అందీ అందని ఆకాశం - శ్యామ్ కుమార్ చాగల్

Andee andani aakaasham

న్యూస్ పేపర్ చూసిన రాజు విషయం చెప్పగానే తండ్రీ కొడుకులు స్థబ్ధులైపోయారు .అప్పుడే ఆకాశం చిల్లులు పడ్డట్లుగా హోరున వర్షం మొదలైంది . కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నట్టుండి ఆకాశం లో
మెరుపు మెరిసింది. అంతలోనే పెద్ద పిడుగు పడి చెవులు చిల్లులు పడేలా శబ్దం .

వారినలాగే చూస్తున్న రాజు కు నాలుగు సంవత్సరాల కిందటి గతం కళ్ళ ముందు గిర్రున తిరిగింది..

**********

" మా పెద్ద బాబుని డాక్టర్ ను చేస్తాను. " దృఢమైన సంకల్పం తో అన్నాడు నారాయణ్ శర్మ చుట్టూ కూర్చున్న తన స్నేహితుల వేపు చూసి.

" శర్మ ! మరి చిన్న వాడిని ఏం చదివిస్తావు ? " యధాలాపంగా అడిగాడొక స్నేహితుడు.

అది విని బిగ్గరగా నవ్వి ఆగాడు నారాయణ శర్మ .పెద్దగా నిట్టూర్చి " చిన్న బాబు ని ఇంజనీర్ చదివిస్తా '' అన్నాడు.

" నువ్వింత పెద్ద ఆఫీసర్ అయ్యుండి, పిల్లల ను ఆ మాత్రం చేయక పోతే ఎలా ?'' ముక్త కంఠం తో అని నవ్వేశారు అక్కడ కూర్చున్న శర్మ స్నేహితులందరూ.

పక్క గది లో నుండీ ఇవి వింటున్న శర్మ పెద్దబ్బాయి తరుణ్ , పక్కనే కూచొని చదువుతున్న స్నేహితుడు రాము వంక గర్వంగా చూసాడు.
రాము కేమీ అర్థం కాలేదు. "అసలు డాక్టర్ , ఇంజనీర్ కావాలంటే ఏం చేయాలి ? మరి నన్నేం చదివిస్తారో మా నాన్న గారు నాకెప్పుడూ చెప్పలేదు కదా ? ఎవరూ కూడా చెప్ప లేదే !! " అని అడిగాడు రాము . అలాగే ఆలోచిస్తూ నిరాశగా వుండి పోయాడు.

రాముని చూసి " మనం ఇంటర్ లో డిస్టింక్షన్ తెచ్చుకోవాలి .. ముందు చదువు ' అన్నాడు తరుణ్ .

స్నేహితులిద్దరూ పుస్తకంలో తల దూర్చి చదువులో మునిగి పోయారు.

ఇంటికెళ్లిన రాము , రంగమ్మ ఎదుట నిలబడి ." పిన్ని , ఇంటర్ అయిపోయాక నన్ను డాక్టర్ చదివిస్తారా ?" అమాయకంగా అడిగాడు.
'' ఏమో నాయన ..నిన్ను ఇంటర్ వరకూ చదివించటమే మా భాద్యత . అయినా డాక్టర్ గిరీ చదవటం చాలా డబ్బు తో కూడిన వ్యవహారం. ఇంటర్ అయింతర్వాత డిగ్రీ పాస్ అయ్యి ఏ గవర్నమేంట్ వుద్యోగం అయినా తెచ్చుకుంటే అదే పదివేలు. పైగా మీ ఇంట్లో నువ్వే పెద్ద కొడుకువి . మీ నాన్నగారి పరిస్థితి తెలుసుగా .అందరి ఆశలు నీ పైనే. " అంది రంగమ్మ.

అది విని ఈ లెక్కలో ఇదేదో మన తాహతుకి మించిన విషయం అనుకుని వెళ్ళిపోయాడు రాము.
.
************

తరుణ్ , రాము ఇద్దరూ కలిసి ఇంట్లోకి అడుగు పెట్టగానే పక్కింటి విజయ నవ్వుతూ కనిపించింది .

తరుణ్ ను చూసి "హలో డాక్టర్ గారు " అంది నవ్వుతూ విజయ.
.
" ఆంటీ ..హలో డాక్టరా ! ....ఇంకా ఎక్కడ , ఎంట్రన్స్ పాస్ కావాలి కదా '' నమస్కారం పెడుతూ అన్నాడు తరుణ్.

" అవును ..ముందు ఎంట్రన్స్ పాస్ కావాలి కదా వదినమ్మ " అంది చిరునవ్వుతో తరుణ్ తల్లి శాంత.

" మా అల్లుడికి అది పెద్ద కష్టం కాదు. తరుణ్ చాలా తెలివి పరుడు " అంది విజయ ,తరుణ్ ను మెచ్చుకోలుగా చూస్తూ.

" నువ్వు కూడా ఎంట్రన్స్ రాస్తున్నావా రాము " అడిగింది విజయ ,రాము వైపు నవ్వుతూ చూసి.
.

'' లేదాంటీ . బిఎస్సి లో చేరతాను " అన్నాడు చేతులు కట్టుకుని రాము.
అది విని మొహం ముడిచింది విజయ . మళ్ళీ తరుణ్ ను నవ్వుతూ చూసి " తొందర లోనే తీపి కబురు చెప్పాలి" అంది విజయ .

"అలాగే అంటీ " అని రాము తో కలిసి లోనికి వెళ్ళాడు తరుణ్.

" తరుణ్ ..అప్పుడే నిన్ను అల్లుడు అంటోంది ఆంటీ ,చూసావా నువ్ డాక్టర్ అవుతావని నీకు విలువ పెరిగి పోయిందిరోయ్ '"అన్నాడు రాము.

" అవునురా నిజమే, కదా " తలూపుతూ అన్నాడు తరుణ్ వాస్తవాన్ని గుర్తిస్తూ.


అందరూ తరుణ్ కి మెడిసిన్ లో సీట్ ఖాయమని నిర్ధారించేసారు. ఎవరు కలిసినా తరుణ్ కనపడగానే కాబోయే డాక్టర్ అని పలకరించడం మొదలైంది.
స్నేహితులు, అమ్మాయిలు , తరుణ్ ను అభిమానంగా చూడసాగారు.
ఆఖరికి అందరూ ఎదురు చూస్తున్న ఎంట్రన్స్ ఫలితాల రోజు రానే వచ్చేసింది.
ఆ రోజు తెల్లవారుజామున తరుణ్ , రాము బస్సు స్టాండ్ కు వెళ్లి న్యూస్ పేపర్ అందరి కంటే ముందుగా తీసుకుని నెంబర్ వెదికారు.
అందులో తరుణ్ నెంబర్ ఎక్కడా కనపడ లేదు. కంగారుతో మళ్ళీ జాగ్రత్తగా చూసారు కానీ తరుణ్ నెంబర్ లేదు.

" ఇంకొక పేపర్ కొనరా ..అందులో చూద్దాం" అని సలహా ఇచ్చాడు రాము

మరో రెండు రకాల పేపర్లు కొని చూసారు , అయితే అందులో కూడా ఎక్కడా నెంబర్ కనపడ లేదు. మొత్తానికి ఎంట్రన్స్ పరీక్ష పాస్ కాలేదు అన్న విషయం అర్థం అయిపోయి, ఇద్దరూ నిరాశగా ఇంటికి వెను తిరిగారు. తరుణ్ కు సీట్ రాలేదు
అనే విషయం కొద్దిసేపట్లోనే ఊరిలో అందరికీ తెలిసి పోయింది.

ఇంక చేసేదేమీ లేక ఇద్దరూ బీఎస్సీ లో చేరిపోయారు.
సంవత్సరం తిరగ్గానే మళ్ళీ ఎంబిబిఎస్ పరీక్షలకు ఈ సారి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుని చాలా ఏకాగ్రతతో చదివి రాసాడు తరుణ్.
ఈ సారి మెడిసిన్ లో సీట్ రావాలని రాము, తరుణ్ తల్లి తండ్రుల తో సహా అందరూ దేవుడికి మొక్కుకున్నారు.

ఆ రోజు ఇంతకు ముందు లాగ ఉద్వేగ పడకుండా ధీమాగా పేపర్ తీసుకుని రిజల్ట్ చూసారు. కానీ అందులో నెంబర్ కనపడ లేదు. ఈ సారి కూడా సీట్ రాలేదు.

ఎండాకాలం సెలవుల్లో ఇంటికి వెళ్లకుండా కోచింగ్ సెంటర్ లో మళ్ళీ చేరి పోయాడు తరుణ్
బీఎస్సీ రెండవ సంవత్సరం , మూడవ సంవత్సరం పరీక్షల తర్వాత , ఎంట్రన్స్ పరీక్షలలో కూడా సీట్ రాలేదు.. దాంతో అందరికీ తరుణ్ మీద ఆశలు సన్నగిల్లాయి. అంత వరకూ ఎంత గానో ప్రేమ కురిపించిన బంధువులు తరుణ్ తో ముభావంగా ఉండటం మొదలు పెట్టారు .

అయితే బీఎస్సీ లో స్నేహితులిద్దరూ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు.

కానీ అప్పటివరకు తరుణ్ డాక్టర్ అవుతాడని ఊహించి విలువిచ్చిన చుట్టాలు, స్నేహితులు క్రమేపి తరుణ్ ను మొత్తంగా పటించుకోవడం మానేశారు. అంత వరకూ వెంట బడిన అమ్మాయిల తల్లి తండ్రులు మొహం చాటెయ్యటం మొదలు పెట్టారు.

ఆ రోజు తరుణ్ ఇంట్లో వాతావరణం గంభీరంగా వుంది. శర్మ ,శాంత ఇద్దరూ సోఫా లో కూర్చొని ఆలోచిస్తూ వున్నారు.

" ఈ ఒక్క మారు నాకు ఎంట్రన్స్ రాయటానికి ఒప్పుకొండి నాన్న ! ఇది నా ఆఖరి ప్రయత్నం . ఒక వేళ ఈ సారి
కూడా రాకపోతే , ఎంఎస్సీ కి వెళ్లి పోతా '' బ్రతిమిలాడుతూ అన్నాడు తరుణ్.


కాసేపు అలోచించి అన్నాడు శర్మ ." సరే ఈ సారి మరెక్కడైనా శిక్షణ తీసుకుంటావా ? ...ఎలా మరి ? ఏంటి నీ ప్లాన్ " సందేహంగా .

ఎవరూ మాట్లాడ లేదు. అక్కడ మౌనం తాండవించింది.

మళ్ళీ అన్నాడు తరుణ్ " ఈ ఒక్క సంవత్సరం నన్ను ఒంటరిగా వదిలెయ్యండి , ఇదే నా ఆఖరి ప్రయత్నం . మీకు ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు అయ్యింది నాన్నా . నాకు తెలుసు. కానీ నాన్న ఇది ఆఖరి ప్రయత్నం . నన్ను నమ్మండి. నేను డాక్టర్ అవటం మీకే కాదు నాకు కూడా అది జీవితాశయం " అని కళ్ళ లో వస్తున్న నీళ్ల ను తుడుచుకున్నాడు తరుణ్.

" సరే అలాగే కానివ్వు బాబు..ధైర్యంగా వుండు.. నువ్ బాధ పడ కూడదు . దాని గూర్చి అంతలా బాధ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎన్నో మంచి చదువులున్నాయి. వస్తే వచ్చింది లేక పోతే లేదు..అంతే " అంటూ లేచి వచ్చి కొడుకు కళ్ళు తుడిచి , గుండెలకు హత్తుకున్నాడు శర్మ .
****

ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా , రకరకాల పరీక్షలు రాస్తూ పోయాడు రాము.
హైదరాబాద్ లో రూమ్ తీసుకున్న తరుణ్ తిరిగి ఊరికి రాలేదు. స్నేహితులెవరినీ తన గది కి రావద్దని చెప్పాడు. ఎవరికీ తన గది చిరునామా కూడా ఇవ్వకుండా జాగ్రత్త లు తీసుకున్నాడు. ఆఖరికి రాము కి కూడా రావద్దని చెప్పాడు.

సరిగ్గా సంవత్సరం గిర్రున తిరిగి పోయింది . రాము స్టేట్ బ్యాంకు లో వుద్యోగం సంపాదించాడు. తరుణ్ ఇంటికి వెళ్లి శర్మ గారిని కలిసి "ఒక సారి హైదరాబాద్ వెళ్లి తరుణ్ ను కలుద్దామనుకుంటున్నాను మామయ్య !..నాకు స్టేట్ బ్యాంకు లో వుద్యోగం వచ్చింది "అన్నాడు.
" చాలా సంతోషం, రాము, వెళ్ళు ..ఇదుగో వాడి నెంబర్, అడ్రస్ ఇస్తాను ..అడ్రెస్ మరింకెవరికీ ఇవ్వొద్దు"
అన్నారు శర్మ .

హైదరాబాద్ లో ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు రాము. ఆ ఇల్లు చూసి ఆశ్చర్య పోయాడు . అదొక పాత రేకుల ఇల్లు. బయట గోడల రంగులు వెలిసి పోయి వున్నాయి. ఇంటి తలుపులు వేసి వున్నాయి . ఇక్కెడలా వుంటున్నాడబ్బా ? అనుకుంటూ వెళ్లి ,సంశయంగా తలుపులు తట్టాడు రాము.

కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసి ఎదురుగా నిలబడ్డ తరుణ్ మొహం చూసి కంగారు పడి పోయాడు రాము.

తరుణ్ పూర్తి గా గుర్తు పట్ట లేనట్టుగా మారి పోయాడు. గడ్డం పెరిగి , తల మీద ఎండి పోయిన జుట్టు , కళ్ళ కింద నల్లని వలయాలు, భయంకరంగా ,పిచ్చి వాడిలా అయిపోయాడు.. బాగా బరువు తగ్గి పోయి నీరసంగా కనిపిస్తూ వున్నాడు. తరుణ్ రూపం చూసి కంగారు పడి పోయాడు రాము.

" ఏంటిరా , ఏంటీ అవతారం "అన్నాడు రాము గది లోనికి అడుగులు వేస్తూ

నీరసంగా నవ్వాడు తరుణ్. " కూర్చో రాము " అన్నాడు లోపల కుర్చీ చూపించి
గది ని చుట్టూ పరికించి చూసాడు రాము. ఎక్కడ చూసినా పుస్తకాలు . కింద చాప మీద కూడా రకరకాల పుస్తకాలు చిందర వందరగా పడేసి వున్నాయి.
ఒక టేబుల్,కుర్చీ మరో పక్కన మంచం, ఇంకో మూల గ్యాస్ స్టవ్, కొన్ని గిన్నెలు వున్నాయి. పై కప్పు కేసి చూసాడు రాము , సీలింగ్ ఫ్యాన్ కూడా లేదు. తరుణ్ గది, రూపం చూసి రాము కి గుండెలు మెలిపెట్టినట్లుగా అయ్యింది

" ఎంటలా నీరసంగా వున్నావు, ఈ అవతారం ఏంటి. ..నువ్వెంటి..ఇదేమీ బాగా లేదు " బాధతో అన్నాడు రాము

" ఏమో రా నాకివన్నీ ముఖ్యం కాదు. ఎలాగయినా సీట్ సంపాదించాలి. అనుకున్నది సాదించాలి ..నాన్న కల నిజం చెయ్యాలి " అన్నాడు తరుణ్..
తరుణ్ కళ్ళలో దృఢమైన నిర్ణయం కనపడుతూ వుంది.

తరుణ్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్ధన్గా కూర్చొని వుండిపోయాడు.

"ముందు తలకు కట్టింగ్ చేయించుకో ".అన్నాడు రాము.

సమాధానం చెప్పకుండా తల కిందకు వేసుకుని మౌనంగా తలూపాడు తరుణ్.

" అమ్మకు , నాన్నకు నేను బావున్నానని చెప్పరా, ఇక్కడి విషయాలు ఏమీ చెప్పొద్దు " అని, తలెత్తి రాము ని చూసి "నువ్విక వెళ్లి రా ..నేను చదూకుంటాను. ప్రతి రోజు ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. పరీక్ష దగ్గరకొచ్చేసింది. " నిష్కర్షగా అన్నాడు తరుణ్. .

"ఏమిటో నువ్వసలు . అసలా డాక్టర్ చదువు చదువకుంటే వచ్చే నష్టమేంటి . మనం బ్రతక లేమా "అని విసుగ్గా అన్నాడు రాము.

తరుణ్ ఏమీ మాట్లాడ కుండా ఒకసారి రాముని చూసి కళ్ళు తిప్పుకున్నాడు.
"సరే రా వస్తాను ..జాగ్రత్త, ఇదిగో ..ఈ డబ్బులుంచు .నాకు వుద్యోగం వచ్చింది " అని కొన్ని నోట్లను టేబుల్ మీదుంచి కదిలాడు రాము.

తరుణ్ ఆకారం, పరిస్థితి చూసి చాలా బరువైన మనసు తో వెను తిరిగాడు రాము. అతని మనసంతా దుఃఖం తో నిండి పోయింది. నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగి చూసాడు రాము. తరుణ్ గది తలుపులు మూసేసి ఉండటం కనిపించింది

*******

ఎంట్రన్స్ రాసి ఇంటికి తిరిగి వచ్చేసాడు తరుణ్. ఇంటికి స్నేహితులు, బంధువులు ఎవరొచ్చినా కొడుకు మనసు విప్పి మాట్లాడ కుండా కూర్చోవటం చూసి శర్మ లొ దిగులు మొదలయ్యింది .
రాము రాగానే మాత్రం తరుణ్ మొహం లో సంతోషం కనపడేది.
************

" రేపేనా రిజల్ట్స్ వచ్చేది " అడిగాడు రాము.

" అవునురా " విరక్తిగా సమాధానం చెప్పాడు తరుణ్.

" ఈ సారి తప్పకుండ సీట్ వస్తుంది ..దిగులు పడకు " సమాధాన పరిచాడు రాము.

"అవును రాము, మేము కూడా రోజూ దేవుడిని అదే , ప్రార్థిస్తున్నాం . నువ్వీ రోజు రాత్రికి ఇంటికెళ్ళద్దు .ఇక్కడే తరుణ్ తో ఉండిపో. రేపుదయం ఫలితాలు వచ్చాక వెల్దువు గానీ " అంది శాంత .

" అలాగే అత్తయ్య " అన్నాడు రాము కళ్ళ సైగ తో ధైర్యం చెప్పుతూ.


ఆ రాత్రి భోజనాలయిన తర్వాత వరండా లో కూర్చున్నారు రాము , తరుణ్.

" రేపుదయం నా భవిష్యత్ ఏమిటో తెలిసి పోతుందిరా " అని నిట్టూర్చాడు తరుణ్.

" నీకు సీటు ఖాయం ..ఇంకేమీ ఆలోచించకు " ధైర్యం చెప్పుతూ అన్నాడు రాము .

రాము కళ్ళల్లోకి సూటుగా కాసేపు చూసి మరింకేమీ మాట్లాడకుండా ఆలోచించసాగాడు తరుణ్.
రాము కూడా అలాగే కుర్చీలో కూర్చుండి పోయాడు.
దాదాపుగా అర్ధ రాత్రి పన్నెండు కావొచ్చింది . ఎవరూ పడుకోలేదు. ఎవరికీ నిద్ర రావటం లేదు.
ఆకాశం లో నిండుగా నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. ఎక్కడో దూరంగా వర్షం పడసాగింది. చల్లని గాలులు వేగంగా వీచ సాగాయి. గాలి వేగం తీవ్రమయ్యి ఉన్నట్టుండి కరెంట్ పోయింది. ఇల్లంతా చిమ్మని చీకటి అలముకుంది. కిటికీల తలుపులు గాలికి ఎడా పెడా కొట్టుకోసాగాయి. రాము లేచి వెళ్లి అన్నీ కిటికీలు మూసాడు.

ఇంతలో లోపలి నుండీ శాంత వచ్చి లాంతర్ వెలిగించింది. గది లో మెత్తటి లేత పసుపు రంగు వెలుగు పరుచుకుంది. ఈజీ చైర్ లో కూర్చున్న కొడుకుని దిగులుగా చూసి " ఇంకెత సేపు కూర్చుంటారు. వెళ్లి పడుకోండి " అంది శాంత .

రాము ను చూసి " నువ్ పడుకోరా ..నే వస్తాను " అని నిస్సత్తువగా అన్నాడు తరుణ్ .

లేచి వెళ్లి మంచం మీద వొత్తిగిలి, అటు ఇటూ చాల సేపు మెసిలి నిద్ర పోయాడు రాము.

కొద్దీ సేపటి తర్వాత నిద్రలో ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసాడు రాము.
వరండా లో కళ్ళు మూసుకుని ఈజీ చైర్ లో కూర్చొని వున్నాడు తరుణ్. ఇంకో వేపు శర్మ కూడా కూర్చొని అలోచిస్తూ వున్నారు.
గోడగడియారానికేసి చూశాడు రాము. రాత్రి మూడు గంటలు చూపిస్తూ వుంది. లేచి తాను కూడా వరండా లో కొచ్చి కూర్చున్నాడు రాము.
బయట సన్నగా వర్షం మొదలయింది. గాలి వేగం పెరిగి , చుట్టూ వున్న చెట్ల కొమ్మలు విపరీతంగా ఊగుతూ వున్నాయి.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
రాము ని చూసి "నువ్వెందుకు లేచావు రాము పడుకో "అన్నారు శర్మ అనునయంగా.

"పర్వ లేదు మామయ్య, మెలకువ వచ్చేసింది " అన్నాడు రాము.

" బస్సు స్టాండ్ కు నే వెళ్లి పేపర్ , తెస్తాను , ఇంకో రెండు గంటలు " అన్నాడు రాము గడియారం వేపు చూసి.

" పేపర్ అబ్బాయి కి చెప్పి ఉంచాము..ముందుగా మనకు తెచ్చి ఇవ్వ మని ..వస్తుంది ఇంటికే " అన్నారు శర్మ.

ఎవరూ మాట్లాడకుండా క్షణాలు లెక్క పెడుతూ వుండిపోయారు. కాలం కదలటం లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.

అందరికీ స్టీల్ గ్లాసుల్లో కాఫీలు పట్టుకొచ్చింది శాంత. తరుణ్ తీసుకోలేదు. వద్దంటూ చేయి కదిలించి కళ్ళు మూసుకున్నాడు.

అందరి మొహాల్లో ఆతృత కనపడుతూ వుంది.

ఇంతలో కరెంటు వచ్చి లైట్లన్నీ వెలిగాయి.
దూరంగా గుడిలో సుప్రభాతం మొదలైంది. చుట్టూ పక్కల ఇండ్ల వాళ్ళు లేచి తలుపులు తీస్తున్న శబ్దాలు వస్తున్నాయి .

లేచి వెళ్లి ఇంటి తలుపులు తీసి బయటి లైట్ వేసింది శాంత.

" అమ్మా కాస్త నీళ్లివ్వు " అని నీరసంగా అడిగాడు తరుణ్. అతడి తలలో విపరీతమైన నొప్పి మొదలైంది.

దూరంగా సైకిల్ వస్తున్న శబ్దం విని కుర్చీ లోనుండి లేచి బయటకు నడిచాడు రాము. శర్మ కూడా వెనకే వెళ్ళాడు.
నిండుగా ప్లాస్టిక్ కోటు వేసుకుని సైకిల్ పై వచ్చిన కుర్రాడు న్యూస్ పేపర్ల కట్ట ఇంటి తలుపు దగ్గర విసిరేసి వేగంగా వెళ్ళిపోయాడు.

వర్షపు నీటికి తడవకుండా బయటకు పరుగెత్తి వెంటనే వాటిని తీసుకున్నాడు రాము
ఆత్రుత తో అవి తీసుకుని లోని కొచ్చి రిజల్ట్ పేజీ తీసి నెంబర్ వెదికాడు రాము. పక్కనే శర్మ కూడా వంగుని చూడ సాగాడు.

" నెంబర్ వుంది మామయ్య చూడండి. తరుణ్ నువ్ పాస్ అయ్యావురా. నీకు సీట్ వచ్చేసింది " ఉద్వేగంగా అరిచాడు రాము.
కంగారుగా ఇంకో పేపర్ తీసి చూసాడు శర్మ ." అవును పెద్ద బాబు..నీకు సీటొచ్చింది .." అన్నాడు.
దగ్గరలో చెవులు చిల్లులు పడేలా పెద్ద పిడుగు పడింది . వున్నట్లుండి వేగంగా విసిరిన గాలికి వర్షపు నీటి జల్లు ముందు గది నిండా చిమ్మింది.
" తరుణ్ నీకు సీటొచ్చేసిందిరా " మళ్ళీ సంతోషంగా అన్నాడు రాము.

గతం లోనుండీ బయటకు వచ్చాడు రాము.

ఆకాశం చిల్లులు పడ్డట్లుగా హోరున వర్షం ఎక్కువైంది . కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నట్టుండి ఆకాశం లో
మెరుపు మెరిసింది. అంతలోనే పెద్ద పిడుగు పడి చెవులు చిల్లులు పడేలా శబ్దం వచ్చింది.

తరుణ్ కుర్చీలో నుండీ లేవ లేదు. నిర్వికారంగా చూస్తూ వున్నాడు.

కుర్చీలోనుండి లేచి నుంచున్న శర్మ కండ్ల లో నుండీ నీళ్లు జలపాతాల లాగ కారిపోసాగాయి. కొడుకును ప్రేమగా చూస్తూ వుండిపోయాడు. అతని మనసు కరిగి పోయింది.

హోరున వర్షం కుండ పోతగా కురువ సాగింది.

రాము కళ్ళలో కూడా తెలీకుండా కన్నీళ్లు కారుతున్నాయి.


తరుణ్ లేవ లేదు . అతడి కళ్ళు కూడా మేఘాల్లా వర్షిస్త్తున్నాయి .

శర్మ వెళ్లి కొడుకుని లేపి కౌగిలించుకుని తృప్తిగా అర చేతులతో వీపు నిమర సాగాడు.

తరుణ్ బోరున ఏడవ సాగాడు. బయట వర్షపు నీళ్లు దడ దడ మంటూ కప్పు మీద నుండీ కిందకు పెద్ద శబ్దం తో పడుతున్నాయి.
తరుణ్ గుండెలు పగిలేలా విలపిస్తున్నాడు.
ఆకాశం ఉరుముతూ తరుణ్ రోదనకు సహాయం చేస్తూవుంది .
ఈదురు గాలి ఎక్కువై వర్షపు జల్లు ఎడా పెడా వరండా లో పడుతోంది. వర్షం హోరెత్తిస్తూ వుంది . బయట అంతా నీళ్లు. అందరి కళ్ళలో నీళ్లు. ఊరంతా వర్షపు నీళ్లు.
" బాబు ,నీకు సీట్ వచ్చిందిరా, నువ్ సాధించావు . " అన్నాడు శర్మ మనసులోనుండీ ఉబికి వస్తున్న సంతోషాన్ని, బాధను అదుపులో పెట్టుకుని. అతని కళ్లనిండా అశ్రువులు నిండిపోయాయి.

తండ్రి ని గట్టిగా, ప్రేమగా గుండెలకు అదుముకున్నాడు తరుణ్. వెనక నుండీ కొడుకు భుజం మీద చేతులు వేసి ఆప్యాయంగా పట్టుకుంది శాంత

" నాన్నా నీ కల , ఆశయం నేర వేర్చాను, సీట్ వచ్చింది. " అని మెల్లిగా అన్న తరుణ్ చేతులు తండ్రి మీద మీద నుండీ జారీ బలం కోల్పోయి వేలాడి పోయాయి. అలాగే కిందకు జారిపోయాడు . తెరుచుకుని ఉన్న కళ్ళలో నుండీ నీళ్లు కారుతూనే వున్నాయి. ఆ కళ్ళు మరిక మూసుకోలేదు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు