నిర్ణయం - జీడిగుంట నరసింహ మూర్తి

Nirnayam

"నాన్నా రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి "

"అదేమిటమ్మా అలా అడుగుతున్నావు . నేను ఎప్పుడూ ఖాళీనే. రోజంతా స్కూల్లో బిజీగా వుండే నువ్వు నాతో మాట్లాడతానంటే నేను చాలా అదృష్టవంతుడిని. . బహుశా నువ్వు నీ పెళ్లి విషయం గురించే అడగాలని అనుకుంటున్నావు కదూ"

“ అవును నాన్నా! నా పెళ్లి గురించి మీరు తొందరపడకండి. ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు.ఒకటి మాత్రం నిజం. ఖచ్చితంగా మీరు తెచ్చిన పెళ్లి సంబంధాన్నే చేసుకుంటాను. నాకంటూ నిర్ధుష్టంగా కొన్ని అభిప్రాయాలు వున్నాయి. తల్లి తండ్రులు ఎంత దుర్భర పరిస్తితిలో వున్నా , అప్పో సొప్పో చేసి పిల్లల పెళ్లిళ్లు చెయ్యడానికి సర్వ శక్తులూ ఒడ్డుతున్నా వాళ్ళను ఏ మాత్రం లక్ష్యపెట్టక ఎవరో ముక్కూ మొహం తెలియని వాడి ఆకర్షణలో అమాయకంగా చిక్కుకుని నేటి యువత తమ దారి తాము వెతుక్కుంటూ ఆనక నిండు జీవితాలను నిలువునా బుగ్గిపాలు చేసుకుంటున్న పరిస్తితులు ప్రతి రోజూ మనకు ఎక్కడో అక్కడ తటస్త పడుతున్నా కూడా ఎవ్వరిలోనూ ఈషణ్మాత్రం మార్పు రావడం లేదు. ఎవరినో ఎందుకు అనుకోవాలి ? నీ పెద్ద కూతురు అదే నా అక్క మాధవి దీనికి ఏమీ అతీతం కాదు. దాని పెళ్లి చెయ్యడానికి చచ్చీ చెడి మీరు ఒక పక్క అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా కూడా తనకి నచ్చిన వాడితో ఎగిరిపోయింది. ఇటువంటి వాళ్ళకు పెళ్ళినాడు అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ధర్మేచ , అర్దేచ , కామేచ ,నాతిచరామి అనే పదాలకు అర్ధం చేసుకుని నడుచుకునే సంస్కారం ,ఆస్కారం ఎక్కడ దొరుకుతుంది ? నేనూ ఈ నాటి యువతరంలోని దానినైనా కూడా అటువంటి హేయమైన సొంత నిర్ణయాలు తీసుకుంటూ తప్పటడుగులు వెయ్య దల్చుకోలేదు. . మొన్న మీరు నా పెళ్లి విషయంలో ఎవ్వరితోనో మాట్లాడుతూ వుంటే విన్నాను . . . రాబోయే నా పుట్టినరోజు నాటికైనా నా పెళ్లి చేయాలని మీరు , అమ్మ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడుతోంది. అక్కలా నేను కూడా నా దారి నేను చూసుకుంటానన్న భయం మీలో బాగా పాతుకు పోయింది . పెళ్లే జీవిత పరమావది కాదు. చదువుకున్నాను. ప్రస్తుతం నేను ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను . ఇంత త్వరగా నిర్ణయాలు తీసుకుని మీ గుండెలమీద కుంపటి దించుకోవాలని అనుకోకండి. కొంతకాలం ఆగండి. . ఈలోపు నేను ఎటువంటి పరిస్తితులలోనూ మీకు తలదించుకునే పరిస్తితి తేబోనని హామీ ఇస్తున్నాను ““ అంటూ మనసులోని ఫీలింగ్స్ బయట పెడుతూ వుంటే విశాలిలో అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు ఉబికాయి.

పెళ్లి గురించి ఒక స్తిరమైన అవగాహన కలిగిన విశాలి ఎంతో కాలం నుండి అంతర్లీనంగా తన గుండెల్లో గూడుకట్టుకున్న మాటలను ఏ మాత్రం దాచుకోకుండా బయటపెడుతూ వుంటే జీవితం పట్ల ఆమె కెటువంటి భయాలు , సందేహాలు లేవని ఆమె మాటలలో స్పష్టమవుతోంది . .

ఉద్యోగం చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకుంటున్న తన కూతురు ప్రస్తుత సమాజ బలహీన ధోరణులకు పూర్తిగా అతీతమైన వ్యక్తి అని ఆయన మనసులో బలపడ్డాక ఇప్పుడు ఆయన ముఖంలో ఎటువంటి అలజడి లేదు . ఏ మూలనో తన రెండవ కూతురు విశాలి కూడా తన అక్క నడిచిన దారిలోనే నడుస్తుందేమో నన్న భయం విశ్వనాధంలో ఒక మూల హెచ్చరిస్తున్నా ఇప్పుడు కూతురు తన స్పష్టమైన తన అభిప్రాయాలు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాక అప్పటివరకూ ఆయనలో పేరుకుపోయిన స్తబ్ధత , సందిగ్దత ఒక్కసారిగా పటాపంచలయ్యాయి. కూతురి పట్ల ఆయన మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.

“అలాగేరా తల్లీ . నువ్వు నీ అక్కలా అనాలోచిత నిర్ణయాలు తీసుకోవని నాకు తెలుసు. నీ మంచి మనసుకు తగ్గట్టు నీకు తగిన మొగుడిని తీసుకురావడానికి ఇల్లు తాకట్టు పెట్టైనా సరే నేను వెనక్కి పోయే ప్రశ్నే లేదు . ఇక నువ్వు నిశ్చింతగా వుండు. నువ్వు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నా ఇంట్లో ఉదయించావు. నా సెంటిమెంట్ ప్రకారం అదే రోజు అంటే వచ్చే నీ పుట్టినరోజునాటికైనా మన ఇంట్లో పెళ్లి భాజాలు మోగాలని నా ఆశ. ఏ నాటికైనా మేము కుదిర్చిన సంబంధమే చేసుకుంటాను అని నువ్వు చెప్పాక నాకు కొండంత ధైర్యం వచ్చింది . . తల్లి తండ్రులకు గౌరవం ఇచ్చి వాళ్ళు వేసిన బాటలో నడిచిన పిల్లలకు జీవితంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగే స్టైర్యమ్ , ధైర్యం, సమాజం నుండి అండ వాటంతట అవే సమకూరుతాయి . “ అన్నాడు హాయిగా గుండెలనిండా వూపిరి పీల్చుకుంటూ .

స్కూలు నుండి వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయ్యాక రేపు పిల్లలకు చెప్పాల్సిన పాఠాలకు సంబంధించిన పుస్తకాలను తిరగేస్తోంది విశాలి. ఇంతలో ఆమె సెల్ ఫోన్ రింగయ్యింది. అక్క మాధవి ఫోను. ఈ మధ్య ఆమె నుండి సమాచారమే లేదు. ఎక్కడ వుంటోందో కూడా ఎవరికీ తెలియదు. రెండు నిమిషాల సేపు ఫోను రింగవడం ఆగిపోయాక మళ్ళీ చేసినట్టుంది అవతలినుండి అక్కగారు.

" హాయ్ అక్కా ఎలా వున్నావు ? ఎక్కడున్నావు నువ్వు ఫోన్ చెయ్యడం సర్ప్రైజింగ్ గా వుంది" అంది విశాలి ఆశ్చర్యపోతూ.

" నా గురించి తర్వాత చెపుతాను కానీ ముందిదిచెప్పు . నాన్న నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నాకు నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు ? ఓకే చెప్పేద్దాం అనుకుంటున్నావా ? వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తలవంచుకుని తాళి కట్టించేసుకోవాలని అనుకుంటున్నావా ?"

" లేదు అక్కా . నువ్వు అలా వెళ్లిపోయాక నాన్నా , అమ్మ ఒకటే కుమిలిపోతున్నారు. ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఉన్న ఇల్లు అమ్మేసి నాకు పెళ్లి చేసేసి బాధ్యతలనుండి విముక్తులు కావాలని చూస్తున్నారు. నిజానికి మా స్కూల్లో నాతో పనిచేస్తున్న టీచర్ చాలా కాలంగా నన్నెంతో ఇష్టపడుతున్నాడు. పెళ్లి చేసుకుందాం అని తొందరపెడుతున్నాడు. ఒక పక్క నాన్న , అమ్మ పరిస్తితి చూశాక మూలిగే నక్కమీద తాటికాయ పడినట్టు నా గురించి చెప్పేస్తే అస్సలు తట్టుకోలేరు. అందుకే నాన్న తెచ్చిన సంబంధాన్నే తప్పకుండా చేసుకుంటాను అని ఆయన్ని నమ్మించాను. అయితే పెళ్లి వెంటనే వద్దు కొంత కాలం ఆగాలి అని చెప్పాను. అంతే కానీ నా భవిష్యత్తు ఆలోచించకుండా ఎవరో దారినపోయే దానయ్యను ముడేస్తానంటే నేనెలా ఒప్పుకుంటాను ? పరిస్తితులు ఎలాగైనా వుండనీ. నేనూ నీదారిలోనే నడవాలని అనుకుంటున్నాను. నా దృష్టిలో నువ్వు ఏమీ తప్పు చేయలేదు. నీ బాగోగులు నిర్ణయించుకోవడంలో నీకు అధికారం ,హక్కూ ఉంది. ఈ రోజు ఉండి రేపు పోయే వాళ్ళ కోసం మన భవిష్యత్తును పణంగా పెట్టడం మూర్ఖత్వం. అది సరే నువ్వెక్కడున్నావో తెలియక తల్లడిల్లిపోతున్నాను . నా విషయం నీతో చెప్పి నీ సలహా తీసుకోవాలని ఒకటే ఆతృతగా వున్నాను.ఇకనుండి నీతో టచ్ లో వుంటాను. ఇదే నెంబర్ కదా నీది . నీతో మళ్ళీ మాట్లాడతాను సరేనా ?" అని ఫోను పెట్టేసింది విశాలి.

వారం రోజులతర్వాత విశాలిని చూసుకోవడానికి మగ పెళ్లివారొచ్చారు.

“ఎప్పుడో చిన్నప్పుడు చూశాను మీ అబ్బాయిని నేను విజయవాడలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు” అన్నాడు విశ్వనాథం పెళ్లికొడుకును నిలువెత్తునా చూసి ఆశ్చర్యపోతూ . ఆయనలో పాత జ్ఞాపకాలు వెల్లువలా బయటకొచ్చాయి . పెళ్లికొడుకు తండ్రి మాధవరావు గారు , తన తండ్రి పూర్వాశ్రమంలో సహ ఉపాద్యాయులు అన్న విషయం విశాలికి వాళ్ళిద్దరూ చనువుగా మాట్లాడుకుంటూ వుంటే అర్ధం అయ్యింది. వాళ్ళిద్దరూ టీచర్లుగా ఒక చోట పనిచేసినప్పుడు అప్పటికి తనకు పూర్తి ఊహ రాలేదు .

“అయ్యా మాధవరావుగారు! అబ్బాయికి , మీ ఉభయులకు మా అమ్మాయి నచ్చిందని ఒక్క మాట చెపితే ఇక రేపు రాబోయే ఉగాది నాటికి ముహూర్తాలు ఖాయం చేసుకోవడానికి నా ప్రయత్నాలు చేసుకుంటాను ” అన్నాడు విశ్వనాధం ఉత్కంఠతతో ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తూ.

"అదేమిటి విశ్వనాధం గారు మన స్నేహ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకిరువురికీ లేదంటారా ? మనిద్దరి మనస్తత్వాలు మొదటినుండి ఒక్కటే. ఇక ఈ విషయంలో మీరు సంశయించాల్సిన అవసరమే లేదు " అన్నాడు మాధవరావు . ఆయనలో ఎటువంటి హిపోక్రసీ కనిపించడం లేదు..

విశ్వనాధం ముఖంలో ఇప్పుడు ఎంతో రీలీఫ్ కనిపించి కొత్తగా ప్రాణ వాయువు పీలుస్తున్నట్టుగా అనిపించింది. . తన రెండవ కూతురు విషయంలోనైనా తను ఇప్పుడు విజయం సాధించాడు. తనని తన పెద్ద కూతురిలా అల్లరిపాలు కాకుండా పూర్తిగా సహకరించిన విశాలికి మరోసారి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. .

పెళ్లి వారు వెళ్ళిపోయిన ఒక గంట తర్వాత మాధవినుండి విశాలికి ఫోను వచ్చింది. . గబగబా వెళ్ళి తీసింది విశాలి.

"ఎంతవరకొచ్చింది నీ ప్రణయలీలలు ? " అంది మాధవి అవతలినుండి .

"త్వరలో ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. బహుశా నా పుట్టినరోజు నాటికి పెళ్లి ఖాయం కావచ్చు " అంది విశాలి

" మంచి శుభవార్త చెప్పావు విశాలీ.పెళ్లి కొడుకు నిన్ను ప్రేమించిన వాడేగా ? నాతో పోల్చుకుంటే నువ్వు చాలా మెతకదానివని అందరూ అనుకుంటూ ఉంటారు . ఇంతకీ నాన్నను ఎలా ఒప్పించావ్ ?" ఆశ్చర్యంగా అడిగింది మాధవి.

"మాధవీ ఇక్కడ నీకో విషయం చెప్పాలి. నా ప్రేమ కధ ఒక కల్పితం. అయితే నా కల్పిత హీరో ఒక టీచరైతే ఇప్పుడు నిజజీవితంలో హీరో ఒక జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్. ఇది నాన్నకు చిన్నప్పటినుండి తెలిసిన సంబంధం. ఇంతకు ముందుకు నేను నీతో మాట్లాడింది పూర్తి అబద్దం. నేను నీ ట్రాప్ లో పడతానని ఎలా అనుకున్నావు?. నీలా నేను తప్పు చెయ్యదల్చుకోలేదు. ఇదే నా నిర్ణయం. బై. ..ఇక నువ్వు నాకు ఫోన్ చెయ్యాల్సిన అవసరం లేదు. " అని విశాలి మాధవి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది .

అనుకోకుండా గదిలోకి వచ్చి ఫోన్ సంభాషణ విన్న విశ్వనాధం గారి గుండెల్లో విశాలి హిమాలయ పర్వతం అంత ఎత్తుకు ఎదిగిపోయింది. ******

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి