పెళ్ళికి ముందు ..... - జీడిగుంట నరసింహ మూర్తి

Pelliki mundu

అభిరామ్ మాధురిల పెళ్లి కుదరడం, ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కూడా పెళ్లిలాగా ఘనంగా జరిగిపోయింది. అభిరామ్ ఆ సాయంత్రం మాధురిని సినిమాకి తీసుకెళ్తూ ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. సినిమా నుండి వెనక్కి వస్తూ దగ్గరలో ఉన్న తాజ్ మహాల్ హోటల్లో భోజనం చేసి మార్గ మధ్యంలో మొబైల్ ఫోన్ల షాపు దగ్గర ఆగారు.

" నీ ఇష్టం మధూ. . ఖరీదు గురించి చూడకు. మనిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయిన సందర్భంగా నీకు లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. . ఇకనుండి నువ్వు ఈ ఫోనులోనే నాతో మాట్లాడుతూ ఉండాలి. మూడునెలలు ఫ్రీ పైడ్ , నీ ఇష్టం గంటలు గంటలు మాట్లాడుతూ ఉండొచ్చు. . ఆఫీసులో వీలు దొరికినప్పుడల్లా నేను కూడా నీతో మాట్లాడుతూనే ఉంటాను. " అంటూ నలభై వేల రూపాయల ఫోన్ కొనివ్వగానే ,మాధురి తన అదృష్టానికి మురిసిపోయింది. అభిరాంతో సంభాషిస్తూ వుంటే ఆమె ప్రాణానికి హాయిగా అనిపిస్తూ ఉంటుంది.

కూరలు తరగడం దగ్గరనుండి అన్ని పనులలలో తల్లికి దగ్గరుండి చకచాకా చేసేసే మాధురి ఇప్పుడు రాత్రిళ్ళు నిద్ర కూడా పక్కన పెట్టి ఫోనుతోనే గడుపుతోంది. పోనీలే కొత్త మోజు అలాగే ఉంటుందని తల్లి పెద్దగా పట్టించుకునేది కాదు. .

ఆ రోజు అభిరామ్ మాధురి వాళ్ళింటికి భోజనానికి వచ్చాడు. ఇంకా పెళ్లి కాకుండానే కొత్త అల్లుడి మర్యాదలు అన్నీ చేసింది మాధవి తల్లి శకుంతల.

ఆ సాయంత్రం వరకు అక్కడే గడిపాడు అభిరామ్. మాధురి అభిరామ్ ల మధ్య అనేకానేక కబుర్లు చోటు చేసుకున్నాయి. పూర్వం తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి పీటలమీదే కలిసే వాళ్ళు వధూవరులు. ఇప్పుడు పేరుకు ఎంగజేమెంట్ అనడమే తప్ప ఒక్క మంగళసూత్ర కార్యక్రమం తప్ప అంతా పెళ్లి లాగానే జరుగుతోంది. ఇరుపక్షాల మధ్య హడావిడి , ఎంగేజ్మెంట్ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువులతో అట్టహాసంగా ఫోటోలు తీయించుకోవడం, ఆ హంగామా ఇంతా అంతా కాదు.

" మధూ, మీ కాలేజీలో నువ్వు ఆక్టివ్ గా ఉండే దానివా ?" అడిగాడు అభిరామ్ ఒక రోజు ఫోనులో.

" అవును. నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నాతో ఫోటోలు దిగాలని పరిచయాలు పెంచుకోవాలని తెగ ఎగబడే వారు. పైగా నేను క్లాస్లో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండటం వల్ల అనుకుంటా సబ్జెక్టు లలో ఏవో అనుమానాలు పేరు మీదట మా ఇంటికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చే వాళ్ళు. ఆ రోజులే వేరు అభీ! . అనుకోని కారణాల వల్ల డిగ్రీతో నా చదువు ఆగిపోయింది కానీ డిగ్రీలో మా ప్రిన్సిపాల్ నాలాంటి తెలివిగల అమ్మాయి ఎటువంటి పరిస్తితులలోనూ డిగ్రీతో ఆపెయ్యకూడదు అని మా నాన్నగారికి పర్సనల్ గా మెసేజ్ కూడా పెట్టారు. పీజీ గురించి ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే ఈ లోపు ఈ పెళ్లి కుదరడం అంతా కలలాగా జరిగిపోయింది. నిజానికి మన సరదాలు , సంతోషాలు అన్నీ వదులుకుని జీవితంలో పెళ్లి అనే ఒక లంపటానికి కట్టుబడి పోయాక ఇక త్రిల్ అనేది ఎక్కడుంటుంది ? ఐనా నో రిగ్రెట్. నాకు నచ్చిన నా అభిరుచులకు తగిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను " అంటూ ఫోనులోనే తన అనుభవాలను బయటపెట్టింది మాధురి .

అభిరామ్ మౌనంగా మాధురి చెప్పింది అంతా వింటున్నాడు. .

"' మరి అయ్యగారి సరదాలు, అనుభవాలు ఇంకెలా ఉంటాయో ? గరల్ ఫ్రెండ్స్ వగైరా వగైరా ? ఆ త్రిల్లింగ్ విషయాలు నాకెపుడు చెపుతారు మరి . ?" ఆసక్తిగా అడిగింది మాధురి .

" రేపు మాట్లాడుకుందాం మధూ. . నీ అంత అందంగా చెప్పలేకపోయినా నేను కాస్త ప్రిపేర్ అవ్వాలి. " అంటూ ఆ రోజుకు ఫోను ముగించాడు అభిరామ్.

** ** **

"నువ్వు ఉడుక్కోవుగా. నేను ఎమ్మెస్సీ చదువుతున్నప్పుడు ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిలు నేనంటే పడి చచ్చే వాళ్ళు. రికార్డ్స్ వ్రాసుకోవడానికి మా ఇంటికి వారానికి రెండు సార్లైనా వచ్చే వాళ్ళు. మొదట్లో మా అమ్మగారు అభ్యంతరం చెప్పినా వాళ్ళిద్దరూ అమ్మను కూడా మంచి చేసుకున్నారు. రానూ రానూ వంటలో ఆవిడకు సాయ పడటం , చనువుగా టేబుల్ దగ్గర కూర్చుని కూరలు తరిగిపెట్టడం ఇవన్నీ చూశాక మా అమ్మగారు వాళ్ళ మీద అభిమానం పెంచుకుంది. వాళ్ళల్లో ఉంగరాల జుట్టు ఉన్న అమ్మాయి మా అమ్మగారిని బాగా ఆకర్షించింది.

"ఈ సంవత్సరం చదువు పూర్తైపోతోంది కదా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అభీ ! కనుముక్కు తీరు చాలా బాగుంది. ఎంతో అభిమానంగా నన్ను పలకరిస్తుంది. ఎక్కడా ఆ అమ్మాయి మాటల్లో అతిశయంగానీ, గర్వం కానీ కనిపించడం లేదు . ఈ ఇంటి కోడలిగా వస్తే నేనెంతో అదృష్టవంతురాలిని అని అనిపిస్తోంది " అని మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టింది ఒక రోజు అమ్మ .

" అమ్మా. నాకు ఎక్కడైనా మంచి ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి విషయాలు ఎత్తకు. . కొంపదీసి నువ్వు ఆ అమ్మాయి దగ్గర పెళ్లి మాట ఎత్తావా ఏమిటి ? రేపటి నుండి మన కొంపకు రావడం మానేస్తుంది. పైగా నా మీద దుష్ప్రచారం కూడా చేసే అవకాశం కూడా ఉంది " అంటూ చిరాకు పడ్డాను. ఒకరోజు "అభీ పరీక్షలు అయిపోయాయి కదా. సరదాగా సినిమాకు వెళ్లొద్దామా?" అని అడిగింది ఆ ఉంగరాల జుట్టు అమ్మాయి వినీల.

నేను అదిరిపడ్డాను ఆమె అంత ధైర్యం చేసి అడిగినందుకు.

మాధురి మధ్యలో కలిపించుకుని " ఏమిటి అభీ . ఆ అమ్మాయికి మరీ అంత చనువేమిటి? చూస్తూంటే ఒక రకంగా మీ అమ్మగారు కూడా ఆ అమ్మాయికి లేనిపోని ఆశలు కలిపించారేమో అని నాకనిపిస్తోంది. . ఇంతకీ సినిమా ప్రోగ్రామ్ కాన్సెల్ అయ్యిందా లేదా ?" అడిగింది మాధవి ఉద్వేగంగా. .

"మధూ ! అసూయతో నీ మొహం ఎర్రబడింది కదూ. నేను గ్రహించగలనులే . ఇంతకీ సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యిందా అని అడుగుతున్నావు కదూ. భలే దానివే. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల ఏరికోరి సినిమాకు వెళ్దామంటే తిరస్కరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ? పైగా ఇవి పూర్వం రోజులు కావు. ఆడపిల్లలైల్నా, మగ పిల్లలైనా చదువుకునే సమయంలో ఎంతో చనువుగా, సర్దాగా మసులుకుంటున్నారు. అయినా నీకు నేను చెప్పేది ఏముంధి ? నీ చుట్టూ కూడా బోళ్లు మంది మగ వాళ్ళు పడే వాళ్ళని నిన్ననే కదా చెప్పావు . నువ్వు కూడా ఒక్కసారైనా వాళ్ళతో సినిమాకు, షికార్లకు వెళ్లకుండా ఉండి ఉంటావా ? స్టూడెంట్ జీవితంలో ఇవన్నీ అతి సాధారణం. నువ్వు ఎవరినైనా ప్రేమించి తర్వాత అనుకోని కారణాల వల్ల అది పెళ్లి వరకు వెళ్లకపోయినా నేనేమీ అనుకోనులే . . నా జీవితంలో లాగే నీ జీవితంలో కూడా ఆసక్తి కరమైన విషయాలు ఉంటే తప్పేముంది ? ప్రతి ప్రేమ పెళ్లి తో ఎండ్ అవ్వాలని ఎక్కడుంది ?" అన్నాడు అభిరామ్ అతి మామూలుగా తీసుకుని .

రోజూ రాత్రి పన్నెండు గంటలవరకైనా అభిరాంతో ముచ్చట్లు వేసుకునే మాధురి ఈ రోజు అన్యమనస్కంగా ఉండిపోయింది. ఆమె మనన్సు అల్లకల్లోలంగా మారింది. ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా అభిరామ్ చదువుకుంటున్న రోజుల్లో ఆ ఉంగరాల జుట్టు అమ్మాయితో అంత చనువుగా ఉండటం, పైగా అతని తల్లి ఆమెతో పెళ్ళికి ప్రేరేపించడం ఆమెకు నచ్చలేదు. ఈ క్షణంలో కూడా అభిరామ్ కు ఆమెతో గడిపిన ఆలోచనలు ఉండవని ఎలా అనుకోవడం ? పైగా వాళ్ళ మధ్య స్నేహం కలిసి సినిమాలకు వెళ్ళడం వరకు వెళ్ళిందంటే అనుమానించాల్సిన విషయమే. ఒక వేళ తను కాలేజీ లైఫ్ లో గడిపిన విషయాల గురించి బోల్డ్ గా చెప్పేయ్యడం వల్ల తనని ఉడికించడానికె అలా చెప్పి ఉంటాడా ? ఏమో అంత తేలిగ్గా తీసుకోకూడదు ఈ మగవాళ్ళ విషయంలో .

రాత్రంతా అవే ఆలోచనలతో ఆమె బుర్ర వేడెక్కిపోయి ఎప్పుడో తెల్లవారగట్ల మాగన్నుగా నిద్రపట్టేసింది. మాధురి ఇంకా లేవలేదేమిటి అనుకుంటూ ఆమె గదిలోకి వచ్చి కంగారుపడి కుదిపి లేపింది తల్లి శకుంతలమ్మ.

ఉలిక్కిపడుతూ లేచింది మాధురి . లేస్తూనే ఆమె చూపులు పక్కనే ఉన్న సెల్ ఫోను మీద పడ్డాయి. అందులో నాలుగైదు అభిరామ్ మిస్సుడ్ కాల్స్ ఉన్నాయి. వాటికి స్పందించి వెంటనే ఫోన్ చెయ్య వద్దని మనసు వారిస్తోంది.

అయితే ఆమె మనసు ఇంకో రకంగా ప్రేరేపిస్తోంది. అసలు తనే అభిరామ్ కన్నా ముందే అనవసరంగా తన విషయాలు చెప్పేసి తప్పు చేసిందేమో ? ఆడపిల్ల జీవితంలో ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ ఏకరువు పెట్టేస్తే ఆ తర్వాత పర్యవసానాలు ఒక్కోసారి చాలా తీవ్రంగా ఉండొచ్చు. ఏదైనా జరిగిందంటే మగవాడికున్న భద్రత ఆడ పిల్ల కుండదు. మాధురి ఒక నిర్ణయానికొచ్చింది. తను చెప్పిన దాన్ని సీరియస్గా తీసుకోవద్దని తను అప్పుడప్పుడు కథలు వ్రాస్తూండటం, ఆ కథలలో భాగమే ఈ కల్పిత కథ అని నా జీవితంలో మొట్ట మొదటిగా దగ్గరైనది మీరే నని చెప్పేస్తే తన కారెక్టర్ ను కాపాడుకున్నాట్టుగా ఉంటుంది మరో పక్క అవతలి వైపునుండి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడొచ్చని ఆమెలో ప్రగాఢంగా ఆలోచన కలిగింది.

"అభీ నేను మాధురిని . రాత్రి కొంత నలతగా ఉండటం వల్ల అలసటతో నిద్రపోయాను. ఏమీ అనుకోవద్దే, నీ మిస్డ్ కాల్స్ పొద్దునే చూశాను. అన్నట్టు నీకో విషయం చెప్పాలి. నేను కథలు వ్రాస్తూ ఉంటానని తెలుసుగా. ఒక ప్రముఖ పత్రిక కథల పోటీకి మొన్న నేను నీకు చెప్పిన కల్పిత కథను పంపాలని అనుకుంటున్నాను. దీని మీద నీ సలహా ఏమిటో చెప్పు " అంది అవతల వైపునుండి ఉత్కంఠతతో .

అభిరామ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమిటీ నువ్వు నాకు చెప్పినది కల్పిత కథా? ఓ మై గాడ్! మధూ. నువ్వు చెప్పింది అబద్దం కావాలని నేను ఎన్నో మార్లు అనుకున్నాను.నిన్ను నీ అమాయకత్వం చూస్తూంటే నువ్వు అటువంటి సాహసాలు చెయ్యవని ఎక్కడో ఒక మూల నమ్మకం. ఇప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. అయితే ఇప్పుడు నేనో విషయం చెప్పాలి. నువ్వు ఇప్పుడు చెపుతున్నది నిజమో , అబద్దమో నాకు తెలియదు. కానీ నేను నీకు చెప్పినది కల్పిత కథ కాదు . అది నిజమే .అయితే నేను విషయాన్ని కొంతకాలం నానిచేసరికి ఆ ఉంగరాల జుట్టు అమ్మాయి నాకిష్టం లేదని అనుకుందో ఏమో వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. . అయినా నో రిగ్రెట్. ఇప్పుడు ఆమె కూడా నాకు మంచి స్నేహితురాలు. పదిహేను రోజుల కొకసారైనా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో సర్ప్రైజ్ ఏమిటంటే మన పెళ్ళికి ముఖ్య అతిథిగా వస్తోంది . నువ్వే చూద్దువు గానీ. ..." అన్నాడు చిలిపిగా నవ్వుతూ.

అతనలా చెప్తూ ఉంటే ఆమెలో ఎప్పుడూ లేని అవ్యక్తమైన బెదురు , నీరసం ముంచుకొచ్చాయి. వెన్నులో సన్నటి జలదరింపు మొదలయ్యి మొహం అంతా చెమటతో ముద్దయ్యింది. ఇప్పుడు ఆమె మనసులో ఎన్నో శంకలు తలెత్తుతున్నాయి . ఏమో ఆ అమ్మాయి కలిస్తే అతనికి పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా ముసురుకుంటాయేమో . ఎంతైనా మగవాడు కదా. తనంటే కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనలు అంతగా సీరియస్గా తీసుకోలేదు. తను పద్దతిగా పెరిగిన అమ్మాయి. తమ కుటుంబంలో ప్రేమలు , ప్రేమించుకోవడాలు అంటూ లేవు. అసలు అభిరామ్ తన పూర్వ ప్రేమ కథ చెప్పకుండా ఉండిఉంటే తనకు ఈ మానసిక ఆందోళన తప్పేది .

" ఏమిటి మాట్లాడవే మధూ. కాస్త ఊహాలలో తేలిపోవడం ఆపు. పెళ్లి పీటల మీద నాటికి కొద్దిగా దాచుకో . ఉంటానే . అమ్మ భోజనానికి పిలుస్తున్నట్టుంది. " అంటూ ఫోన్ పెట్టేశాడు అభిరామ్ .

" ఏంటి తల్లీ . నిన్నటినుండి ఎందుకూ కలతగా ఉన్నావు ? అతనేమేనా ఇబ్బంది పెట్టాడా ? ఏమిటి చెప్పు . అలా ఉంటే మాకు మాత్రం మనశ్శాంతిగా ఎలా ఉంటుంది ? అదే నిజమైతే రోజూ ఇరవై నాలుగు గంటలూ అతనితో తిండి తిప్పలూ కూడా మానేసి మాట్లాడుతూ ఉండటం మంచిది కాదు. ఒకోసారి అపార్ధాలకు దారితీస్తుంది. .ఎందుకైనా మంచిది పెళ్లి అయ్యేవరకు అతనితో కొద్దిగా మాటలు తగ్గించు. తర్వాత నీ ఇష్టం " అంటూ శకుంతలమ్మ ఆవేదనగా అక్కడనుండి వెళ్ళి పోయింది .

ఆలోచనలో పడింది మాధురి మస్తిష్కం . బరువుగా ఊపిరి పీల్చి వదిలేసింది. అభిరామ్ తో మాట్లాడిన తర్వాత నుండి ఆమె మనసులో ముళ్ళు కెలుకుతున్నట్టుగా ఉంది. రకరకాల ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నాయి. తను తీసుకోబోయే నిర్ణయం తలుచుకోగానే కన్నీళ్లు చెంపలమీద నుండి జల జలా రాలిపోసాగాయి.

"అమ్మా. ఒక్క నిమిషం నా దగ్గర కూర్చో. నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి . నువ్వు అర్ధం చేసుకుంటావని ఆశిస్తాను. " అంది మాధురి గుండెను దిటవు చేసుకుని.

తనకూ, అభిరామ్ కు మధ్య జరిగిన సంభాషణ గురించి ఆమె ఉద్వేగంగా చెప్పుకు పోతోంది.

"ఇదేమిటే బాబూ. ఒక పక్క ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నాం కూడాను. ఇప్పుడు ఒకరి మీద ఒకరు అనుమానాలతో పెళ్లి వద్దనుకుంటారా ? మన పరువేం కానూ ? అసలు ముందు మీ నాన్నకు ఈ విషయం తెలిస్తే నిన్నూ, నన్నూ చంపేస్తారు. నాకు తెలియదు .ఇంత జరిగాక మన చుట్టాలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటాం ? అసలు నీకు అతను కొత్త ఫోన్ కొనిపెట్టి ఇరవై నాలుగు గంటలు చాటింగ్ చేసుకుంటున్నపుడే ఒళ్లూ పైనా తెలియక ఒకరి రహస్యాలు ఒకరు చెప్పేసుకుంటారని అనిపించింది. నువ్వు చెప్పింది కల్పిత కథ అని అతనితో చెప్పుకున్నావుగా. ఇక నీ సైడ్ నుండి ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. . ఇక ప్రతి మగవాడి జీవితంలోనూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మగ వాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒక్క పెళ్లి సంబంధంతో పెళ్లిల్లైపోవు . పెళ్లి వరకు వచ్చి పీటల మీదే పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు ఎన్నో వుంటాయి. అవన్నీ ఎవరైనా ఏకరువు పెట్టుకుంటారా ? అతను చెప్పిన పూర్వ కథలో నాకెటువంటి పెళ్లి మానేసే అంత భయంకరమైన విషయాలు ఏమీ లేవు. ఇక వాళ్ళిదరూ పదిహేను రోజులకొకసారి మాట్లాడుకోవడం, మీ పెళ్ళికి ముఖ్య అతిధిగా వస్తుందనడం ఇవన్నీ కొంపములిగే విషయాలు అసలు కానే కావు. చాలా మంది మగవాళ్ళు ఆ విధంగా తమ గొప్పలు చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఇలాంటి కల్పనలు కూడా చేసే అవకాశం ఉంది. నాకెందుకో అనిపిస్తోంది. నువ్వు నిజాన్ని అబద్దంగా అతనికి చెప్పినా అతను ఒక అబద్దాన్ని నిజంగా చేసి చెప్పాడని అనుకుంటున్నాను. ఆ విధంగా చూస్తే పెళ్ళికి పూర్వం ఏ ఆడదాని ప్రేమ కథ, అనుభవాలు మగవాడు భరించలేడు. ఏదో సమయంలో అదే విషయాన్ని గుర్తు చేస్తూ సంసారాన్ని నాశనం చేసుకుంటాడు. అదృష్టవశాత్తు నిన్ను అతను నమ్మాడు. ఇక ఈ విషయం ఈ క్షణం నుండి మర్చిపోయి ఈ ఫోనుల్లో ఇటువంటి ప్రమాదకరమైన కబుర్లు ఆపి సాధ్యమైనంతవరకు అవసరమైతేనే మాట్లాడుకోండి. ఇది నీకే కాదు పెళ్లి కాబోయే ఏ ఆడపిల్లకైనా నా భయంకరమైన హెచ్చరిక . నువ్వు చెప్పినదాన్ని బట్టి నీలా నేను కూడా అతని గురించి ఆవేశ పడి నీకు సహకరిస్తే తల్లిగానాకు, పెళ్లి కావాల్సిన దానిగా నీకు జీవితాంతం ప్రశాంతత ఉండదు. వెళ్ళి నీ పనులు చేసుకో. " అని తప్పిపోయిన ప్రమాదాన్ని తల్చుకుని గుండెలనిండా ఊపిరి పీల్చుకుంటూ కూతురు తల మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటూ కొండంత ఊరట కలిగించింది తల్లి శకుంతలమ్మ.

ఇప్పుడు మాధురిలో కొన్ని క్షణాల క్రితం అణువణువూ ఆవరించిన ఆవేశం, నిరాశ, నిర్లిప్తత పూర్తిగా తగ్గిపోయి రెట్టించిన ఉత్సాహంతో అమ్మను గాడంగా ముద్దుపెట్టుకుని అక్కడ నుండి తుర్రుమని ఏవేవో కొత్త ఆశలతో తన గదిలోకి పరిగెత్తింది.*****

సమాప్తం

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి