మనిసికి ఇలువెప్పుడొస్తాది..? - ఇందు చంద్రన్

Manisiki Iluveppudostaadi

సింత సెట్టు కింద కూసోని రోడ్డు మీద వొచ్చి పొయ్యే వాళ్ళని సూస్తా ఉండాడు అరవైఐదేళ్ళు పైబడిన సుబ్బయ్య

ఇంతలో అటపక్కగా వొచ్చిన సినబ్బ సుబ్బయ్యని సూసి " ఏం సుబ్బన్నా ఎప్పుడొచ్చినేవు ?

అన్నాడు నవ్వతా

" తెల్లార్త వొచ్చినా సినబ్బా ఎట్టుండావు ? ఇంట్లోవోళ్ళు ఎట్టుండారు అన్నాడు సుబ్బయ్య నవ్వతా

"బాగుండార్నా , ఏంది పండక్కి రాకుండా వుత్తి రోజుల్లో వొచ్చినావు అన్నాడు సినబ్బ

"ఏం లేదు సినబ్బా , సిన్న పనుంటేను , మా ఇంటావిడకి పించినికి రాసినారు కాగితాలు కావాలన్నేరు సవరాలు పెట్టాలంటే వొచ్చినేము అన్నాడు సుబ్బయ్య

"ఆ సరే సరే , అట్ట ఇంటి పక్క రావొచ్చు గదా అన్నాడు సిన్నబ్బా

"వొస్తాలే సినబ్బా అన్నాడు సుబ్బయ్య నవ్వాతా

"ఇందా అంటూ బీడి ముక్కని ఇచ్చినాడు సినబ్బా

"నేనిప్పుడు బీడీ కాల్చేది లేదు సినబ్బా , ఈ మద్దిన దగ్గు ఆయసమొస్తే ఆస్పిటల్ కి పోయినా ఇంక

బీడి కాలిస్తే నిన్ను , ఈ తూరి కాల్చేస్తారు అన్నేరు అన్నాడు నవ్వతా

"అట్నా అంటూ బీడి ఎలిగించి పొగ వొదల్తా వున్నేడు సిన్నబ్బా

" సూరోడు , ఊసెబ్బా అందరూ ఎట్టుండారు అన్నాడు సుబ్బయ్య

"అంతా బాగుండారు , ఒక తూరి పొయ్యి సూసేదానికి ఏవి ? టౌనుకి పొయ్యొచ్చి బాగా మనిసి

తేరుకున్నేవు అన్నాడు భుజం పై తడుతూ

సుబ్బయ్య నవ్వతా " అందురు అట్నే అంటాండారు , నడిస్తే ఆయసమొస్తాండాది , రేత్రిల్లో దగ్గు

కాళ్ళు వొణకతా ఉంటాది వయుస్సు అయిపోయింది గద సినబ్బా అన్నాడు

"ఇంక ఈడనే ఉండి సూసుకోవచ్చు గదా సుబ్బన్నా , మీ వోడు , అమ్మి బాగా ఉండారు సుసుకుంటారు గదా అన్నేడు సినబ్బా

"ఆ సుసుకుంటారు అని కొడుకు మాట్టాడిన మాటలు తల్సుకున్నేడు

"మీరు ఇద్దురు మా మానం తీసేదానికే వుండారు , దుడ్డు గావాలంటే ఇస్తాం గదా అట్ట వాచిమెన్ గా

ఉంటా ఎందుకు మా మానం దీస్తారు ? అన్నాడు కొడుకు

"ఏం మానం దీసేసినాం రా? మా చేతనయిన పని సేసుకొని ఉండేది మీకు మానం పోతాండాదా? మీ

సదువులకి ఉద్దేగాలకి ఇచ్చిన దుడ్డు ఏం పనిసేస్తే వొచ్చినాయి ? అని తిరగబడి అరిచేసినాడు

సుబ్బయ్య

"అప్పుడు మనికి ఏది లేదు నాయనా , ఇప్పుడు నేను ఉండా గదా సూసుకునేదానికి ఆ పని ఇడిసి

పెట్టి ఊర్లో గౌరవంగా ఉండండి అన్నాడు

"ఏందే ? గౌరవంగానా ? బాగా ఎదిగిపోయినాక ముందు సేసిన పనిని అసింకం అనుకునేదానికన్నా

దరిద్రం ఇంకోటి ఉంటాదా? నువ్వు మమ్మల్ని సూడబల్లే ఒంట్లో ఒప్పిక ఉన్నకాడికి

సంపాయించుకుని తింటాం నీకు మరీ అట్ట మా వల్ల మానం బోతే మాయమ్మా నాయన

సచ్చిపోయినారు అని సెప్పుకో అని ఫోను కట్ సేసి కూర్సున్నాడు

ఆ మాటలు గుర్తుకు రాంగానే సుబ్బయ్య మనుస్సు ఒక మాదిరి అయిపోయినాది.

రోడ్లో కూసోని వొచ్చి పోయే వాళ్ళని పలకరిస్తా ఉన్నేడు , తెలిసినోళ్ళ ఇండ్లకి పోయి పలకరించి

మాట్టాడినాడు

సందేలకి ఇంటిపోతే లచ్చవమ్మ గ్యాస్ పొయ్యి మీద వొండతా ఉంది

"బిన్నే సేసేమే , ఈ రోజు ఆంకిలిగా ఉండాది అన్నాడు నవారు మంచం మీద పండుకుంటా

"ఏంది ఆడ తొమ్మిదైతే గాని తినవు ఈడ ఏడింటికే ఆంకిలి ఆంటాండావు అంది లచ్చివమ్మ

"ఏవో ఊరి గాలి తగిలిండ్లా అన్నాడు నవ్వతా

"మావో మర్సిపోయినా పోస్టాపీసులో గట్టినాం గదా? నిన్న నువ్వు సవరాలు పెట్టేసొచ్చినాంక ఆ

పిల్లోడొచ్చి లచ్చా ముప్పై ఐదు వేలుండాయి రేపు తెచ్చిస్తా అన్నేడు , ఆ దుడ్డు ఏడైనా వొడ్డి కిస్తే

మనకి వొడ్డి వొస్తాది , ఇంట్లో ఉన్నే ఆ పెట్లో పెట్టుగోవాల గదా అంది

"వొద్దు లచ్చివే , వొడ్డి కట్టే బాధ ఎట్టుంటాదో మనకి తెలుసు గదా? ఎంత బంగ పడినాము , పిల్లకాయల

సదువు పెండ్లిళ్ళకి సేసిన అప్పు కి వొడ్డీలు కట్టలేక వూరొదిలి పోయి ఆడ ఇన్నేళ్ళు ఉండిపోయాము , మళ్ళీ ఈ డబ్బుని వొడ్డికి ఇచ్చి ఇంకో ఇంట్లో వాళ్ళని ఆ కస్టాల్లో తోసేయ్యాల బ్యాంకులో ఏసుకొందాం కావాల్సివొస్తే తెచ్చుకుందాం లేకుంటే పోస్టాపీసులోనే ఉండనియ్యి అన్నాడు

"సర్లే నువ్వెట్టంటే అట్ట అంది లచ్చవమ్మ

లచ్చివమ్మ పప్పు గుత్తి కవ్వంతో ఎనపతా ఉంటే " లచ్చివే నీకు ఆడ నచ్చిందా? ఈడ బాగుండాదా? అన్నాడు

"ఏంది మావా అట్ట అంటాండావు , నన్ను ఇడిసి పెట్టి నువ్వు ఒకనివే బోదామనా? నాకు సవితిని

ఏమన్నా తీస్కపోతాండావా? అంది సరసంగా

"నీకు సవితిని ఏడ తెచ్చేది మే , ఆడాడా ఎవుర్నో ఉంచుకుంటా ఉంటే నేను ఇన్నేళ్ళు అప్పుల్ని

ఉంచుకున్నే ఇప్పుడే గదా నిమ్మతిగా ఉండాము అన్నాడు నవ్వతా

లచ్చవమ్మ కూడా సుబ్బయ్యతో కలిసి నవ్వతా " ఈడ బాగుండాది మావ కాని ఆడ మనికి అన్నీ

సౌకర్యాలు ఉండాయి నీడలో పని మూడు పూటల మంచి తిండి ఆడ ఉంటే బాగుంటాది , ఈడ

ఎట్టున్నేము ఈయ్యాల మిగింది రేపు తింటాన్నేమ్ము , ఈయ్యాల ఏసుకున్న గుడ్డలు ఆరేదాక వుండి

ఒళ్ళికి బోసుకుంటా ఉన్నేము ఈయ్యాలటిది రేపటికి వాడకుంటా ఉన్నేము ఇప్పుడు ఏదో తింటా

నిమ్మతిగా ఉండాం గద మావ అంది లచ్చవమ్మ.

"ఆం అది నిజవే లే లచ్చివే అని లేచి ఇంటి ముందర అటిక మీదేసిన కాడిని నాగలిని సూసి చేత్తో

దాన్ని తడమతా ఉన్నేడు

"అయిపోయినాది మావ సంగటి సల్లంగ పోకముందే తిను అంది కంచంలో వేస్తూ

సుబ్బయ్య కూర్చుని సంగటి వంకాయ పుల్లగూర అద్దుకుని తింటా వున్నేడు

"ఇంకొంచెం ఏసేదా? అంది లచ్చవమ్మ సంగటి ముద్దని తుంచతా

"వొద్దు మే నువ్వు తిను , బాగుండేది సానాళ్ళయింది సంగటి దిని వాళ్ళిచ్చే మిగిలిన కూరలు అవి

తిని నోరు సప్పబడిపోయినాది అన్నాడు నవ్వతా

"ఇంగోరవ్వ ఏసుకో అంటే వొద్దంటావు అంది లచ్చవమ్మ

ఇద్దరూ మాట్టాడుకుంటా తిని పడుకున్నేరు.

మంచం మీద పడుకున్న సుబ్బయ్యకి పడుకోంగానే కండ్లు మూతలు బడతాఉన్నేయి

"ఏందో మే ఇయ్యాల అట్ట పడుకుంటేనే కండ్లు మూసకపోతాండాయి , ఆడ ఎట్ట తిరిగి పండుకున్నే

నిద్రబట్టదు అన్నాడు

"ఊరి గాలి తగిలిండ్లా అంది లచ్చవమ్మ నవ్వతా

"ఏందో మే లచ్చివే , నాగిలి భుజానేసుకుని మడిలో దిగి దున్ని , ఇంటికొచ్చి సాలి సాలకుండా ఉన్నే అన్నం తిని ఆ సెమట వాసనతో పడుకున్నే సరే నిద్ర అట్ట ముంచుకొచ్చేది ఆడ సావుకారి మాదిరి నీడలో ఉంటాంటే నిద్రే పట్టదు అన్నేడు బాధగా

"ఈ ఊర్లో ఎన్నేళ్ళుగా కస్టపడినావు , ఏం వొచ్చింది మావ , ఊర్లోవాళ్ళకి ఎంత సేసి ఉంటావు ?

అప్పులోళ్ళు ఇంటి మీద పడి అరిచినారు , నువ్వు పైరు బెట్టి పదిమందికి బువ్వ బెట్టాల

అనుకున్నేవు నీకేం వొచ్చింది మావ అప్పులు దప్ప , ఎవురన్న నిన్నిట్ట మతించినారా? నువ్వు

సెయ్యి జాపి అడిగితే ఒకరన్నా ఇచ్చినారా? ఎవురు లేనోళ్ళ మాదిరి ఆడకి పోయి ఏదో నాలుగు

రాళ్ళు జూసి ఎనకేసుకొచ్చినాము ఇప్పుడు నిన్ను సూసి వాళ్ళే మాట్లాడతాండారు , మనుసులు

కన్నా దుడ్డుకే ఇలువ ఎక్కువ అంది లచ్చివమ్మ బాధగా కళ్ళొత్తుకుంటూ

" ఇలువ అనేది మనిసిపోయినాక కూడా సెప్పుకోవలా మే , దుడ్డు ఇయ్యాల ఉంటాది రేపుపోతాది , దుడ్డుతో వొచ్చే మర్యాద దుడ్డుతోనే పోతాది లచ్చివే , పోయినాక సెప్పుకునేదానికి మన గురించి ఏంవన్నా ఉండాలమే అప్పుడే ఆ మనిసికి ఇల్లువొస్తాది డబ్బుతో గాదు అన్నాడు

"ఇట్ట నువ్వు జెప్పుకోవల అంతే అంది గొణుక్కుంటూ

“మన కాడిని సూత్తే కాడెద్దులు ఙాపకానికొచ్చినాయి , నాతో పాటు బారాన్ని అయికూడా మోసినాయి , ఈడ నుండి మనం అన్ని వొదులుకొని పోతాంటే నేను ఎట్ట బంగపడినానో లచ్చివే , ఆడ సేసిన పనిని కూడా నేను ఏ దినమూ తక్కువగా సూడలే , మనం సేసే పనిలో నిజాయితి ఉంటే ఉంటే సాలు కాక పోతే ఏంది ఊరొదిలి దూరంగా ఉంటాండానని బాధ , మడి సేన్లో దిగి మడక సేతబట్టేది లేదని బాధ అంతే అన్నాడు సుబ్బయ్య బాధగా

ఆయన మాటల్లో ఏదో తెలియని బాధ లచ్చవమ్మ చెవిన పడింది.

ఇంక పండుకో సామే , నువ్వు అయిపోయినోటి గురించి మాట్టాతాంటావు అంది పడుకుంటూ

సుబ్బయ్య కండ్లు మూసుకున్నేడు నీళ్ళు పట్టిచ్చిన మడిసేన్లో కాడెద్దులతో నాగలిని బట్టుకుని

దున్నతా ఉన్నాడు , సెమట మొకం మీద కారతా ఉంది మెల్లంగా నిద్రలోకి జారుకున్నేడు

తెల్లరినాక లచ్చివమ్మ పేడనీళ్ళు జల్లి " ఏం మావ ఐదైనా ఇంకా అట్నే పండుకోని ఉన్నావు ? అంది

సుబ్బయ్య ఉలకలేదు బలకలేదు

"ఓ మావ నిన్నే అంది ఇంకో తూరి అరస్తా సుబ్బయ్య లేవకపోయేసరికి లచ్చివమ్మ దగ్గిరికిపోయి తట్టింది ఒళ్ళంతా జిల్లుంగా ఉండాది .

లచ్చివమ్మా బెదిరిపోయి అరస్తా పక్కింటోళ్ళని పిలిసింది వాళ్ళొచ్చి సుబ్బయ్య సచ్చిపోయినాడని

సెప్పినారు .

లచ్చివమ్మా లబోదిబోమని అరస్తా ఏడస్తా ఉనింది

ఇంటి ముందర పందిట్లో పండబెట్టినారు సుబ్బయ్య ని వొచ్చినోళ్ళంతా పూలమాలేసి దణ్ణం పెట్టుకుని నిలబడి సూస్తాన్నారు

"నిన్న కూడా బాగున్నేడే , వాడికి ఊరంటే పానంలే అందుకే ఈడనే పానాలొదేసినాడు అన్నారు ఒకరు.

"మన సుబ్బడి వాటం ఎవురుకొస్తాదబ్బా ,ఎద్దుల్ని సంతలో జూసి కొనాలన్నే , ఎద్దుల్ని ఏరు

కట్టాలన్నే , నాట్నం నాటాలన్నే , మడి సేను దున్నాలన్నే , ఏ కాలంలో ఏ పంట ఎయ్యాలన్న , ఒక మంచి సెడ్డ సెప్పాలన్నఅన్నీ బాగా ఇవరంగా సెప్పేటోడు , ఎవురు అడిగినా నాకాడ లేదు అనే మాట వాడి నోట్లో నుండి రాదే అనాడు ఒకాయన.

"సుబ్బన్న ఇలువ తెలిసిన మనిసి ఆయన మాదిరి మనిసిని ఏడ జూల్లేబ్బా అని అన్నాడు ఇంకో

ఆయన

"అవునబ్బా...ఎంత సంపాయించి పిళ్లోళ్ళు బాగా ఉన్నే ఆయన కస్టం మీదనే బతికినోడు , ఈ పని

తక్కువ ఆ పని ఎక్కువ అని అనుకోడు సేసే పనిలో నిజాయితి ఉండాలా మనకి నచ్చాల అంటా

ఉంటాడు అన్నేరు ఇంకొకరు.

"సుబ్బన్న మంచి రైతే కాదు మనిసి విలువ తెలిసిన మనస్సున్నోడు అన్నాడు ఇంకోకాయ

"మనం సేసే ఏ పనైనా మనిసి పోయినాక మన గురించి గొప్పంగా సెప్పుకోవాల లచ్చివే అప్పుడొస్తాది

మనిసికి అసలైన ఇలువ డబ్బుతో గాదు అన్న మాట లచ్చివమ్మ సెవిలో ఇంకో తూరి ఇనపడింది

బాధగా సుబ్బయ్య వైపు సూసి " నువ్వు మనిసి ఇలువ తెలిసిన మనుసున్నోడివి సామే అంటూ పాడతా బావురుమంది.

మరిన్ని కథలు

Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ