మంచి మొండి పిల్ల - బి.రాజ్యలక్ష్మి

Manchi mondi pilla

“అమ్మా ! నీకెన్ని సార్లు చెప్పాను ! ప్రక్క గది యెవరికీ అద్దెకివ్వద్దని !మన యిబ్బందులు ఆలోచించవా “అప్పుడే కాలేజీ నించి వచ్చిన సీత జానకమ్మను చూస్తూ విసుగ్గా అరిచింది .

హాల్లో నే వున్న జానకమ్మ ,”సీతా ! నీకు అరవడం ,విసుక్కోవడం తప్ప యేమి చేతకాదు ! మన పరిస్థితులు ఆలోచించు ! నాన్న లేరు ,నిన్నూ తమ్ముణ్ణి చదివించాలి ! నాన్న పెన్షన్ మనకు సరిపోదు అయినా బొత్తిగా తెలియని అబ్బాయి కాదు ,రాజబాబు తండ్రి నాకు అన్నయ్య వరుస అవుతాడు .వాళ్ల తాతగారికి మనం యీ వూళ్లో వున్నామని తెలిసి మన సాయం కోరాడు .మనతో పాటే కాఫీ భోజనం ,అద్దె తో సహా కలిపి యివ్వంటాను .బ్యాంకు లో మనవూళ్ళో వుద్యోగం వచ్చింది .”అంటూ కూతురికి వివరణ యిచ్చింది జానకమ్మ .

“అమ్మా !నీ యిష్టం వచ్చినట్టు చేసుకో కానీ అతను మన యింట్లో తిరగడానికి వీల్లేదు .మనకు ఒకే బాత్రూమ్ వుంది పైగా దానికి లోపల గొళ్ళెం లేదు ,అతను వెళ్లాలనుకున్నప్పుడు తలుపు చప్పుడు చెయ్యాలి అమ్మా ,రాత్రుళ్లు లేట్ గా రావద్దని చెప్పు “అంటూ బోలెడు ఆంక్షలు చెప్పింది సీత .

“మెల్లగా మాట్లాడవే సీతా అతను గది లోనే వున్నాడు “అన్నది జానకమ్మ .

“విననీ ! నేనేం తప్పుగా మాట్లాడలేదుగా “అంటూ లోపలికి వెళ్లింది సీత .

ప్రక్క గదిలోనే పడుకున్న రాజా కి అన్ని వినపడ్డాయి .సీత మూర్ఖత్వం అర్ధం అయ్యింది . తనకు వూరు కొత్త . వుద్యోగమూ కొత్త .ఉదయమే వచ్చాడు .నాన్న మరీ మరీ చెప్పి పంపించాడు .అత్తయ్య చాలా మంచి మనిషి అని చెప్పాడు . ఇంతలో జానకమ్మగారు రాజా గదిలోకి వచ్చారు .

“బాబూ ,భోజనం చేద్దువుగాని రా అక్కడే బాత్రూమ్ వుంది ,కాళ్లుచేతులు కడుక్కో “అంటూ రాజా ని ఆప్యాయం గా పిలిచారు .రాజా సరేనని లేచాడు .ఇంతలో “అమ్మా యిందాక నేనేం చెప్పాను ?మర్చిపోయావా , భోజనం ఆ గదిలోనే పెట్టు ,మన గదుల్లో వద్దు “అంటూ సీత బయటనించి అరిచింది .జానకమ్మ గారు తలకొట్టుకుంటూ ,రాజా వైపు చూసి గది బయటకు వచ్చారు .రాజా కు అర్ధమయ్యింది .బాత్రూం తలుపు కొట్టి లోపలికి వెళ్లి ఫ్రెష్ అయివచ్చాడు .జానకమ్మగారు అన్నం కంచం అధరువులు పట్టుకుని రాజా గదికి వచ్చారు .భోజనం వడ్డించారు !

“మా సీత మాటలు పట్టించుకోకు బాబూ !దానికి ఆవేశం యెక్కువ ఆలోచన తక్కువ .మీ అమ్మ దగ్గర యెలా వుంటావో నా దగ్గరా అలాగే వుండు “అంటూ ఆవిడ కొసరి కొసరి వడ్డిస్తుంటే రాజా కడుపునిండా తృప్తి గా తిన్నాడు .

“అత్తయ్యా !మీరింతగా చెప్పాలా !అయినా నేనివ్వన్నీ పట్టించుకోను ఆలా మా బ్యాంకు వైపు వెళ్లొస్తాను ,రేపు జాయిన్ అవ్వాలి గా “అంటూ లేచాడు రాజా !

“బాబూ జాగ్రత్తగా వెళ్లు “అంటూ జానకమ్మ కంచం తీసుకుని బయటకొచ్చింది ,రాజా తన గదికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు .

రెండు వీధులు దాటగానే రోడ్డు మీదే వుంది బ్యాంకు ! నడిచి వెళ్లొచ్చు అనుకున్నాడు రాజా .యింకాస్త ముందుకెళ్తే సినిమాహాలుంది .రాజా సినిమా చూసి యింటికి వచ్చేటప్పటికి సుమారు పది గంటలయింది . తలుపు కొట్టాడు ,

“ఎవరు ?”సీత గొంతు గుర్తు పట్టాడు .

“నేనే “అన్నాడు రాజా

“నేనంటే !పేరు లేదా “అంటుంటే జానకమ్మగారు వచ్చి తలుపు తీసారు .సీత లోపలికి వెళ్లింది .

“లేటయ్యింది అత్తయ్యా “అంటూ చెప్పబోయాడు

“పర్వాలేదులే బాబూ !భోజనం చేద్దువు నీ గదిలో కూర్చో “అంటూ ఆవిడ వంటింట్లో కి వెళ్లారు .రాజా గది లోకి వెళ్లాడు .

మర్నాడు రాజా బ్యాంకు లో చేరాడు .కొత్తగా వున్నా అందరూస్నేహం గా పలకరించారు .సాయంకాలం యింటికి వచ్చేటప్పుడు పళ్లు తెచ్చాడు ! అక్కడే చదువుకుంటున్న సీత దగ్గర పెట్టాడు .

“చూడండీ ! మేం గతిలేని వాళ్లం కాదు ,”అంటూ పళ్ల కవరు విసిరేసింది .రాజా బాధపడ్డాడు .”అత్తయ్య కు తెచ్చాను “అన్నాడు .

“అత్తయ్యకు అవసరం లేదు “అంటూ విసురుగా లోపలికెళ్లింది సీత .

ఒకరోజు జానకమ్మ గారు బాగా దగ్గడం వినిపించింది .పైగా ఆ రోజు సీత అన్నం కంచం గదిలో పెట్టి వెళ్లిపోయింది .రోజూ ఆప్యాయం గా దగ్గరుండి తినిపించే అత్తయ్య రాలేదు .భోజనం సరిగా చెయ్యలేకపోయాడు .అయినా సీత అవేమీ గమనించకుండా కంచం తీసుకెళ్లిపోయింది .సాయంకాలం రాజా జానకమ్మను పలకరిద్దామని ఆవిడ పడుకునే గది దగ్గరకు వచ్చాడు .

“అత్తయ్య ను చూద్దామని వచ్చాను “అన్నాడు .రాజా .

“అమ్మ నిద్రపోతుంది ,”అన్నది సీత ,రాజా మౌనం గా వెనక్కి తిరిగాడు .ఇంతలో “రాజా లోపలికి రా “అంటూ జానకమ్మ పిలిచారు .రాజా నవ్వుతూ సీతను చూసి లోపలికి వెళ్లాడు .

“అత్తయ్యా వొంట్లో బాగాలేదా “అన్నాడు .

“వయసు పెరుగుతున్నదిగా అప్పుడప్పుడూ యివన్నీ మాములే .రెండు మూడు రోజులు సీత వంట చేస్తుంది ,నీకు తెచ్చిస్తుంది ,దాని మాటలు పట్టించుకోకు “అన్నారు ఆవిడ ! అలాగేనని తలూపాడు రాజా .సీత పళ్ల కవరు విసిరెయ్యడం చెబ్దామనుకున్నాడు కానీ ఆవిడ బాధపడ్తుందని చెప్పలేదు .

రాత్రి యెనిమిదింటికి సీత భోజనం కంచం తెచ్చి స్టూలు మీద పెట్టి వెళ్లిపోయింది .రాజా తినలేదు .సీత వచ్చి కంచం తీసుకెళ్లింది అంతేకానీ యెందుకు తినలేదని అడగను కూడా అడగలేదు .మూడు రోజులూ యిదే పధ్ధతి .కాఫీ త్రాగలేదు భోజనం చెయ్యలేదు .రాజా రాత్రిపూట బయట తినేసి వచ్చేవాడు .నాల్గో రోజు ఆదివారం రాజా పడుకునేవున్నాడు .జానకమ్మగారు నెమ్మది గా కాఫీ ,ఉప్మా పట్టుకుని వచ్చారు .అది చూసి రాజా లేచి కూర్చున్నాడు .

“బాబూ నువ్వు సరిగా తినడం లేదని సీత చెప్పింది .దానికి వివరం తెలియదు ,మూర్ఖత్వం తెలుసు ,కనీసం యెందుకు తినడం లేదు అన్న యింగితజ్ఞానం కూడా లేదు .దీన్నెవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాడు గట్టివాడు రావాలి ,లేకపోతె యిదే వాణ్ణి తిప్పలు పెడ్తుంది “అంటూ తన గోడు అతనికి చెప్పుకుంది జానకమ్మ .రాజా నవ్వుకున్నాడు .

ఆ రోజు వుదయం నించీ కుంభవృష్టి ! సీత కు ఆ రోజే డిగ్రీ పరీక్ష మొదలు ! రాజా బ్యాంకు కి సెలవు పెట్టాడు .గొడుగేసుకుని బయటకొచ్చింది సీత .జానకమ్మగారు రాజా ని తోడుగా వెళ్లామన్నారు .

“నేనేం చిన్నపిల్లను కాదు ,నాకు యెవ్వరి తోడు అక్కర్లేదు “అంటూ చర చరా వెళ్లిపోయింది .జానకమ్మ తల కొట్టుకుంది .రాజా కి అర్ధం అయ్యింది .డ్రెస్ చేసుకుని గొడుగేసుకుని వెళ్లాడు .సీత తడుస్తూ వెళ్తున్నది ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు .రాజా తన బైక్ ఆపి యెక్కమన్నాడు ,మూతి మూడు వంకర్లు తిప్పుతూ తడుస్తూనే వెళ్తున్నది .రాజా కు వొళ్లు మండింది ,సీత చెయ్యి పట్టుకుని ఆపి “అల్లరి చెయ్యకుండా కూర్చో ,చుట్టూ పెద్ద సీన్ చెయ్యకు, అక్కడ గేట్ మూసేస్తారు “అంటూ గట్టిగా అన్నాడు .అప్పటికే నలుగురూ వింతగా చూస్తున్నారు .సీత యేమనుకుందో ఏమోకానీ బైక్ మీద కూర్చుంది .అతనికి తగలకుండా సీటు పట్టుకుని కూర్చుంది .రాజా నవ్వుకున్నాడు .

సాయంకాలానికి వర్షం తగ్గింది .రాజా సీతను దింపి వెంటనే వచ్చాడు .

మర్నాడు వుదయం జానకమ్మ రాజా కు కాఫీ తీసుకెళ్లారు ! రాజా మూలుగుతున్నాడు .నుదిటి మీద చెయ్యి పెట్టి చూస్తే వేడిగా వుంది .జ్వరం వచ్చినట్టుంది .”ఆవిడ గబ గబా వెనక్కి వెళ్లి జ్వరం టాబ్లెట్ తెచ్చి అతని చేత మింగిచారు .

“సీతా ,నేను వంట చేస్తున్నాను రాజా ని కాస్త వుండు “అన్నారు .తలూపింది సీత .రాజా బైక్ మీద దింపిన విషయం గుర్తుకొచ్చింది .అతను దింపకపోతే తన పరీక్ష పోయేదే కదా అనుకుంది .అతని పైన యేదో తెలియని యిష్టం మొదలయ్యింది .

దగ్గరుండి మరీ అతనికి సేవలు చేసింది .జానకమ్మగారు సీత లో మార్పుకు సంతోషించారు .

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి