అదృష్టం కలిసొస్తే... - కందర్ప మూర్తి

Adrustam kalisoste

" ఏరా, వీరేశం !పొద్దెక్కిపోయినాది. ఇంకా ఆటో తియ్యలేదు. ఒంట్లో నిమ్మళంగా ఉంటోందా?" బీడీ పొగవదులుతూ కొడుకును అడిగాడు సోమేశం. " లేదు, నాయనా! వంట్లో బాగానే ఉంది.ఇవాళ పార్కు దగ్గర పార్టీ మీటింగుంది. పెద్ద నాయకులు మాట్లాడతారట.వెళ్లాలి." "ఎందుకురా ఈ మీటింగులు?రాజకీయాలు పెద్దోళ్లకేరా! మనబోటి పేదోళ్లకి తిండి పెడతాయా?.చూడు, నువ్వు డిగ్రీ పాసయినా సర్కారు కొలువు దొరికినాదా? ఆటో నడుపుతు కుటుంబాన్ని లాగుతున్నావు. డబ్బున్నోళ్లకు సిపారసున్న వోళ్లకే సర్కారు కొలువులు దొరుకుతాయి. నీకేమో ఏ పెద్దోళ్లు తెలవదు.మనం లేబరోళ్లం. డబ్బులు ఖర్చు చెయ్యలేం గదరా! " నోట్లో బీడీ కింద పడేస్తూ కొడిక్కి నచ్చచెబుతున్నాడు సోమేశం. " నాయనా , దేశంలో చదుకున్న వాళ్లు ఎక్కువయారు. అందరికీ గవర్నమెంటు ఉద్యోగాలంటే కష్టమే కదా! వ్యాపారంలోనో స్వయంకృషితోనో బ్రతుకు తెరువు చూసుకోవాలి.రాధేశ్యాం గారు స్వతంత్ర సమరయోధులు. వారు యువతను సరైన దారిలో ఉంచడానికి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో స్వరాజ్యం పార్టీ పెట్టి నేడు రాజకీయంగా జరుగుతున్న అరాచకాలను ఆపకపోతే దేశం ఇంకా భ్రష్టు పట్టిపోతుందని ఆవేదన పడుతున్నారు.ఆయన ఆశయాల్ని అర్థం చేసుకున్న నాలాంటి చదువుకున్న యువత ముందుకు రావాలని కోరుకుంటున్నారు.పెద్ద వయసులో ఆరోగ్యాన్ని లెక్క చెయ్యకుండా పార్టీ కోసం పాటుపడుతున్నారు. అటువంటి మంచి మనిషికి చేతోడుగా కార్యకర్తల కృషి సహాయం ఎంతో అవసరం. ఒక కార్యకర్తగా వారికి నా సహాయ సహకారాలు తప్పక అందచేస్తానని" తన ఉద్దేశ్యం చెప్పాడు తండ్రికి. చేసేదేమీ లేక సరే అన్నాడు సోమేశం. నెహ్రూ పార్కు దగ్గర మీటింగ్ సన్నాహాలు పూర్తయాయి. రాధేశ్యాం గారితో పాటు మరో ఇద్దరు నాయకులు పురుషోత్తం గారు , రామేశం గారూ వేదిక మీద ఆశీనులయారు.పార్కు మైదానంలో గడ్డి మీద చాలామంది యువకులు కూర్చున్నారు. వేదిక ఏర్పాట్లు , మైకు కుర్చీలు వీరేశంతో పాటు మరి కొంతమంది బందోబస్తు చేసారు. యువకులే కాకుండా పెద్దలు కూడా సభకు హాజరయారు. స్వరాజ్యం పార్టీ నాయకుడిగా పార్టీ ఆశయాలు, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అనర్థాలు అరాచకాలు లంచగొండితనంతో సామాన్య ప్రజలు, బలహీన వర్గ జనాల ఇక్కట్లు వివరంగా తెలియ చేసారు రాధేశ్యం గారు. యువత మేలుకుని ముందుకు రాకపోతే బ్రిటిష్ వారితో పోరాడిన మన స్వాతంత్ర్య సమర యోధుల శ్రమ వృధా అవుతుందని మరో సమర యోధుడు పురషోత్తం గారు తన ఉపన్యాసంలో తెలియచేసారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు మట్టిలో కలిసేలా ఉంది నేటి నాయకుల పాలన, ఇలాగే పరిపాలన సాగితే మత కల్లోలతో దేశం అల్లకల్లోలం అవుతుందని కనక యువత మేల్కొని పరిపాలనలో మార్పులు తేవాలని మరో వక్త రామేశం గారు హెచ్చరించారు. నెహ్రూ పార్కు మీటింగ్ లోనే స్వరాజ్యం పార్టీ గుర్తుగా యువకుడి చేతిలో తిరంగా జండాగా తీర్మానించారు. ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు రామారావు గారు వారి ఇంటి ముందు గదిని స్వరాజ్యం పార్టీ కార్యాలయానికి ఇచ్చారు. స్వతంత్ర పార్టీగా పార్టీ చిహ్నం, విధి విధానాలు రిజిస్టరు చేయించారు. వీరేశం రాత్రిళ్లు ఆటో నడుపుతు పగలు పార్టీ కార్యక్రమాలు, యువతను కార్యకర్తలుగా చేర్చడం, స్వరాజ్యం పార్టీ ఆశయాలు , నియమావళి,పార్టీ గుర్తు పాంప్లెట్లపై ముద్రణ చేయించి ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్నాడు. స్వరాజ్యం పార్టీ మొదలైన కొద్ది నెలలలోనే జనాలలో గుర్తింపు తేగలిగాడు వీరేశం.చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు, వ్యాపారులు, సామాన్య జనం వాలంటీర్లులుగా ముందుకు వస్తున్నారు. పార్టీ మొదలు పెట్టిన కొద్ది నెలల తర్వాత మున్సిపల్ వార్డు , కౌన్సిలర్లు ఎన్నికలు వచ్చాయి. స్వరాజ్యం పార్టీ గుర్తు మీద వార్డు మెంబరుగా నిలబడమని కార్యకర్తలు, పార్టీ నాయకుడు రాధేశ్యాం గారు ప్రోద్బలం చెయ్యడంతో తప్పలేదు వీరేశానికి. గడువులోపల నామినేషన్ వేసాడు. అధికార పార్టీ నాయకుడు వీరేశానికి వ్యతిరేకంగా నామినేషన్ వేసి పుష్కలంగా డబ్బు మద్యం ఓటర్లకు పంపిణీ చేసినా స్వరాజ్యం పార్టీ కార్యకర్తలు రాత్రింబవళ్లు తిరిగి చేసిన కృషి , వీరేశం మాట తీరు వినయం వల్ల ఎటువంటి ధన ప్రమేయం లేకుండా మెజారిటీతో వార్డు మెంబరుగా ఎన్నికయాడు.ఇంటింటికీ తిరుగుతూ అందరి కష్టసుఖాలు తెలుసుకుంటు వారికి కావల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో వీరేశం పరపతి ఇంకా పెరిగింది. వీరేశం అకుంఠిత దీక్ష , కృషి , పట్టుదల చూసిన అధికార పార్టీ నాయకులు వీరేశాన్ని తమ పార్టీ లోకి ఆహ్వానించినా స్వరాజ్య పార్టీని వీడే ప్రశక్తే లేదని ఖరాకండిగా చెప్పేసాడు. అదృష్టం కలిసొస్తే పల్లకీ మోసేవాడే పల్లకిలో కూర్చుంటాడట. అదే జరిగింది. ఆ ఏరియా కౌన్సిలర్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేసినందున మళ్లా కౌన్సిలర్ ఎన్నికలు అనివార్యమయాయి. ఈసారి స్వరాజ్యం పార్టీ అధిస్టానం వారి పార్టీ తరపున వార్డు మెంబరుకి రాజీనామా చేయించి వీరేసాన్ని కౌన్సిలర్ పదవికి నామినేషన్ వేయించారు. బంపర్ మెజారిటీతో కౌన్సిలర్ గా ఎన్నికయాడు వీరేశం.తర్వాత వార్డు మెంబరుగా స్వరాజ్యం పార్టీ యువకుడే మళ్లీ గెలుపొందాడు. తర్వాతి రోజుల్లో స్వరాజ్యం పార్టీ పరపతి పెరిగి పార్టీ ఆశయాలు పనితీరు మెచ్చి చాలమంది అధికార పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరారు.ఎక్కడ చూసినా 'యువకుడి చేతిలో తిరంగా జండా 'గుర్తు జండాలే కనబడుతున్నాయి. పార్టీ వ్యవస్థాప అద్యక్షుడు రాధేశ్యాం గారు పార్టీ ఉన్నతినీ , యువతలో పార్టీ పట్ల ఆకర్షణ చూసి తన ధ్యేయం నెరవేరింని ఆనంద పడ్డారు. అచిరకాలంలోనే స్వరాజ్యం పార్టీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది అధికార పార్టీకి సవాలుగా మారింది. యువత, సామాన్య జనం, మహిళలు అధికార పార్టీ దుశ్చర్యలు గూండాగిరి లంచగొండితనంతో విసిగి స్వరాజ్యం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అధికార పార్టీ ఎన్ని పధకాలు తాయిలాలు చూపించినా ఫలితం కనబడటం లేదు. క్రమంగా అధికార పార్టీ వార్డు మెంబర్లు, గెలిచిన కౌన్సిలర్లు పార్టీని వదిలి స్వరాజ్యం పార్టీ కండువాలు కప్పుకోవడంతో మున్సిపల్ మేయర్ పదవి వీరేశాన్ని వరించి మేయర్ కుర్చీలో సబ్యుల అభినందనలు కరతాళ ధ్వనుల మద్య అధిష్టించాడు స్వరాజ్యం పార్టీ జనరల్ శెక్రటరీ వీరేశం. ముఖ్య ఆహ్వానితులుగా ముందు వరుసలో కూర్చున్న రాజకీయ గురువు రాధేశ్యాం గారి పాదాలకు వంగి నమస్కరించాడు వీరేశం. కొడుకు ఉన్నతిని చూసి మురిసిపోయాడు తండ్రి సోమేశం. * *

మరిన్ని కథలు

Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ