ఉడత రాజు - నిశ్చలవిక్రమ శ్రీ హర్ష

Vudatha Raju

రోజు మునిసిపల్ పార్క్ లో ఉత్సాహంగా వాకింగ్ చేస్తూ అందరిని పలరించే 68 ఏళ్ళ శ్రీనివాస రావు .. ఈ రోజు బెంచ్ మీద దీనంగా కూర్చొని ఆలోచిస్తున్నాడు .. గత 35 ఏళ్లుగా అక్కడున్న చెట్లు, పక్షులు, ఉడుతలు, అన్ని ఆయనకు సుపరిచితమే .. రోజు ఆయనకు తోచిన ఆహారం వాటికి పెడుతూ ఉంటాడు .. ఆయన స్నేహితులు పక్కనుంచి వెళుతుండగా " ఏంటి శ్రీనివాస రావు గారు ఈ రోజు కూర్చొని ఉన్నారు .. అంతే లెండి మీ అబ్బాయి అమెరికా నుంచి వచ్చాడు కదా .. బహుశ ఇంక రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నట్టు ఉన్నారు ... " అని పలరించారు .. శ్రీనివాస్ రావు కొంచం ఇబ్బందిగా నవ్వుతూ తలాడించాడు..

తన కూతురు, అల్లుడు, కొడుకు కోడలు మనవళ్లు మనవరాళ్లు ఇంట్లో ఉన్న కూడా .. శ్రీనివాస్ రావు మటుకు ఒక్కడే ఒంటరిగా బెంచ్ మీద పార్క్ లో కూర్చొని ఉన్నాడు ... ఒక సంవత్సరం కిందట తన భార్య పోయిన రోజు ఇదే ఒంటరితనం శ్రీనివాస రావు మనసులో మొదలైంది .. తనతో 40 ఏళ్ళు జీవితాన్ని పంచుకున్న భార్య ఒక నాడు హఠాత్తుగా నిద్రలోనే శాశ్వత నిద్రకు జారుకున్న రోజున శ్రీనివాస రావు కంట నీరు రాలేదు .. జీవితం లో తన కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న భార్య తనను వదిలి వెళ్లిపోయేసరికి .. శ్రీనివాసరావు మానసికంగా

చనిపోయాడు.. ఇంక కంట నీరు కనీసం పెట్టాలి అన్న ఆలోచన కూడా తనకు కలగలేదు .. కొడుకు అమెరికా నుంచి వచ్చి తల్లి కి తలకొరివి పెట్టి వెళ్ళిపోయాడు .. కూతురు తల్లి బంగారాన్ని తీసుకొని అపుడప్పుడు వచ్చి తండ్రిని పలకరించిపోతున్నది .. ఒక సంవత్సరం గడిచింది, నిన్ననే సంవత్సరీకాలు అయిపోయాయి ... ఇప్పుడు తండ్రిని ఎవరు చూసుకోవాలి కొట్లాట పిల్లల్లో మొదలైంది ..

అల్లుడు ఆస్తి కోసము భార్యను ఆయుధం లా వాడుకొని వాటా రాబట్టాలని చూస్తున్నాడు .. కొడుకు మాత్రం ఇన్ని రోజులు అమ్మ నాన్నలను మీరు వాడుకున్నారు .. ఇంకా మీరు ఆస్తి ఎందుకు , ఎప్పుడు వాళ్ళ అవసరం తీసుకోని నాకే రావాలి అని వాదిస్తున్నాడు .. ఆస్తి ఇద్దరికీ కావాలి కానీ నాన్న మటుకు ఎవరికీ అవసరం లేదు .. నాన్న ఎన్నో రోజులు ఉండడు ఇంకా చివర్లో ఎవరు ఉంచుకుంటే వారికే ఆస్తి దొరుకుతుంది అన్న స్వార్ధం ఇద్దరిలో ఉంది .. “నాన్నను ఎలా చూసిన పడి ఉంటాడు”.. అన్న భావన కొడుకు, అల్లుడు ఇద్దరిలో ఉంది ..

కూరగాయల కోసం బయటకు వెళ్ళి వస్తున్న శ్రీనివాస్ రావు ఇదంతా చాటుగా విని బాధపడ్డాడు .. ఆ మరుసటి రోజు పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు 5:00 గంటలకు శ్రీనివాసరావు లేచి పార్క్ కి వచ్చాడు .. ఆలోచనలో అలా జారుకున్న శ్రీనివాస్ర రావు .. 1985 సంఘటన గుర్తు చేసుకున్నాడు ... ఆ రోజు తన భార్య కామాక్షి కామాక్షి తన తల్లికి బాగోలేదని పుట్టింటికి వెళ్ళింది .. రావు ఆఫీస్ కి వెళ్ళాలి పొద్దునే లేచి వంట వండాడు, పిల్లలకు, స్నానం చేయించి, స్కూల్ డ్రెస్ వేసి రెడీ చేసాడు.. 5 ఏళ్ళ కొడుకు వచ్చి నాన్న షూస్ వెయ్యి అని ముందర నిలపడ్డాడు .. ఏడేళ్ల కూతురు వచ్చి నాన్న జడ వెయ్యి అని అడిగింది .. సమయం మించిపోతుంది .. ఆటో ఇంకో 10 నిమిషాల్లో వస్తుంది .. పిల్లలిద్దరి పనులు చేసి ఆటో లో పంపే టైం లేదు .. హడావిడి గా వాళ్ళ ఇద్దరి పనులు చేసేసరికి ఆటో వెళ్ళిపోయింది ..

” దేవుడా” అని అనుకోని తన స్కూటర్ మీద ఇద్దరినీ ఎక్కించుకొని స్కూల్ లో దిగపెట్టేసరికి తాను టీచర్ గా ఉద్యోగం చేస్తున్న స్కూల్ కి టైం కి వెళ్ళాలి .. ఆ సమయం దాటిపోతుంది, ఈ రోజు ప్రధానోపాధ్యాయురాలు కోపం తో మాటలు అంటుంది .. ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి అసలు ఊరుకోదు , ఇప్పుడు ఎం చేయాలా అని ఆలోచన లో పడిన రావు కి .. పిల్లలు నవ్వుతు టాటా చెప్పిన తీరు ఆనందాన్ని ఇచ్చింది .. మిగతా అన్ని మర్చిపోయాడు .. ఈ సంఘటన గుర్తు చేసుకున్న రావు కి కళ్ళలో నీళ్లు తిరిగాయి ..

“ఆ రోజు పిల్లకు అన్ని చేసి నేను స్కూల్ కి పంపాను, నా స్కూల్ ఉద్యోగానికి లేట్ అయినా మాటలు పడ్డాను .. ఆ ఒక్క రోజే కాదు .. పిల్లలు ఇద్దర్ని వాళ్ళ జీవితంలో వాళ్ల వాళ్ళ మజిలీలకి చేర్చి వాళ్లకు ఒక జీవిత0 ఇవ్వడానికి నేను అడుగడుగునా ఎన్నో త్యాగాలు చేస్తూ వచ్చాను .. చివరకు కొడుకు అమెరికా వెళ్తాను అంటే .... కూతురు పెళ్లి అంటే నా దగ్గర సేవింగ్స్ అన్ని ఖర్చు చేసాను, పెన్షన్ లేదు అయినా కూడా ఆలోచించకుండా తీసేసాను ..అలా చేసిన నాన్న ఈ రోజు వీళ్ళకు భారం అయిపోయాడు, ఈ రోజు నా ఇల్లు అమ్మెసి నన్ను పంచుకుందామని అనుకుంటున్నారు” .. అని బాధ పడ్డాడు .. కృంగిపోయాడు…

5:30 అయింది రోజు తనను పలకరించడానికి వచ్చే తన స్నేహితుడు ఒక చిన్ని ఉడత వచ్చింది .. ఆ ఉడత ఒక 7 ఏళ్ళ కిందట నుంచి రోజు చెట్టు దిగి వస్తుంది .. రావు తనకు తోచింది చెట్టు కింద పెడతాడు .. అది తినేసి వెళ్ళిపోతుంది .. ఈ రోజు కూడా దానికి బటానీలు పెట్టాడు ... అది తింటూ ఉంటె ఒక తెలియని ఆనందం రావు కి వేసింది .. ఆ ముసలి ఉడత తింటున్నంత సేపు .. వేరే ఉడతలు కూడా దాని దగ్గరకు తిండి కోసం వచ్చాయి .. కానీ అది వయసు రీత్యా పెద్దది అయినా కూడా .. కొంచం కూడా దడవలేదు .. ఆహారాన్ని ఆక్రమించడానికి వచ్చిన వేరే ఉడతలు అన్నింటిని బెదరకొట్టి తరిమేస్తున్నది .. కేవలం ఒక్క తిండే కాదు ఆ చెట్టుని కూడా తన సామ్రాజ్జం లాగ మార్చుకొని దేన్నీ కనీసం ఆ చెట్టుని కూడా తాకనివ్వలేదు .. ఉడత ఒక రాజు లాగ తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చూసిందే కానీ, వయసు పై పడింది అని ఈ మాత్రమూ అదరలేదు, బెదరలేదు .. అదే ఠీవి, అదే దర్పం తో తన జీవితాన్ని గడుపుతున్నాడు .. చుట్టుపక్కల ఉన్న ఉడతలకు కూడా ఈ పెద్ద ఉడతా అంటే కొంచం భయంతో మెలుగుతున్నాయి .. ఇన్ని ఏళ్లుగా తనకు పరిచయం అయినా ఒక చిన్ని ఉడత .. ఈ రోజు తనకు రాజు లాగ కనిపించింది .. ఇన్ని రోజుల నుంచి ఆ ఉడతను చూస్తున్న కూడా తనకి తట్టని ఈ తత్త్వం .. ఈ రోజు తట్టింది .. ఆ ముసలి ఉడత తనకి కొత్తగా కనిపించింది .. అలాగే ఆలోచిస్తూ రావు ఉండిపోయాడు ..

సమయం 6:30 అయింది ఆ బెంచ్ మీద నుంచి లేచాడు .. అట్లా నడుచుకుంటూ ఈ సారి తన ఇంటికి కాకుండా ఒక రెండు వీధులు అవుతల ఉన్న ప్రకాష్ ఇంటికి వెళ్ళాడు ..

" రండి సర్" .. అని ప్రకాష్ లోపలి పిలిచాడు ..

సుమ కొంచం టీ తీసుకోరా .. అని భార్యకు చెప్పాడు ...

రావు ప్రకాష్ తో " ఈ రోజు టీ వద్దు ప్రకాష్ .. నాకు బ్రతకడానికి కొంచం ధైర్యాన్ని ఇవ్వు " అని అడిగాడు ..

ప్రకాష్ ఆశ్చర్య పోయి " ఏమైంది సర్ .. అట్లా మాట్లాడుతున్నారు " అని అడిగాడు ..

“ఎం లేదు రా .. 10 రోజులు కిందట మీ స్కూల్ లో లెక్కల మాస్టర్ సరిగ్గా వచ్చి లెక్కలు చెప్పడం లేదు అని నాకు చెప్పావు .. ఆయన ప్రభత్వ ఉద్యోగి అయినా సెలవలు పెట్టి .. పిల్లని బాగా ఇబ్బంది పెడుతున్నాడు , కాబట్టి .. మీ హెడ్ మాస్టర్ ఒక ప్రైవేట్ లెక్కల టీచర్ కోసం చూస్తున్నాడని చెప్పావు .. నాకు లెక్కల టీచర్ గా 35 ఏళ్ళ అనుభవం ఉంది .. ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తే నేను చేస్తాను .. నువ్వు ఏమైనా సహాయం చేయగలవా అని అడిగాడు ...

ప్రకాష్ కొంచం అలోచించి " నాకు ఏమి లేని రోజున మీరు జీవితాన్ని ఇచ్చారు .. దొంగ గా మిగిలిపోవాల్సిన నన్ను ఒక టీచర్ గా తీర్చిదిద్దారు, పెళ్లి చేసారు, ఈ ఇల్లు కొనుక్కోమని చూపించారు .. మీ కోసం ఉద్యోగం ఇప్పించడం నేను మీకు చేసే ఉడతాసాయం అని నాకు తెలుసు .. కాకపోతే మీ వయసు రీత్యా అన్ని గంటలు చెప్పగలరా అని ఆలోచిస్తున్నాను " అని అన్నాడు ..

" ఒరేయ్ .. నా వయసు 68 అని ఆలోచిస్తున్నావు నువ్వు .. 30 ఏళ్ళ వయసులో నాకు కూతురు పుట్టింది .. 34 కి కొడుకు పుట్టాడు .. 30 ఏళ్ళ వయసు నుంచి నేను కేవలం వారిద్దరి కోసమే బ్రతికాను .. నాకోసం నేను బ్రతకం మర్చిపోయాను .. ఇప్పుడు నా కోసం నేను బ్రతకాలి అన్న కోరిక నాకు కలిగింది .. నా మనసుకున్న వయసు వయసు ఇప్పుడు 31 మాత్రమే .. నేను నీ కంటే చిన్న వాడిని .. నాకున్న శక్తి కూడగట్టుకొని మళ్ళీ జీవితం మొదలుపెడతాను " అని అన్నాడు

ప్రకాష్ " తప్పకుం డా సర్ .. ఇవాళే వెళ్ళి H.M తో మాట్లాడుతాను .. మీకు కావాలంటే రేపటి నుంచి జాయిన్ అవ్వొచ్చు .. అవసరం బాగా ఉంది "

సరే ... సంతోషం అని చెప్పి .. రావు బయదేరుతాడు ..

శ్రీనివాస రావు ఉత్సాహంతో ఇంటికి బయల్దేరాడు .. వెళ్ళంగానే పిల్లలు అంత టీలు తాగుతున్నారు .. అప్పడి దాకా తండ్రిని ఎం చేయాలా అని చర్చించుకొని వారి నిర్ణయం చెపుదామని వేచి ఉన్నారు .. శ్రీనివాస్ రావు సోఫా లో కూర్చొని .. తన కోడలికి టీ తీసుకురమ్మని చెప్పాడు ..

టీ తాగుతూ " ఇన్ని రోజులు నన్ను ఏమి చేయాలి ?అని మీరు చర్చించుకున్నారు .. ఈ రోజు నా మాట వినండి .. నేను మీ అమ్మ, ఈ ఇంటిని కట్టడానికి జీవితం అంత ఖర్చు చేసాము .. ఇది మాకు ఒక ఇల్లు కాదు జ్ఞాపకము.. ఇప్పుడు తను నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది .. కానీ తన ప్రతి గుర్తు, మెట్టెల సవ్వడి, పిలుపు ఇప్పడికి ఈ ఇంట్లో నాకు వినిపిస్తూనే ఉంటాయి ... ఈ ఇల్లు నన్ను మీ కంటే దగ్గరగా చూసింది .. మిమల్ని పెంచడం లో నేను మేలుకొని ఉన్న ఎన్నో నిద్ర లేని రాత్రులను ఈ ఇల్లు చూసింది ... కామాక్షితో పాటు నా కష్ట సుఖాలన్నీ కూడా ఈ ఇల్లు చూసింది ..

ఈ రోజు నాకు వయసు అయిపొయింది కాబట్టి .. నన్ను మీలో ఒకరు చూసుకుంటారు అన్న ఒక భావం కోసము ఇన్ని జ్ఞాపకాలు ఉన్న ఈ ఇంటిని నేను ట్రేడ్ చేయలేను ..

మిమల్ని ఇంత వాళ్ళను చేసిన నాకు .. నన్ను నేను చూసుకోవడం భారం అవుతుందా ?

కానే కాదు ..

మీకు ఈ నాన్న ఎప్పుడు ఉంటాడు .. ఎప్పుడన్నా మీ నాన్నను మీకు చూడాలి అనిపిస్తే నా పిల్లలుగా ఈ ఇంటికి రండి .. మీకు నేను అన్న0 పెడతాను .. చచ్చే దాకా అది నా బాధ్యత .. కానీ నేను బ్రతికుండగానే ఈ ఇంటిని, నన్ను పంచుకునే ఆలోచన వస్తే మటుకు ..

మిమల్ని నా జీవితం నుంచి వెలివేస్తాను .. పిల్లలు అని కూడా చూడను " నేను చెప్పేది చెప్పాను .. "ఇంక మీరు ఉంటారు, వెళ్తారా అనేది మీ ఇష్టం " .. అని చెప్పి, టీ కప్ అక్కడ పెట్టిసి బయటకు వెళ్ళసాగాడు ..

బయటకు అడుగు పెట్టేసమయానికి .. తాతయ్య నేను కూడా వస్తాను అని 3 ఏళ్ళ మనవడు వెంటపడ్డాడు .. మనవడిని ఎత్తుకొని చాకొలేట్ కొనివ్వడానికి రావు తీసుకెళ్లాడు ..

---- సమాప్తం ---

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ