగులు వేసాడు. ఒక్క నిముషం ఆగి అతనికి తెలియకుండానే తాను కట్టిన ఆ భవనాల వైపు చూసాడు. ఎదురుగా ఉన్న భవనాలు జడలు విరబోసుకున్న పెద్ద పెద్ద దయ్యాల్లా కనిపించాయి. ఓసారి తల తిప్పి ఆ నలుగురి పొలం వైపు చూసాడు. మెరుపుల వెలుగులో పైరు మీద నిలిచిన నీటి బిందువులు ముత్యాల్లా, సాన పెట్టిన వజ్రాల్లా మణుల్లా, మాణిక్యాల్లా మెరుస్తున్నాయి!! *********..

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ