మారిన మనసులు - Kanuma Yella Reddy

Marina manasulu

కంచి కామాక్షి, మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి
అంటూ తాడిపత్రి నీరాజాక్షి గట్టిగా చదివాడు చంద్రం.పేపర్లో వచ్చిన కరపత్రం లో అమ్మవారి దర్శన యాత్ర అన్నారే, ఆ దేవతలతో పాటు నీ దర్శనం కూడా ఉంటే బాగుంటుంది" గొణిగాడు. వంటింట్లో టిఫిన్ చేస్తున్న నీరజ కు ఈ మాట వినపడింది.
"ఏమిటి ఆ దేవతలతో పాటు నా పేరు జపిస్తున్నారు"అంది.
"జపించటం కాదు.నీ దర్శనభాగ్యం యాత్రికులకు కల్పిస్తున్నా"అన్నాడు చంద్రం నవ్వుతూ.
"నేనేమి దేవతను కానే దర్శించడానికి" అంది
"ఎందుకు కావు? ఈ వీధిలో ఎవరి ఇంటిలో శుభకార్యం జరిగినా, పేరంటం ,బారసాల జరిగినా, ఆ నిర్మల కొత్త చీరెలు తెచ్చినా నీకె కధ మొదట పిలుపు వచ్చేది.ఈ వీధిలో ప్రతి ఇల్లు నీకు పరిచయమే, నా మాట విని ఈ సారి కౌన్సిలర్ గా పోటీ చేయి గెలుస్తావు"అన్నాడు.
"చాల్లే సంబడం ముందు టిఫిన్ చేద్దురు గాని రండి "అంది.
టిఫిన్ చేస్తుండగా "నీరజమ్మ..నీరజమ్మ" అంటూ ఏడ్చు కుంటూ వచ్చాడు ఎదురింటి సుందరి ఆరేళ్ళ కొడుకు బంటి. వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్ళు నులుపుకుంటున్నాడు."అయ్యో!ఏమైంది బంటి?" అంది నీరజ కంగారుగా.వాడు చేతులు చూపించాడు."అమ్మ కోట్టిందని" ఏడుస్తూనే ఉన్నాడు. కంది పోయిన ఆ చేతులు చూసి సుందరి ఎందుకలా చేసింది .మనసులోనే అనుకుని "ఏ తప్పు చేశావు నాన్న"అంది బుజ్జగిస్తూ.అడిగే కొద్ది వాడి కన్నీళ్ళు ధారాళంగా కారుతున్నాయి. "ముందు కన్నీళ్ళు తుడుచుకో" టవల్ అందించాడు చంద్రం.వాడు కళ్ళు తుడుచుకుంటూ "ఓ లెక్క తప్పు చేశాను" అన్నాడు. "అందుకు చేతులు వాచేలా కొట్టాలా! లేదులే కన్నా" అంటూ ఒళ్ళో పడుకోబెట్టుకుంది. "ఎడ్వకు ఈ రోజు స్కూల్ కు వద్దులే పడుకో,ఈ వయసుకే లెక్కలు ,ఎం మనిషో "అంటూ జో కొట్టింది.కాసేపటికి వాడు ఏడుపు మాని నిద్రలో కి జారుకున్నాడు. చంద్రం ఆఫీసుకు వెళ్ళాడు.బంటి నిద్రపోతుంటే పనంతా ముగించుకుంది.ఇంతలో ఫోన్ మోగింది.
"హలో"
"హలో నీరజక్క నేను సుందరిని బంటి "అని అడిగింది.
"వాడు నిద్రపోయాడు ఎందుకు అంతలా వాడ్ని కొట్టావు" అంది కటువుగా.
సుందరి నవ్వుతూ "ఎదో ఒక దెబ్బ వేశాను అంతే" అంది.
"చాల్లే వాడు బాగా జడుసుకున్నాడు. ఇంకెప్పుడు అల కొట్టకు"అంది.
"సరే అక్కా"ఫోన్ పెట్టేసింది సుందరి. నిద్రపోతున్న బంటి పై బెడ్ షీట్ కప్పింది నీ రజ. నీరజ కు పిల్లలు లేరు.ఎంత మంది డాక్టర్ల కు చూపించిన ఫలితం లేదని ,గర్భ సంచిలో సమస్య ఉందని చెప్పారు డాక్టర్లు. కంటేనే పిల్లలా! ఈ వీధి లోని వారంతా నా పిల్లలే కదా! అనుకునేది.బంటి లేవబోతుంటే "పడుకో"అని జో కొట్టింది.బంటి చిన్నప్పటినుండి అలవాటు.ఎక్కువగా నీరజ దగ్గరే ఉండే వాడు.ఒక్కోసారి స్నానం,టిఫిన్ అన్నీ అక్కడే.స్కూల్ నుంచి వస్తూనే నీరజ మెడ చుట్టూ చేతులు వేసి ఆనందించేవాడు.వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆనంద్ అని తానే పేరు పెట్టింది.అయితే వీధిలో అందరూ బంటి..బంటి అని పిలుస్తుంటే ఆనంద్ పేరు మర్చి పోయి ఆ పేరే పిలువసాగారు అందరూ.
వాడు అటు,ఇటూ పొర్లుతుంటే చెదిరిన బెడ్ షీట్ సర్దింది.ఇంతలో ఫోన్.
"హలో"
" హలో నీరజక్క నేను మంజులను .ఈ రోజు మా అమ్మాయికి ఒడి బియ్యం పోస్తున్నాం,నువ్వు రావాలి" అంది.
"ఎన్ని గంటలకు"?
"ఇప్పుడే పదకొండు గంటలకు"
"ఇంత హడావుడిగానా! చెప్పేది" అంది.
"నా ఫోన్ చార్జీ ఐపోయింది .దానితో ఇబ్బంది పడ్డాను వస్తావుగా" అంది.
"సరే వస్తాను" అంది.
ఇంతలో సుందరి "అక్కా.. అక్కా " అంటూ వచ్చింది.
"రా సుందరి "అంది. మంచం పై నిద్రపోతున్న బంటి ని చూసి "నిద్రపోతున్నాడా"! అంది.
"వాడి చేయి చూశావా ఎలా కందిపోయిందో".
పిడికిలి బిగించుకున్న బంటి చేయిని మెల్లగా విప్పింది.ఎర్రగా కందిపోయాయి.అది చూడగానే కళ్ళలో నీళ్ళు జారాయి."మా బాబు అంటూ" నుదుటిపై ముద్దు పెట్టింది."ఇంకెప్పుడు కొట్టనులే " అనుకుంది వాడి ముందు నిలబడి.నీరజ వంక చూసి భోరున ఏడ్చింది. సుందరి తల్లి ప్రేమ కు స్పందించి "ఇంకెప్పుడు వాడ్ని కొట్టకు .నా మీద ఒట్టెయ్"అంది నీరజ కూడా కన్నీళ్లు పెట్టుకుని.ఒట్టు వేసింది సుందరి.
"అన్నట్లు మంజుల ఫోన్ చేసిందా"! అడిగింది నీరజ.
"చేసిందక్క ఇద్దరం వెళదాం అందుకే వచ్చాను" అంటూ బంటి ని ఎత్తుకుంటూ. వాడు మెదలక తల్లి భుజాలపై అలానే కునుకు తీస్తున్నాడు. "బంటిని ఇంట్లో మా అత్త గారికి ఇస్తాను.ఇద్దరం కలిసి వెళదాం"అంది సుందరి వెళుతూ.
ఇంతలో మరో ఫోన్.
"హలో'
"హలో నీరజక్క రేపు మా ఇంటి గృహప్రవేశం నువ్వు ,అన్న తప్పక రావాలి".
"వస్తాను సులోచన" అంది.
"తప్పక రావాలి సుమా,మరవద్దు" అంది.
*** *** *** *** ***
ఉదయం పదకొండు గంటలకు మంజుల ఇంటికి వెళుతుంటే దారిలో కొంతమంది అమ్మలక్కల మాటలు లీలగా వినిపించాయి నీరజ కు. "ఆ మంజుల కూతురు ఎవరినో ప్రేమించి పెళ్ళి చేసుకుంది.అబ్బాయి తక్కువ కులం వాడంట" అంది ఓ ఆవిడ.
"పెద్దలను ఒప్పించే చేశారుగా పెళ్ళి. చక్కగా ఉంది జంట.ఇప్పుడు కులం ఎవరు చూస్తారు.పిల్లలు బాగుండాలి కాని"అంది మరో ఆవిడ.
"ఇప్పుడు కులం ఎవరు చూస్తారు"అనే మాట బాగా వినపడింది నీరజ కు.మంజుల ఇల్లు దగ్గరకు రావడంతో మంజుల ఎదురెళ్ళి "రా నీరజక్క,రా సుందరి " అని ఆహ్వానించింది.
మంజుల ఆడ బిడ్డలు ఆ కార్యక్రమానికి పెద్దగా ఉండి జరిపిస్తున్నారు.నీరజ ఆ అమ్మాయి ఒడిలో రెండు వేలు రూపాయలు పెట్టి "పిల్లా పాపలతో సౌభాగ్యాలతో వర్ధిల్లు "అని ఆశీర్వదించింది
.సుందరి నీరజ చెవిలో ఎదో ఊదింది.
"అమ్మాయి తక్కువ కులం వాడిని చేసుకుందని".దానికి నీరజ స్పందించలేదు.మంజుల ఆడ బిడ్డల వంక చూస్తూ ఉంది."ఈవిడ మా పెద్ద ఆడ బిడ్డ ప్రభుత్వ కాలేజీ లో ప్రిన్సిపల్ కర్నూలు లో ఉంటారు.చిన్న ఆడ బిడ్డ హైదరాబాద్ లో బ్యాంక్ మేనేజర్" పరిచయం చేసింది నీరజ కు."నమస్కారం "అని నీరజ. ప్రతి నమస్కారం చేశారు వాళ్ళు. "ఈ విడ పేరు నీరాజాక్షి ఈ వీధి లోనే ఇల్లు.మా వీధి కే ఈ విడ పెద్దనుకో వదిన.ప్రతి శుభకార్యం లో నీరజక్క ఉండాల్సినదే"చెప్పింది ఆడ బిడ్డలతో.ఆ మాట ఒకింత గర్వంగా అనిపించింది నీరజ కు.చిన్నగా నవ్వింది వారి వైపు చూసి."ఈ సమాజంలో మనకు కావలసినది మంచి మనసే కదా!మనకు శత్రువులు ఎవరూ లేకపోతే అంతే చాలు"అంది ప్రిన్సిపాల్."అవును"అంది నీరజ.
"భోజనం చేసి వెళ్ళాలి నీరజక్క" ఆజ్ఞ జారీ చేసింది మంజుల.
*** *** **** ***** **** ** **
దారిలో సుందరి,నీరజ మాట్లాడుకుంటూ వస్తున్నారు. "చాలా చక్కటి పిల్ల ,చదువు,ఉద్యోగం .తక్కువ కులం వాడిని ఎలా చేసుకుందో" అంది సుందరి.దానికి నీరజ నవ్వి "మనం చూడాల్సింది కులం కాదు గుణం.పిల్లాడు మంచోడు అయితే అంతకంటే కావలసింది ఏముంది?కులం ఏమి అన్నం పెడుతుందా!ఈ కులాలు,మతాలు నాకు నచ్చవు.వాళ్ళ భవిష్యత్తు మనం కోరుకోవాలి,ఆశీర్వదించాలి.నా నైజం అదే .ఈ కుల పిచ్చి పోతేనే మన దేశం బాగుపడుతుంది.ఈనాడు ఎన్నో పరువు హత్యలు చూస్తున్నాం.సొంత కూతురిని హత్య చేసిన కసాయి తల్లిదండ్రులున్నారు.చంపితే కులం తిరిగి వస్తుందా!.మానసిక క్షోభ అనుభవించేది వారే కదా. ఒక జంటను విడదీయడం క్షమించరాని నేరం ఏమంటావ్" అంది నీరజ.దానికి పలక లేదు సుందరి.సుందరికి కుల పిచ్చి ఎక్కువ.
"నాకేమో మంజుల బిడ్డ చేసిన పని నచ్చ లేదు" అంది.
"ఎందుకు సుందరి అలా అంటావ్.పిల్లలు చక్కగా ఉన్నారు.పైగా పిల్లాడి నాన్న మంచి హోదా లో ఉన్నారు"అంది.
"నీవు ఎన్నైనా చెప్పు ఇది నాకు నచ్చలేదు"అంది.
"ఈ పని రేపు బంటి గాడు చేస్తే"
"అక్కా..."ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం.
"నేను వాడ్ని ఇంటిలోకి రానివ్వను"
"నిజమా"
"అవును అక్క " ఖరా ఖండిగా చెప్పింది సుందరి.నీరజ ఎదో చెబుతుండగా ఫోన్ మోగింది.
"హలో"
"హలో నీరజక్క గృహ ప్రవేశం మరవద్దు"అంది
"అబ్బా ఎన్ని సార్లు చెబుతావు వస్తాను గా"అంది.
"ఎవరూ"అడిగింది సుందరి.
'సులోచన రేపు గృహప్రవేశం రమ్మంటుంది. నిన్ను పిలువలేదా"!
"పిలిచింది నేను రాను "అంది
"ఎందుకేమిటి"?
"సులోచనది కులాంతర వివాహం".
"అయితే నీ కేమిటి? చక్కటి గృహం కట్టుకుంది. సంతోషంగా ఉంది.వివాహం వారి వ్యక్తిగత విషయం.మనకు ప్రేమ ముఖ్యం.ఈ పట్టింపులు ఎవరికి కావాలి"అంది.
"ఏమో అక్కా నాకైతే కటువే"అంది.
ఇద్దరి ఇళ్ళు దగ్గరకు రావడంతో "వస్తాను సుందరి"అంది. "సరే" అంటూ వెళ్ళింది సుందరి.
*** *** *** **** **** **** *******
సులోచ ఇల్లు చూడ ముచ్చటగా ఉంది.విశాలమైన కాంపౌండ్.పూల మొక్కలు ఒక వరుసలో అందంగా ఉన్నాయి. ఇంటి ముందర కోలాహలంగా ఉంది.బంధువులు ఎవ్వరు రాలేదు.అందరూ మిత్రులే ఉన్నారు. ఆ మిత్రులలో ఒకాయన మాట వినపడింది నీరజ కు."బంధువులు సులోచనను వెలి వేశారంట".
నీరజ కోసం ఎదురుచూస్తుంది సులోచన.అవిడతోనే రిబ్బన్ కట్టింగ్ చేయించాలని ఉంది.అప్పుడే చంద్రం,నీరజ కనపడగానే కళ్ళు విశాలమయ్యాయి ఎదురెళ్ళి ఆహ్వానించింది నవ్వుతూ."బాగున్నారమ్మా" పలకరించాడు చంద్రం.
"బాగున్నా అన్న" అంది. గుమ్మానికి ఎర్రని రిబ్బన్ కట్టి ఉంది.ట్రె లో కత్తిరించడానికి కత్తేర తీసుకు వచ్చాడు సులోచన భర్త వీరేశ్. బైట ఉన్న అందరిని రమ్మని పిలిచింది సులోచన.వీరేశ్ కత్తెర అందిస్తూ "కట్ చేయండి అక్క'అన్నాడు.నీరజ రిబ్బన్ కట్ చేయగానే అందరూ తప్పట్లు కొట్టారు.
"లోపలికి పదండి"అంది సులోచన. నీరజ ఒక్క క్షణం ఆగి కుడి కాలు ముందు పెట్టి దేవుడిని మనసులో తలచుకుని లోపలకు అడుగు పెట్టింది.విశాలమైన హాలు. ఖరీదైన ఫర్నిచర్,గోడకు ఎదురుగా గాంధీ బొమ్మ కనిపించింది.దానికిందనే ఓ స్లోగన్ "అంటరాని తనం జాతికి ద్రోహం" చుట్టూ చూసింది మరో చోట అంబేద్కర్ ఫొటో ,కాస్త దూరంగా హిందు, ముస్లిం,క్రై స్తవ మత చిహ్నాలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాయి.సర్వమతాల సారం ఒకటే నని రాసుంది. సులోచన,వీరేశ్ ల ఆదర్శం గొప్పదని గ్రహించింది నీరజ.అందరూ సులోచనను,వీరేశ్ ను అభినందించారు.నీరజ సులోచనను ఆలింగనం చేసుకుంది.ఆ ఆలింగనానికి కదిలిపోయింది సులోచన.కళ్ళలో కన్నీళ్ళు తుడుచుకుంటు "వస్తావో రావో అనుకున్నా" అంది గద్గద స్వరంతో. "నాకు కులం కాదు ముఖ్యం మానవత్వం" అంది.ఆ మాటకు అందరూ చప్పట్లు కొట్టారు.
**** **** **** **** **** *****
కాల చక్రం గిర్రున తిరుగుతోంది. చంద్రం రిటైర్డ్ అయి ఇంటి పట్టునే ఉంటున్నాడు.నీరజ కు తల నెరసింది.కళ్ళకు అద్దాలు వచ్చాయి.అయినా ఆరోగ్యంగా ఉంది. సాయంత్రం నడక అలవాటు చేసుకుంది.
ఆ రోజు రాత్రి సుందరి ఇంటిలో ఎదో ఘర్షణ జరుగుతోంది.భార్య,భర్త ఇద్దరూ బంటి ని తిట్టి పోస్తున్నారు.బాల్కనీలోకి వచ్చి చూసింది నీరజ. బంటి మాట్లాడుతూ "నేనేమి చిన్న పిల్లవాడిని కాదు.అన్నీ ఆలోచించే ఆ అమ్మాయిని ...",అంటుండగా.
"ఆపు"గట్టిగా అరిచింది సుందరి.
నీరజ కు పరిస్థితి అర్థమైంది.బంటి ఎవరినో ప్రేమించాడు,ఎవరమ్మాయి నాతో ఎప్పుడూ చెప్పలేదు అనుకుని లోపలకు వెళ్ళింది.
"ఈ పెళ్ళి జరగడానికి వీలు లేదు "తండ్రి గర్జించాడు.
"అమ్మా" అన్నాడు బంటి.
"నీ తండ్రి మాటే నా మాట కూడా,కులం తక్కువ అమ్ముయిని చేసుకుంటే మనకు బందువులలో విలువ ఏమి ఉంటుంది.నా మాట విను ఆ అమ్మాయిని మరచిపో" బతిమిలాడింది సుందరి.
"అమ్మాయి చాలా మంచిది.కులం కాదు.గుణం ముఖ్యం అమ్మ" అన్నాడు.
"వద్దు..వద్దు నాకు కులమే ముఖ్యం "అంది.
"అమ్మా"
"మరేం మాట్లాడకు రేపే మీ అత్తయ్య కూతురితో మాట్లాడతాను.ఆ అమ్మాయిని మరచిపో " అంది.
"లేదమ్మ వనజ ను మరువను".
"తల్లిదండ్రుల కంటే అదే ఎక్కవా నీకు "కోపంగా అంది.
"నాకు ఇద్దరూ కావాలమ్మ" అన్నాడు బంటి.
ఆరోజు ఎవరూ భోజనాలు చేయకుండానే విశ్రమించారు.సుందరి ఇంటిలో గంబీర మైన వాతావరణం నెలకొని ఉంది.
మరుసటిరోజు ఉదయం ఆరు గంటలకే నీరజ తలుపు తట్టారు ఎవరో.నీరజ కళ్ళ జోడు సవరించుకుని తలుపు తీసి ఆశ్చర్య పోయింది.ఎదురుగా బంటి,ప్రక్కనే అమ్మాయి.ఇద్దరి మెడలో పూల దండలు ఉన్నాయి.నీరజ ను చూడగానే ఇద్దరూ కాళ్ళ మీద పడ్డారు.
"అమ్మ ఆశీర్వదించు"అన్నాడు.నీరజ ఆశీర్వదించి పైకి లేవ నెత్తింది. "ఈ అమ్మాయి పేరు వనజ,నా క్లాస్ మేట్.ఈ మధ్యనే గ్రామ సచివాలయంలో ఉద్యోగం వచ్చింది."అన్నాడు.
"నీవు పని చేసే చోటే కదా, ఇద్దరికి మంచి ఉద్యోగాలు రండి" అంటూ లోపలికి ఆహ్వానించింది.అప్పుడే చంద్రం లేచి "బంటి బాగున్నవా"!అన్నాడు.వనజ చంద్రం కు నమస్కరించింది. "కూర్చోండి" అన్నాడు చంద్రం.నీరజ వంటిట్లో కాఫి కలుపుతుంటే వనజ తో మాట్లాడుతున్నాడు చంద్రం.
"నీరజ అమ్మ " అంటూ కొంగు ముడి వేస్తున్నాడు.అది చిన్నప్పటినుంచి వాడికి అలవాటు.
"చెప్పు నాన్న "అంది నీరజ.
"అమ్మకు చెప్పకుండా ఈ పెళ్ళి చేసుకున్నాను"అన్నాడు.
"నాకు తెలుసు నువ్వు ఎప్పుడైతే ఈ ఇంటికి వచ్చావో నాకు అర్ధం అయింది.ఇదిగో కాఫి తాగు" అందించింది .అప్పుడే ఫోన్.
"నీరజా నీ ఫోనే" అన్నాడు చంద్రం.
"హలో"
"....."
"అవును,ఎప్పుడు?ఎక్కడున్నారు,అయ్యో ఇప్పుడే వస్తున్నాం"అంది కంగారుగా.
"ఎవరు ఫోన్ "అన్నాడు చంద్రం.
నీరజ టెన్షన్ పడుతూ ఉంది."అది..అది " బంటి వైపు చూసి మీ అమ్మకు,నాన్నకు యాక్సిడెంట్ అయ్యిందట.ఉదయము గుడి నుంచి వస్తుంటే కుక్కను తప్పించ బోయి ఇద్దరికీ బలమైన గాయాలు అయ్యాయి" చెప్పింది.ఆ మాట వినగానే అక్కడ నిశ్శబ్దం.
"అమ్మా.. నాన్న" కళ్లనీళ్ళు పెట్టుకున్నాడు బంటి.
"ఏం కాదులేరా "ఓదార్చింది నీరజ.
**** **** **** **** **** ****
ఆశా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్నారు ఇద్దరూ. బలమైన గాయాలు తల కు తగిలాయి.స్పృహ లేదు.నర్సులు అటు,ఇటు తిరుగుతున్నారు.
డాక్టర్ కనపడగానే " డాక్టర్ " అన్నాడు బంటి.
"ప్రాణాలకు ప్రమాదం లేదు" చెప్పాడు డాక్టర్.
"థాంక్యూ గాడ్"అనుకుంది నీరజ.
డాక్టర్ చెబుతున్నాడు. "ఇద్దరిలో రక్తం చాలా పోయింది.రక్తం కావాలి "అన్నాడు.రక్తం ఇవ్వడానికి నీరజ ,చంద్రం,బంటి ముందుకు వచ్చారు.చక చక ముగ్గురి రక్తం పరీక్ష చేశారు.
అవేవి వారి బ్లడ్ గ్రూప్ కు సరి పోలేదు.
"లాభం లేదు.మీ రక్తం సరి పోదు అంటుండగా
అప్పుడే బాబా గుడికి వెళ్ళి వచ్చిన వనజ "నా రక్తం పరీక్ష చేయండి "అంది.నర్స్ వచ్చి పరీక్ష చేసింది.వనజ రక్తం నూటికి నూరు పాళ్ళు సరి పోయింది. వనజ ను పిలిచాడు డాక్టర్. తలకు బలమైన గాయాలతో స్పృహ లేని స్థితిలో ఉన్నారు సుందరి,సుందరి భర్త.డాక్టర్ వనజ రక్తం తీసుకున్నాడు.వనజ రక్తం ఆ దంపతులకు ఎక్కించాడు డాక్టర్.సుందరీ భర్త కన్నా,సుందరికి ఎక్కువ రక్తం అవసరమైంది.బైట మౌనంగా కూర్చున్నారు బంటి,నీరజ, చంద్రం.నర్స్ వనజ ను బైటకు తీసుకు వచ్చి "ఈమెకు మంచి జ్యూస్ ఇప్పించండి ,వాళ్ళకు రేపు స్పృహ వస్తుంది,భయం లేదు"అంది నర్సు.
అంత నీరసం లోను ఆ మాటకు బాబాకు కృతజ్ఞత చెప్పింది వనజ మనసులో.
**** **** **** **** ******
మెల్లగా కళ్ళు తెరిచాడు సుందరి భర్త. ప్రక్కనే
మరో బెడ్ పై భార్య. మంచం ప్రక్కనే చంద్రం,బంటి నిలుచున్నారు."నాన్న"అన్నాడు బంటి.
"నన్ను క్షమించరా నీ పెళ్ళి వద్దు అన్నందుకు
మాకు...."అంటుండగా,"ఇప్పుడు అవన్నీ ఎందుకండి భాదపడకండి, సుందరి కూడా కొలుకుంటుంది"అన్నాడు చంద్రం.
"నాన్నా పడుకోండి ,మాట్లాడ వద్దండి"అన్నాడు బంటి. నర్స్ వచ్చి సెలైన్ బాటిల్ మార్చింది సుందరికి. మధ్యాహ్నం స్పృహ వస్తుంది.నాలుగు రోజులలో ఇంటికి వెళ్ల వచ్చు"అంది నర్స్.
**** ***** ****** ******
ఆసుపత్రిలో పూర్తిగా కొలుకున్నారు సుందరి,సుందరి భర్త.డాక్టరు పరీక్ష చేసి వారం పాటు ఈ మాత్రలు వాడాలి ఇంకేం వద్దు.ఈ రోజే మీరు వెళ్ళవచ్చు"అన్నాడు.
అప్పుడే చంద్రం ఫోన్ రింగ్ అయింది.
"హలో, సరే అక్కడికే తీసుకు వస్తాం"అన్నాడు.బంటి ఊహించాడు అది నీరజ అమ్మ ఫోనని.
**** ******** ***** ***
షిర్డీసాయి బాబా గుడి.మూర్తీభవించిన తెల్లని
పాలరాయి విగ్రహం, ఒకచేయి ఆశీర్వదిస్తున్నట్లుగా,అభయం ఇస్తున్నట్లుగా ఉంది."మీ కష్టాలు నావి" అన్నట్లు బాబా హస్తం ఉంది.బాబాకు అర్చన చేయిస్తోంది వనజ.బాబా గుడికి చేరుకున్నారు అందరూ.వాళ్ళు రావడం చూసి ఎదురు వెళ్ళింది నీరజ. సుందరిని చూసి "బావున్నావు కదూ, నువ్వు మీ వారు కోలుకోవడం అంతా బాబా దయ,ఆ అమ్మాయి పూజ ఫలం." సుందరి బాబా ముందు కూర్చున్న వనజ వంక చూస్తోంది. రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుని శ్రద్ధ తో బాబాను ధ్యానిస్తుంది.
"చూశావా ఆ అమ్మాయి మంచితనం మీరు ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి ఆ బాబా దగ్గరే గడిపింది.మనకు కులం కాదు ముఖ్యం మంచితనం,ఆప్యాయత,ఆ అమ్మాయి రక్తమే మీకు ఎక్కించారు.ఆ రక్తం తోనే మీరు కొలుకున్నారు. రక్తానికి కులం లేదు .మానవత్వం ఉంది."అంది నీరజ.
ఆ మాట కళ్ళు తెరిపించాయి సుందరి,సుందరి భర్తకు.
"పదండి బాబాను దర్శించుకుందాం" అన్నాడు చంద్రం.గుడి గంటలు గణ గణ మోగించాడు సుందరి భర్త.వనజ కళ్ళు తెరచి వెనకకు చూసింది.సుందరి చేతులు చాచి ఆహ్వానించింది కళ్ళతోనే.వనజ పరుగున వెళ్ళి సుందరిని ఆలింగనం చేసుకుంది.ఆమెలో క్షమ గుణం కనపడింది.
బంటి మనసు సంతోషించింది.పూజారి హారతి ఇస్తూ "జై బోలో షిర్డీ సాయి బాబా కు "అన్నాడు.
అందరూ "జై" అంటూ నమస్కరించారు.వారందరికీ శఠ గోపం పెట్టి బాబా ఆశీర్వాదం అందించాడు పూజారి.
ఆ మూడు జంటలు బాబాకు మరోసారి నమస్కరించి అక్కడ నుంచి కదిలారు.
(సమాప్తం)

మరిన్ని కథలు

Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి
Toli prema
తొలి ప్రేమ..!
- ఇందుచంద్రన్
Nakka vaibhogam
నక్క వైభోగం
- నిశ్చలవిక్రమ శ్రీ హర్ష