తొలి ప్రేమ..! - ఇందుచంద్రన్

Toli prema

“మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళల్లో ఏలా ఈ వేళా..కోరుకున్న గోరింకను చేరదేల రామ

చిలుక ఏలా వేళా ...ఆవేదనే ఏ నాటికి మిగిలింది నాకు...అన్న మౌన రాగంలో పాట విసిపిస్తూ ఉంది లోపల నుండి

బయట వరండాలో బనియన్ తో భుజం మీద కండువా తో పేపర్ చదువుతున్న సత్యనారాయణ ఆ

పాట వినగానే పేపర్ పక్కన పెట్టి అలా జారగిలబడి కూర్చున్నాడు కళ్ళద్దాలు పక్కన పెట్టి...

1986 లో రిలీజ్ అయ్యింది ఇప్పటికి 55 యేళ్ళ పైబడే ఉంటుందిలే అనుకుంటూ

లెక్కవేసుకుంటున్నాడు సత్యనారాయణ మనస్సులో

ఆ పాటలో లిరిక్స్ మారుతున్నాయి కాని సత్యనారాయణ మనస్సు అక్కడే ఆగిపోయింది పాత

ఙాపకాలు గుర్తొస్తున్నాయి.

పెద్ద పల్లెటూరు చుట్టూ పచ్చని పొలాలు ఉదయం నాలుగింటికి ట్రైన్ దిగి రిక్షాలో

వెళ్తున్నాడు.గుమ్మం ముందు ఆడవాళ్ళు కళ్లాపి చల్లుతున్నారు ముగ్గులు పెడుతున్నారు , చేతి

పంపు దగ్గర కొంత మంది వేచి ఉన్నారు అటు గా వెళ్తున్న మా రిక్షా వైపు చూసి గుస గుస గా

మాట్లాడుతున్నారు.

ఇంటి ముందు ఆగగానే అమ్మమ్మ ఎదురొచ్చింది నవ్వుతూ

బ్యాగ్ తీసుకుని అమ్మమతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళా

తాతయ్య రేడియో లో పాటలు వింటున్నారు నన్ను చూడగానే

"సత్యం వచ్చేసావా? రాజా వచ్చాడా ? స్టేషన్ కి అన్నాడు

"వచ్చాడు మాష్టారు అన్నాను నవ్వుతూ... తాతయ్య స్కూల్లో హెడ్ మాస్టర్ అలా అలవాటు అయిపోయింది.

లోపలికి వెళ్ళి అలా మంచం మీద పడుకున్నా...నిద్ర పట్టేసింది బాగా

ఏడింటికి లేచి బయటకి వచ్చా

టీ తాగుతావా? అంది అమ్మమ్మ

సరే అన్నట్టు తలుపా బయటికి వస్తూ

ఎదురింట్లో గుమ్మం ముందు వెనకకు తిరిగి ఒక అమ్మాయి ఉంది సరాసరి తన జుట్టు ముందుకు వేస్తే

బొడ్డు కిందకి ఉండొచ్చేమో అంత పొడవుగా ఉంది అటు తిరిగి గుమ్మానికి పసుపు కుంకుమ రాస్తుంది

తిరిగితే చూడాలని చూస్తున్నా ఇంతలో టీ తెచ్చి ఇచ్చేసరికి గ్లాస్ అందుకుని అరుగు మీద

కూర్చున్న ఒరగా చూస్తూ

ఆ అమ్మాయి వెనక్కి కూడా తిరగ కుండా వెళ్ళిపోయింది

ఎవరా? అమ్మాయి అని ఆలోచిస్తూ ఉన్నా ముందెప్పుడు చూడలేదు కదా అని

ఎవరైతే ఎందుకులే అని టీ గ్లాస్ లోపల పెట్టి పేపర్ తెచ్చి బయట కూర్చున్నా చదువుతూ ఉన్నా

"మాష్టారు లేరా అని ఒక పిలుపు పేపర్ కొంచెం కిందకి దించా తన కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి

"లోపలున్నారు అని అన్నాను

తను చక చకా లోపలికి పరిగెట్టింది పట్టీల చప్పుడికి వెనక్కి తిరిగా జలపాతంలా ఉన్న ఆ జుట్టు చూసి

ఎదురింటి అమ్మాయే అనుకున్న మనస్సులో

ఆ అమ్మాయిని చూడాలని ఏదో సాకుతో లోపలికి వెళ్లా

తాతయ్య కుర్చీ పక్కన కూర్చుని ఉంది

"సత్యం మన ఎదురింట్లో ఉంటారు రా పేరు కావేరి అన్నాడు నవ్వుతూ

నేను ఆ అమ్మాయి వైపు చూసా తను నా వైపు చూసి నవ్వింది

"అనుకుని గీసినట్టు ఆ ఆ కనుబొమ్మలు , వెడల్పుగా గుండ్రంగా పెద్దగా ఆ కళ్ళు ,పెద్దగా దిద్దిన

సిందూరం పసుపు రాసిన పాదాలు అక్కడక్కడా జుట్టు మధ్య ఉన్న కుంకుడు కాయ పలుకులు

లంగా వోణిలో ముచ్చటగా ఉంది

చూడటానికి అందంగా ఉంది

"వీడు మా సత్యం.. సత్యనారాయణ మా మనవడు మద్రాసులో చదువుతున్నాడు అన్నాడు

"అవునా...మీకు తమిళం వచ్చా అంది ఆశ్చరంగా కళ్ళు పెద్దవి చేస్తూ

"అర్థం చేసుకోగలను కాని మాట్లాడలేను అన్నాడు

"అవునా...నాకు బా గా వచ్చు అంది నవ్వుతూ

ఆ నవ్వు ఏదో గమ్మత్తుగా అనిపించింది

"నువ్వు ఆపవే...ఇదిగో ఇది మీ అమ్మకి ఇచ్చి రా అంది అమ్మమ్మ చేతికి పాయసం గిన్నె ఇస్తూ

"ఏంటి వయస్సు పిల్లల్ని ఇలా పరిచయం చేస్తారా మీరు మరీను అంది తాతయ్యను గదమాయిస్తూ

"అందులే ఏముందే నీ పిచ్చి కాకపోతేను అన్నాడు తాతయ్య నిట్టూరుస్తూ

"ఆ..ఆ .. కానివ్వండి నువ్వెళ్ళి స్నానం చేయరా అంది

లోపలికి వెళ్ళి స్నానం చేసి టవల్ బయట ఆరేస్తూ ఉన్నా

"ఇదిగో మీకు ఏదైనా తమిళంలో సందేహాలు ఉంటే నన్ను అడగండి అంది కావేరి దగ్గరకి వస్తూ

"ఓ తప్పకుండా అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయా

"లోపల వంట గదిలో అమ్మమ్మ తో ఒకటే ముచ్చట్లు చెప్తుంది కావేరి ఆమె కొంచెం గడుసుగా

మాట్లాడినా తను కొంటెగా నవ్వుతుంది

నేను టిఫిన్ తిని బయటకు అలా వెళ్తున్నా

ఆ వీధిలో ఏదో గొప్ప కల ఉంది ఎప్పుడూ అరుగు మీద పెద్ద వాళ్ళు వీధి లో పిల్లల ఆటలు గుమ్మం

ముందు ఆడవాళ్ళ కబుర్లు నిండుగా ఉంటుంది. పాతికేళ్ళు వస్తున్నా అమ్మమ ఇల్లంటే అదొక సరదా

అమ్మ వాళ్ళ కన్నా ముందు అమ్మమ ని చూడాలి అని సరదా

ఊరంతా తిరిగి ఇంటికి వస్తున్నా వెనక నుండి కళ్ళు మూసినట్టు ఉంటె ఆగా చూస్తే ఫ్రెండ్ విశ్వా

"ఏంట్రా వచ్చావన్న సంగతి కూడా తెలీదు అన్నాడు

"ఉదయమే వచ్చాను అన్నా

అవునా ఇంకేంటి విశేషాలు మద్రాసులో ఉన్నావు ఎలా ఉన్నావు అన్నాడు

"బావున్నా అన్నా నవ్వుతూ

ఇంతలో పట్టీల చప్పుడు కావేరి అనుకుని వెనక్కి తిరిగా

ఎవరో అమ్మాయి

సరే రా ఇంటికి వెళ్దాం అన్నా విశ్వాని పిలుస్తూ

"సాయంత్రం వస్తా సినిమాకి వెళ్దాం రా అన్నాడు విశ్వా

"వెళ్దాం అన్నా

ఇంటికి వెళ్ళి కాసేపు అలా పడుకుని భోజనానికి లేచాడు

హాల్లోకి రాగానే కావేరి తాతయ్య పక్కన కూర్చుని లాగించేస్తుంది

నువ్వేంటి ఇక్కడా అన్నాను నవ్వుతూ

" తింటున్నా అంది మొహం తిప్పుతూ

తను ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది అన్నాడు తాతయ్య

"అదేంటే అబ్బాయిలతో అలా మాట్లాడుతారా ? సరిగ్గా కూర్చో అంది అమ్మమ్మ గట్టిగా

"ఇదిగో మాష్టారు నిజంగా ఇవిడ మీకు నచ్చే చేసుకున్నారా? అంది నవ్వుతూ

"కాదులేమ్మ ఇంట్లో వాళ్ళ చేసేసారు అన్నాడు

"ఏంటే నువ్వు అరవైయేళ్ళలో నాకు రాని ఈ సందేహాన్ని కొత్తగా కలిగిస్తున్నావు అంది అమ్మమ్మ గదమాయిస్తూ

"నువ్వెప్పుడు అలా గుర్రు మని ఉంటావు మాష్టారు చూడు ఎంత అందంగా శోభన్ బాబులా ఉన్నారో అంది నవ్వుతూ

"ఆ ఆ ఉంటాడులే అంది

అసలు అమ్మమ్మ చాలా స్ట్రిక్ట్ మా అమ్మ , మావయ్యలు అసలు నోరు కూడా మెదపరు మాకు ఆ

భయం ఉంది మా తాతయ్య కూడా అమ్మమ్మ కి ఎదురు మాట్లాడరు కాని కావేరి అమ్మమ్మ ని

ఆటపట్టిస్తుండటం చూసి నమ్మలేక పోయా

అమ్మమ ఏమన్నా నవ్వుతూ ఉంది.

కావేరి వెళ్ళిపోయాక అలా అంటావేంటే అన్నాడు తాతయ్య

"అదేం పట్టించుకోదులేండి దానికి అది మాములే మా ఇద్దరికి ఇలానే బావుంది అంది అమ్మమ్మ

నవ్వుతూ

అమ్మమ్మ అలా మాట్లాడం నాకు ఊహ తెలిసి అదే మొదటి సారి ఎప్పుడూ స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల

సరదా గా ఉండాలంటే భయం

సరదా గా పిల్లలు మాట వినరని అలా ఉండేది అది అలా అలవాటు అయిపోయింది మాకు.

ఆ రోజు సాయంత్రం రెడీ అవుతుండగా వచ్చింది

"ఎక్కడికి తెగ రెడీ అయిపోతున్నారు అంది మెల్లగా

"సినిమాకి అన్నా

"మీ పని బావుంది నాకు ఆ అదృష్టం లేదు అంది మొహం తిప్పుతూ

"రా వెళ్దాం అన్నా నవ్వుతూ

"మీ అమ్మమ్మ గారు నన్ను ఇంక ఇంట్లోకి కూడా రానివ్వరు నా కాళ్ళు విరగ్గొడుతుంది అంది చేతులు ఊపుతూ

"పర్లేదు బానే భయం ఉంది అన్నా నవ్వుతూ

బయలు దేరి వెళ్ళిపోయా. సినిమా చూసుకుని టౌన్ లో తిరిగి ఫ్రెండ్స్ ని కలిసి లేట్ గా వచ్చా

లోపలికి రాగానే కావేరి గొంతు విని మెల్లగా వెళ్లా

అమ్మమ్మ కాళ్ళు నొక్కుతుంది

"నువ్వెళ్ళవే తల్లీ మీ అమ్మ చూస్తే నేనేదో నీతో చేయించుకున్నట్టు అంటుంది అంది

"నువ్వాగమ్మా మీనాక్షి అంటూ వొత్తసాగింది

నన్ను చూసిన అమ్మమ్మ కాళ్ళు చేతులు కడుక్కోరా వడ్డిస్తా అంది

"నువ్వుపడుకోవమ్మా నేను పెడతాలే అంది కావేరి

"నువ్వెళ్ళవే అంది అమ్మమ్మ గట్టిగా

"నువ్వు పడుకో నేను పెడతా అంది బయటికి వస్తూ

సత్య హాల్లో కి రాగనే అన్నీ తెచ్చి ముందు పెట్టి తలుపు దగ్గర నిలబడింది

"నేను తింటా నువ్వెళ్ళు అన్నాడు

"తినండి నేను మా ఇంట్లో కొత్త ఆవకాయ పెట్టారు తెస్తా అంటూ పరుగు పెట్టింది

తిరిగి వచ్చేటపుడు గడపకి తగిలి కింద పడ్డది ఆ అరుపుకి అమ్మమ్మ తాతయ్య వెళ్ళాము కంగారుగా

చేతికి అంటిన ఆవకాయ నాలుకతో అలా చప్పరిస్తూ లొట్టలు వేసి చాలా బావుంది అంది

కావేరి ని అలా చూడగానే నచ్చేసింది .కల్మషం లేని మనస్సు అసలు పరాయి అన్న భావన లేదు

సొంత వారిలా కలిసిపోతుంది. అమ్మమ్మ తాత్తయ్య కి మేము దూరంగా ఉన్నమ్మన్న లోటు వాళ్ళు

ఒంటరిగా ఉన్నారన్న ఆలోచన రాకుండా చేసింది

కావేరిని చూసి అమ్మమ్మ" మెల్లగా రావే దెబ్బ తగిలిందా అంటూ చూడసాగింది

"ఎంత తిట్టుకున్నా మీరిద్దరే మరి అన్నాడు తాతయ్య లోపలికి వెళ్తూ

అమ్మమ్మ వెళ్ళి పడుకుంది

ఆవకాయ తెచ్చి ముందు పెట్టి ఆవకాయ వేడి అన్నం లోకి నెయ్యితో తింటే అబ్బబ్బా అంది

చప్పరిస్తూ

"వాడికి పెట్టకే వాడు కారం తినలేడే ... కొత్త ఆవకాయ కలుపుకోలేడే అంది అమ్మమ్మ

"సర్లే నేను కలిపిస్తా అంది కావేరి వేడి అన్నం లో కలుపుతూ

కలిపి చేతిలో ముద్దలుగా పెడుతుంటే నేను తిన సాగా లోపలనుండి చూసిన అమ్మమ్మ

"ఏం చేస్తున్నావే నువ్వెల్లు అంటూ కావేరిని పంపించేసింది

నేను మౌనంగా తిని వెళ్ళిపోయా

లోపల తాతయ్య గొంతు వినిపిస్తుంది "అదేంటే నువ్వు వాళ్ళు చిన్నపిల్లలే నువ్వు ఏదెదో అని వాళ్ళ

మధ్య లేని ఆలోచనలు కల్పించకు అన్నాడు

"నువ్వు ఊరుకుంటావా...వాళ్ళేం చిన్నపిల్లలు పాతికేళ్ళు దగ్గర పడుతుంటే అంది

"అయినా ఆ పిల్ల గురించి తెలీదా మనకు అన్నాడు

"తెలుసులే ఎప్పుడు ఆ మాయరోగం ఎలా పుడుతుందో అంది కోపంగా

అమ్మమ్మ కి మామ్మయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అప్పటి నుండి ఆవిడకి ఈ ప్రేమ అలాంటివి నచ్చవు.

లోపలికి వెళ్ళి పడుకున్నా కాని కావేరి గురించి ఆలోచిస్తున్నా ఇదేంటి మరీ విచిత్రంగా అనుకుని బుక్

తీసా.. పెరట్లో నుండి నవ్వులు కిటికి తెరిస్తే కావేరి పిల్లలతో ఆడుతూ ఉంది.

కళ్ళకి గంతలు కట్టి లంగా కుచ్చిళ్ళు బొడ్డు దగ్గర దోపి జుట్టుని లూజ్ గా కొప్పు పెట్టి ఆడుతూ ఉంది.

మధ్యలో ఆ నడుం కొద్ది కొద్ది గా కనిపిస్తూ ఉంది.

పక్క రూమ్ లో అమ్మమ్మ దగ్గు వినపడగానే కిటికి మూసేసా

పడుకున్నా కాని కావేరి ఆలోచనలే నచ్చేసిందా అని అర్థం కావట్లేదు .ఏదో తెలియని ఫీలింగ్ ఒక

విధంగా భయం సిగ్గు గా ఉంది ఇదేంటో అనుకున్నా ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పకూడదు

మామయ్య విషయం లాగా పెద్ద గొడవలు వద్దు అనుకుని పడుకున్నాడు

అలా రెండు రోజులు కావేరి మాములు గా వచ్చినా నాలో ఏదో కొత్త గా అనిపించేది నాకోసమే అన్నట్టు

అనిపించేది. నాలో ఒక హీరో పుట్టు కొచ్చాడు నాకు నేనే హీరోలా అనిపించా , క్రాఫ్ చెదిరినా మళ్ళీ

మళ్లీ దువ్వుకోసాగా కొత్త బట్టలు అన్నీ వేసుకొని తిరగసాగా.

రోజు తను మాములుగా ఉన్నా సరే తనని ప్రత్యేకంగా గమనించేవాడ్ని , తను ముగ్గు పెట్టక ముందే

లేచి అరుగు మీద తిష్ట వేసే వాడిని కళ్ళు నులుపుకుంటూ

అలా నాలుగు రోజులు గడిచాయి

ఒకరోజు నేను లోపల బుక్ చదువుతుంటే కావేరి వచ్చింది

"నన్ను సినిమాకి తీసుకెళ్ళరా అంది

"నేనా ? నా తోనా అన్నాను ఆశ్చర్యంగా

"ఇక్కడ ఎవరూ టౌన్ కి వెళ్ళరు , ఇంట్లో చెప్పకండి ముందు మీ అమ్మమ్మ కి అంది భయపడుతూ

"చెప్పనులే అన్నాను నవ్వుతూ

"మౌనరాగం తమిళ్ లో రిలీజ్ అయ్యింది అంది

"తమిళ్ లోనా నాకు రాదే అన్నాను

"అర్థం అవుతుంది కదా మీకు చాలా రోజులయ్యింది తమిళ సినిమాలు చూసి ఈ ఊరొచ్చాక అన్నీ తెలుగే అంది

"నువ్వు తమిళా అని అడిగా ఆశ్చరంగా

"అవును అమ్మ తమిళ్ నాన్న తెలుగు అంది బాధగా

"ఏంటి అంత బాధగా చెప్తున్నావు అన్నాను

"మరి బాధ ఉండదా? అమ్మమ్మ వాళ్ళ దగ్గరికే వెళ్ళలేదు ఇప్పటి వరకు తెలుసా మా అమ్మ వాళ్ళ

పెళ్ళి అలా జరిగింది అంది

"ఓ...సారీ నాకు తెలీదు అన్నాడు

"పర్లేదు... మీ మావయ్య పెళ్ళి కూడా అలానే అంటగా అంది మెల్లగా గుస గుస గా

"నీకెలా తెలుసు అన్నా ను

"చెప్పుకుంటే విన్నాను అంది మెల్లగా

సరే సాయంత్రం వెళ్దాం నువ్వు నేను వేరు వేరు గా వెళ్ళాలి అన్నాను

నవ్వుకుంటూ వెళ్ళసాగుంది నాకు హ్యాపిగా అనిపించింది

సాయంత్రానికి తను రిక్షా లో వెళ్తే నేను ఫ్రెండ్ తో కలిసి మోటర్ బైక్ మీద వెళ్ళా.

ఇద్దరం లోపలికి వెళ్లాము

ఆ థియేటర్ లోకి వెళ్లగానే కావేరి ఆనందం తట్టుకోలేకపోయింది.

సినిమా మొదలవ్వగానే ఆ స్లో మ్యూజిక్ కి కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది.ఇళయ రాజా గారి

సంగీతం అంటే ఇంక కొత్త లోకానికి వెళ్ళినట్టే ఆ మధ్యలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా అంతా

అదిరిపోయింది. పూర్తిగా అర్థం కాకున్నా ఎలాగోలా అర్థం చేసుకున్నా. ఇంటర్వెల్ లో తనకోసం

బఠాణీలు , కారప్పూస తెచ్చి ఇచ్చా తింటూ చూస్తూ ఉంది

సినిమా అయిపోయింది బయటకి వచ్చాము ఇద్దరం

ఇద్దరం చెరో రిక్షాలో ఇంటికి వచ్చాము.నేను కావేరి కోసం ఎర్ర గులాబీలు ఒక లెటర్ రాయడానికి కార్డ్

ఎన్వలప్ తీసుకున్నా

అప్పటికే ఇంటి ముందు జనం కావేరి వాళ్ళ అమ్మ అమ్మమ్మ దగ్గర ఏడుస్తూ ఉంది

కావేరిని చూడగానే కోపంగా వచ్చి చెంప చెల్లుమనిపించింది.

అమ్మమ్మ కొట్టొద్దని వారిస్తూ ఉంది

తాతయ్య అలా చెప్పకుండా వెళ్ళొచ్చా అని కావేరిని అడుగుతున్నారు. ఆ సమయంలో ఇద్దరి తప్పు

ఉన్నా సరే తనని మాత్రం అలా అందరి ముందు దోషిలా నిలబెట్టా.

వాళ్ళమ్మ పక్కింటి వాళ్ళంతా తిడుతున్నారు వయసొచ్చిందన్న ఆలోచన ఉండక్కర్లేదా ? అలా

చెప్పా పెట్టకుండా వెళ్తావా? అని అరుస్తున్నారు

నేను మెల్లగా పెరటి వైపు వెళ్ళి పోయా

చేతిలో ఉన్న రోజా పువ్వులని పక్కన ఉన్న తులసి మొక్క మీద పెట్టి లెటర్ కోసం తెచ్చిన కార్డ్ ని

నలిపి జేబులో పెట్టుకుని లోపలకి వెళ్ళా

రాత్రికి కావేరి వస్తుందనుకున్నా రాలేదు. వీధి గుమ్మం దగ్గర నిలబడ్డా తన గొంతు వినపడలేదు

మనస్సులో ఒక పశ్చాతాపం , తనని చూడాలనిపించింది అటు ఇటు తిరిగుతూ ఉన్నా

"ఏమైందిరా? అన్నాడు తాతయ్య

"అంటే పాపం ఆ అమ్మాయి ఈ రోజు రాలేదు కదా మాష్టారు అన్నాను

"ఒక్క రోజే రేపు ఉదయానికి వస్తుంది చూడు అన్నాడు నవ్వుతూ

లోపలికి వెళ్లి పడుకున్నా , నిద్ర పట్టలేదు దొర్లుతూ ఉన్నా తనతో కలిసి సినిమా వెళ్ళినంత వరకు

బావుంది కాని తనని మాత్రం అలా అందరి ముందు దోషిలా నిలబెట్టి తప్పించుకున్న ఆ బాధ

ఏమోలా అనిపించింది.అలా నిద్ర పట్టేసింది.

తెల్లవారి అమ్మమ్మ తులసి కోట మీద ఉన్న గులాబి చూసి ఎవరు పెట్టరో అని అడుగుతూ ఉంది

నేను ఏమి తెలియనట్టు మిన్నకుండిపోయా

పట్టీల చప్పుడికి తిరిగి చూసా..

"హమ్మయ్య నిన్న ఎక్కడ మీరు కూడా దొరికిపోతారో అనుకున్నా తెలుసా ? మళ్ళీ అమ్మమ్మ నన్ను

అసలు రానివ్వదు , ఎంత గొడవ అయ్యేదో మీకు చెడ్డపేరొచ్చేది అంది

"కాని నిన్ను అలా అందరూ అన్నారు కదా అన్నాను బాధ

"పర్లేదు అది మాములే అంది నవ్వుతూ

"కాని నాకే ఏదోలా ఉంది అన్నాడు

"కాని అమ్మమ్మ వాళ్ళకి మీతో వచ్చానని చెప్పకండి మళ్ళీ నాతో మాట్లాడరు , అయిన వాళ్ళకి

దూరంగా ఉంటూ పరాయివాళ్ళని అయిన వాళ్ళలా చూస్తున్నా ఇలా ఉండటం మాత్రమే నాకు

కావాలి అంది.

"చెప్పను అన్నాను మెల్లగా

అప్పటి వరకు అల్లరి గా చూసిన కావేరి మొదటి సారి కొత్తగా మెచ్యుర్డ్ గా మాట్లాడటం చూసా

తులసి కోట పక్కన ఉన్న గులాబీ తీసి ఇది లా ఉండాలి అంటూ చెట్టు మొదలు దగ్గర పెట్టింది.

నేను ఈ రోజు వెళ్ళిపోతున్నా అని అన్నాను

"అవునా...మళ్ళీ ఎప్పుడొస్తారు అంది నవ్వుతూ

"తెలీదు వస్తానో రానో మరి అన్నాను బాధ గా కిందకి చూస్తూ

"అప్పుడప్పుడూ వస్తూ ఉండండి పాపం ఈ వయసైన కాలంలో మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

మీరొస్తే వాళ్ళకి పండగ లా ఉంటుంది. అయినా వాళ్ళకి దూరంగా ఉండటం ఎంత కష్టమో వాళ్ళు

మనకి దూరం అయినప్పుడు దూరంగా ఉంచినప్పుడు తెలుస్తుంది.మీ అమ్మమ్మ గారు పైకి అలా

ఉన్నా లోపల దూది పింజలాంటి మనస్సు ఆవిడ మనస్సుకి నచ్చినట్టు ఉండండి అంది నవ్వుతూ

వెళ్ళిపోతూ

"ఏంటే రాత్రి పెట్టిన గడ్డి సరిపోలేదా అంది అమ్మమ్మ కావేరిని చూసి

"నువ్వుండగా నన్ను ఎవరేమంటారే మీనాక్షి అంది నవ్వుతూ బుగ్గలు పట్టుకుంటూ

లోపలికి వెళ్ళి లెటర్ కవర్ చింపేసా..బాదేసింది ఆ ముక్కలని చూసినప్పుడు కాని నా స్వార్థ ప్రేమ

కోసం ఇలా వెలకట్టలేని వీళ్ళ అనుబంధాన్ని తెంచాలనుకోలేక ఆగిపోయా.

ఆ కాగితపు ముక్కలని గుండెకి హత్తుకుని విలవిలాడిపోయా...ముక్కల మధ్య విరిగిన నా మనస్సు

కనిపిస్తుంది కాని నా తొందర పాటుతో అమ్మమ్మ వాళ్ళకి కావేరి మీద ఉన్న ప్రేమ కి భంగం కాకుడదని

నిర్ణయించుకున్నా. మనస్సంతా ఏదో బాధ తనతో కలిసి ఉండాలనుకున్న నా ఆశలు అన్నీ ఆవిరి

అయిపోయాయి.

ఆ రోజు సాయంత్రం బయలు దేరా.. అమ్మమ్మ నాకోసం గోదుమరవ్వతో ఉప్మా చేసింది కడుపు నిండా

తిని బయటకు వచ్చా తాతయ్య అమ్మమ్మ జాగ్రత్తలు చెప్పసాగారు నేను వింటూ ఉన్నా

మధ్యలో వచ్చి మౌనరాగం తెలుగులో వచ్చిందంట కదా మీరు ఇంకోసారి చూడండి అంది గుసగుస గా నవ్వుతూ

సరే అని నవ్వుతూ రిక్షా ఎక్కా బరువెక్కిన గుండెతో

అమ్మమ్మ ని ఒడిసి పట్టుకుని ఉన్న కావేరి ని అలా చూసి మనస్సు తేలిక అయ్యింది.

మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత వెళ్ళా తాతయ్య కాలం చేసినప్పుడు వెళ్ళా కావేరి లేదు.అమ్మమ్మ ని

అడిగే ధైర్యం చేయలేకపోయా , అమ్మమ్మ మాతో వచ్చేసింది అప్పుడప్పుడూ కావేరి గురించి

మాట్లాడినప్పుడు కలుక్కు మనేది. ఎలా ఉందో ఎక్కడ ఉందో అని మనస్సు తపించిపోయేది.

కొన్నాళ్ళ కి అమ్మమ్మ పోయారు నేను ఉద్యోగంలో చేరి కొన్నాళ్ళకి ఇంట్లో చూసిన అమ్మాయిని పెళ్ళి

చేసుకున్నా...పెళ్ళయ్యాక కావేరి ని మనస్పూర్తిగా మర్చిపొలేక పోయినా కొన్నాళ్ళకి నా ప్రేమ కోసం

పరితపిస్తున్న నా భార్యని సంపూర్ణంగా ప్రేమించ గలిగా , ఇద్దరు పిల్లలు పుట్టారు. రోజులు చాలా

వేగంగా గడిచి పోయాయి పిల్లలు పెద్దవాళ్ళయారు కూతురి పెళ్ళి అయిపోయింది. ఒక మనవరాలు

పుట్టింది. కొడుకు పెళ్ళీ మొన్న మొన్న నే అయ్యింది. రిటైర్మెంట్ కి ఇంకో ఏడాది ఉంది ఈ లోపు ఈ

కరోనా వచ్చింది అనుకుంటూ ఉన్నాడు

"కాఫీ తాగుతారా అని గొంతు వినగానే ఆలోచనల్లో నుండి బయటకి వచ్చిన సత్యనారాయణ

"వర్షం వచ్చేలా ఉంది కదా క్రిష్ణా రాత్రికి గోధుమ రవ్వతో ఉప్మా చేస్తావా అన్నాడు

"సరే చేస్తానండి , ఇప్పుడు కాఫీ ఇవ్వనా అంది మెల్లగా

"కొద్ది గా కలిపి తీసుకుని రా అన్నాడు

చెలీ రావా... అన్న పాట వినగానే సాకేత్ కొంచెం సౌండ్ పెంచరా అన్నాడు సత్యనారాయణ

సరే డాడీ అన్నాడు పెంచుతూ

ఆ లిరిక్స్ అలా కదులుతూ ఉన్నాయి కళ్ళముందు

చెలీ రావావరాలీవా...

నిన్నే కోరే ఓ జాబిల్లీ

నీ జతకై వేచేనూ

నిలువెల్లా నీవే...

చెలీ రావా వరాలీవా...

ఈవేదన తాళలేనే మామా చందమామా

వెన్నెల్లనే పూలు రువ్వీ చూడూ ఊసులాడూ

చెప్పాలనీ నీతో ఏదో చిన్నమాటా

చెయ్యాలనీ స్నేహం నీతో పూటపూటా

ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా.....

కాఫీ కప్పు చేతికి అందించిన క్రిష్ణవేణి పక్కన కూర్చుంటూ

ఇప్పటికి ఈ సినిమా వంద కి పైగా చూసి ఉంటారేమో... ఆ పాటలు వింటూనే ఉంటారు అయినా అలా

ఎలా విసుగులేదా అంది

"ఇళయరాజా సంగీతానికి అలుపు ఉండదు అది నిరంతరం అలా కొత్తదన్నాన్ని ఇస్తుంది నాకు

అన్నాడు బాధగా

"క్రిష్ణా....ఈ రోజు మనస్సంతా ఏదోలా ఉంది అన్నాడు బాధగా

"ఏంటండీ మీరు ఇంకా పాతికేళ్ళ కుర్రాడు అనుకున్నారా? ఇలా ఆలోచిస్తూ ఉండటానికి కాలం

అన్నిటికి కలిసి రాదు కదా? ఈ కాలంలో పిల్లలకి ఇదోక ఆట లా యిపోయింది ఇలా చుస్తారు ఇలా

ప్రేమిస్తారు విడిపోతారు మీరు మరీ ఎప్పుడో ముప్పై యేళ్ళ కిందట చూసిన అమ్మాయిని గుర్తు

చేసుకుని ఇలా బాధ పడుతున్నారు అంది.

"నీకు ఈ విషయం చెప్పినప్పుడు బాధ గా లేదా అన్నాడు

"మీరు అమ్మాయి గురించి చెప్పినప్పుడు మీ ప్రేమ కన్నా ఆ అమ్మాయి ని చివరి సారిగా కలవలేదన్న

మీ ఆరాటం , ఆవేదన కనిపిస్తుంది అంది బాధ గా

"ఒకసారి తనని చూస్తే బావుండు అన్నాడు బాధ గా

కనిపిస్తుందండి అంది ఓదార్పుగా చేతికి స్ప్రుశిస్తూ

లోపలికి వెళ్ళిన సత్యనారాయణ కప్ బోర్డ్ లో నుండి బ్యాగ్ తీసాడు దాని మీద దుమ్ము దులిపి

వణుకుతున్న చేతితో చిరిగిన ఆ కార్డ్ ముక్కల్ని చేతిలోకి తీసుకుని " ఇందులో ఏం రాయకుండానే

చింపేసా ఆరోజు నువ్వు అలానే చెప్పకుండా కనిపించకుండా పోయావు కదా కావేరి , నిన్ను చూసి నీ

రుణం తీర్చుకునే అదృష్టం మాకు ఇవ్వలేదు కదా , అమ్మమ్మ తాతయ్య కి నువ్వొక ఙాపకం లా

మిగిలిపోయి నీ కోసం ఎదురు చూసిన అమ్మమ్మ కి చివరి కోరిక నువ్వే, ఎన్ని రోజులు ఎంత మంది ని

అడిగినా నీ ఆ చూకీ తెలుసుకోలేకపోయా కదా... అని కుమిలి పోయాడు .కళ్ళలో నీ ళ్ళు ఆ ముక్కల్ని

తడిపేస్తున్నాయి...

బయట నుండి చూస్తున్న క్రిష్ణ దేవుడిని ప్రార్దిస్తూ వెళ్ళిపోయింది.

ఆ ముక్కల్ని లోపల మళ్ళీ దాచి పెడుతూ.....ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో చూశా పెళ్ళి పిల్లలు

ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళు ఇన్ని సంతోషాల ముందు కూడా నీ లోటు నన్ను స్పష్టంగా వేదిస్తూ ఉంది

కావేరి అనుకుంటూ. కావేరి మాటలని తలచుకుంటూ మనస్సులో నవ్వుకోసాగాడు జారుతున్న

కన్నీళ్లని తుడుచుకుంటూ

తొలి ప్రేమ ఎప్పటికి చెరగదు శిల మీద చెక్కిన శిల్పంలా ప్రతిబింబిస్తునే ఉంటుంది.మధ్యలో ఎంత

మంది వచ్చినా ఎంత మందిని ప్రేమించినా ఎప్పటికి మిగిలిపోయే ఒకే ఒక్క ఙాపకం తొలిప్రేమ....

మరిన్ని కథలు

Aparadhulu
అపరాధులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Prema lekha
ప్రేమ లేఖ
- వెంకటరమణ శర్మ పోడూరి
Adrusta chakram
అదృష్ట చక్రం
- కందర్ప మూర్తి
Sishya dakshina
శిష్య దక్షిణ
- వెంకటరమణ శర్మ పోడూరి
Pelliki mundu
పెళ్ళికి ముందు .....
- జీడిగుంట నరసింహ మూర్తి
Kodalu diddina kapuram
కోడలు దిద్దిన కాపురం
- - బోగా పురుషోత్తం.
Sarparaju
సర్పరాజు
- కందర్ప మూర్తి
Devaki Vasudevulu
భాగవత కథలు - 18 దేవకీ వసుదేవులు
- కందుల నాగేశ్వరరావు