పాండు2: వలలో చేప - మొదటి భాగం - కణ్ణన్

Valalo chepa-1

రాజశేఖరంగారీ హత్య విషయంలో పాండు ప్రదర్శించిన ప్రతిభ విజయవాడ పోలీసు, న్యాయవాదులలో చాలా చర్చనీయాంశమైంది. వ్యక్తిగతంగా శ్రీధర్ జన్మాంతరం వరకూ ఋణపడితే, నెలరోజులలోపల కేసు విచారణకు రావడం, వాయువేగంతో ముగియడం, నిందితులకు శిక్ష పడడం అన్నీ జరిగిపోయాయి. విచారణ ముగిసిన రోజు పాండును ప్రత్యేకంగా కోర్టుకు పిలిపించి జిల్లా జడ్జి ప్రభాకరంగారూ, ఎస్.పి.గారూ పాండు గురించి ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాల వల్ల అతనిని ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని టీవీ ఛానెళ్ళు ప్రయత్నించాయి. కానీ, అన్న విఠల్ ఇచ్చిన సలహా మేరకు అతను లైమ్ లైట్ లోకి రావడానికి నిరాకరించాడు. “పరోక్షంగా నీ పాపులారిటీని అనుభవించు, కానీ ఎప్పుడూ, ఎవ్వరికీ ఇంటర్వ్యూ మాత్రం ఇవ్వ వద్దు”. ఒక రాత్రంతా అన్నయ్య ఇచ్చిన సలహా గురించి ఆలోచించి, అన్నయ్య కరెక్టే చెప్పాడని నిశ్చయించుకున్న తరువాత, మీడియాకు దూరంగా ఉండసాగాడు పాండు.

తనకు ఆకస్మాత్తుగా వచ్చిన కీర్తి మూలంగా పాండుకు కలిగిన ఏకైక లాభం అప్పుడప్పుడూ సుందరమూర్తి దగ్గర ఫ్రీగా దొరికే సిగరెట్లు. పాండు మూలంగా సుందరమూర్తి తన ఆఫీసులోని సొల్లు కబుర్ల బ్యాచిలో, ఆతంకవాదుల్లో లాడెన్ అంత పేమస్ అయిపోయాడు. వీలైనప్పుడల్లా పాండుతో మాట్లాడటానికి ప్రయత్నించేవాడు. అలాటి ఓ ప్రయత్నంలో పాండు తన సిగరెట్లను నిశితంగా చూడటం చూసి ఒక సిగరెట్ ఆఫర్ చేశాడు. తనను పెద్దవాడిగా సుందరమూర్తి గుర్తించాడని భావించిన పాండు నెల రోజుల్లో మూర్తి జేబులో చెయ్యి పెట్టి సిగరెట్ తీసుకునేంత పెద్దవాడిగా ఎదిగిపోయాడు.

మంగళవారం, ఫిబ్రవరి రెండు, 2002 సంవత్సరం సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంది. కాలేజీలో ఏదో ప్రాక్టికల్ టెస్టు చేసుకుంటున్నాడు పాండు. ల్యాబ్ లోకి ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని ఉన్నాడు. లోపల ఉన్న వాళ్ళందరినీ చూసి పాండుని గుర్తు పట్టాడు “ఉన్నాడు సార్”. ఫోన్లోనుంచి సూచనలు గ్రహించి, అక్కడున్న వాళ్ళను మరొకసారి పరిశీలించి చూశాడు. ఒక మూలలో కుర్చీలో కూర్చుని కిటికీ నుంచి బయటకు చూస్తూ శిక్షాకాలం ముగియడం కోసం ఎదురుచూస్తున్న జైలుపక్షిలా ఉన్నతని దగ్గరకు వెళ్ళి భుజం తట్టాడు. ల్యాబ్ ఇన్స్ట్రక్టర్. పాతికేళ్ళుంటాయి అతనికి. ఉలిక్కిపడి లేచి పోలీస్ యూనిఫారం చూడగానే భయంతో కళ్ళు పెద్దవిచేసి చూశాడు.

ఎస్.పి.గారు లైన్లో ఉన్నారు” అతనికి ఫోన్ అందించాడు కానిస్టేబుల్.

* * *

పాండుకి చాలా కోపంగా ఉంది. సడెన్-గా కానిస్టేబుల్ రావడం, ల్యాబ్ ఇన్స్ట్రక్టర్ బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం, ల్యాబ్ నుంచి బయటకు వస్తుంటే అందరూ తనను ఒకమాదిరిగా చూడడం, చాలా సిగ్గుగా, ఉక్రోషంగా ఉంది. బయటకు రాగానే కానిస్టేబుల్ మీద తన కోపాన్ని చూపేంతలో అతను “బాబూ, నాకేమీ తెలియదు. నన్ను అరవకు. నా మీద కంప్లైంట్ ఇస్తై నా ఉద్యోగం ఊడిపోతుంది. పిల్లలు కలవాణ్ణి” అని చేతులు జోడించాడు. కోపాన్నంతా ఒక దీర్ఘమైన నిట్టూర్పుగా మార్చి “పర్లేదు అంకుల్. పదండి” అన్నాడు.

ఎస్.పి. కారు కాలేజీలోనే ఉంది. టైము వేస్టుచేయకూడదని కాబోలు, ఇంజన్ కూడా ఆపలేదు. కారు బయలుదేరిన తరువాత పక్కనున్న కానిస్టేబులుని అడిగాడు పాండు “అసలెందుకు తీసుకెళుతున్నారు?” దీనంగా ముఖం పెట్టి తనకు అసలు ఏమీ తెలీదన్నట్లు అడ్డంగా తల ఆడించాడు ఆ పెద్దాయన. భయంకరమైన టెర్రరిస్టులను ఛేజ్ చేస్తున్నట్లు పెద్దగా సైరెన్ మ్రోగించుకుంటూ వెళ్ళి చివరకు ఆ కారు ఎమ్.పి.గారి ఇంటిముందు ఆగింది. ఇక్కడికెందుకొచ్చామన్నట్లు ముఖం పెట్టాడు పాండు. ఈ ప్రశ్న అడగకపోయినా అర్థం చేసుకున్నాడు కానిస్టేబుల్ “ఇది ఎమ్.పి.గారి ఇల్లు. మిమ్మల్ని ఇక్కడికే తీసుకు రమ్మని పురమాయించారు. జడ్జిగారు కూడా ఇక్కడే ఉన్నారు”. తనకు తెలిసిన సమాచారం మొత్తం గడగడా చెప్పాడు.

కారు దిగి ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని చూశాడు పాండు. మూడంతస్థుల భవనం. గ్రౌండ్ ఫ్లోర్ చాలా ఎత్తుగా పాత ఇంగ్లీషు సినిమాలలోని రోమన్ ప్యాలెస్ లాగా ఉంది. ఒళ్ళు విరుచుకుంటున్నట్లుగా రెండు చేతులూ పైకెత్తి ఇల్లు మొత్తం పరిశీలించాడు పాండు. వైట్ హౌస్ లాగా ఉంది. ఇంటి ముందు గార్డెన్. మూడు ఇంపోర్టెడ్ కార్లు. యూనిఫారం ధరించిన డ్రైవర్లు. ఉంటే ఇలాటి ఇంట్లో ఉండాలి, అనుకున్నాడు పాండు.

పక్కనున్న కానిస్టేబుల్ వంక చూసి “బాబాయ్, ఇలాటి ఇల్లు కట్టాలంటే ఎంతవుతుందంటావ్?”

నువ్వు ముందు లోనకెళ్లరా బాబూ. నన్ను తిడతారు”.

నువ్వు చెబితే వెంటనే వెళతా”.

ఆ ఇంటిని ఎగాదిగా చూశాడు కానిస్టేబుల్. “ఓ పది కోట్లవదూ. స్థలం విలువ కూడా కలుపుకుని”.

ఇట్లాంటి ఇంట్లో మా అమ్మా నాన్నలను ఉంచాలి బాబాయ్” పాండు ఉత్సాహం, అమాయకత్వం చూస్తే కానిస్టేబులుకు ముచ్చటేసింది. ఇలాటి కొడుకు తనకుంటే బాగుండుననిపించింది. అంతలోనే ఎస్.పి. ముఖం గుర్తొచ్చి “నువ్వు లోపలికెళ్ళరా నాయనా” అని వెనుక తట్టాడు. కాలర్ ఎగరేసుకుంటూ, చొక్కాను కిందకు లాగుతూ తోటలోనుంచి ఒక ముద్ద నందివర్ధనం పువ్వు కోసి, వాసన చూస్తూ మెట్లెక్కాడు పాండు.

అతను మెట్లెక్కగానే గుమ్మం దగ్గర ఉన్న ఒక పోలీసు, ఎమ్.పి.గారి సెక్యూరిటీ కాబోలు, లోపలకు ఆహ్వానిస్తున్నట్లుగా చేతులు చూపాడు. లోపలకు వెళ్ళిన పాండుకు ఆ భవనం లోపలి ఆలంకరణ చూసి మతిపోయింది. దాన వీర శూర కర్ణ సినిమా లోని మయసభ గుర్తుకొచ్చింది. పేద్ద హాలు. ఆ హాలులోనే సుందరమూర్తి ఇల్లు కట్టుకుని చుట్టూ చెట్లు కూడా నాటుకోవచ్చు. కనీసం ముఫ్ఫై అడుగుల ఎత్తులో సీలింగునుంచి వేలాడుతున్న స్వరోవ్స్కీ షాండ్లియర్. అన్ని మూలలలో చిన్నసైజు అశోకా చెట్లు పెద్ద సిమెంటు తొట్టెలలో ఉన్నాయి. వారం వారం వాటిని బయటకు తీసుకు వెళ్ళడానికి అనువుగా అవి ట్రాలీలలో బిగించబడి ఉన్నాయి. ముఖద్వారానికి ఎదురుగా ఎమ్.పీ.గారి భక్తికి నిదర్శనంగా నిలువెత్తు వేంకటేశ్వర స్వామి ఇత్తడి విగ్రహం. బహుశా తమిళనాడులో పోతపోయించి ఉంటారు. వెండి కిరీటం. అసలు అది స్వర్ణకిరీటమని పాండుకు తోచింది. .టి. వాళ్ళ కళ్ళు కప్పడానికి బంగారానికి వెండి పూత వేసి ఉండవచ్చు. సాధారణంగా చిన్న గుళ్ళల్లో ఇత్తడి దీపాలకు వెండిపూత, వెండి ఆభరణాలకు బంగారు పూత పూస్తారు. ఎమ్.పీ.గారిపై లక్ష్మీకటాక్షం బాగానే ఉన్నట్లుంది. వేంకటేశ్వరునికి ఇరువైపులా అయిదడుగుల నిలువున్న దీపస్తంభాలు. ఒక్కోక్క దానికి నిలువుగా అయిదుచోట్ల అయిదయిదు వత్తులు వేసేందుకు వసతి. రెండు దీపస్తంభాలలో యాభై దీపాలు వెలుగుతాయి. అందుకేనేమో మధ్యలో ఇంకొక దీపం ఉంది. మొత్తం యాభై ఒక్క దీపాలు వెలుగుతున్నాయి. ఇహ అగరువత్తుల పొగైతే, పక్కనున్న ఎగ్జాస్ట్ ఫాన్ లేకుంటే అంత పెద్ద హాలును కూడా పొగమయం చేసేవి. నైవేద్యంగా ఒక పళ్ళబండీ, ఒక స్వీటు బండీ ఉన్నాయి. వచ్చీ పోయే వాళ్ళందరికీ ప్రసాదం రుచికరంగానూ, ఆరోగ్యవంతంగానూ దొరుకుతుంది. వచ్చిన పని ఐనా కాకపోయినా, కనీసం మాంచి ప్రసాదం తిన్నామన్న తృప్తి మిగులుతుంది. ఆ ఇంట్లో పూజకు, ప్రసాదాలకూ రోజుకు పాతికవేలైనా ఖర్చవ వచ్చు. దైదీప్యమానంగా ఉన్న ఆ హాల్లో అక్కడక్కడా నీడల వెనుక ఒక అరడజను మంది పనివాళ్ళు ఉన్నారు. హాలు మధ్యలో ఎనిమిది సోఫా సెట్లు ఉన్నాయి. ఎమ్.పి.గారికి ఒకవైపు ఎస్.పి, మరోవైపు జడ్జి ప్రభాకరం గారు ఉన్నారు. ఎమ్.పి.గారికి ఎదురుగా ఉన్న మనిషిని గుర్తుబట్టాడు పాండు. ప్రఖ్యాత హిందీ నటుడు షౌకత్ ఆలీ ఖాన్. షౌకతుకు ఇద్దరు పెళ్ళాలు, ముగ్గురు పిల్లలు. ఇంటి లోపల కూర్చున్నా కూలింగ్ గ్లాసులు తీయకుండా కూర్చున్నాడు. మెల్లగా హాలును, హాలులోని వాళ్ళనూ పరిశీలిస్తూ వస్తున్న పాండును నల్ల కళ్ళద్దాల వెనుక నుంచి పరిశీలిస్తున్నాడు.

ప్రభాకరంగారు పాండును తన పక్కన కూర్చోమని సైగ చేశారు. షౌకత్ ఆలీ ఖాన్ గాగుల్స్ తీసేసి పాండును ఎగాదిగా చూస్తున్నాడు. పెళ్ళిచూపులకు మగపెళ్ళివాళ్ళు డజనుమంది వచ్చి చూస్తుంటే పెళ్ళికూతురికి ఎలా ఉంటుందో పాండుకు అర్థమైంది. ప్రపంచానికి తెలిసినంత వరకూ షౌకతుకు రెండుసార్లు పెళ్ళయింది – అదికూడా ఆడవాళ్ళతోనే. మరి ఇతనికి ఇలా మగవాళ్ళను చూడటం, అందులోనూ ఇద్దరు ప్రభుత్వాధికారులు, ఒక పార్లమెంట్ మెంబరు ముందు – పాండుకు చాలా ఇబ్బందిగా ఉంది. రెండు నిముషాలపాటు షౌకత్ అలానే చూస్తూ ఉండిపోయాడు. మిగతావాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. ఇక ఆగలేక – బహుశా ఆలస్యం అమృతం విషమన్న సూక్తి గుర్తొచ్చి, కళ్ళజోడు తీసి పక్కన పడేసి చేతులు రుద్దుకుంటూ ఎస్.పి.గారిని ఉద్దేశించి షౌకత్ ఇంగ్లీషులో అడిగాడు.

ఇతన్ని ఇన్వాల్వ్ చేయడం అవసరమా?”

మీకు త్వరగా రిజల్ట్ కావాలా? వద్దా?” స్వరం సున్నితంగా ఉన్నా, ఒప్పుకోక పోతే నీ ఖర్మ అన్నట్టుగా అన్నాడు ఎస్.పి.

అర్థమయిందన్నట్లు తల ఊపాడు షౌకత్. దీర్ఘంగా శ్వాస విడిచి, పైన ఉన్న షాండ్లియరును చూస్తూ “మీరే చెప్పండి”.

ఎస్.పి. జడ్జి ప్రభాకరంగారి వైపు చూశాడు.

ప్రభాకరంగారు పాండువైపు చూడకుండానే “పాండూ, ఈయన నీకు తెలుసనుకుంటున్నాను”.

ప్రభాకరంగారు తప్ప మిగతా ముగ్గురూ పాండువైపే చూస్తున్నారు. పాండు గుటకలు మ్రింగడం చూసి టీపాయ్ పైనున్న నీళ్ళగ్లాసులను చూపించారు ప్రభాకరంగారు. భయం భయంగా ముందుకు వంగి ఒక గ్లాసు తీసుకున్నాడు పాండు. హై క్వాలిటీ క్రిస్టల్ గ్లాసులవి. మెల్లగా గ్లాసును ఎత్తి ఒక్క గ్రుక్క నీళ్ళు నోటిలో పోసుకుని పొడిబారిన నోటిని తడి చేసుకున్నాడు. కాస్ట్లీ గ్లాసులలో త్రాగితే నీళ్లకు తీయదనం వస్తుందిలా ఉంది. తీయని నీళ్ళు చల్లగా గొంతు దాటి లోనకు వెళుతుంటే చాలా హాయిగా అనిపించింది. మరో గుటకేసేటప్పటికి అతనికి ధైర్యం కూడా వచ్చినట్లనిపించింది. “తెలుసు” అన్నాడు.

ఆయన ఫ్యామిలీ గురించి కూడా తెలుసా?”

తెలుసు”.

ఆయన పెద్దమ్మాయి కనబడటం లేదు. ఈ విషయం బయటకు పొక్కకముందే ఆ అమ్మాయిని కనుక్కోవాలి. అమ్మాయి తెల్లవారుఝామున బయలుదేరి ముంబయినుండి విశాఖపట్నం వచ్చింది. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసేటప్పటికే ఆమె వైజాగ్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చింది. టాక్సీ బుక్ చేసుకుని రైల్వేస్టేషనుకు వెళ్ళింది. నేరుగా లోనకు వెళ్లింది. లేడీస్ వెయిటింగ్ రూములోనకు ఆమె వెళ్ళినట్లు తెలిసింది. బయటకు రావడం ఎవరూ చూడలేదు. ఆమె అక్కడ లేదు”.

పాండుకు ఆలోచించుకోవడానికి అవకాశమిస్తున్నట్లు ఆగారు ప్రభాకరంగారు. పాండు ఏమీ సమాధానమివ్వకుండా షౌకత్ వంక చూడసాగాడు.

దిసీజ్ బియాండ్ హిమ్. ప్లీజ్ ట్రై యూజింగ్ ది ఇంటెలిజెన్స్ పీపుల్” అసహనంగా ఎస్.పి. వంక చూసి అన్నాడు షౌకత్. అతనికి ఇంకా గడ్డం కూడా పూర్తిగా మొలవక చిన్నపిల్లాడిలా కనిపిస్తున్న పాండును చూస్తే నవ్వొస్తుంది. కానీ కూతురు కనిపించడంలేదన్న నిజం భయంగా మారి ఆ నవ్వును త్రొక్కి పెట్టేసింది.

ఇంటెలిజెన్స్ టీం ఈజ్ ఆల్రెడీ ఆన్ ది జాబ్. అండ్ దే హేవ్ నాట్ మూవ్డ్ ఎన్ ఇంచ్ ఫ్రమ్ ది వెయిటింగ్ రూమ్” నిర్లిప్తంగా ఉంది ఎస్.పి. గొంతు. “బయటకు తెలియకుండా ఒక్క టీంతో విచారణ జరపితే బాగా ఆలస్యమౌతుంది. మనం పాపను (ఆ అమ్మాయిని ఎస్.పి. పాప అంటే పాండుకు నవ్వొచ్చింది. ఆపుకున్నాడు) కనుక్కునేటప్పటికి, కనుక్కున్నా ఉపయోగం ఉండదు. ఎక్కువ మందిని పనిలోకి దింపితే, విషయం రహస్యంగా ఉంచడం కుదరదు”. అసలు లోకల్ ఎమ్.పి. చెప్పబట్టి నీతో నేను మాట్లాడుతున్నా, లేకపోతే నీతో నాకేం మాటలురా అన్నట్లుంది ఆయన చెప్పిన విధానం.

షౌకత్ ఓటమిని అంగీరకించినట్లు రెండు చేతులూ చాచాడు “మీకెలా చేస్తే బాగా ఉంటుందని అనిపిస్తే అలా చేయండి”.

మళ్ళీ కాస్సేపు ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం పాండు, షౌకత్ ఇద్దరూ భరించలేకపోయారు. పాండు తల వంచుకుని తన చేతి వేళ్ళని మొదటిసారి చూస్తున్నట్లు నిశితంగా చూడసాగాడు. ముందు షౌకత్తే మాట్లాడాడు. “సరే బాబూ. ఏదో ఒకటి చెయ్యి”.

ప్రశ్న ఏమిటంటే సార్, అసలు నేనేం చేయాలి? మీకేం కావాలి?” తలెత్తకుండానే అడిగాడు పాండు.

మా అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెట్టాలి”. వంగివున్న పాండు తలపై కదలాడుతున్న వెంట్రుకలను చూస్తున్నాడు షౌకత్. తనకూ ఒకప్పుడు ఇలాగే ఒత్తుగా జుట్టు ఉండేది.

తను మేజర్ కదా” మొదటిసారి తల పైకెత్తాడు పాండు. సమాధానమిచ్చేటప్పుడు షౌకత్ ముఖం చూడాలి కదా మరి.

షౌకత్ ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపించింది. “ఇలాటి ప్రశ్నలు వేస్తున్నాడేంటి? వీడికి నేను సమాధానం చెప్పాలా” అన్నట్లు ఎమ్.పి.గారి వంక చూస్తున్నాడు.

ఏదో సెంట్రల్ మినిష్టర్ ఆబ్లిగేషన్ కాబట్టి నీతో కూర్చుని మాట్లాడుతున్నా. అధికారులను పురమాయించడం కంటే నేనేం చేయను. నీ కూతురు కావాలంటే ఈ కుర్రాడికి కాదు, ఎవ్వరేం ప్రశ్న అడిగినా సమాధానమివ్వాలి. లేకుంటే నీ ఖర్మ. నీ కూతురు నీ ఇష్టం. ముఖం మీద ఏ భావమూ లేకుండా కష్టపడి ఎంతో నియంత్రణతో కూర్చున్న ఎమ్.పి.గారి మనోగతం షౌకత్తుకు అర్థమైంది.

ఔను” ఆముదం తాగిన ముఖం పెట్టి జవాబిచ్చాడు షౌకత్.

మరి తనకు ఇష్టం వచ్చిన చోటికి తాను వెళ్ళొచ్చు కదా. తను రెగ్యులరుగా తనకు ఇష్టం వచ్చిన చోట్లకు పోతుంది కదా?” ఇన్ని రోజులూ లేని కలవరపాడు ఇప్పుడు మాత్రం ఎందుకన్నట్లు చూశాడు పాండు.

ఇతన్ని చూస్తే మా అమ్మాయిని కనిపెట్టడానికి కాదు, నన్ను ప్రశ్నలేయడానికి వచ్చినట్లుంది”. షౌకత్ ఎస్.పి. వంక చూశాడు. గొంతు చాలా కర్కశంగా ఉంది.

పాండు వెంటనే లేచి నిలబడ్డాడు. “మా అమ్మాయి వైజాగ్ రైల్వేస్టేషనులో మాయమైంది. ఇప్పుడు ఎక్కడుందని అడిగితే చెప్పడానికి నేనేమీ పాతాళభైరవిలో మాయలఫకీరును కాదు. ఈ సమాచారంతో మీ అమ్మాయిని కనిపెట్టాలంటే మీరు ఏ బెంగాలీ బాబా దగ్గరకో వెళ్ళాల్సింది”. తాను బయటకు వెళ్ళడానికి సిద్ధమని చొక్కా సర్దుకుంటూ తెలియజేశాడు పాండు.

ఎమ్.పి.కి బాగా నవ్వొచ్చింది. షౌకత్ మాటతీరుకు ఆయనకూ బాగా కోపంగా ఉంది. కానీ తానేమీ అనలేని పరిస్థితి. అందుకే పాండు మాటలకు లోలోపలే సంతోషపడ్డాడు. కానీ, షౌకత్ సమస్యపై తాను పూర్తి సిన్సియరుగా పని చేసినట్లు కనిపించాలి. ప్రభాకరం గారి వైపు చెయ్యి ఊపాడు, తెగేదాగా లాగనివ్వవద్దన్నట్లు.

నువ్వు కూర్చో పాండూ” పాండు చేయిలాగి అతన్ని కూర్చోబెట్టారు ప్రభాకరంగారు. షౌకత్ వంక చూసి “చూడండి ఖాన్ గారూ, మీకు కష్టమనిపించినా, అనవసరమనిపించినా అతను అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలి. కావాలంటే నేనూ, ఎమ్.పి.గారూ బయటకు వెళతాము. మీరు సమాధానాలివ్వడానికి ఎంత ఆలస్యం చేస్తే మీ అమ్మాయిని పట్టుకోవడం అంత కష్టమౌతుంది. తర్వాత మీ ఇష్టం”.

ఎమ్.పి. గారికి లేవమన్నట్లుగా సైగ చేసి తానూ లేచారు. వాళ్ళిద్దరూ వెళ్ళగానే షౌకత్తుకు ఆ హాల్లో ఉన్న వాళ్ళల్లో ప్రస్తుత పరిస్థితిలో పాండు మిగతావారికంటే శక్తివంతుడని అర్థమయింది.

అమ్మాయిని రియాజుద్దీన్ వలలో వేసుకున్నాడని నా అనుమానం”. ఇప్పుడు షౌకత్ గొంతులో ఒక సాధారణ తండ్రి పడే బాధ వ్యక్తమౌతుంది.

నూర్జహాన్ ,రియాజుద్దీనుతో ఉన్న కొన్ని ఫోటోలు ఆరు నెలల క్రింద ఒక సినిమా పత్రిక ప్రచురించింది. బహుశా షౌకత్ తన పలుకుబడితో ఆ తరువాత అలాటి ఫోటోలు ఎక్కడా ప్రచురణ కానివ్వకుండా చూసుకున్నట్లున్నాడు. పాండు కళ్ళు మూసుకుని ఆ ఫోటోలు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. సన్నగా, పొడుగ్గా, తెల్లగా, ఒక యువరాణిలా ఉండే నూర్జహాన్ పక్కన ఆమెకంటే మూడంగుళాలు పొట్టిగా, చామనచాయలో ఉన్న రియాజుద్దీను ఆమె డ్రైవరులా అగుపించాడు.

రియాజుద్దీన్ బీహారునుంచి వచ్చి బాలీవుడ్లో పదేళ్ళు కష్టపడి ప్రస్తుతం విలనుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడు. నటుడిగా ప్రస్తుతం మంచి పేరు సంపాదించినప్పటికీ, అతను ఎప్పటికీ హీరో కాలేడు. అంతేకాక అతనికి బీహారు నుంచి ముంబయి వచ్చే మునుపే పెళ్లయింది. మొదట్లో ఒక్కడే ముంబయిలో ఉన్నా, ప్రస్తుతం భార్యా పిల్లలతో కలసి ముంబయిలోనే కాపురం పెట్టాడు. నూర్జహాను కాక ఇంకొక కొత్త హీరోయినుతోనూ, ఒక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కూతురితోనూ కూడా అతనికి ప్రేమాయణం నడుస్తుందని పుకార్లున్నాయి.

మిగతా సమాచారం కూడా ఇవ్వమన్నట్లు చూశాడు పాండు.

రియాజ్ ఇంట్లో ఎవ్వరూ లేరు. రియాజ్, అతని భార్యాపిల్లలతో కలసి నిన్న ఉదయం వైజాగ్ వచ్చాడు. హోటల్లో దిగారు. ఈ ఉదయం హోటల్ ఖాళీ చేశారు. వాళ్ళూ మాయమైపోయారు. అందరి ఫోన్లూ స్వచాఫ్ చేయబడి ఉన్నాయి.” ఎస్.పి.గారు మిగతా సమాచారాన్ని అందించి చివరకు ప్రశ్న వేశారు “వాళ్ళందరూ కలసి ఎక్కడికి వెళ్ళి ఉంటారు?”

మీ టీం ఏం తెలుసుకున్నారు?”

ఏ ట్రైనులోనూ, విమానంలోనూ వీళ్ళు వెళ్ళలేదు. అవన్నీ మా వాళ్ళు చూసేశారు. విజయవాడ, భువనేశ్వర్ వైపు వెళ్ళే కారులన్నీ గమనిస్తున్నారు. ఇప్పటి వరకూ అయితే దొరకలేదు”

పాండు షౌకత్ వంకకు తిరిగాడు. “మీ అమ్మాయికి రియాజుద్దీన్ భార్యతో పరిచయం ఉందా? వాళ్ళింటికి ఏమైనా వెళుతుండేదా?”

లేదు” తన జవాబు ఖచ్చితమైనట్లుగా చెప్పాడు షాకత్. అసలు రియాజ్ భార్య ఎలా ఉంటుందో ఎవ్వరూ చూడలేదు. తను ఎప్పుడు రియాజుతో బయటకు వచ్చినా బురఖాలో వచ్చేది. అస్సలు వాళ్ళిద్దరూ బయటకు వచ్చిందే చాలా తక్కువ. ఒకటి రెండు సార్లు మాత్రమే తాను బయటకు వచ్చింది. హిందీ కూడా శుద్ధంగా మాట్లాడలేదు. భోజ్ పురి యాసలో మాట్లాడుతుంది. ఆమెకంటే రియాజే రంగెక్కువ. కాకపోతే ఊళ్ళో కామందు కూతురు కావడం వల్ల, అప్పట్లో రియాజుకు డబ్బులు అవసరం అవడం వల్ల ఆమెను వివాహం చేసుకున్నాడు. రియాజు తండ్రి స్కూల్ టీచర్. ఆస్థులు లేకున్నా గ్రామంలో మంచి పేరుంది. అందుకే తన కూతురిని రియాజుకు ఇచ్చాడు వాళ్ళ మామగారు” దూరదర్శనులో వార్తలు చదువుతున్నట్లు ఆపకుండా తనకు తెలిసిందంతా చెప్పేశాడు షౌకత్. నిండా మునిగిన వాడికి చలేమిటన్నట్లున్నది అతని పరిస్థితి.

ఏదైనా హెలికాప్టర్ లేక చిన్న విమానం తీసుకుని వెళ్ళుంటారా?” ఎస్.పి.గారి వంక చూశాడు పాండు. లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడాయన.

వాడికంత సీన్ లేదు” అవహేళన చేస్తున్నట్లు ఉంది షౌకత్ స్వరం.

మీ అమ్మాయి సెల్ ఫోనుకు కాల్ చేశారా?”

స్విచ్ ఆఫ్ చేసి ఉంది”.

అమ్మాయి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లాటివి ఎమైనా వాడబడ్డాయా?”

క్రెడిట్ కార్డ్ డ్రెస్సింగ్ టేబుల్ పైనే ఉంది” చటుక్కున జవాబిచ్చాడు షౌకత్. “తన బ్యాంక్ అక్కౌంట్ కూడా తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించాం”. తల పక్కకు తిప్పుకుని ద్వారం వైపు చూస్తూ “అంటే తన ఖాతాపై నిఘా ఉందనుకో” తన పవర్ గురించి ఇంత సిగ్గుపడుతూ చెప్పుకోవాల్సి వస్తుందని షౌకత్ ఎప్పుడూ ఊహించలేదు.

రియాజుకున్న మిగతా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్?”

వాళ్ళు ముంబయిలోనే ఉన్నారు”

కళ్ళు మూసుకున్నాడు పాండు. అతనికి లోపల ఒకేసారి చాలా భయంగానూ, ఉత్తేజంగానూ ఉంది. ప్రభాకరంగారూ, ఎస్.పి.గారు కలిసి తనేదో షెర్లాక్ హోమ్స్ అన్నంత బిల్డప్ ఇచ్చారు. తనేదో పజిల్స్ సాల్వ్ చేస్తాడుగాని ఇలా అపరాధ పరిశోధన చేయడంలో తనకేం అనుభవముంది? రాజశేఖరంగారి విషయంలో ఎదురుగా చూసింది చెప్పాడుగాని, తనేమీ నిగూఢ రహస్యాలను ఛేదించలేదే? తనమీద భారం వేసి ఒక ఎమ్.పి.నీ ఒక సూపర్ స్టారునూ తనపై ఆధారపడేలా చేసినందుకు వాళ్లిద్దరి మీదా పాండుకు కోపం వచ్చింది. ఇంకో వైపు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే పట్టుదలా వచ్చింది.

కానీ, ఏపాటి ఆచూకీ లేకుండా ఈ అమ్మాయిని ఎలా కనిపెట్టడం? కిడ్నాపయినా ఫరవాలేదు. ఇక్కడేమో ఈ అమ్మాయే – లేచిపోయిందని అయితే మాత్రం పెద్దగా అనకూడదు. ఆ అమ్మాయే దాక్కోవాలనుకుంటే ఎక్కడయినా దాక్కోవచ్చు. అందులోనూ పెద్ద సిటీలో చాలా మంది పెద్దింటి స్నేహితులతో పెరిగిన పిల్ల. రైల్వే స్టేషను నుంచి టాక్సీలో మళ్ళీ ముంబయికో, లేక పంజాబులోని వాళ్ళ ఊరికో వెళ్ళుండవచ్చు. కానీ, అలా చేసుండదు. అలా ముంబయిలోనో, పంజాబులోనో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా దాక్కోవాలనుకుంటే విశాఖ దాకా రానవసరం లేదు. ఏ నాగపూరుకో, ఢిల్లీకో, జైపూరుకో వెళ్ళుండొచ్చు. అంతే కాకుండా రియాజ్ కుటుంబం కూడా పరారీలో ఉందంటే, ఖచ్చితంగా ఈ రెండు పారిపోవడాలూ ఒకే పథకంలోని రెండు భాగాలు.

నూర్జహాన్ మాయమయ్యేటప్పుడే తన కుటుంబంతో పాటుగా రియాజ్ మాయమయ్యాడంటే రియాజుకు నూర్జహాన్ పారిపోతున్న విషయం ముందే తెలిసి ఉండాలి. నూర్జహాన్ కనబడకపోతే మొదటిగా అనుమానించేది తననేనని రియాజుకు బాగా తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా తనతోబాటు తన కుటుంబాన్ని కూడా మాయం చేశాడు. రియాజ్ ఇంతకీ తన కుటుంబంతో ఉన్నాడా? లేక నూర్జహానుతో ఉన్నాడా? అతను కుటుంబంతో లేకుండా ఉంటే భార్యా పిల్లలను స్వగ్రామానికో, బంధువుల వద్దకో పంపించి ఉండవచ్చు. రియాజ్ కనబడకపోతే పోలీసులు మొదట వెదికేది అతని స్వగ్రామంలోనే. అందుకే రియాజ్, అతని కుటుంబం నూర్జహాన్ కంటే ముందే విశాఖపట్నం వచ్చారు. ఆమెతో కలిసి మాయమయ్యారు. అంటే ఈ పథకం రియాజ్ వేసినదే అయి ఉండాలి. కానీ షౌకత్ చెప్పినదాని ప్రకారం రియాజ్ భార్యకు నూర్జహానుకు పరిచయం లేదు. అయినా రియాజుకు పెళ్ళైన విషయం మాత్రం లోకవిదితమే. నిజంగా షౌకత్ భార్యాపిల్లలతోబాటుగా నూర్జహానును తీసుకుని మాయమైతే – అవకాశం లేదు కాని -ఒకవేళ అలా జరిగితే మాత్రం షౌకత్ ఆలీ ఖాన్ తన కూతురిని మర్చిపోవాల్సిందే.

పాండు లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చుని బయటకు చూశాడు. బయట దానిమ్మ చెట్టు విరబూసిన పూలతో అనార్కలిలా నిలబడి ఉంది. అతనికి వెంటనే అనార్కలి వేషంలో ఉన్న మధుబాలకు సజీవసమాధి కట్టిన “ మొగల్--ఆజమ్” సినిమా గుర్తుకు వచ్చింది. మొగుడు కట్టినా, మామగారు కట్టినా, చివరికి తండ్రి కట్టినా – ప్రేమలో పడ్డ అమ్మాయికి బ్రతికినా చచ్చినా సమాధే. అతనికి నూర్జహాన్ గుర్తుకు వచ్చింది. అవసరానికి మించిన ఆధునికతతో పెరిగింది. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పే తలిదండ్రులు ఇప్పుడు తగ్గిపోయారు. వయసులో ఉన్నప్పుడు తమ గాలి తిరుగుళ్ళకు అడ్డం రాకూడదని పిల్లలను గాలికి వదిలేసి ముసలోళ్ళయిన తరువాత సంప్రదాయాలు మాట్లాడతారు. వీళ్ళు పిల్లల భవిష్యత్తు కన్నా సంఘంలో తమ తాహతుకు భంగం వాటిల్లకుండా ఉండడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. తల తిప్పి షౌకతును చూశాడు పాండు. షౌకత్ నూర్జహానును రియాజ్ నుంచి దూరం ఎందుకు చేయాలనుకుంటున్నాడు? నూర్జహానుకు ఏ హానీ కలుగకూడదనా? తాను నూర్జహానుకు మంచి సంబంధం తేగలడా? ఒక్క నిముషం పాటు పాండుకు తను తన వయసుకు మీరి ఆలోచిస్తున్నట్లు అనిపించింది. తనలో తానే నవ్వుకున్నాడు. మంచి, చెడు గుర్తించడానికి వయసుతో పనేం ఉంది? షౌకత్ నూర్జహానుకు మంచి సంబంధం తేగలడో, లేడో కాని, రియాజ్ మాత్రం మంచివాడు కాదు. పెద్ద స్టార్ కాకపోయినా ఒక నటుడిగా రియాజ్ వందమంది షౌకతులకు సమానం. కానీ, ఒక మనిషిగా – ఊహూ. ఎంత గొప్ప నటుడో, అంత పనికిమాలిన మనిషి. ఏకోణం నుంచి చూసినా ప్రస్తుత పరిస్థితిలో షౌకత్ తన కూతురిని రియాజ్ నుంచి దూరం చేయాలనుకోవడం సరేనని అనిపిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా పాండు వచ్చి షౌకత్ ఎదురుగా కూర్చున్నాడు.

ముందు తను నిజాలని అనుకుంటున్నవన్నీ నిజాలో కావో నిర్ధారణ చేసుకోవాలి. “మీకు తెలిసినంతలో రియాజుకు పెళ్ళయిన విషయం మీ అమ్మాయికి తెలుసు కదా?”

ఔను”.

రియాజ్ భార్య చూడడానికి బాగోదు కదా?”

ఔను. అంతే కాదు. తను స్వగ్రామంలో అన్నింటికంటే ధనికుల ఇంటినుంచి వచ్చినా, ఆ ఆస్థి మొత్తం రియాజ్ సంవత్సరం సంపాదన అంత కూడా కాదు. ఇంకా వివరంగా చెప్పాలంటే నటుడిగా ఎంత పేరు సంపాదించినప్పటికీ రియాజ్ సంపాదన చిన్న హీరోల సంపాదనకంటే కూడా తక్కువే – అసలు అతను హీరో మెటీరియల్ కాదు”.

ఈ సంగతి అందరికీ తెలుసు. అనవసర సమాచారం.

పాండు నెమ్మదిగా అడిగాడు “కోపం తెచ్చుకోకుండా నిదానంగా ఆలోచించి చెప్పండి. మీ అమ్మాయి రెండో పెళ్ళాంగా రియాజుకే గాదు, ఇంకెవ్వరితో కూడా ఒప్పుకోదు కదా?”

పాండు కళ్ళల్లోకి మొదటిసారిగా చూశాడు షౌకత్. ఈ కుర్రాడు బాగా ముదురు. తను స్వరం పెంచకుండా జవాబిచ్చాడు “ఔను. తను ఏదీ పంచుకునే రకంగాదు”.

అలాటప్పుడు రియాజ్ తన కుటుంబాన్ని తనతో పాటుగా ఎందుకు తీసుకు వెళ్ళినట్లు?” తన ప్రశ్నకు తానే సమాధానమిచ్చాడు పాండు.

నూర్జహాన్ కనిపించకపోతే మీరు ముందు వెతికేది రియాజ్ కోసం. అతను కనిపించకపోతే తన భార్యాపిల్లలను వెతికి బెదిరించవచ్చు. అతను నిజంగా నూర్జహానును ప్రేమిస్తే, తన ప్రస్తుత భార్యకు తలాకులిచ్చి, మీ అమ్మాయితో నిఖా చేసుకోవాలనుకుంటే భార్యాపిల్లలను తనతోబాటు తీసుకురాడు. అసలు తనకు భార్యను విడిచిపెట్టే ఉద్దేశ్యమే లేదు. కానీ భార్య అంటే పడిచచ్చే రకం కూడా కాదు. మామగారి కుటుంబమంటే బాగా భయము ఉండవచ్చు. మీరే అన్నారు కదా, వాళ్ళ స్వగ్రామంలో ఆయనే కామందని. ఒకటి, తన తలిదండ్రులకు ఏమౌతుందో అనే భయం ఉండవచ్చు. అదే నిజమైతే వాళ్ళని ఎప్పుడో ముంబయికి తీసుకువచ్చి ఉంచేవాడు. రియాజ్ బాగా సంపాదించడం మొదలుబెట్టి నాలుగయిదేళ్ళవుతుంది. కానీ అతను తలిదండ్రులను తనతో ఉంచుకోవడానికి ముంబయికి తీసుకురాలేదు. సోదరులతో తన సంపాదన పంచుకోలేడు. అతను మంచివాడే అయితే ఈ ఘటన జరిగి ఉండదు”.

తన భయం, అత్తారింటివారు తలిదండ్రులనో, సోదరులనో ఏదైనా చేస్తారని కాదు. తను భార్యను వదిలేస్తే వాళ్ళు తనను వదలరనే భయం. మీకు తెలిసినట్లే అతని భార్యకు కూడా రియాజ్ గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలుసు. తెలిసినా అతనికి ప్రస్తుతం వరకూ అత్తారింటినుంచి ఏ బెదిరింపులూ వచ్చినట్లు లేవు. అంటే అతని భార్యే తన వాళ్ళకు ఏదో చెప్పి ఉంటుంది. బహుశా ఆమెకు కూడా ఈ పథకంలో భాగం ఉండాలి. కనీసం ఏం జరుగుతుందో ఆమెకు ముందే తెలుసు. అందుకే పిల్లలను కూడా ధైర్యంగా తీసుకురాగలింది. తనకు పొరపాటున ఏమైనా జరిగినా కూడా రియాజ్ తన తండ్రి, సోదరులనుంచి తప్పించుకోలేడు”.

పాండు ఎస్.పి.గారి వంక చూశాడు. “సార్, నా విశ్లేషణలో ఏదైనా పొరపాటు ఉందా?”. చిన్నగా నవ్వుతూ లేదన్నట్లు తల ఊపారాయన.

ఖచ్చితంగా ఏదో ఒకచోట ఉండడానికి ప్లాన్ వేసి ఉంటాడు రియాజ్. మీకు దూరంగా ఉండే ప్రదేశం. మీరు విశాఖపట్నం వరకూ నూర్జహాను జాడ చాలా సులువుగా కనిపెట్టగలరు. అంటే ఏ విమానాశ్రయం వరకైనా కనిపెట్టగలరు. తరువాత ఆ రాష్ట్ర పోలీసులను రంగంలోకి దింపుతారు. వాళ్ళకు నూర్జహాను కానీ, రియాజ్ కుటుంబం కానీ దొరకకూడదు. మీరు రాష్ట్రమంతా వెతుకుతారు. పక్క రాష్ట్రాలూ వెతుకుతారు. రియాజ్, నూర్జహానులిద్దరూ రెండు రోజులలో గుర్తు పట్టబడతారు. విదేశానికి వెళ్ళరు. ఎందుకంటే పాస్ పోర్ట్ ఎంట్రీని మీరు సులువుగా కనిపెడతారు. ఇంకా ఏ దేశానికి వెళ్ళినా మీకున్న పలుకుబడి ముందు అతను ఆనడు. అక్కడ అతను ఖచ్చితంగా చాలా సులువుగా పట్టుబడతాడు. అంటే ఇండియాలోనే ఉండాలి. కానీ నూర్జహాన్, రియాజులను ఎవ్వరూ పట్టించుకోకూడదు. అంటే బాగా రద్దీగా ఉండే పర్యాటక స్ధలానికి వెళ్ళాలి. విశాఖలో ఉండలేరు. ఆంధ్రాలోని ఏ పర్యాటక ప్రదేశానికీ వెళ్ళరు. ఎందుకంటే ఆంధ్రా పోలీసులు వెతుకుతారు కాబట్టి. రోడ్డు, రైలు మార్గాలలో వెళ్ళలేరు. చాలా సులువుగా గుర్తుపట్టబడతారు. ప్రైవేటుగా విమానంలో వెళ్ళలేరు. ఎందుకంటే రియాజ్ కుటుంబం వస్తున్న సంగతి నూర్జహానుకు తెలియకూడదు. అంటే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించాలి. రోడ్, రైల్, ఆకాశ మార్గాలు కాకుండా ఉండేది జలమార్గం ఒక్కటే. విశాఖనుంచి జలమార్గంలో వెళ్ళగలిగే పర్యాటక ప్రదేశం – అండమాన్”.

పాండు ముఖం వెలిగిపోయింది. ఎస్.పి.గారి వైపు చూసి “నా లెక్క సరైతే, ఈరోజు ఉదయం విశాఖనుంచి అండమానుకు నౌక బయలుదేరి ఉండాలి. అందులో మనకు కావలసిన వాళ్ళు ఉన్నారో లేదో కనుక్కోండి సార్”.

వెరీగుడ్. బ్యూటిఫుల్ రీజనింగ్” అంటూ పాండు భుజం మీద చరిచి లేచాడు ఎస్.పి.

సార్. వీళ్ళు షిప్పులో ఉన్నారో లేదో ముందు నిర్ధారణ చేసుకోండి. ఏం చేయాలన్నది తరువాత”.

షౌకత్ ఆలీ ఖాన్ ఏదో చెప్పబోతే పాండు వారించాడు. “కొంచెం ఓపిక పట్టండి సార్. మీరు తొందరపడి మీ అమ్మాయికి ప్రమాదం కలిగించవద్దు. ముందు మీ కూతురూ, రియాజ్ ఎక్కడ ఉన్నదీ నిర్ధారణ కానివ్వండి”.

పాండు మాటలకు గౌరవమిస్తున్నట్లుగా షౌకత్ ఆగిపోయాడు. ఎస్.పి. తన సెల్ ఫోనులో విశాఖపట్నం పోలీసు కమీషనరుతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక అరగంట సేపు ముగ్గురూ చాలా టెన్షనుతో గడిపారు. షౌకతుతో బాటు బయటకు వెళ్ళి బాల్కనీలో సిగరెట్ వెలిగించాడు ఎస్.పి. పాండును ఎస్.పి. పిల్లాడిలా చూసినా షౌకత్ అర్థం చేసుకుని సిగరెట్ ఆఫర్ చేశాడు. సిగ్గుతో నవ్వుతూ ఒక సిగరెట్ తీసుకుని “థాంక్యూ” అన్నాడు పాండు. వాళ్ళిద్దరికీ దూరంగా వెళ్ళి తన సిగరెట్ అంటించాడు.

రియాజ్ ప్లాను ఏమై ఉంటుంది? ప్రస్తుతం రియాజ్ గురించి ఎవ్వరు చెప్పినా నూర్జహాన్ నమ్మదు. ఆమె నమ్మేటట్లు చెప్పగలిగేది ఒక్క రియాజ్ మాత్రమే. రియాజును బలవంతం చేస్తే అతనిపై ఆమెకు సానుభుతి పెరుగుతుందే తప్ప నమ్మకం పోదు. కానీ రియాజ్ భార్య తమతో వస్తున్నట్లు తెలిస్తే? తెలిస్తే ఏముంది? ఆమె నూర్జహానును తిట్టి తన భర్తను తనకు కాకుండా చేస్తున్నట్లు అరుస్తుంది. నూర్జహాను పరువు పోతుంది. అదీకాక రియాజ్ ఇప్పటికే తన భార్య గురించి చెడుగా చెప్పి ఉంటాడు. రియాజ్ భార్య గొడవ పడితే అతని మాటలు నిజమని నమ్మే అవకాశమే ఎక్కువ.

ఊహూ. ఇలాక్కాదు. రియాజ్ భార్యే వచ్చి వాళ్ళ పథకాన్ని నూర్జహానుకు చెప్పాలి. ఏం చేస్తే అలా జరుగుతుంది. అసలు రియాజ్ భార్య తనంతట తాను వెళ్ళి ఎందుకు నూర్జహానుతో నిజం చెబుతుంది? నూర్జహానుపై పట్టు కావాలంటే రియాజ్ నూర్జహానుతో కొన్ని రోజులు గడపాలి. కానీ నిఖా కాకుండా నూర్జహాను రియాజుతో ఒకే గదిలో ఉండే సమస్యే లేదు. నూర్జహాన్ ఎంత మోడర్న్ అమ్మాయైనా, రియాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చేంతవరకూ అతనితో ఒకే కప్పు కింద ఉండదు. కాదు, రియాజుతో తనకు నిఖా అయ్యేంత వరకూ ఉండదు. అయినా రియాజ్ ఏం చెప్పి నూర్జహానును ఇంటినుంచి ఇంత దూరం రప్పించగలిగాడు? ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఉంటాడు. అందులోనూ అండమానులో నిఖా అంటే అది భారతదేశంలో చట్టరీత్యా జరిగిన పెళ్ళి. తను అప్పటికే తన భార్యకు విడాకులిచ్చేశానని చెప్పి ఉండాలి. అది కేవలం అబద్ధమే ఔతుంది కానీ, చట్టరీత్యా నేరం కాదు. పాండుకు ఇంకో సిగరెట్ కావాలని అనిపించింది.

ఎస్.పి. జేబులోని సెల్ ఫోన్ మ్రోగింది. అటువైపునుంచి మాట్లాడేది వినగానే ఆయన ముఖంలో చిరునవ్వు. రెండో చేత్తో పిడికిలి బిగించి బొటనవేలు ఎత్తి విజయం సాధించినట్లుగా సైగ చేశాడు. ఫోనులో “థాంక్యూ. కొంచెం సేపట్లో ఏం చేయాలన్నది చెబుతాను. కంట్రోల్ రూంకి వెళ్ళి అక్కడినుంచి శాటిలైట్ లింకు ద్వారా నేరుగా కెప్టెనునే కాంటాక్ట్ చేస్తాను. ఎలా కాంటాక్టు చేయాలన్నది విజయవాడ కంట్రోల్ రూంకు తెలియజేయండి. థాంక్యూ వన్స్ ఎగైన్”.

పదండి. కంట్రోల్ రూంకు వెళదాం” అన్నాడు. షౌకత్ భుజంపై చేయివేసి “మీ అమ్మాయి సురక్షితంగా ఉంది. మీరు ఇంక కంగారు పడవలసిన అవసరం లేదు” అన్నాడు.

పాండూ, తరువాత ఏం చేయాలో ఆలోచించావా?” ఆయనకు పాండు మీద బాగా నమ్మకం కలిగింది. షౌకత్ ఒక్కసారిగా రిలీఫ్ అయ్యాడు. పక్కనే ఉన్న స్టూలుపై కూర్చుని రెండు చేతులతో కళ్ళు, ముఖం మూసుకున్నాడు. కొన్ని సెకనుల తరువాత లేచి పాండు దగ్గరకు వచ్చి కౌగలించుకున్నాడు. “థాంక్యూ యంగ్ మాన్. థాంక్యూ సోమచ్”. అతనికి మొదట్లో తాను ప్రవర్తించిన విధం గుర్తొచ్చింది. పాండు భుజం చూట్టూ చెయ్యేసి “అయామ్ సారీ, నేను నీకు కష్టం కలిగే విధంగా మాట్లాడి ఉంటే”.

పదండి, వెళదాం” తొందర చేశాడు ఎస్.పి. పాండు నవ్వాడు “ఏం తొందర లేదు సార్. ఆ షిప్ పోర్ట్ బ్లేయర్ చేరడానికి కనీసం ఇంకా రెండు రోజులు పడుతుంది. ముందు రిలాక్సవండి”

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు