దేవుడు గుడిలో లేడు !. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Devudu gudilo ledu

గుంటూరు పట్టణానికి కొంతదూరంలో ఉంది చర్లోపల్లె అనే గ్రామం

అక్కడ ఉన్న నదికి పలుమార్లు వరదవచ్చి ఆగ్రామం ముంపుకు గురికావడంతో అక్కడిప్రజలు దాదాపుగా గుంటూరు పట్టణానికి వలసపోయారు కాని అక్కడ ఉన్న పురాతన రామాలయం పూజార్లు,వాద్యగాళ్ళకుటుంబాలు మాత్రం అక్కడే ఉండిపోయారు,

వీరికి కూతవేటు దూరంలో ఎత్తయిన ప్రదేశంలో సింగయ్య అనే రైతు కొన్ని పాడి పసువులు పెంచుతూ,కూరగాయలు పండిస్తూ తనభార్యా ,పిల్లలతో నివసిస్తున్నాడు.

తొలిరోజు పాలుపోయాడానికి పూజారిగారి గుమ్మముందుకు వెళ్ళినప్పుడు ప్రధానపూజారి ' సింగయ్య ఇది అగ్రకులస్తులు నీవసించే ప్రాంతం రేపటినుండి నీరిక్షాబండికి గంటకట్టుకునీరా అలా మాప్రహరి గేటటువద్దకు వచ్చి గంటమోగించు మేమే అక్కడకువచ్చి పాలు పోయించుకుని,మాకుకావలసిన కూరగాయలు తీసుకుంటాం ' అన్నాడు.

అలాగే అంటూ తలఊపిన సింగయ్య తనమోటారు రిక్షాకు గంట బిగించాడు.

సాయంత్రం బీరతోటలో తన భార్యతోకలసి బీరకాయలు కోయసాగాడు సింగయ్య దాదాపు ఇరవై కిలోలు వచ్చాయి ,అలాగే టమోటా, వంకాయలు, దోసకాయ ,పచ్చిమిరపకాయలు కోసి గోతాల్లో సర్ది,ఆకు కూరలు కట్టలు కట్టి బాడి రిక్షలొ సర్దేసరికి సూరీడు పడమటి దిక్కున దాక్కున్నాడు.

వేకువనే నిద్రలేచిన సింగయ్య దంపతులు పసువులపాకలో పాలు పిండి క్యాన్లలో పోసేసరికి పెంళ్ళాంచేత తిట్లుతిన్న మొగుడులా ఎర్ర మొకంతో సూరీడు ఎల్లబారాడు.

కంచు గిన్నెలోమూడువంతులు కూడు ఏసుకుని గిన్నెనిండుగా సల్లపోసుకుని పొట్టువలిసిన పెద్ద ఉల్లిపాయ నంజుకుతిని, తక్కడ తీసుకుని బయలుదేరి, కూతవేటు దూరంలోని రాములోరి గుడివద్ద ఉన్న పూజార్ల కుటుంబాలకు పాలుపోయడానికి తన మోటారు రిక్షాకు కట్టిన గంట నాలుగు పర్యాయాలు మోగించాడు సింగయ్య .

"పాల అబ్బి వచ్చాడు ఆగిన్నెఅట్టుకు వెళ్ళండి చెప్పకుండాఏపని సవ్యంగా చేయరుగా " అని పార్వతమ్మ గారి గయ్యళి గొంతుఖంగున వినిపించింది.ఆమెభర్త శంకరయ్య నవ్వుకుంటూ పాలగిన్నెతో వచ్చాడు.

" అయ్యోరు మాఅమ్మగారు ఎప్పుడూ ఇంతేనా " అన్నాడు సింగయ్య.

" ఉరేవే మీ అమ్మగారి మాట పెడసరం ఐనా మనసు వెన్నపూస అయినా పాత పెళ్ళామే అరిసేది ,కొత్త చెప్పేగా కరిసేది"అంటూ వెళ్ళిపోయాడు శంకరయ్య.

ఎవరికి ఎన్నిపాలు పోసింది,ఏకూరగాయలు ఎంత తీసుకున్నారో తన పుస్తకంలో రాసుకుని, గుంటూరులో పాలు ,కూరగాయలు అమ్మడానికి మోటారు బాడి రిక్షతో వెళ్ళాడు సింగయ్య.

వాతావరణం శాఖవారు హెచ్చరించినట్లే భారివర్షం రెండురోజులుగా కురవసాగింది నదిపొంగి నీరు ఆప్రాంతమంతా రావడంతో పూజారి, వాద్యాకారుల కుటుంబాలు భయంతో గజగజ లాడసాగారు.

ఆలయ ప్రహరి గేటువద్ద గంటమోత వినిపించడంతో అటుగా వెళ్ళారు .

'భయపడకండి నాఇల్లు బాగా మెరకప్రాంతంలో ఉంది మీరంతా మాఇంట్లో సురక్షితంగా ఉండవచ్చు 'అని పూజారుల కుటుంబాన్ని,

వాద్యకారుల కుటుంబాన్ని రెండు పర్యాయాలుగా తన తన ఇంటికిచేర్చాడు. తన అన్నదమ్ములు వదిలివెళ్ళిన ఇళ్ళు వారు ఉండటానికి కేటాయించి'స్వామి ఇంటిముందు తోటలో అన్నిరకాల కూరగాయలు ఉన్నాయి తమకు కావలసిన నిత్యావసర సరుకులు నాఇల్లాలు అన్ని సిధ్ధం చేసింది ,తమరు స్నానాలు చేసి రాములోరికి నైవేద్యం పెట్టుకోవచ్చు, పండుగకు అని మాపెద్దలకు పెట్టడానికి,మాకు కొత్త బట్టలు తెచ్చిపెట్టుకున్నాం తమకు అభ్యంతరం లేకుంటే వాటిని ధరించండి,మీకన్నామాకు పెద్దలు ఎవరున్నారు ' అని పాలు వారికి అందించి వెళ్ళాడు సింగయ్య.

ఉత్సవ మూర్తులతో నిలబడిఉన్న శంకరయ్య దీర్ఘంగా నిట్టూర్చాడు.

మరోమూడు రోజుల అనంతరం వర్షం నెమ్మదించింది మరో మూడురోజుల అనంతరం వరద నీరు పూర్తిగా తగ్గింది. పూజారి,వాద్యాకారుల కుటుంబాలను ప్రహరివద్ద తన మోటారు రిక్షాలో దించాడు సింగయ్య.

మరుదినం పాలు పోయడానికి ఆలయప్రహరివద్దకు వెళ్ళిసరికి అక్కడ శంకరయ్య నిలబడి ఉన్నాడు ,సింగయ్య రిక్షవద్దకు వచ్చి తనచేతిలోని పూమాల సింగయ్య మెడలో వేసి ' ఈపూమాల నేడు మనదేవునికోసం కట్టబడింది దేముడు గుడిలోలేడు దయార్ధహ్రుదయులైన మనుషుల్లో ఉంటాడని నిరూపించావు, మతం మత్తుకన్నా,కులం కంపుకన్నా మానవత్వ పరిమళమే గొప్పది అని నీచర్యలతో వెల్లడించావు, ప్రార్ధంచే మాపెదవులకన్నా సాయంచేసే చేతులే మిన్న అని నిరూపించావు మనిషికి కులంకాదు గుణమె ప్రధానం అని తెలియజేసావు, ఆపదలో కులము ,మతము ఆదుకోవని తెలుసుకున్నాం, జాలి,దయా,కరణా,పాపభీతి లేని మనిషిజీవితం నిరర్ధంకం అని అనుభవపూర్వకంగా అర్ధంచేసుకున్నాం ' అని సింగయ్య రిక్షాకు కట్టిఉన్న గంటను ఊడదీసి విసరివేసాడు శంకరయ్య.

గుడి ప్రాంగణంలోని పూజారి,వాద్యకారుల కుటుంబసభ్యులు కరతాళధ్వనులు చేయడం చూసిన సింగయ్య కళ్ళి చెమ్మగిల్లాయి.

మరిన్ని కథలు

Dayyaala Meda
దయ్యాల మేడ
- డా:సి.హెచ్.ప్రతాప్
Chivari chitram
చివరి చిత్రం
- డా:సి.హెచ్.ప్రతాప్
Idi ekkadi nyayam
ఇది ఎక్కడి న్యాయం
- ప్రభావతి పూసపాటి
Maa Inti TV (feelgood story)
మా ఇంటి టి.వి (feelgood story)
- అనిసా తబస్సుమ్ sk
Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)