పాండు 4: మాలతి మాయమైంది - కణ్ణన్

Malithi mayamayindi

ఆదివారం. ఉదయం ఎనిమిదిన్నర కావస్తూంది. ఇంటి ముందు సపోటా చెట్టు కింద కూర్చుని పేపరు చదువుతుంది మాధవి. పక్కనే ఉన్న బ్లూటూత్ స్పీకరులోంచి ఇళయరాజా పాటలు వస్తున్నాయి. వీధి చాలా ప్రశాంతంగా ఉంది. చివరికి కుక్కులు కూడా మొరగడం లేదు. మాధవికి రెండో సారి కాఫీ త్రాగాలనుంది. కానీ, తనే లేచి కాఫీ కలపాలి. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేవాలా, వద్దా అని ఆలోచిస్తున్నంతలో గేటు తోసుకుని పంకజం పరిగెత్తుకుంటూ వచ్చింది "అమ్మగారూ" అంటూ.

రోజూ ఆరింటికల్లా వచ్చి అంట్లు తోమే పంకజం ఏడైనా రాకపోతే ఇక రాదనుకుని తానే గిన్నెలు కడుక్కుంది మాధవి. ఇప్పుడు ఎనిమిదిన్నరకు ఇలా ప్రత్యక్షమవ్వగానే మాధవికి కోపం వచ్చింది. "ఏంటే ఇంత లేటు" అంటూ అరవబోయేంతలో పంకజం దగ్గరకొచ్చి "అమ్మగారూ, మీరే కాపాడాలి" అంటూ భోరున ఏడవసాగింది.

అంట్ల గురించి మర్చిపోయింది మాధవి. "ఏమైందే? ఏడుపాపి ఏం జరిగిందో చెప్పు".

"నా కూతురు మాలతి కనబడడం లేదమ్మా". మాలతికి పదిహేనేళ్ళుంటాయి. చూడడానికి బాగానే ఉంటుంది. కానీ తనను తాను మాత్రం మిస్ ఇండియా అని అనుకుంటుంది. పదిళ్ళల్లో పనిచేసి సంపాదించేదంతా షోకులకు బాగా తగలెడుతుందని వాళ్ళమ్మ ఎప్పుడూ వాపోతుండేది. అది స్నానం చేసినా చేయకున్నా, పౌడరూ, సెంటూ, డ్రస్సులూ, మ్యాచింగ్ గాజులూ, చెప్పులూ. తను కూడా తన శరీరంపై అంత ఖర్చు పెట్టదని మాధవి అభిప్రాయం. కానీ, కొన్ని కొన్ని చెబితే అర్థం కావు. ఒక్కోసారి చెప్పి చెడడం కన్నా ఊరుకోవడమే ఉత్తమం. అయినా ఈరోజుల్లో పిల్లలు చెబితే వినేలాగున్నారా. అంతలోనే మాధవికి గుర్తొచ్చింది, ఇదే మాట తన తల్లి, ఆమె తల్లి కూడా అన్నారని.

"ముందా ఏడుపాపి, ఏమైందో అర్థం అయ్యేలా చెప్పవే".

"రాత్రి మాతోనే ఇంట్లో పడుకుంది. తెల్లారి మూడింటికి మెలకువ వచ్చి చూస్తే పక్కన పిల్ల లేదమ్మా".

"మరిప్పటి వరకూ ఏం చేస్తున్నావు"? ఆదుర్దాగా అడిగింది మాధవి "పోలీసు స్టేషనుకి వెళ్ళావా"?

"తెల్లారగట్లే వెళ్ళానమ్మా. నాలుగింటి నుంచీ అక్కడే ఉన్నాను. వాళ్ళేమీ కదలేట్లు లేరు".

"కేసు రాయించావా"?

"రెండు గెంటలు కూర్చోబెట్టి రెండొందలు తీసుకుని రాశారమ్మా".

ఇంకేం అడగాలో, అనాలో మాధవికి తెలీలేదు. మాలతి ఒక్కతే కూతురు పంకజానికి. మొగుడొదిలేశాడు. ఇంకెవ్వరూ లేరు. "ఏమైనా తిన్నావా" ఇంకేం అడగాలో తెలీక, ఏం జరిగినా, జరగక పోయినా, తన పని తాను చేసుకుపోయేది కడుపొక్కటేనని అడిగింది.

"ఇప్పుడేం వద్దమ్మా".

"వద్దంటే ఎట్లానే పిచ్చి మొహమా. కూర్చో, కొంచెం ఉప్మా చేస్తాను" లేచింది మాధవి.

"అమ్మా" పంకజం గొంతులో బిడియం.

"ఏందే" అసలు పంకజానికి ఏం కావాలో మాధవికి అర్థం కాలేదు.

"ఓతూలి అయ్యగారికి చెప్పి, పాండు బాబుకు చెప్పించమ్మా". మాధవి మళ్ళీ కూర్చీలో కూలబడింది "పాండుకా" అంటూ.

"పోలీసు స్టేషనులోని వెంకటస్వామిగారే సెప్పారమ్మా. అంటే ఇట్లా మూర్తిగారింట్లో పనిచేస్తున్నానని చెప్పాలేమ్మా. అప్పుడే వాళ్ళు కేసు రాసుకుంది. స్వామిగారు ఎనిమిదింటికి వచ్చారు. ఇట్లా అయ్యగారి గురించి చెబితే పాండు బాబు దగ్గరకు వెళ్ళమన్నారు. పోలీసోళ్ళు, పిల్ల దొరికితే తెస్తారు. కాకపోతే వీళ్ళు వెతకితే పిల్ల దొరకడానికి శానా దినాలు పట్టుద్ది. పాండు బాబయితే చప్పున పట్టేస్తాడు అన్నాడమ్మా. అందుకే వాళ్ళే మీ దగ్గరకు పంపారు".

మాధవికేం అనాలో అర్థం గాలేదు. "సరే, తన వంతు ప్రయత్నం తనది", అనుకుంటూ ఫోన్ తీసి మొగుడికి ఫోన్ చేసింది.

* * *

డాబా పైనున్న గదిలో చాపలేసుకుని పడుకున్నారు పాండు, సుందరమూర్తి. రెండు చాపలు పొడవుగా వెేసి మధ్యలో దిండ్లేసి పడుకున్నారు. గదంతా సిగరెట్ల కంపు. అందుకే గామోసు, బల్లులూ, బొద్దింకలూ కూడా రావు ఆగదిలోకి. సుందరమూర్తికి పాండుతో చేరిన తరువాత పెరిగిన తెలివితేటల ఫలితంగా ఫోన్ స్విచాఫ్ చేసి పడుకోడం అలవాటైంది. ఫోన్ ఉన్నది మన అవసరానికి. అవసరమైనప్పుడు మనం ఫోన్ చేయాలిగాని, ఇంకొకళ్ళకు అవసరమైనప్పుడు ఫోన్ చేసి మన ప్రశాంతతను భంగం చేయడానికి కాదన్నది పాండు తత్వం. అందుకే పాండు ఫోన్ ఎప్పుడూ స్విచాఫ్ చేసి ఉంటుంది. వాళ్ళమ్మ కూాడా మాట్లాడాలని అనిపించినప్పుడు మాధవికి చెప్పి సుందరమూర్తి ద్వారా పాండుకు చెప్పిస్తుంది. ప్రొద్దున ప్రొద్దున్నే తనకు పాండుతో అవసరం పడినందుకు, భర్త ఫోన్ స్విచాఫ్ చేసి పడుకున్నందుకు మాధవికి కోపం వచ్చింది. కానీ, ప్రస్తుతం అత్యవసర పరిస్థితి. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడులే అనుకుని, మెల్లగా డాబాపైకెక్కింది. వెనకాలే పంకజం కూడా వెళ్ళింది. కాలింగ్ బెల్ ఎప్పుడో డిస్ కనెక్ట్ చేసి పడేశాడు పాండు.

ఫోన్ తీయని భర్తమీదా, కేసు విచారించని పోలీసుల మీదా ఉన్న కోపాన్నంతా ఆ తలుపు మీద చూపించి గొళ్ళెం పట్టుకుని దబదబా కొట్టింది మాధవి. లోపల ఏవో విసుక్కుంటున్న శబ్దాలు వినిపించాయి. పంకజానికి అసలు తలుపు వేసి ఉందా అని అనుమానం వచ్చి గట్టిగా నెట్టింది. కిర్రుమంటూ తలుపు తెరచుకుంది. కొండమీద గుహలోకి వెళితే గబ్బిలాలకంపు వచ్చినట్లు ఘాటుగా సిగరెట్ల పొగ స్వేచ్ఛావాయువులలో కలసిపోవడానికని ఆగది నుంచి పారిపోసాగింది. ముక్కుముందు చేత్తో విసురుకుంటూ "ఏమండీ" అంటూ భర్తను పిలిచింది.

లోపలనుంచి ఏవిధమైన ప్రతిస్పందనా లేదు. "మీరుండండి అమ్మగారూ" అంటూ పంకజం లోనకెళ్లి ట్యూబ్ లైట్ ఆన్ చేసింది. సుందరమూర్తి కళ్ళు చిట్లించి "ఎవరదీ" అని అరిచాడు. పాండు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా కంటిపై మాస్కు వేసుకుని పడుకున్నందువల్ల ఇంకా ప్రశాంతంగా నిద్రలోనే ఉన్నాడు.

మాధవి సుందరమూర్తి దగ్గరకెళ్ళి భుజాలు పట్టి కుదిపి లేపింది. నోట్లో తిట్టుకుంటూ లేచాడు సుందరమూర్తి. పైకి తిడితే దొరికే కాఫీ కూడా దొరకదు మరి. పాండుని లేపండి. అర్జంట్“ సుందరమూర్తి చెవిలో చెప్పింది మాధవి.

మాధవినీ, పంకజాన్నీ, అసలు విషయం ఏంటన్నట్లు చూశాడు సుందరముర్తి. “ముందు లేపండి“ గుడ్లు పెద్దవి చేసింది మాధవి భయపెడుతున్నట్లు. మూర్తికి మాత్రం ఆ కళ్ళు చాలా హాస్యాస్పదంగా కనిపించాయి. నవ్వుతూ మాధవి చెంప నిమిరాడు. అంత విసుగులోనూ సిగ్గేసింది మాధవికి. అందులోనూ పనిమనిషి ముందు.

పళ్ళు కొరికి, “చాల్లే సరసం. పంకజం కూతురు కనబడడం లేదు. పోలీసోళ్ళు పాండు దగ్గరకు వెళ్ళమని పురమాయించారు. వాడిని ముందు లేపండి“ అంది మాధవి.

పాండు మెదడులో నిద్రపోకుండా సక్రియంగా ఉన్న కొన్ని కణజాలమేదో ఈ మాట విని మిగతా కణాలనూ, నాడులనూ ఒక్కసారిగా చైతన్యవంతం చేసినట్లున్నాయి. స్విచ్ వేయబడ్డ రోబోట్ లాగా చప్పున లేచి కూర్చున్నాడు పాండు. వెనక్కి తిరిగి మాధవిని, పంకజాన్ని చూశాడు. పంకజాన్ని కూర్చోమన్నట్లు సైగచేసి, “కొంచెం కాఫీ ఇవ్వు పిన్నీ“ మాధవిని అడిగాడు. “పళ్ళుతోముకుని కిందకు రా. మెట్లెక్కాలంటే బద్ధకంగా ఉందిరా“ అంటూ లేచింది మాధవి “మీరూ బయలుదేరండి“ భర్తను పురమాయించి తను మెట్లు దిగసాగింది.

పాండు వచ్చేటప్పటికి పంకజం, మూర్తి తయారుగా ఉన్నారు. ఫర్--ఛేంజ్, పాండు సెల్ ఫోన్ తీసుకుని వచ్చాడు. పంకజాన్ని విషయం చెప్పమన్నట్లు తలూపి, “ఇంకో రెండు నిముషాలురా, డికాక్షన్ దిగుతుంది“ అంది మాధవి.

సుందరముర్తి ముఖం నిద్రెక్కువై వాచినట్లుంది. కానీ, పాండు మాత్రం తాజాగా ఉన్నాడు. “ఒక గ్లాసు మంచినీళ్ళీ పిన్నీ“.

చెప్పు పంకజం“ అన్నాడు పాండు.

రాత్రి మూడింటప్పుడు మెలకువ వచ్చి చూస్తే పక్కన లేదు బాబూ“ కూతురి గురించి చెప్పడం మొదలు పెట్టగానే వెక్కిళ్ళు వచ్చాయి.

నువ్వు ముందు గుండె దిటవు చేసుకుని నాకు మెల్లగా చెప్పు. లేకపోతే కష్టం“.

అంతే బాబూ. పది నిముషాల తర్వాత కూడా పిల్ల కనబడకపోతే బయట, చూట్టు ప్రక్కల చూశాను. ఎక్కడా లేదు. పక్కింట్లో వాళ్ళని లేపాను. వీధి మొత్తం వదికాక, నాలుగింటికి పోలీసు స్టేషనుకి వెళ్ళాము. ఆరింటికి కేసు రాసుకున్నారు. వెంకటస్వామిగారు వచ్చింతర్వాత ఆయనే మీదగ్గరకు వెళ్ళమని చెప్పారు.

మీ అమ్మాయి ఫోన్ ఇంట్లో ఉందా? తీసుకెళ్ళిందా“?

దాని దగ్గర ఫోన్ ఎక్కడిది బాబూ? మా దగ్గర ఫోన్ లేదు. ఎప్పుడైనా అవసరమైతే అమ్మగారే ఫోన్ చేసిపెడతారు“.

నిట్టూర్చాడు పాండు, అడ్డంగా తలూపుతూ. “మాలతి దగ్గర ఫోన్ ఉంది. నాకు తెలుసు. నాలుగు రోజుల క్రింద గమనించాను. ఎవరో రింగ్ చేస్తే వైబ్రేట్ అయ్యింది. ఇది ఎక్కడో బట్టలలో దాచుకుంది. వెంటనే బయటికెళ్ళి మెట్లమీదనుంచుని మాట్లాడింది“.

దాని దగ్గర ఫోన్ కొనడానికి డబ్బులేడియ్యి“ పంకజం విస్తుపోయింది. పంకజం వంక జాలిగా చూశాడు పాండు.

మాలతి ఎన్ని ఇళ్ళల్లో పనికి వెళుతుంది“?

అయిదిళ్ళు బాబూ. అంటే ఈ ఇల్లు గాకుండా“.

పాండు ఏమీ మాట్లాడలేదు. తానే చెప్పాలని అర్థమయ్యింది పంకజానికి. ఇదే వీధిలో తాసిల్దారుగారింట్లో చేస్తది. ప్రక్కన బజారులో బ్యాంకాయన దగ్గర, వాళ్ళన్న దగ్గర. అంటే పక్కపక్కన ఇళ్ళే. ఆపై వీధిలో ఉన్న ఇద్దరు పంతుళ్ళ ఇళ్ళల్లోనూ చేస్తుంది“.

తాసిల్దారుగారింట్లో ఎవరెవరుంటారు“?

ఆయన రిటైర్డు తాసిల్దారు బాబూ. మొగుడూ పెళ్ళాలిద్దరే ఉండేది“.

పిల్లలు“?

అమ్మాయికి పెళ్ళయ్యింది. అమెరికాలో ఉంటది. అబ్బాయి చిన్నోడు. హైదరాబాదులో ఉంటాడు. శనాదివారాలకు వచ్చి పోతుంటాడు“.

సరే. మిగతా ఇళ్ళల్లో“

"బ్యాంకోళ్ళ ఇంట్లో మొగుడూ పెళ్ళాలతోబాటు వాళ్ళ పిల్లలుంటారు. పెద్దాయనకు ఇద్దరబ్బాయిలు. చిన్నాయనకు ఇద్దరమ్మాయిలు. పెద్దాయనింట్లో వాళ్ళమ్మ కూడా ఉంటుంది. పిల్లలందరూ పదేళ్ళ లోపు వాళ్ళే". ఆగి ఊపిరి పీల్చుకుంది పంకజం. "ఇహ పంతుళ్ళింట్లో మాత్రం, సంగతే వేరు. ఒకాయన బ్రహ్మచారి. ఆయనతోబాటు అమ్మా, నాన్న, పెళ్ళికెదిగిన చెల్లెలు ఉంటారు. మగోళ్ళయితే అసలు కనబడరు. అంతా ఆ పిల్ల పెత్తనమే. ఎప్పుడైనా వాళ్ళమ్మ మాట్లాడతది. రెండో ఇంట్లో ఐతే కొత్తగా పెళ్ళయినోళ్ళు. ఇద్దరే ఉండేది".

ఒక్క క్షణమాగి పాండు అడిగాడు "మొదటింట్లో ఉండే అబ్బాయి ఈమధ్య ఏమైనా వచ్చాడా"?

"నిన్న శనివారం కదా, మొన్న రాత్రి వచ్చుంటాడు".

"ఎప్పుడు వెళతాడు"?

"ఈ రాత్రికి వెళతాడు"

"ఒకసారి వాళ్ళింటికి వెళదామా"? ఫోన్ చేసి సి.. మురళిని ఇంటికి పిలిచాడు పాండు. జీవితంలో అన్నీ మనకు నచ్చేవే ఉండవు, చేయము. చాలా విషయాలు మనకు నచ్చనివి చేయాలి. మురళికి, పాండుకు ఒకరంటే ఒకరికి పడదు. కానీ, ఇద్దరూ నోర్మూసుకుని ఇంకొకరితో కలిసి పని చేస్తారు. పాండుకు, పోలీసుగా మురళి అవసరం. మురళి డిపార్టుమెంటుకు పాండు అవసరం. అలా సంబంధం లేని రెండు సంబంధాలతో వీళ్ళిద్దరూ ముఖాలి చిట్లించుకునైనా సరే కలిసి పనిచేస్తారు.

పాండు ఫోన్ చేసేటప్పటికి స్నానం చేసి పెళ్ళాం చేసిన పెసరట్లు తినడానికి కూర్చుంటున్నాడు మురళి. ఆదివారం ఉదయం ప్రశాంతంగా టిఫిన్ చేయడమనేది పోలీసోళ్ళకి అరుదైన అవకాశం. ఆ సమయంలో ఫోన్ మ్రోగగానే అంతవరకూ శరీరంలో ఉన్న శక్తి మొత్తం ఒక్కసారిగా ఉడిగిపోయినట్లయింది మురళికి. డిపార్టుమెంటు కూడా కాదు. పాండు. ఇది మరీ ఘోరం. కాదనడం చాలా సులువు. కానీ, ఈ ప్రబుద్ధుడు ఫోన్ చేశాడంటే చాలా ముఖ్యమైన విషయం అయ్యి ఉంటుంది.

చెప్పు“.

పెసరట్లు బాగా కరకరలాడుతున్నట్లున్నాయ్“

చప్పున చుట్టూ చూశాడు మురళి. “ఎక్కడున్నావ్“ అంటూ.

ఓహ్, నిజంగానే పెసరట్లా. నేను ఊరికే అన్నాలేన్నా. తిన్నాక, టీ త్రాగడానికి మా ఇంటికి రా. వచ్చేప్పుడు ఆచేత్తోనే నాకూ ఓ రెండు పెసరట్లు పట్రా. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేయమని వదినకు చెప్పు“.

అరగంట తరువాత మురళి జీపు మూర్తిగారింటి ముందు ఆగింది. మురళి తెచ్చిన దోశలు తింటూ, పాండు విషయమంతా వివరించాడు. పెసరట్లు చూస్తూ సుందరముర్తి గుటకలు మ్రింగుతుంటే, “పిన్నీ, బాబాయిని లోపలకు పిలువు. నేను తింటుంటే నాకు దిష్టి పెడుతున్నాడు. మళ్ళీ కడుపు నెప్పి వస్తే కష్టం. ఏదన్నా ఉప్మా చేసి వుంటే ఆయనకీ పెట్టు“. అంతలోనే మాధవి రెండు ప్లేట్లలో ఉప్మా తెచ్చి మూర్తికి, పంకజానికి ఇచ్చింది.

* * *

గేటు త్రోసుకుని కృష్ణారావుగారింట్లోకి వెళ్ళాడు పాండు. వెనకే మురళి, సుందరముర్తి, చివరగా పంకజం. గుమ్మం తెరిచే ఉంది. నేరుగా లోనకెళ్ళాడు “ఏమండీ“. లోపలనుంచి ఒక పెద్దావిడ వచ్చింది. వస్తూనే పంకజాన్ని గుర్తుబట్టింది. ఏంటింత మందినేసుకుని వచ్చింది, గొడవచేయడానికా ఏమిటి? ఈ మనిషి కూడా లేరు మాట్లాడటానికి. సరిగ్గా ఇప్పుడే వెళ్ళాలా స్నానానికి అని మనసులోనే మొగుడిని తిట్టుకుంది. అంతలోనే ఉదయం మాలతి రాలేదన్న విషయం గుర్తుకు రాగానే కోపం వచ్చింది. అసలే ఓపిక లేదు. గంటసేపు నిలబడి గిన్నెలు కడగాల్సివచ్చింది. పంకజాన్ని చూస్తూ “నీ కూతురేదే, ఇవ్వాళ నాగా పెట్టింది“.

పంకజం కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు. “అది కనబడటం లేదమ్మగోరూ“.

ఏడుపాపమన్నట్లు పంకజానికి సైగ చేసి, “ముందు మీరు కూర్చోండి ఆంటీ. అంట్లు తోమి అలిసిపోయినట్లున్నారు“ అంటూ పాండు అక్కడున్న సోఫాలో కూర్చుని, మురళిని, మూర్తిని కూడా కూర్చోమన్నట్లు చేయూపాడు.

ఆమె మాట్లాడకుండా వాళ్ళెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని చెంగుతో ముఖం పైనున్న చెమటను తుడుచుకుంది. అప్పటికే పక్కన టీపాయ్ పైనున్న కృష్ణారావు ఫోన్ చేతిలోకి తీసుకుని “ఇప్పుడు చెప్పు పంకజం“ అని కథ మొదలెట్టిన పంకజాన్ని పట్టించుకోకుండా ఆ ఫోనుతో ఆడుకోడం మొదలెట్టాడు పాండు.

పంకజం కథ ముగిసేసమయానికి కృష్ణారావుగారు కూడా వచ్చారు. నడుముకు చుట్టుకున్న తువ్వాలుతోనే వస్తూ “నా లుంగీ ఎక్కడ“ అంటూ. హాల్లో అంతమందిని చూసి ఒక్కసారిగా ఆగిపోయారు. ఆయనకోసం పంకజం కథ మళ్ళీ మొదలెట్టింది. పాపం, కౌరవసభలో ద్రౌపదిలా ఆయన అలాగే నిలబడి మాలతి మాయమైన కథ విన్నారు.

కథ ముగియగానే “మీ అబ్బాయి ఎక్కడ అంకుల్“ పాండు ప్రశ్న.

రాత్రే వెళ్ళాడు“, ఆలోచించకుండానే జవాబిచ్చి “ఔనూ, వాడిగురించి ఎందుకడుగుతున్నావు“?

ఆయన ప్రశ్నను పాండు లెక్కచేయలేదు. “ప్రతిసారీ ఆదివారం వెళ్ళేవాడు, ఈసారి శనివారం ఎందుకు వెళ్ళాడు“?

ఎంతైనా ఒకప్పటి ప్రభుత్వోద్యోగి కదా. నడుముకు రెండు పక్కలా చేతులానించి నిటారుగా నిలబడ్డాడు కృష్ణారావు. “వాడి గురించి మీకెందుకు“?

మురళి కల్పించుకున్నాడు. “ముందు అడిగిందానికి సమాధానం చెప్పండి సార్“. మురళిని చూడగానే డిపార్టుమెంటు అని ఆయనకు అర్థమయ్యింది. ఒక్క నిముషం తమాయించుకున్నాడు. అనవసరంగా కెలుక్కోవడం దేనికని అనిపించింది. “ఆఫీసులో ఏదో అర్జంట్ మీటింగ్ ఉందన్నాడు“.

సమాధానమిచ్చినా తననే చూస్తున్న మురళిని, పాండును చూసి “వాడి ఉద్యోగం గురించి మాకు పెద్దగా తెలీదు బాబూ“.

ఏ కంపెనీ“?

ఎదురు మాట్లాడకుండా బల్లపైనున్న స్టాండునుంచి కొడుకు విజిటింగ్ కార్డు తీసిచ్చాడు కృష్ణారావు. కార్డు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు మురళి. “ఇంటి అడ్రస్ ఒక కాగితంపై వ్రాసి ఇవ్వండి“. కృష్ణారావు మారుమాట్లాడకుండా ఒక పేపరు తీసుకుని రాయడం మొదలెట్టాడు.

పాండు మళ్ళీ మొదలెట్టాడు “నిన్న ఎన్ని గంటలకు బయలుదేరాడు“?

రాత్రి రెండున్నరకు. ఓలా బుక్ చేసుకున్నాడు“

మీ వాడికి కారు లేదా“?

ఉంది కానీ, అది హైదరాబాదులో తిరగడానికి వాడతాడు. వచ్చి పోయేటప్పుడు మాత్రం ఓలానే“.

మీవాడికి ఒకసారి ఫోన్ చేస్తారా“?

ఇందాకే మాట్లాడాడు. చేరానని చెప్పాడు. సాయంత్రం వరకూ మీటింగులో ఉంటానని, ఫోన్ చేయవద్దని చెప్పాడు“.

ఒకసారి రింగ్ చేయండి“.

కృష్ణారావు రింగ్ చేసి స్పీకరు ఆన్ చేశాడు. సతీష్, అదే కృష్ణారావు కొడుకు ఫోన్ స్విచాఫ్ అని ఫోన్ బాల చెప్పింది.

సరే సార్, వస్తాం“ పాండుతో బాటు అందరూ లేచారు.

* * *

అందరూ పోలీసు కంట్రోల్ రూముకు చేరుకున్నారు. పంకజాన్ని ఇంటికి పంపించాడు మూర్చి. మా ఇంట్లో ఉండు. ఏదైనా తెలిస్తే చెబుతామని చెప్పి పంపాడు మూర్తి. మురళి ఓలాకు ఫోన్ చేసి సతీష్ ప్రయాణించిన కారు నంబరు, డ్రైవరు పేరు, నంబరు అడిగాడు.

అంటే, ఏకారు సార్“, ఓలా కాల్ సెంటర్ అమ్మాయి వీళ్ళకి తెలియని సమాచారం ఇచ్చింది. “రెండు కార్లు బుక్ చేశారు సార్. ఒకటి సతీష్ గారికి, ఇంకోటి భారతిగారికి“. మాలతి పేరు వాడలేదని అర్థమయ్యింది మురళికి.

రెండు కార్ల వివరాలూ నోట్ చేసుకున్నాడు మురళి. అడక్కుండానే మాలతి ఫోన్ నంబరు దొరికింది. మాలతిని తీసుకెళ్ళిన కారు డ్రైవరుకు ఫోన్ చేశాడు. గంటన్నర క్రింద ఎర్రగడ్డలో ఒక ఇరానీ హోటలు దగ్గర డ్రాప్ చేశానన్నాడు డ్రైవరు. రెండు కార్లూ కలిసే వెళ్ళాయి. అరవై దాటకుండా, ఏ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకుండా ప్రయాణించారు. సతీష్ బాగానే జాగ్రత్తలు తీసుకున్నాడనిపించింది.

మాలతి నంబరుకు ఫోన్ చేశాడు మురళి. స్విచాఫ్ చేసి ఉంది. ఈ పాటికి ఆ సిమ్ కార్డు పారేసి ఉంటారు. ఇప్పుడేం చేయాలన్నట్లు పాండు వంక చూశాడు మురళి. “ఎర్రగడ్డ సి..కి ఫోన్ చేయన్నా. మనం బయలుదేరుతున్నామని చెప్పు“.

ఎర్రగడ్డ సి.. రాజిరెడ్డితో మాట్లాడి కేసు వివరించాడు. సతీష్ ఆఫీస్ అడ్రస్, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్, మాలతి ఫోటో, అన్నీ వాట్సప్ చేశాడు మురళి. ఆలోపల పాండు ఓలాలో ఒక ఇన్నోవా బుక్ చేసి రెడీగా ఉన్నాడు. తనపైని ఎస్.పి.గారికి ఫోన్ చేసి తాను పాండుతో హైదరాబాదు వెళుతున్న విషయం తెలిపాడు మురళి. “వెరీ గుడ్, నేను అక్కడి కమీషనరుగారితో మాట్లాడతాను“ ఆయన ఆశ్వాసనం ఇచ్చాడు.

వీళ్ళు ఎర్రగడ్డ చేరుకునేప్పుటికి నాలుగున్నరయ్యింది. పంకజాన్ని కూడా తీసుకెళ్ళారు. సతీష్ అప్పటికే స్టేషనులో ఉన్నాడు. పంకజాన్ని చూడగానే అతని ముఖం రంగు మారింది. అతని దగ్గరకు పంకజం వెళ్ళబోతే సుందరమూర్తి వారించాడు. పంకజాన్ని చూసిన వెంటనే ఫోన్ చేయబోతుంటే ఫోన్ లాక్కున్నాడు మురళి. లోపలికెళుతూనే “ఏమైనా చెప్పాడా“ అడిగాడు మురళి రాజిరెడ్డిని.

అబ్బే, లే. ఇప్పుడే తోల్కొచ్చినం. అరగంట క్రిందే ఇంటికి వచ్చిండు. లేవదీసుకొచ్చినం“. రాజిరెడ్డి కానిస్టేబుల్ వైపు తిరిగి సతీషును తెమ్మన్నాడు.

రాజిరెడ్డి ఎదురుగా మురళి, మూర్తి కూర్చున్నారు. ప్రక్కనున్న స్టూలుపై గోడకానుకుని కూర్చున్నాడు పాండు. అతని ప్రక్కన నిలబడింది పంకజం.

సతీష్ లోపలకు వచ్చి మౌనంగా నిలబడ్డాడు. ఏం మాట్లాడలేదు. తలెత్తి సతీషుని చూశాడు మురళి. చూడడానికి అమాయకంగానే ఉన్నాడు. అయిదూ రెండుంటాడు. పొట్టోడనే చెప్పొచ్చు. కానీ మాంఛి రంగు. టార్న్ జీన్సు, టీ షర్టులో ఉన్నాడు. రెండువేల రూపాయలు పెట్టి కొన్న ఇంపోర్టెడ్ స్లిప్పర్స్. ఒక్క మురళి ఏంది, అందరూ సతీషువైపే చూస్తున్నారు. తల తిప్పి పాండును చూశాడు మురళి. అంగీకరిస్తున్నట్లు చిన్నగా తలూపాడు పాండు. ఒక్క ఉదుటున లేచి సతీష్ గవదలు పగిలిపోయేలా కొట్టాడు మురళి. ఆ ఊపుకు తూలి నాలుగడుగుల దూరంలోనున్న బీరువాపై పడ్డాడు సతీష్.

సతీష్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మెల్లగా లేచి మురళి వైపు చూశాడు. కాళ్ళు సన్నగా వణకసాగాయి. మురళి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. రాజిరెడ్డి వైపు తిరిగి “కొంచెం టీ తెప్పించన్నా“ అన్నాడు. రాజిరెడ్డి కానిస్టేబుల్ వైపు చూశాడు. అతడు మాట్లాడకుండా బయటికెళ్ళాడు టీ చెప్పడానికి.

మళ్ళీ లేవబోయిన మురళిని ఆపాడు పాండు. సతీషువైపు తిరిగి “మాలతి ఎక్కడ ఉంది“?

సతీష్ కళ్ళల్లో కంగారు. భయం. మెల్లగా “తెలీదు“.

పాండు లేచాడు “నీకు తెలుసు“. దగ్గరకొచ్చి సతీష్ భుజం మీద చెయ్యి వేశాడు. “పద తీసుకొద్దాం, నువ్వు దారి చూపిస్తావుగా“ అంటూ. సతీష్ కదల్లేదు. పాండు ముందుకు వంగి సతీష్ చెవిలో చెప్పాడు “నువ్వు ఆలస్యం చేసి ఆ అమ్మాయికి ఏమైనా అయినా, లేదూ ఆ అమ్మాయి దొరక్కపోయినా రేపీపాటికి నువ్వు రెండు శవాలకు కొరివి పెడతావు“. భయంగా చూస్తున్న సతీష్ చెంపపై తట్టాడు. “ఆ అమ్మాయికి ఏం కాకూడదని కోరుకో. అవసరమైతే ఫోన్ చేయి. నానుంచి అమెరికాలో ఉన్న నీ అక్క కూడా సేఫ్ కాదు. పదమూడో రోజుకు వస్తుంది కదా“ సతీష్ కళ్ళల్లోకి చూసి నవ్వాడు పాండు “మళ్ళీ తిరిగి వెళ్ళదు. నన్ను నమ్ము. నువ్వు మాలతికి ఏం ప్లాను చేశావో, దానికి వంద రెట్లు మీ ఇంట్లో వాళ్ళు అనుభవించేలా చేస్తాన్నేను“.

పంకజాన్ని అక్కడే ఉండమని చెప్పి మిగతా వాళ్ళందరూ బయలుదేరారు. సతీషును తమతో తీసుకెళ్ళాడు పాండు. ఇంకో జీపులో రాజిరెడ్డి నలుగురు కానిస్టేబుల్సును తీసుకుని వచ్చాడు. నేరుగా కూకట్ పల్లి శివార్లలో ఉన్న కొత్త అపార్టుమెంటుకు తీసుకెళ్ళాడు సతీష్.

పోలీస్ జీపు చూడగానే వాచ్ మన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు సారంటూ. “ఏ ఫ్లాటో తెలీదు. కానీ, ఈ బిల్డింగులోనే ఉంది“.

రాజిరెడ్డి వాచ్ మన్ ను పిలిచి పొద్దున్న వచ్చిన అమ్మాయి ఏ ఫ్లాటని అడిగాడు. తెలియక చూస్తున్న వాడిని చూసి సతీష్, యాదగిరిది ఏ ఫ్లాటని అడిగాడు. మెయిన్ గేట్ మూయించి తాళం వేయించాడు రాజిరెడ్డి. తాళం చెవి తీసుకుని ఒక కానిస్టేబులును అక్కడుంచి, వాచ్మనును తమతో రమ్మన్నాడు. ఏడో ఫ్లోర్. ఏడొందల మూడు బెల్ కొడితే ఒక మధ్య వయస్కురాలు తీసింది. ముందు లోనకు రానివ్వకుండా అరవబోయినా, పోలీసులను చూసి పిల్లిలాగా మారింది. మూడు బెడ్ రూములలోనూ ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. మాలతి లేదు. “నాకేం తెల్వదు సార్. నేను ఇక్కడ వంటమనిషిని మాత్రమే“ అంది డోరు తెరిచిన మహిళ.

నీ పేరేంది“?

యశోద సార్“

తనతో ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు చాలరని గ్రహించి రాజిరెడ్డి కంట్రోల్ రూముకు ఫోన్ చేసి అదనపు బలగాలను కోరాడు. పక్కనున్న ఫ్లాట్లు కూడా తెరిపించాడు. ఆ ఫ్లాట్లల్లో మొత్తం ఇరవైమూడు మంది అమ్మాయిలు దొరికారు. వాళ్ళు పోలీసులను చూసి కంగారుపడ్డారు. అందరికీ ఎక్కువ జీతానికి సినిమాయాక్టర్ల ఇళ్ళల్లో పాచిపనీ, వంటపనీ, తోటపనీ అని చెప్పి తీసుకువచ్చారు. ఆ ఫ్లాట్లన్నీ యాదగిరివే. అతడొక మోస్తరు బిల్డరు. సోషల్ వర్కరునని చెప్పుకుంటాడు.

యశోదా, ప్రతి ఆదివారం ఇంతమంది వస్తారా“? అక్కడికి వచ్చిన తరువాత పాండు అడిగిన మొదటి ప్రశ్న.

లేద్సార్. అంటే నాకేం తెలీద్సార్. నేను వచ్చిందే మొన్న. నాలుగు రోజులు అమ్మాయిలకు వంటలు చేయాలంటే వచ్చినా. అంతకంటే నాకేం తెల్వద్. కావాలంటే కిచెన్ చూడండి సార్“.

పాండు కిచెన్ లోకి వెళ్లాడు. అక్కడ నీళ్ళు త్రాగడానికి ఒక గ్లాసు తప్ప ఇంకేమీ లేవు. అంటే కిచను పై ఫ్లోర్లో ఉంది సార్. కళ్ళు మూసుకుని తల పట్టుకున్నాడు పాండు. రాజిరెడ్డిని చూసి “అన్నా, ప్రతి ఫ్లాటూ తెరిపించండి“ అన్నాడు.

మొత్తం కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి పదిన్నరయ్యింది. మొత్తం నలభై ఎనిమిది మంది అమ్మాయిలు దొరికారు. మాలతి కూడా ఉంది. ఇంకొక టీం యాదగిరి ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుంది. అతన్ని అమ్మాయిలున్న బిల్డింగు వద్దకు తీసుకు వచ్చారు. ఆ బిల్డింగ్ మాత్రం తనదేనని, కాని తనకు అక్కడున్న అమ్మాయిలతో సంబంధం లేదన్నాడు యాదగిరి. అసలు వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వచ్చారో తానే కేసు పెడతానన్నాడు. సతీషును ముందుకు తోశాడు రాజిరెడ్డి.

యాదగిరిని చూసి నీళ్ళు నమిలాడు సతీష్. రాజిరెడ్డి వైపు చూసి, “అంటే, నేను ఈయనను ఎప్పుడూ కలవలేదు. ఫర్హాన్ అనే అతనే నన్ను ఇక్కడికి రమ్మంది“ తలవంచుకున్నాడు. లాగిపెట్టి కొట్టాడు రాజిరెడ్డి. “మరి ఇంత సేపు ఎందుకు చెప్పలేదు బే“ అంటూ. ఫర్హాన్ నంబర్ ఇచ్చాడు సతీష్.

పాండు యాదగిరి ఫోన్ ఇవ్వమని అడిగాడు. “ఎవ్వురు తమ్మీ నువ్వు? నీకు నా ఫోన్, నేనిచ్చుడేంది? నేనెవరో ఎరుకనా నీకు“? అతని మాటలు పూర్తయ్యే లోపల గూబ పగిలిపోయింది.

అసలే ఆకలేసి చికాకు దొబ్బుతుంటే, నీ లొల్లేందిబే“ రాజిరెడ్డి గొంతు బాగా కర్కశంగా ఉంది. యాదగిరి మారుమాట్లాడక ఫోన్ పాండు చేతిలో పెట్టాడు. కాంటాక్ట్స్, కాల్ హిస్టరీ చూసి పాండు యాదగిరికి ఫోన్ తిరిగి ఇచ్చి, “ఫర్హానుకు ఫోన్ చెయ్యి“.

ఏం మాట్లాడకుండా ఫోన్ చేశాడు యాదగిరి. అడ్రస్ చెప్పి పది నిముషాలలో రమ్మన్నాడు. ఫర్హాన్ సందు మలుపు తిరిగి బిల్డింగు దగ్గరున్న పోలీసు జీపులు చూడగానే బైక్ వెనక్కు తిప్పాడు. చీకట్లో నిలబడ్డ కానిస్టేబుల్ వెంటనే అతడి పైకి లంఘించి కాలర్ పట్టుకుని కిందకు నెట్టాడు. పైకి లేవనీకుండా నేలపైనే అదిమి పెట్టి రెండు చేతులూ వెనక్కు విరిచి పట్టుకుని సంకెళ్ళు వేసేశాడు. ఎంతైనా మధ్యతరగతివాడు కదా. ఎక్కువ రిస్క్ తీసుకోడు.

పంకజాన్ని స్టేషను నుంచి పిలిపించారు. తల్లిని చూడగానే మాలతి ఏడుపు ముఖం పెట్టింది. అక్కడున్న పోలీసు రైటరులు ప్రతి అమ్మాయిని ప్రశ్నించి, వాళ్ళను తీసుకొచ్చిన సతీషులను, ఆ సతీషుల ద్వారా యాదగిరి దగ్గరకు తీసుకొచ్చిన ఫర్హానులనూ గుర్తుపట్టే ప్రయత్నం మొదలుపెట్టారు.

రాజిరెడ్డినీ, మురళినీ పక్కకు పిలిచాడు పాండు. ఈ ఫర్హాను గుంపు మొత్తం నా లెక్క ప్రకారం డ్రగ్స్ సప్లై చేస్తుంటారు. లేకపోతే ఇలాటి పోరంబోకుల కోసం అమ్మాయిలను ఎత్తుకొచ్చేందుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సాహసించరు. ఎటూ డ్రగ్స్ కొంటారు కాబట్టి వీళ్ళ క్లయింట్లే వీళ్ళకు పనివాళ్ళుగా మారారు. దీంట్లో రెండు పెద్ద కేసులున్నాయి. మీరు కొంచెం నెమ్మదిగా విచారించండి.

మాలతి, పంకజాలను తీసుకుని పాండు, సుందరముర్తి విజయవాడ బయలుదేరారు. మురళి ఆగిపోయాడు. ఆంధ్రానుంచి వచ్చిన అమ్మాయిలందరి వివరాలూ కనుక్కుని, వాళ్ళందరినీ ఇళ్ళకు చేర్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

* * *

మరుసటి రోజు పేపరులో మురళి, రాజిరెడ్డిల ఫోటోలు మొదటి పేజీలో అచ్చువేయబడ్డాయి. దొరికిన నలభై ఎనిమిది మంది అమ్మాయిలలో ముఫ్ఫైఆరు మంది ఆంధ్రానుంచి వచ్చినవారే. ఫర్హానులా ఇంకో ముగ్గురు ఏజెంట్లు యాదగిరికి అమ్మాయిలను మోసగించి తీసుకొచ్చిన వాళ్ళకి మధ్య ఉన్నారు. మొత్తం యాభైరెండుమంది అరెస్టయ్యారు. యాదగిరి, అతని ఏజెంట్లు తప్ప మిగిలినవారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులూ, బ్యాంకు ఉద్యోగులూ, వ్యాపారస్థులూ, నలుగురు ప్రభుత్వోద్యోగులూ ఉన్నారు. కృష్ణారావుకు తమ కొడుకు ఘనకార్యం మరుసటిరోజు ఉదయం టీవీలో కనిపించింది. పెళ్ళాన్ని తీసుకుని బయల్దేరి హైదరాబాదు వెళ్ళాడు. తరువాత రోజు అతను పోలీసు స్టేషనుకి వెళితే సతీషును కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్ళారని తెలిసింది. ఆటో మాట్లాడుకుని కోర్టుకు వెళ్ళారు. మిగతా నిందితులతో కలిసి కోర్టు బయటే ఉన్నాడు సతీష్. రాజిరెడ్డిని గుర్తుపట్టి అతని దగ్గరకెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నాడు కృష్ణారావు. కొడుకుతో మాట్లాడాలంటే మాట్లాడవచ్చని, ఇంకా అరగంట సమయముందని చెప్పాడు రాజిరెడ్డి. సతీష్ దగ్గరకెళ్ళి నిలబడ్డారు తలిదండ్రులిద్దరూ. మీడియా వాళ్ళు కెమెరాలను వీళ్ళవైపు తిప్పడం వాళ్ళు గమనించలేదు.

అమ్మా, నాన్నలను చూడగానే సతీష్ ముఖం విప్పారింది. రెండురోజులుగా పరిచయం లేని నిందితులతో కలసి ఉండటం అతనికి బాగా ఇబ్బందిగా ఉంది. తండ్రిని చూడగానే “లాయరును మాట్లాడావా నాన్నా“ అడిగాడు.

ఒక్క క్షణం కొడుకు వైపు చూశాడు కృష్ణారావు. మెల్లిగా వంగి కాలి చెప్పు తీసు ఎడా పెడా కొట్టసాగాడు. అతని భార్య కూడా నివ్వెరపోయి చూడసాగింది. రాజిరెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చి “ఆగు పెద్దాయనా, ఆగు“ అని కృష్ణారావును పక్కకు లాగాడు. సతీష్ ముఖం అవమానంతో ఎర్రబడింది.

చిన్న పిల్లరా అది. అమాయకురాలు. ఛీ, నువ్వు మనిషివట్రా. నీకూ ఒక అక్క ఉంది కదరా“ ఆయన నోటికొచ్చినట్లుతిడుతూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు. టీవీ వాళ్ళు ఆయన వెనకపడకుండా చూశాడు రాజిరెడ్డి.

డ్రగ్స్ గురించి న్యూస్ లీక్ చేయలేదు పోలీసులు. విచారణ నడుస్తూంది. దాదాపు పాతికమందిని అదుపులోకి తీసుకుని యాదగిరి ఫ్లాట్లలో ఉంచి విచారిస్తున్నారు. యశోద వాళ్ళందరికీ వండి పెడుతూంది.

* * *

మరుసటి ఆదివారం. తెల్లారుఝాము తొమ్మిది గంటలు. చీకటి గుహల్లో గబ్బిలాలలా పాండు, సుందరముర్తి నిద్రపోతున్నారు.

గేటు తెరుచుకుని లోనకొచ్చారు కృష్ణారావు దంపతులు. వాళ్ళ వెనుకే వచ్చారు పంకజం, మాలతి.

మాధవిని చూడగానే ముందుకెళ్ళంది పంకజం. “పాండు బాబు కోసం వచ్చారమ్మా“.

మీరు కూర్చోండి. వాడు రావడానికి కనీసం పావుగంటైనా పడుతుంది“ మాలతి పైకెళ్ళబోయింది. “పంకజం, ఆ కుర్చీలు వెయ్యి“ అంటూ.

మెట్లు దిగుతున్న పాండును చూడగానే లేచి నించున్నాడు కృష్ణారావు. భుజానున్న సంచీ లోంచి పత్రాలు తీసి అతని చేతిలో పెడుతూ, “నా కొడుకు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు బాబూ“ అన్నాడు.

పాండుకేమీ అర్థం కాలేదు. ఈరోజునుంచి, పంకజం మాతోనే ఉంటుంది. ఆ ఇల్లు దాని పేర రాసేశాను. అవి రిజిస్ట్రేషను కాగితాలు. వింటున్న పంకజానికి మతి పోయింది. “ఏందయ్యగోరూ“ అంటూ ఏదో చెప్పబోతే మాధవి వారించింది.

పంకజాన్ని తీసుకుని అతను వెళ్ళగానే మాధవి పాండును చూసింది “నీ మూలంగా చాలా మంది ఆడకూతుళ్ళ బతుకులు చెడకుండా ఆగిపోయాయి పాండూ. సరైన సమయానికి నువ్వు చొరవ తీసుకున్నావు. లేకుంటే, అమ్మో, ఊహించుకోడానికే భయం వేస్తుంది“.

నవ్వాడు పాండు. సుందరముర్తి వైపు తిరిగి "చూశావా బాబాయ్, ఈ కేసులో అసలు బ్రెయిన్ వాడాల్సిన పనిలేదు. మనం చేసింది టిపికల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. అసలు పోలీసుల దగ్గర వర్క్ లోడ్ తక్కువగా ఉండుంటే, వాళ్ళే ఈ కేస్ సాల్వ్ చేసేవాళ్ళు" అన్నాడు.

చిన్నగా నవ్వి తల అడ్డంగా ఊపాడు సుందరముర్తి. "లేదురా, నిజంగానే పోలీసోళ్ళు పంకజం ఫిర్యాదుకు వెంటనే రెస్పాండ్ అయి సతీష్ కోసం వెతికి ఉంటే, మాలతి హైదరాబాదు చేరగానే పోలీసులకు దొరికేది. కానీ, మిగతా వాళ్ళు ఎవరూ దొరికే వాళ్ళు కాదు. భయంతో సతీష్ మాలతిని అమ్మేస్తున్న విషయం చెప్పడు. మాలతికి కూడా ఏమీ తెలీదు. తనంటత తానే వెళ్ళింది కాబట్టి కేసు కూడా పెద్దగా ఏమీ ఉండదు. మిగతా అమ్మాయిలందరినీ ప్లాన్ ప్రకారం బాంబేకి పంపేవాళ్ళు. ఇక డ్రగ్స్ కేసు విషయమైతే అసలు బయటికే వచ్చేది కాదు“. పాండు భుజం తట్టాడాయన.

అంతలో ఇంటిముందు పోలీస్ జీపు ఆగింది. గేటు తోసుకుంటూ మురళి వచ్చాడు. చేతిలో చిన్న గిఫ్ట్ ప్యాకెట్ ఉంది.

ఏంది, నువ్వు కూడానా అన్నాయ్“ అరిచాడు పాండు. నవ్వుతూ లోపలనుంచి గోల్డ్ ప్లేటెడ్ వాచ్ తీసి పాండు చేతికి తొడిగాడు మురళి. “ఇది హైదరాబాదునుంచి. హోమ్ మినిస్టర్ గారు పంపారు“.

మరి మా బాబాయికి“?

నేను కొనిస్తాలే“ నవ్వుతూ చెప్పాడు మురళి.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు