ఆదిత్య హృదయం - Dr PK.Jayalakshmi

Aaditya hrudayam

ఆరోజు ఆదివారం కావడంతో ఆఫీసులో పెండింగ్ లో ఉండిపోయిన ఫైలు చూద్దామని తీరిగ్గా ఓపెన్ చేశాను. ఎంతసేపు ఆలోచించినా కొలిక్కి రాకపోవడంతో ఇక లాభం లేదు ఆదిత్య ని ఇబ్బంది పెట్టాలిసిందే అనుకొని “ఒక ఫైల్ కి సంబంధించి కొన్ని డౌట్లున్నాయి మీ ఇంటికిరానా?” అంటూ ఫోన్ చేశా. “మోస్ట్ వెల్ కం” అన్నాడు.

ఆదిత్య నాకంటే రెండేళ్ళు సీనియర్. చాలా కష్టపడి పైకొచ్చాడు. బద్ధకం,కక్కుర్తి లేకుండా ప్రతి పని నా అన్న భావం తో చేస్తాడు.. ఆఫీస్ లో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాడు.మానవ సంబంధాల్లో లెక్కలు వేయకూడదని ప్రగాఢం గా నమ్మే వ్యక్తి. “రా రా పవన్ ! ఏంటి ప్రాబ్లెమ్?” అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు. నేను ఫైల్ చూపించి సందేహాలు వ్యక్తం చేయగానే తను నెట్ లో సమాచారం కోసం వెతికి నాకు వివరించాడు. లోపలినించి “నమ్రత కి తార్కాణంహనుమంతుడు. దాసోహం కోసలేంద్రస్య అని చెప్పుకున్నాడే గాని గొప్పలు చెప్పుకోలేదు.” అంటూ ఆదిత్య భార్య అహల్య గొంతు విన్పించింది.

ఆదిత్య చిరునవ్వుతో “ మన సంస్కృతి వంటబట్టాలని మా పిల్లలకి రోజూ పాఠాలతో పాటు ఇలా పురాణకధలు కూడా చెప్తూ ఉంటుంది పవన్ మా ఆవిడ.!. నా చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే పంచతంత్రం కధలు, గాంధీ, నెహ్రూ ల కధలు చెప్తూ ఉంటే. తెలియని ఉత్సాహం, పట్టుదల ఆవహించేవి. మా అమ్మ నాకు మంచి ప్రేరణ అనుకుంటానెప్పుడూ!......... .

అహల్యఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని స్కూల్లో టీచర్ గాపనిచేస్తోంది! పిల్లలు ఎదుగుతున్నారు కదా, వాళ్ళ అవసరాలు కూడా పెరుగుతాయి అనే ముందు చూపుతో కొంత మంది పిల్లలకి సాయంత్రాలు ట్యూషన్ కూడా చెప్తోంది.మా పిల్లలకి ట్యూషన్ ఖర్చు తప్పింది, పైగా మిగిలిన పిల్లలతో వీళ్ళు కూడా అంతసేపు కూచుని చదువుకుంటున్నారు., మా అమ్మ గుర్తొస్తుంది తనని చూస్తే. ఎంత పనయినా సహనం గా నవ్వుతూ చేసుకుపోతుంది. ఒక విధం గా తను నాకు మార్గదర్శి కూడా. ” అన్నాడు ఫైలు నా చేతిలో ఉంచుతూ. ఆదిత్య మాటలు నాలో ఆలోచనని మేల్కొలిపాయి. ఇవాల్టి నించి నేను కూడా కాసేపు మాఅమ్మాయి చదువు సంగతి చూసుకోవాలి. సంస్కారాన్నినేర్పాలి

******** ******* *******

ఆరోజు సాయంత్రం ఆఫీస్ నించి నేను ఆదిత్య నెలవారీ సరుకులు కొనడానికి ఎప్పటిలాగే సూపర్ మార్కెట్ కి వచ్చాము. అన్నీ కొనుక్కొని బిల్ కట్టడానికి వెళ్తుంటే “ ఆదీ! అటు చూడు, ఏదో ఆఫర్ పెట్టాడు” అంటూచూపించాను... మూడు వేలు పైగా సరుకులు కొంటే బకెట్ ఫ్రీ అట. బిల్లు చూస్తే రెండువేల నాలుగువందలే అయింది. “ఇంకో ఆరువందలకి ఏమైనా కొంటాను ఆదిత్యా” అన్నా. “ఏం కొంటావ్? కావాల్సినవన్నీ తీసుకున్నావు కదా?” ఆశ్చర్యం గా అడిగాడు ఆదిత్య. “ఏవో ఒకటి!” అంటూ డ్రింక్ సీసాలు,జామ్, పచ్చళ్లు,పొళ్ళు, ఏవేవో ట్రాలీ లో పడేయసాగాను.. “నూటయాభై రూపాయల బకెట్ కోసం ఇవన్నీ కొనడం అవసరమా? ఇవేవీ మన ఇళ్ళల్లో వాడరు....కొన్నాళ్ళకి బైట పారేయడమే తప్ప. ఎందుకు అనవసరమైన ఖర్చు?వస్తువు అవసరమైతే షాప్ కి రావాలి తప్ప, వస్తువు చూసి అవసరం గుర్తు చేసుకోకూడదు., టైమ్ వేస్టు, డబ్బువేస్టు!” అంటూ అవన్నీ వెనక్కి పెట్టించేశాడు. ఇంకేమీ మాట్లాడలేకపోయాను.. మర్నాడే అనుకోకుండా వచ్చిన అవసరమైన ఖర్చుకి ఆ ఆరువందలు ఆదుకోవడంతో ఆదిత్య పట్ల గౌరవం రెట్టింపయ్యింది నాకు.

ఆదిత్య ని కలిసి ‘’ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్.మొన్న ఆరువందలు మిగలడం వల్ల ఇవాళ నాన్న కళ్ళజోడికి సరిపోయింది. లేకపోతేఇవాళ అప్పు చేయాల్సి వచ్చేది.” అన్నా కృతజ్ఞతలు చెప్తూ.

“ ఫ్రీ ఆఫర్ చూస్తాం గాని ఎంత డబ్బు వదిల్తే అది చేతికి వస్తుందో గమనించం. నాన్నగారు చెప్తూ ఉండేవారు... డబ్బు సంపాదించడం కంటే వివేకంగా ఖర్చు పెట్టడం గొప్ప కళ అని. అవసరమైన చోట ఆలోచించకూడదు, అనవసరంగా పైసా కూడా వృధా చేయకూడదు అని చెప్తూ డబ్బు, నీళ్ళు, మాట ఈ మూడూ పొదుపుగా వాడుకోవాలిరా ...ఖర్చు పెట్టాక వెనక్కి తీసుకోలేము అనేవారు. నిజంగా నాన్నగారు నాకు మంచి ఇన్స్పిరేషనల్ ఫ్రెండ్!” ఆర్ధ్రత నిండిన స్వరం తో అన్నాడు ఆదిత్య. ప్రతిసారి నేను తన దగ్గర నించి ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉన్నాను.

******* ******** ********

మా బాస్ తన కొడుకు పదిహేడో పుట్టినరోజు సందర్భం గా పెద్ద హోటల్లో మా అందరినీ డిన్నర్ కి ఆహ్వానించారు. మేమిద్దరం ఆదిత్య బైక్ మీద బైలుదేరాం. దార్లో వినాయకుడి గుడి దగ్గర ఆగి ,దర్శనం చేసుకొని దూరం గా కన్పిస్తున్న సముద్రాన్ని చూస్తూ కాసేపు గుడి ఆవరణలో కూచున్నాం. సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు ఆదిత్య “నీకో విషయం తెల్సా పవన్? ఇవాళ మా మాస్టారు మోహన్రావు గారి పుట్టినరోజు. ఆయన నా మార్గదర్శి”. అన్నాడు ఆకాశం లో నిండు చందమామ ని తదేకం గా చూస్తూ..“నేను ఎనిమిదో తరగతి లో ఉన్నపుడు, నా స్నేహితుడు కుమార్ అని ఉండేవాడు.తండ్రి లేడు. తల్లి నాలుగిళ్ళల్లో పని చేసి వాణ్ణి చదివించేది. పూట గడవడమే కష్టం. వాడు ఒకనాడు పుట్టినరోజు చేసుకుంటా, ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలంటూ డబ్బుల కోసం తల్లిని వేధిచడంతోఆవిడ మాస్టారికి మొర పెట్టుకుంది.

మాస్టారు ఆరోజు మా అందరికీ చేసిన హితబోధ ఎప్పటికీ మర్చిపోలేను. “పుట్టినరోజు జీవితం లో అతి ముఖ్యమైనదే. చిన్నప్పుడు తల్లిదండ్రులు వేడుకగా చేయడం,కొంచెం పెద్దయ్యాక స్నేహితులతో పార్టీలు చేసుకోవడం!. తల్లిదండ్రుల కష్టార్జితం తో పుట్టినరోజు చేసుకోవడం గొప్పకాదు.ఇతరులు మీ పుట్టినరోజు గుర్తుపెట్టుకొని వేడుకగా జరిపే స్థాయికి ఎదగాలి. మీ పుట్టినరోజున పార్టీ లకి పెట్టే ఖర్చుతో అనాధలకి కడుపు నిండా అన్నం పెట్టండి. మీకది ఆశీర్వాదం అవుతుంది. ఆయన మాటలు అక్షర సత్యాలు పవన్! అందుకే మా పిల్లల పుట్టినరోజులప్పుడు అనాధాశ్రమంలో పళ్ళు, బిస్కెట్లుపంచి కాసేపు అక్కడ గడిపి వస్తాము.దీని వల్ల పిల్లల్లో, సేవాభావం కలగడమే కాకుండా తాము ఎంత అదృష్టవంతులో కూడా తెలియవస్తుంది. కొంతైనా సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడ్పడగలిగితే మానవ సంబంధాలు పటిష్టమవుతాయి కదా!” ఆదిత్య ఉద్వేగభరితం గా చెప్తున్న మాటలు అమృత గుళికల్లా తోచాయి.

******* ******* *******

ఆఫీస్ లోకి రాగానే ఆదిత్య కి ప్రమోషన్ తో పాటు ఉద్యోగ రత్న అవార్డ్ కూడా వచ్చిందన్న వార్త విని ఆనందానికి లోనయ్యాను.. వెంటనే ఆలింగనం చేసుకొని అభినందించాను. శనివారం ఆఫీస్ ఆవరణ లోఘనంగా ఏర్పాటయిన వ్యవస్థాపక దినోత్సవ ఫంక్షన్లో సీఈవో ఆదిత్య ని పుష్పగుచ్చం,శాలువా,అవార్డ్ తో సన్మానించి ఈ విజయానికి ప్రేరణఎవరో చెప్పమని కోరడం తో ఆదిత్య మైక్ ముందుకొచ్చాడు. ” ఎందరోనాకు మార్గదర్శులు. కానీ ఈ విజయానికి మాత్రం నా పిల్లల భవిష్యత్తే ఇన్స్పిరేషన్. పిల్లలిద్దరికి పెద్ద చదువులు చెప్పించి సమాజం లో ఉన్నతమైన హోదా లో చూడాలన్నదే నా ఆశయం..అది నెరవేరాలంటే నాకు ప్రస్తుతం వస్తున్న జీతం పెరగాలి. ప్రమోషన్ వస్తేనే జీతం పెరిగేది. నేను మరింత కష్టపడి పనిచేస్తేనే కదా ప్రమోషన్ వచ్చేది. మేధస్సుకి మరింత పదును పెట్టుకొని పూర్తి అంకితభావం తో కష్టపడ్డాను.... ఇలా పరోక్షంగా దిశానిర్దేశం చేసి నన్ను విజయపథం లో నిలబెట్టిన నా పిల్లల ఉజ్వల భవిష్యత్తే నా ప్రేరణ... నిజం.” జయజయధ్వానాల మధ్య ముగించాడు.

మరిన్ని కథలు

Chinni aasha
చిన్ని ఆశ..!
- ఇందుచంద్రన్
Taraalu antaranga raagaalu
తరాల అంతరంగ రాగాలు
- సి హెచ్.వి యస్ యస్.పుల్లం రాజు
Sneha dharmam
స్నేహ ధర్మం
- వెంకటరమణ శర్మ పోడూరి
Nirnayam
నిర్ణయం
- జీడిగుంట నరసింహ మూర్తి
Toli prema
తొలి ప్రేమ..!
- ఇందుచంద్రన్
Nakka vaibhogam
నక్క వైభోగం
- నిశ్చలవిక్రమ శ్రీ హర్ష