కోతి సూటి [ప్రశ్న..! - చెన్నూరి సుదర్శన్

Kothi sooti prasna

జాగారం ఊళ్ళో రామయ్య, సీతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వారికి సంతానం లేక బాధ పడే వారు. సీతమ్మ సంతానం కోసం నోములు నోచేది.. దేవుళ్లకు మొక్కుతూ ఉపవాసాలు చేసేది. అయినా వారి కోరిక ఫలించ లేదు. వయసు మీరిన కొద్దీ వారిలో ఆవేదన అధికం కాసాగింది.

ఆ ఊరి సూర్యం మాష్టారు బడిలో పాఠాలు మాత్రమే గాకుండా ఊళ్ళో వారికి కావాల్సిన సలహాలూ ఇచ్చేవాడు. అందరి నోళ్ళలో నాలుకలా మెదిలే వాడు. సంతానం కోసం పరితపించే రామయ్య దంపతులను చూసి జాలి పడేవాడు. వారు అనుసరించే పద్ధతులు నచ్చేది కాదు. మాష్టారు ఒకరోజు కలుగ జేసుకొని వారిరువురిని పట్నం లోని ‘సంతాన సాఫల్య కేంద్రం’ అనే వైద్యశాలకు తీసుకు వెళ్ళాడు. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి కొన్ని మందులు రాసిచ్చారు. అవి క్రమం తప్పకుండా వాడితే సంతాన కలుగుతుందని భరోసా ఇచ్చారు. మనో వ్యాధి పెట్టుకుంటే మందులు పని చేయవని.. పొలం పనుల్లో మునిగి పోవాలని హితవు చెప్పాడు సూర్యం.

మరో సంవత్సరంలోనే సీతమ్మకు పండండంటి అమ్మాయి పుట్టింది. వారి ఆనందానికి అవధులు లేవు. అంతా సూర్యం మాష్టారు చలువ అని అమ్మాయికి ‘సూర్యకళ’ అని పేరు పెట్టుకున్నారు. ఆ సంవత్సరం మాష్టారు పదవీ విరమణ ఉత్సవాన్ని ఘనంగా జరిపించాడు రామయ్య. ఊరంతా మాష్టారుకు కన్నీళ్ళతో వీడ్కోలు పలికింది.

సూర్యకళ బుడి, బుడి అడుగులు వేస్తోంది. రామయ్య, సీతమ్మ ప్రాణాలన్నీ సూర్యకళ మీదనే.. క్షణం విడిచి ఉండే వారు కాదు. తమతో బాటుగా తమ ఇంటి ప్రక్కనే ఉన్న జామతోట లోకి తీసుకుని వెళ్ళే వాళ్ళు. తోటకు ఆనుకుని ఉన్న పొలం పనుల్లో మునిగి తేలుతున్నా.. సూర్యకళను ఒక కంట కనిపెడుతూ ఉండే వారు. తోటలో మిగతా పిల్లలతో ఆడుకునేది సూర్యకళ.

ఒకరోజు అలవాటు ప్రకారం సూర్యకళ ప్రొద్దున్నే జామతోటకు దారి తీసింది. రెప్పపాటులో కనబడకుండా పోయిన బిడ్డ కోసం అటూ, ఇటూ పరుగులు తీసింది సీతమ్మ. గ్రామాంతరం వెళ్ళి వస్తున్న రామయ్యను చూడగానే గుండెలు బాదుకుంటూ.. విషయం చెప్పింది. రామయ్య లిప్తకాలం నిశ్చేష్టుడయ్యాడు. అతనికి జామతోట జ్ఞప్తికి రాగానే హడలి పోయాడు. ఈ మధ్యనే తోట చుట్టూ విద్యుత్తు ఇనుప కంచె ఏర్పాటు చేసాడు. ఉదయం రాగానే విద్యుత్తు నిలిపి వేయాలని అనుకున్నాడు. సూర్యకళ అటు గానీ వెళ్ళితే ఇంకేమైనాఉందా..! అని మనసులోకి రాగానే కంపించి పోయాడు. తోట వైపు పరుగు తీశాడు. అతని వెనుకాలే సీతమ్మ లబో, దిబో మంటూ పరుగెత్తింది.

కంచెకు ఆనుకొని కరెంటు షాక్ తో చనిపోయిన ఒక కోతిపిల్ల కనబడగానే ఘొల్లుమన్నాడు రామయ్య. తన బిడ్డ గూడా ప్రక్కనే ఎక్కడో పడి ఉంటుందని ఒళ్లంతా కళ్ళు చేసుకుని వెదుక సాగాడు. కాని కన్నీళ్లు నిండిన అతని కళ్ళకేమీ కనబడ్డం లేదు. విషయం గ్రహించిన రాజమ్మ ఏడుపు తారాస్థాయికి చేరింది.

ఇంతలో తల్లిదండ్రులను చూసి సూర్యకళ కిల, కిలా నవ్వుతూ రావడం.. ఇది కలా! నిజమా! అని దిగ్భ్రాంతి చెందాడు రామయ్య. సీతమ్మ వేగంగా వెళ్తుంటే.. కరెంటు ఉంది ఆగు.. ఆగు.. అని రామయ్య అంటున్నా వినిపించుకోకుండా వెళ్లి సూర్యకళను ఎత్తుకుని బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించసాగింది. రామయ్య కొయ్యబారి పోయాడు. ఇదెలా సాధ్యం? బహుశః కరెంటు పోయిందేమో!.. అని అనుకుంటూ ఉండగా ఒక కోతి రామయ్య వంక రావడం కనబడింది. దాని కళ్ళల్లో కన్నీరు ధారాళంగా కారుతోంది.

“రామయ్యా..” అని కోతి పిలిచే సరికి మరింత ఆశ్చర్య పోయాడు. “రామయ్యా.. ఇది నీకు న్యాయమేనా? నీ తోటను, పంటను రక్షించుకోడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాని ఇలా ఇనుప కంచె ఏర్పాటు చేసి కరెంటుతో వన్యప్రాణుల ప్రాణాలు తీయడం ధర్మమా? ప్రాణం పోసే శక్తి నీకు లేనప్పుడు.. ప్రాణాలు తీసే అధికారం ఎక్కడది?” అంటూ సూటిగా ప్రశ్నించింది.

“ ఒక్కో సారి మనుషులు గూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఉదయమే నా గారాల బిడ్డ కనబడకపోయే సరికి నాకు అనుమానమేసింది. తోటకు పరుగెత్తుకుంటూ వచ్చాను. ఇంతలోనే ఘోరం జరిగి పోయింది. నాబిడ్డ కంచెకు తగిలి కాలి పోయింది” అంటూ తన బిడ్డను చూపిస్తూ ఏడువ సాగింది. రామయ్య, సీతమ్మల కళ్ళూ చెమ్మగిల్లాయి.

“ఇంతలో మీ అమ్మాయి తోట దిక్కు రావడం గమనించాను. భయమేసింది. వెంటనే వెళ్లి కరెంటు మెయిన్ ఆఫ్ చేసాను. దయచేసి ఎవరి ప్రాణాలూ తీయకండి” అంటూ రెండు చేతులు జోడించింది.

రామయ్య హృదయం ద్రవించింది. గుండె దిటవు చేసుకొని..

“నీ బిడ్డ దహన సంస్కారం నేను చేస్తాను. ఇక్కడే గుడి కట్టి నిత్యం పూజలు జరిపిస్తాను. మా ఊళ్ళో ఇంకెవరూ ఇలాంటి కరెంటు కంచెలు నిర్మించకుండా చూస్తాను” అని వాగ్దానం చేసాడు రామయ్య. *

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి