కష్టాన్ని పంచుకుంటే - శింగరాజు శ్రీనివాసరావు

Kastaanni panchukunte

ఇరవై నాలుగు గంటలు వంట ఇంట్లో పడి చావడమే గానీ, ఒక్క తెలివైన పని చేద్దామని లేదు. ఏమేమి కొత్తరకం వంటలు చేద్దామా, ఎవరి ఒళ్ళు ఎలా పెంచుదామా.. ఇవే ఆలోచనలు నా కోడలికి. సరదాగ అత్తగారితో, పక్కింటి వాళ్ళతో కాలక్షేపం చేద్దామనే ధ్యాసే లేదు. కాస్త తీరిక దొరికితే ఆ కుట్టుమిషను వేసుకుని కూర్చుంటుంది. మొగుడి దర్జాకు తగ్గట్టు ఉందామనే ధ్యాసే లేదు" పంచలో కూర్చుని పదిమంది వినేలా అరుస్తున్నది మంగతాయారు. సహజంగానే నోరు ఎక్కువ మనిషి. ఈమధ్య అత్యుత్తమ టి.వి. సీరియళ్ళు చూసి అందులో అత్తగారి పాత్రలను ఆదర్శంగా తీసుకుని కొంచెం డోసు పెంచింది. ఆమె ఎన్ని మాట్లాడినా బెల్లం కొట్టిన రాయిలా ఉలకదు పలకదు వందన. తలవంచుకుని తన పని తను చేసుకుపోతుంది. భర్త కాలం చేసినప్పటి నుంచి కొడుకు ప్రభాకరం దగ్గరే ఉంటున్నది మంగతాయారు. చిన్నతనం నుంచి భర్తను అదుపులో పెట్టి చక్రం తిప్పిన కాంతామణి కావడంతో, వయసు మీదపడ్డా చావని అహం ఆమె నోటికి తాళం వేయలేక పోతున్నది. కొడుకు ప్రైవేటు కాలేజీలో ఫిజిక్సు లెక్చరరుగా చేస్తూ నెలకు ఓ యాభై వేల వరకు సంపాదించడంతో ఆమె కాలు భూమి మీద నిలవడం లేదు. భర్త జీవితంలో కోరిన ఒకేఒక్క కోరికను కాదనలేక ఆడపడుచు కూతురు వందనను కోడలిగా చేసుకున్నది. వందన డిగ్రీ పూర్తి చేసినా, ఉద్యోగం చేయాలనే ధ్యాస లేకపోవడంతో చదువురాని దానిలాగే చూస్తుంది కోడలిని మంగతాయారు. ఇవేవీ పట్టించుకోకుండా ఇద్దరు పిల్లలని చూసుకుంటూ పక్కా గృహలక్ష్మిలా ఉంటుంది వందన. " ఇదిగోండి అత్తయ్యా కాఫీ" అంటూ తెచ్చి ఇచ్చింది వందన. "అంతే కాఫీలు, టిఫిన్లు, భోజనాలు తప్ప, ఏదైనా స్కూలులో చేరి నాలుగు రాళ్ళు సంపాదిద్దామనే ధ్యాసే లేదు. సరేలే నీకు చెప్పినా ఒకటే, ఆ గోడకు చెప్పినా ఒకటే. ఇంతకూ సుహాన్ గాడేడి?" " మిద్దె మీద యోగా చేస్తున్నాడత్తయ్యా" " వీడొకడు. తల్లికి తగ్గ కొడుకు. మరి సంజన" " దానికి కరోన అని స్కూలు మూసేశారు కదా. ఏదో బొమ్మలు గీసుకుంటుంది" " అందరూ అందరే కొంపలో దద్ధోజనాలు. నా కొడుకు వస్తే తప్ప నాతో పలికే దిక్కేలేరు" "ఏంది నానమ్మా అరుస్తున్నావు. అమ్మే నన్ను బొమ్మలు వేసుకోమంది. స్కూలు లేదు కదా అని కాలాన్ని వృధా చెయ్యకుండా, ఏదైనా విద్య నేర్చుకో అంది. అందుకే నాకు ఇష్టమైన బొమ్మలు వేసుకుంటున్నాను. నేను చిన్నగా మొదలుపెడితే, తరువాత అందులో మెళుకువలు నేర్పుతానన్నది అమ్మ" అంటూ వచ్చింది పదేళ్ళ సంజన. " మీ అమ్మ దగ్గర ఆ కళలు కూడ ఉన్నాయా? చదువు తప్ప అన్నీ ఉన్నట్టున్నాయి. ఇదిగో గ్లాసు తీసుకుని, ఇక భోజనతయారీ మొదలుపెట్టు" అని వ్యంగ్యంగా అంటూ ఖాళీ గ్లాసు వందనకిచ్చింది మంగతాయారు. గ్లాసు అందుకుని లోపలికి నడిచింది వందన. 'ఏమిటో నానమ్మ ఎప్పుడూ కేకలేస్తూనే ఉంటుంది' అనుకుంటూ తల్లిని అనుసరించింది సంజన. ******* కరోన ఉదృతి ఎక్కువ కావడంతో అటు పిల్లల పాఠశాలలే కాదు, ఇటు కళాశాలలు కూడ మూసివేశారు. దాంతో అందరూ ఇంటిపట్టునే ఉండడంతో ఊపిరి సలపని పని అయింది వందనకు. రోజుకు ఆరు సార్లు కాఫీలు, భోజనం, మధ్యాహ్నం స్నాక్సు, అన్నీ చేరి క్షణం తీరిక లేకుండా అయిపోయింది వందనకు. నెల మొదలయి వారం గడిచినా జీతం అకౌంటులో పడకపోవడంతో, కాలేజీకి ఫోను చేశాడు ప్రభాకరం. ఎవరూ లిఫ్టు చేయలేదు. అంటే కాలేజి పూర్తిగా మూసేశారన్నమాట అనుకుని తన స్నేహితుడు రాజాకు ఫోను చేశాడు. "ఏరా రాజా. ఈ నెల జీతాలు పడలేదేమిటి?" "జీతాలేమిటిరా. మనదేమన్నా ప్రభుత్వ కళాశాల అనుకున్నావా ఠంచనుగా పడడానికి. అసలే కరోనా. కాలేజి జరిగితేనే సరిగా ఫీజులు కట్టరు. ఇక మూసేస్తే ఎవరు కడతారు. నేను మొన్న కరెస్పాండెంటు గారికి ఫోను చేశా. ఆయన చెప్పినదాన్ని బట్టి మనకు ఈ శెలవులలో జీతాలు ఇవ్వరని తెలిసింది" చావు కబురు చల్లగా చెప్పాడు. "మనం సెలవులు పెట్టలేదు కదా. కరోనా అని వాళ్ళే ఇచ్చారు. మరి మన జీతం కోస్తే ఎలా?" లా పాయింటు లాగాడు ప్రభాకరం. " లా పాయింటు లాగకు. మనది అరిటాకు జీవితం. ఏది జరిగినా చిరిగేది మన బ్రతుకులే. ఏదో ఇంకో మూడు నెలలు ఆగితే ఆన్ లైన్ క్లాసులు మొదలుపెడతారట చూద్దాం అప్పుడిస్తారేమో" " మరి జరిగేదెలారా ఈ మూడు నెలలు" " దాచుకున్న డబ్బు ఖర్చు పెట్టుకోవడమే. నేనయితే ఇక ఆ కాలేజీ మీద ఆశలు వదులుకున్నారా. తెరిచినప్పుడు చూడొచ్చులే అనుకుని, ప్రస్తుతానికి మార్కెట్ లో షాపు తీసుకుని పండ్లకొట్టు పెట్టబోతున్నాను. నువ్వు కూడ ఏదో ఒక దారి చూసుకో" ఉచిత సలహా పారేశాడు. " ఛ. ఇంత బతుకూ బతికి అలాంటి వ్యాపారాలు చేయడమా. ఒరేయ్ మనం పోస్టు గ్రాడ్యుయేట్సుమిరా" "అయితే మనకు ఆకలి ఉండదా. ఒరేయ్ చదువు అనేది మనకు విజ్ఞానాన్ని, సంస్కారాన్ని ఇవ్వడానికే గానీ, భేషజాలు పోవడానికి కాదు. నా దృష్టిలో దొంగతనం, రంకుతనం తప్ప, నిజాయితీగా చేసే ఏ పనీ తప్పుకాదు, అవమానం అంతకన్నా కాదు. నేనైతే ఫిక్సయి పోయాను. ఉంటానురా" అని ఫోను పెట్టేశాడు రాజా. ఒక్కసారిగా డీలా పడిపోయాడు ప్రభాకరం. లెక్చరరంటే పెద్ద హోదాగల వృత్తియని గొప్పలకు పోయి వందన మాట లెక్కచేయకుండా ఇష్టారీతిని ఖర్చులు పెట్టేశాడు. ఇప్పుడు బ్యాంకులో లక్ష కంటే ఎక్కువ లేదు. అది బొటాబొటిగా రెండు నెలలకు సరిపోతుంది. తరువాత కూడ ఉద్యోగం రాకపోతే...దిగులు కమ్ముకుంది ప్రభాకరానికి. ******* గత నెల రోజులుగా భర్తలో ఏదో తెలియని మార్పును గమనిస్తున్నది వందన. ప్రతి దానికి చిరాకుపడడం ఎక్కువయిందతనికి. అందరి భోజనాలు పూర్తయిన తరువాత మెల్లగా పంచలో ఒంటరిగా కూర్చున్న భర్త దగ్గరకు చేరింది. " ఏమండీ. ఎందుకు ఈమధ్య అదోలా ఉంటున్నారు. ఆరోగ్యం ఏమైనా బాగొలేదా" కింద కూర్చుంటూ అడిగింది వందన. " అదేంలేదు. బాగానే ఉన్నాను" "మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. నిజం చెప్పండి. కాలేజీ వాళ్ళు ఏమైనా చెప్పారా? నాకు కూడ చెప్పకూడని రహస్యమా అది" భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంది వందన. "అదికాదు వందనా. నీకు కాకపోతే ఎవరికి చెప్తాను. కరోన కారణంగా కాలేజి మూసివేశారు. ముందేమో సెలవులు ఇచ్చినా జీతాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేమో చేతులు ఎత్తేశారు. వచ్చే నెల నుంచి తరగతులు ఆన్లైన్లో జరుపుతాము అని చెప్తే సరేనని ఎలాగో సర్దుకున్నాము. తీరా నిన్న ఫోనుచేసి, ఆన్లైను క్లాసులకు మూడోవంతు స్టాఫ్ చాలని, నాతో సహా పదిమందిని తీసివేశారు. మరల అన్నీ సర్దుకుంటే అప్పుడు చూద్దామన్నారు. ఇప్పుడు ఏంచెయ్యాలో, అప్పటిదాక కాపురం ఎలా జరపాలో, నాకు తోచుబాటు కావడం లేదు. అమ్మకు ఈ విషయం తెలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తుందోనని భయంగా ఉంది" ప్రభాకరం మాటల్లో దిగులు తొంగిచూసింది. " ఇంతకాలం ఈ బాధను మీ మనసులో దాచుకున్నారా. నాతో పంచుకుంటే ఏదో ఒక మార్గం ఆలోచించుకునే వాళ్ళం కదా. అయిందేదో అయిపోయింది. ఇబ్బందులు వచ్చినపుడే మనసు దిటవు చేసుకుని పరిష్కారాలు ఆలోచించాలి. మీరు భేషజాలకు పోనంటే ఒక మార్గం చెబుతాను. వెంటనే కాదు అనకుండా కొంచెం ఆలోచించండి" "చెప్పు. ఇంకా భేషజాలేమిటి. కుటుంబాన్ని పస్తులు పెట్టేకంటే, మనల్ని మనం తగ్గించుకుని ఏదో ఒకటి చేయడమే" "ఏమండీ. నాకు తెలిసిన విద్యలు రెండే. ఒకటి వంటచేయడం. రెండు టైలరింగు. వంటలోని మెళకువలు బాగా తెలిసిన వ్యక్తి అత్తయ్య. ఆమె ఏమీ చేయనక్కర లేదు. నాకు ఏదైనా అనుమానం వచ్చి అడిగితే ఎలా చెయ్యాలో చెప్తే చాలు. నేనే చేసుకుపోతాను" "అంటే నువ్వు వంటలకు వెళ్తానంటావా" "అబ్బే కాదండి మనమే మన ఇంటిముందు కర్రీపాయింటు పెడదాము. దానితోపాటు పులిహోర, కరివేపాకు రైస్, పాలక్ రైస్, కొత్తిమీర రైస్ లాంటి ఏదో ఒక వెరైటీ రైసును రోజుకొకటి చేసి పెడదాము. ఎవరికైనా మరీ అవసరమై ముందుగా ఆర్డరు చేస్తే భోజనం కూడ పంపుదాము. ఇందులో నామూషీ పడవలసిన పనిలేదు. అన్నీ నేను తయారుచేస్తాను. మీరు తక్కువని అనుకోకుండా కౌంటరులో కూర్చుంటే చాలు" చెప్పి భయంభయంగా భర్తవంక చూసింది. ప్రభాకరానికి రాజా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నిజమే భేషజాలకు పోయి కడుపులు మాడ్చుకునే కంటే, తెలిసిన పని చేసుకుని తలెత్తుకు తిరగడమే మంచిదనిపించింది. "అంత శ్రమ పడగలవా వందనా" "మనకోసం మనం పనిచేసుకోవడంలో శ్రమ ఏమున్నది. అంటే అత్తయ్య నాలుగు మాటలంటుంది. బాగా బ్రతికిన మనిషి కదా. కష్టానికి ఎప్పుడూ అలవాటు పడని మనిషి. అంటే అననివ్వండి. నాకు అమ్మయినా, అత్తయినా ఆమే కదా. ఆమె ఏంమాట్లాడినా అది నా మంచికోసమే, అది నాకు దీవెనే. మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదండీ. మీకు కష్టమొస్తే మేమంతా చూస్తూ ఊరుకోగలమా. నామాట కాదనకండి. అందరం ఒకమాట మీద నిలబడితే, ఏకష్టమూ మన వాకిలి గడప కూడ తొక్కదు" అని భర్త చేతిని ముద్దుపెట్టుకున్నది వందన. "సరే నీ ఇష్టం. ప్రయత్నంలో తప్పేమున్నది" అని వందన మాటకు ఓటేశాడు ప్రభాకరం. పంచలోకి రాబోయి వీళ్ళను చూసి వీళ్ళ మాటలు వినాలనుకున్న మంగతాయారుకు, కోడలి మాటలు కళ్ళవెంట నీళ్ళు తెప్పించాయి. 'ఉద్యోగం ఊడగొట్టుకున్న కొడుకును పల్లెత్తు మాట అనకుండా, తనే ఒక ఆధారంగా నిలిచి కాపురానికి మూలస్తంభంగా మారాలనుకున్న కోడలి మంచితనానికి ఆమె మనసు కరిగిపోయింది. ఇంతకాలం ఎందుకూ పనికిరాదనుకున్న కోడలే ఈ రోజు అందరికీ తిండిపెట్టే దేవతగా మారింది. ఇంత మంచి బిడ్డకు నేను అత్తనుకాను, అమ్మనవుతాను. నేనుకూడ దానికి సాయం చేస్తాను' అని నిర్ణయించుకుంది. ******* భగవంతుడే కరుణించాడో, వీళ్ళ కృషే ఫలించిందో గానీ, ఊహించిన దానికంటే వేగంగా వ్యాపారం ఊపందుకుంది. ఖాళీ దొరికిన సమయంలో టైలరింగు చేస్తూ, దాని మీద కూడ కొంత సంపాదించడం మొదలుపెట్టింది వందన. ఎప్పుడూ మంచంలో కూర్చునే అత్తగారు వచ్చి ఆమెకు వంటలో సహాయం చేస్తుంటే, ఆమెలోని మార్పుకు ఆనందపడిపోయింది వందన. స్వతంత్రంగా బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎంతో ఆనందాన్ని ఇవ్వసాగింది ప్రభాకరానికి. ఇప్పుడతనికి వందన మాట వేదమయింది. ఎవరిమీద ఎవరికి అజమాయిషీ లేకుండా హాయిగా సాగిపోతున్నది జీవితం. "ఒరేయ్ ప్రభాకరం. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉండాలంటే బోరుగా ఉందిరా. వందన ఏమో కుట్టు మిషను ఎక్కి నాలుగు రాళ్ళు అదనంగా సంపాదిస్తున్నది కదా. మనం కూడ ఇంకేదయినా చేద్దాంరా" కొడుకును అడిగింది మంగతాయారు. "ఈ వయసులో ఇంకా శ్రమ ఎందుకే. ఏదో ఒక అతుకు అతుకుతూనే ఉన్నావుగా. చాల్లే విశ్రాంతి తీసుకో" అన్నాడు ప్రభాకరం. " ఇంతకు ముందంటే మంచాలు విరగదొక్కటం, పక్కవాళ్ళతో పోచుకోలు కబుర్లు, ఇవే జీవితం అనుకున్నారా. కానీ వందనను చూశాక ఖాళీ సమయాలను కూడ సద్వినియోగం చేసుకోవాలని ఉందిరా" "అయితే ఏంచేద్దామో నువ్వే చెప్పు" "అదేరా అదేదో ట్యూబులో ఈ మధ్య అందరూ వంటల గురించి చెబుతున్నారుగా. అలాగ మనం కూడ చెబుదామురా. నాకు తెలిసిన పాత వంటకాలను అందరికీ పరిచయం చేస్తాను. కూరలు, పొడులు, స్వీటు, హాటు, వెరైటీ వంటకాలు సుమారు వందరకాలు వచ్చు నాకు. దాన్ని కూడ ఎక్కువ మంది చూస్తే డబ్బులు వస్తాయటగా. మొన్న శకుంతల చెప్పింది. ఒక ప్రయత్నం చేద్దాంరా" తల్లి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి ప్రభాకరానికి. అమ్మలో ఎంత మార్పు. పాపం ఆశగా అడుగుతున్నది. ఒక ఛానల్ తెరిచి అమ్మ కోరిక తీరుద్దామని సరే అన్నాడు. అత్తగారు అంతగా అడుగుతుంటే వద్దు అని అనాలనిపించక వందన మౌనంగా ఉండిపోయింది. "మన ఇంట్లో మన వంటలు" అనే పేరుతో యూట్యూబు ఛానల్ తెరిచి మంగతాయారుకు తెలిసిన వంటలన్ని పెట్టారు. "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అన్న మాట నిజమన్నట్టు అనతికాలంలోనే లక్ష పైన వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఇంట్లో ఎవరూ ఖాళీగా గడపడానికి ఇష్టపడడం లేదు. పెద్దలతో పాటు పిల్లలు కూడ అలాగే తయారయ్యారు. యోగాలో ప్రావీణ్యత కోసం సుహాన్ ప్రయత్నిస్తుంటే, చిత్రలేఖనంలో పట్టు సంపాదించాలని సంజన పోరాడుతున్నది. వందన ఓర్పు, సహనం, తెలివితేటలు, కృషి వల్ల గాడి తప్పుతుందనుకున్న కాపురం బృందావన మయిందని మంగతాయారు అనుకోని రోజు లేదు. కుటుంబంలో అందరూ కష్టపడితే ఆ ఆనందం ఎలా ఉంటుందో అర్థమయింది మంగతాయారుకు. ***** అయిపోయింది ******

మరిన్ని కథలు

Pakkinti Anitha
పక్కింటి అనిత
- తాత మోహన కృష్ణ
Vruthi dharmam
వృత్తిధర్మం
- - బోగా పురుషోత్తం
నది తోసుకుపోయిన  నావ!
నది తోసుకుపోయిన నావ!
- కొత్తపల్లి ఉదయబాబు
Kadivedu neellu.2
కడివడు నీళ్ళు . ముగింపు
- రాము కోలా.దెందుకూరు.
Kadivedu neellu.1
కడివెడు నీళ్ళు. మొదటి భాగం.
- రాము కోలా.దెందుకూరు.
Lat Lat aar
లట లట ఆర్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Ettuku pai ettu
ఎత్తుకు పైఎత్తు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Devudu soottaantadu
దేవుడు సూత్తాంటడు..! (క్రీమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్