బెడ్ లైట్ వేసి ఆరేళ్ళ శాన్వి ని నిద్రపుచ్ఛుతూ రోజూ పాడే గుడ్ నైట్ రైమ్ అందుకున్నాడు మహేష్. గుడ్ నైట్, స్లీప్ టైట్ హోప్ నో బగ్ బైట్ వేకప్ బ్రైట్ ఇన్ ద మార్నింగ్ లైట్.. శాన్వి నిద్ర పోయినట్లు చూసి మెల్లగా పాప తల దిండు మీదకి చేర్చి పాప పక్కన ఆదమరిచి నిద్రబోతున్న సరిత ని చూసి, "పాపం ఆఫిస్ లో ఈ రోజు వర్క్ ఎక్కువైనట్లుంది" అనుకున్నాడు. బెడ్ మీద నుండి లేచి వాష్ రూమ్ కి వెళుతూ ఉండగా నిద్రలో కాబోలు శాన్వి," గుడ్ నైట్ మమ్మి, గుడ్ నైట్ డాడీ, గుడ్ నైట్ గ్రాండ్ మా, గుడ్ బై గ్రాండ్ పా " అనడం విని నవ్వుకుంటూ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు..చివరిలో ఏమంది? వెనక్కి వెళ్లి పాపని కదిలించబోయాడు. గాఢ నిద్ర లో ఉంది. పాప మొహంలోకి చూస్తూ అలాగే పడుకుని నిద్రబోయాడు మహేష్. తెల్లవారుఝామున తల్లి కేకలు విని లేచి హాల్లోకి వెళ్ళాడు మహేష్ . అక్కడ సోఫాలో నిర్జీవంగా పడి ఉన్న తండ్రిని చూసి స్థాణువై నిలుచున్నాడు. ....... తండ్రి పోయి నెల రోజులు కావస్తూంది అనుకున్నాడు మహేష్ పాపని ఒక చేత్తో నిద్రబుచ్చుతూ, మరొక చేత్తో లాప్టాప్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ. "పాపని నేను పడుకోబెడతాను. నువ్ ఆఫీస్ పని చూసుకో " అంది సరిత "అమ్మ పడుకుందా?" అన్నాడు మహేష్ బెడ్ మీద నుండి లేస్తూ.. "ఆ" అంటూ సరిత గుడ్ నైట్ రైమ్ పాడటం మొదలుబెట్టింది. మహేష్ బెడ్ రూమ్ డోర్ తీసి హాల్లోకి వెళ్లబోతూ ఉండగా శాన్వి అంది,"గుడ్ నైట్ మమ్మి, గుడ్ నైట్ డాడీ, గుడ్ బై గ్రాండ్ మా" గుండె ఝల్లుమంది మహేష్ కి. ఒక్క సెకను శాన్వి కళ్ళలోకి చూసి, తల్లి బెడ్రూం లోకి వెళ్లి "అమ్మా" అని పిలిచాడు. ఏమి స్పందన రాకపోయేసరికి ఆమెని ఒకసారి కదిపి చూసి,"సరితా" అని అరిచాడు పెద్దగా. ...... రాత్రి రెండున్నర. నైట్ డ్యూటీ లో ఉన్న సెక్యురిటి వింతగా చూసాడు మహేష్ కేసి," ఏంటి సార్ ఈ టైం లో? అన్నాడు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ ఎం లేదు కొంచెం అర్జంట్ వర్క్ అంటూ నేరుగా తన కేబిన్ లోకి వెళ్లి కూర్చున్నాడు. నైట్ డ్యూటీ లో ఉన్న ఉద్యోగుల్లో ఒకరిద్దరు మహేష్ ని పలకరించబోయి అతడు టెన్షన్ లో చిరాగ్గా ఉన్నాడని వెళ్లిపోయారు.. చైర్ లో వెనక్కి వాలి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు మహేష్. శాన్వి నిద్రబోయే ముందు అన్న మాటలు చెవిలో మారుమోగుతున్నాయి. గుడ్ నైట్ మమ్మి, గుడ్ బై డాడీ" అమ్మ, నాన్న పోయినట్లు తను ఈరోజు తప్పక చనిపోతాడు. ఇన్సూరెన్స్ కాగితాలు, సేవింగ్స్ అన్ని లెక్క చూసాడు. నెమ్మదిగా తెల తెల వారుతూ ఉంది. లేచి సిగరెట్ వెలిగించాడు. హు. ఈ జీవితానికి ఇదే చివరి సిగరెట్ అనుకున్నాడు. తన బాల్యం, చదువు, ఉద్యోగం సరిత తో పెళ్లి అన్ని సినిమా రీళ్లలా తిరిగాయి. సరితకి మీతో పెళ్లి ఇష్టం లేదు తల్లిదండ్రుల బలవంతం మీద ఒప్పుకుంది. సరిత మేనమామ చెప్పిన మాటలు ఎందుకో గుర్తొచ్చాయి. జ్ఞానేశ్వర సిధ్ధాంతి ఫోన్ లో పంపిన మెసేజ్ మరో సారి చదుకున్నాడు. " ఆ పాప జాతకం లో తీవ్ర దోషం ఉంది. తిథుల ప్రకారం నేను చెప్పిన తేదీల్లో హోమం చేయించండి.మరో చావు ని ఆపడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా" అంత సమయం లేదు స్వామి. కనీసం సరిత ని అయినా కాపాడండి అని మెసేజ్ చేసాడు స్వామికి. అప్రయత్నంగా కారుతున్న కళ్లనీళ్లు తుడుచుకుని, రెసిగ్నషన్ లెటర్ CEO కి మెయిల్ చేసాడు. తనకి సంబంధించిన వస్తువులు అన్ని తీసుకుని కార్ లో కీసర కి బయలుదేరి వెళ్ళాడు. సారి సరితా. పాపకి ముధ్ధులు. నా బ్రీఫ్ కేస్ లో మన సేవింగ్స్ సర్టిఫికెట్స్, అకౌంట్ డీటెయిల్స్ ఇన్సూరెన్స్ కాగితాలు అన్ని ఉన్నాయి. అని మెసేజ్ చేసాడు భార్యకి. ఫోన్ స్విచ్చాఫ్ చేసాడు. గుడిలో మౌనంగా కూర్చుని ధ్యానం లోకి వెళ్ళాడు. ఒంటి మీద ఏదో గుచుకుంటున్నట్లుగా టప టప మని శబ్దం వస్తుండగా కళ్ళు తెరిచి చూసాడు..వాన..ఉండి ఉండి పెద్దది అవుతూంది. గబ గబా లేచి చెట్టు కిందకి వెళ్ళాడు. చుట్టూ చీకట్లు. వాన. టైం చూసుకున్నాడు.వాచ్ రాత్రి 7 గంటలు చూపిస్తూంది. ఒక్కసారిగా అదిరిపడ్డాడు. అంటే తను చావలేదు. బ్రతికే ఉన్నాడు. హుర్రే అని అరిచాడు. హడావుడిగా కార్ తీసి ఇంటికి పోనిచ్చాడు. ఫోన్ అం చేసాడు. మిస్డ్ కాల్స్, మెసేజ్ లు ఆఫీసు నుండి..సరిత నుండి. ఇంటికి వెళ్ళగానే సరిత కంగారుగా అంది," ఏంటి వర్షంలో ఇలా తడిసావ్?ఎక్కడికి వెళ్ళావ్? ఆఫీసులో కూడా లేవట?" " ఎం లేదు. శాన్వి ఏది?" అన్నాడు మహేష్ రిలాక్సింగ్ గా. "ఆడుకుంటూంది" . కాఫీ పెట్టనా" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది సరిత. మహేష్ స్నానం చేసొచ్చి హాల్లో కూర్చుని టీవీ చానెల్ మారుస్తూ ఉండగా సరిత తెచ్చిన కాఫీ తాగుతూ ఉండగా అంది సరిత, " ఆఫీస్ నుండి మధ్యాహ్నమే వచ్చేసాను. ఒక రకంగా షాకింగ్ అండ్ బాధాకరమైన న్యూస్. సంపత్ అదే మా బాస్ కార్ ఆక్సిడెంట్ లో ఈరోజు తెల్లవారుఝామున చనిపోయాడు" మహేష్ చేతిలోని రిమోట్, కాఫీ కప్ భళ్ళున ఒకేసారి కిందపడి పగిలాయి. *****