భాగవత కథలు - 13 గజేంద్ర మోక్షం - కందుల నాగేశ్వరరావు

Gajendra moksham

భాగవత కథలు – 13

గజేంద్ర మోక్షం

-1-

“నొక్కకరినాథుడెడతెగి, చిక్కెనొక కరేణుకోటి సేవింపంగన్”

పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతం ఉంది. అది పదివేల ఆమడల పొడవూ, అంతే వెడల్పూ, ఎత్తూ కలిగి త్రిభుజాకారంలో ఉంటుంది. దానికి బంగారం, వెండి, ఇనుమూ నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్పవృక్షాల లాంటి చెట్లతో, గల్లు గల్లుమనిమ్రోగుతూ పారే సెలయేర్లతో,మంచినీటి సరస్సులతో, రంగు రంగుల రత్నాలతో ధాతువులతో నిండి ఉంటుంది. ఆ త్రికూటం దేవతలనూ, యక్షులనూ, కిన్నెరులనూ కూడా ఆకర్షిస్తూ ఉంటుంది.

ఆ అడవిలోలెక్కకు మించిన మదించిన ఏనుగులు,ఇతర జంతువులు కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటంతభయంకరంగా ఉంటాయి. అవి ఒకనాటిసాయంత్రంకొండగుహలలోనుండి విహారానికి బయలుదేరాయి.ఆ మదపుటేనుగులు రకరకాల క్రీడలతో విహరింపసాగాయి. ఆటలు ఆడి ఆడి వాటికి దాహం వేసింది. నీళ్ళ మడుగు వైపు నడిచాయి.ఆ ఏనుగులకు రాజైన గజేంద్రుడు దారితప్పి గుంపు నుండి విడిపోయాడు.కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూఅతని వెంట ఉన్నాయి. వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరేదారి గుండా నడిచాడు.గజరాజు ఒకచోట ఒక నీటి మడుగు చూసాడు. ఆ మడుగులోఎన్నో విచ్చుకున్న కమలాలు కలువలూఉన్నాయి.

-2-

“నీరాట వనాటములకు, పోరాటం బెట్లు కలిగె?”

మదపుటేనుగులు నిర్మలంగా ఉన్న ఆ పద్మసరస్సును చూసి దప్పికతో అందులో దిగాయి. గళగళమని శబ్దాలు చేస్తూ నిండుగ నీళ్ళు త్రాగాయి. గజరాజు తన తొండంతో నీళ్ళు పీల్చి మునిగాళ్ళపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు. ఆడ ఏనుగులపై నీళ్ళు చల్లాడు. తన ఆటలతోఆ సరస్సును అల్లకల్లోలం చేసాడు. దానితో ఆ మడుగు అందచందాలు మాసిపోయాయి.

ఈ విధంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ మడుగులో ఓ మూల దాగిఉన్న మొసలిరాజు అతనిని చూసాడు. భుగ భుగ మనే చప్పుళ్ళతో పెద్ద పెద్ద బుడగలు పుట్టి అలలు ఆకాశానికి ఎగిరి పడేటట్లు, గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించాడు. ఆ మకరరాజు గజరాజును వడిసి పట్టుకున్నాడు. గజేంద్రుడు మొసలి పట్టు తప్పించుకున్నాడు. ఏనుగు తన పొడవైన తొండంతో కొట్టిన దెబ్బకు మొసలి చావుదెబ్బ తిని నీళ్ళలో పడిపోయింది. వెంటనే అది తేరుకొని ఏనుగు ముందరి కాళ్ళు పట్టుకుంది. మొసలిఏనుగును మడుగులోకి ఈడ్చింది. ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది. “ఏనుగు కంటె మొసలి, మొసలి కంటె ఏనుగు బలమైనవి” అనుకుంటూ అన్ని లోకాల్లోని వీరులు ఆశ్చర్య పోయారు.

కరి మకరి రెండూ ఎడతెరపి లేకుండా ముట్టెలతో తాకుతూ, తలలు ముక్కలయ్యేటట్ట్లుగా, నెత్తురు కారేటట్లు వాడి పండ్లతో పొడుచుకున్నాయి. పట్టు వదలకుండా గట్టిగా నిలదొక్కుకున్నాయి. సరస్సులో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. వాటి పోరాటం లోకాలకు భయంకరంగా సాగింది. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఏనుగులు చూస్తూ ఉండిపోయాయి.

-3-

“నలవుజలము నంతకంత కెక్కి మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు”

మొసలికి నీళ్ళలోనే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమంగా దానికి బలమూ పట్టుదలగా పెరిగాయి. గజరాజు రాను రాను కృష్ణ పక్షపు చంద్రుని వలెఅంతకంతకు నీరస పడుతున్నాడు. మొసలి సింహం వలె హూంకరించి ఏనుగు కుంభస్థలంపైకి ఉరికింది. మెడనూ వీపును కరిచి బాధపెట్టింది. తోక కొరికింది. ఎముకలు దంతాలు విరిగేటట్లు డీకొంది. మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగాగజరాజును నొప్పించింది. గజేంద్రుడు ఘోరమైన మొసలి వాడి కోరలకు చిక్కి బాధతో అలమటించాడు. అయినా సరే గజరాజు విసుగు చెందకుండా రాత్రుళ్ళూ పగళ్ళూవెయ్యి సంవత్సరాలు తీవ్రంగా పోరాటం కొనసాగించాడు.

-4-

“ఏరూపంబున దీని గెల్తు? నిట మీ దేవేల్పు జింతింతు?”

పూర్వ జన్మ పుణ్యఫలం వల్లగజరాజు ఈ విధంగా ఆలోచన చేసింది. “ఈ మొసలిని ఎలా గెలవాలి? ఏ దేవుని ప్రార్థించాలి? ఎవరు నన్ను కాపాడుతారు?ఈ మొసలిని అడ్డగించే వారెవ్వరు? అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై గొప్ప గౌరవాన్ని పొందాను. ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నాను.నా దానజలధారలతో పెరిగిన మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులో ఎందుకు దిగాను? భగవంతుడా భయం కలుగుతూ ఉంది. నా గతి ఏమతుందో!

-5-

“ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;”

ఈ లోకం ఎవరి వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, చివరికి మరల ఎవరియందు కలిసి పోతుందో అటువంటి ఆ భగవంతుని శరణు కోరుతాను. శాశ్వతంగా అఖండమైన రూపంతో ప్రకాశించే ఆ దేవదేవుణ్ణి తలవంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు ఆర్తుల ఎడల ఉంటాడంటారు. అన్ని దిక్కుల్లోను ఉంటాడని అంటారు. అటువంటి దేవుడు మరి ఉన్నాడో! లేడో!ఈ విధంగా తలంచి మనస్సులో భగవంతుని ప్రార్థించాడు. “భగవంతుడా! నాలో కొంచెం కూడా శక్తి లేదు. నా ధైర్యం తగ్గి పోయింది. ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయేటట్లున్నాయి. మూర్ఛ వస్తోంది. శరీరం చిక్కి పోయింది. నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. రావయ్యా! కరుణించి నన్ను కాపాడవయ్యా” అని వేడుకున్నాడు.

-6-

“అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దాపల”

ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్నవారిని కాపాడే భగవంతుడు శ్రీమహావిష్ణువు వైకుంఠంలో, అంతఃపురంలో ఉన్నాడు. అందులో ఓ ప్రక్కనున్న మేడకు దగ్గరలోని అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిలల అరుగుపై కలువపువ్వుల పాన్పుపై శ్రీమహాలక్ష్మితో వినోదిస్తున్నాడు. ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీరచెంగు లాగుతూ ఆమెను ఆట పట్టిస్తున్నాడు. భయంతో స్వాధీనం తప్పి ‘కాపాడు కాపాడు’ అని ఆర్తితో విలపిస్తున్న గజేంద్రుని మొర విన్నాడు. గజరాజును కాపాడాలనే ఆత్రుతతో శ్రీహరి ఒక్కసారిగా త్రుళ్లిపడి లేచాడు. “కాపాడు కాపాడు” అని భక్తుడు పెట్టే మొర ఒక్కటే వినబడుతోంది. అతనిని కాపాడాలని తొందర పడుతున్నాడు.

-7-

“సిరికిం జెప్పడు; శంఖచక్ర యుగముం జేదోయి సంధింప డే”

లక్ష్మీదేవికి ఏమీ చెప్పలేదు. శంఖు చక్రాలను చేతిలోనికి తీసుకోలేదు. సేవకులెవరినీ పిలువ లేదు. గరుడవాహనం సిద్ధపరచుకోలేదు. చెవులపై జారిన జుత్తుముడిని సరిచేసుకోలేదు. ప్రణయకోపంతో లేచి వెళ్ళుతున్న లక్ష్మీదేవి చీరకొంగును వదలి పెట్టలేదు. ఆయన గజరాజు మొరలన్నీ విని ప్రియురాలితో సరస సల్లాపాలు చాలించాడు. ఆకాశమార్గాన్న బయలు దేరాడు. విష్ణువు వెనుక లక్ష్మీదేవి, ఆ వెనుక అంతఃపుర స్త్రీలు, గరుడుడూ, శంఖమూ, చక్రమూ, నారదుడూ, విష్వక్సేనుడు, వారి వెనుక వైకుంఠంలో నున్న మిగిలిన వారందరూ విష్ణుమూర్తిని వెంబడించారు. లక్ష్మీదేవి భర్త ఎక్కడకు వెళుతున్నాడో అడగాలనుకుంది, కాని అడగలేక పోయింది. ఆకాశమార్గాన్న వెళుతున్న విష్ణుమూర్తిని చూస్తున్న దేవతలు నమస్కారాలు చేసారు. కాని గజరాజును కాపాడాలనే తొందరలో మైమరచి వారి మ్రొక్కులు కూడా అందుకోలేదు. అలా బయలుదేరివెళ్ళిన నారాయణుడు “త్రికూటం” చేరాడు.

విష్ణువు మొసలిని చంపడానిక తన చక్రాన్ని పంపాడు. ఆ చక్రం దేవతలను కాపాడేది, భూమండలాన్ని వణికించే వేగం కలది. ఎదురు లేనిది. ఆ చక్రాయుధం రివ్వున వెళ్ళి మొసలి తల నరికి వేసింది, దాని ప్రాణం తీసింది. మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలించాడు. విష్ణువు తన పొడవైన చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకు రావడానికి సాయపడ్డాడు. అతని వెన్ను తట్టి బాధ పోగొట్టాడు. విష్ణుమూర్తి హస్త స్పర్శతో అతని శరీర తాపమంతా చల్లారి పోయింది. సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా ఘీంకారం చేసాడు. ఆ మొసలి ముని శాపం వలన కలిగిన తన మకర రూపం వదలి ‘హూహూ’ అనే గంధర్వుడిగా మారిపోయింది.ఆ గంధర్వుడు స్వామిని మిక్కిల భక్తితో కీర్తించి, స్వామి అనుగ్రహం పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు.

-8-

“గజేంద్ర డా మకరంతో నాలంబు గావించె మున్ద్రవిళాధీశు డతండు”

మొసలితో పోరాడిన గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్యుడనేరాజు. ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు గొప్ప విష్ణుభక్తుడు. ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమరచి ఉన్నాడు. అక్కడకు వచ్చిన అగస్త్యమహర్షిని గమనించలేదు. దానికి ఆ మహర్షి కోపగించి ‘అజ్ఞానంతో కూడిన ఏనుగుగా పుట్టమని’ శపించాడు.ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా, అతని సేవకులు ఏనుగులుగా పుట్టారు. రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వల్ల అతనికి ముక్తి లభించింది.

గజరాజును కాపాడిన తరువాత శ్రీహరి చిరునవ్వుచిందిస్తూ లక్ష్మీదేవితో “ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడువకుండా ప్రార్థించిన వానిని నేను రక్షిస్తాను. ఇది నీకు తెలుసు కదా!” అన్నాడు.

లక్ష్మీదేవి “నీవు సమస్తానికి ప్రభువైనవాడవు. నీ పాదాలను మనస్సులో ఉంచుకొని పూజించడమే నా పని. అందుకనే నిన్ను అనుసరించి వచ్చాను” అని స్తుతించింది. ఇదంతా చూస్తున్న గంధర్వులు, దేవతలు జయ జయ ధ్యానాలు చేసారు. విష్ణుమూర్తి పరివార సమేతంగా వైకుంఠానికి బయలుదేరాడు.

గజేంద్ర మోక్షం కథ చదివేవారికి, వినేవారికి కీర్తి పెరుగుతుంది. పాపాలు, దుఃఖాలు నశిస్తాయి. ఆపదలు అంతరిస్తాయి. శుభాలు కలుగుతాయి. ఇంతేకాదు, తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైన మనస్సుతో విష్ణువునూ, గజరాజునూ, ఆ సరస్సునూ, శ్వేతదీపాన్నీ, పాలసముద్రాన్నీ, త్రికూటపర్వతశిఖరాలనూ, లక్ష్మీదేవినీ, ఆదిశేషుని, గరుడుని, శంఖ చక్ర గదాయుదాన్నీ, విష్ణు భక్తులను తలంచేవారు మృత్యు సమయంలో నిర్మలమైన విష్ణు రక్షణ పొందుతారు.

*శుభం*

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి