యోగం - జీడిగుంట నరసింహ మూర్తి

Yogam

రమేష్ , నేనూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. చదువు అలా పూర్తయ్యిందో లేదో రమేష్ కు పెళ్లి నిశ్చయమయ్యింది. అనుకోకుండా నాకు చేతికి ఆక్సిడెంట్ అవ్వడంతో నేను ట్రీట్మెంట్ కోసం వేరే వూరు వెళ్లాల్సి వచ్చింది. దాంతో రమేష్ పెళ్ళికి వెళ్ళడం కుదరలేదు. . చెయ్యి కొంత స్వాధీనంలోకి వచ్చాక రమేషును పలకరిద్దామని వాళ్ళింటికి వెళ్ళాను. అతని తండ్రి పక్కనే వున్న తోట గట్టు దగ్గర కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడు రమేష్ కోసం వాళ్ళింటికి వెళ్ళడం జరిగినా ఎందుకో ఆయన నన్ను వెంటనే గుర్తుపట్టలేకపోయాడు .

"నేనే సార్ . రమేష్ ప్రియమిత్రుడిని సురేష్ ని . అనుకోని కారణాల వల్ల మీ వాడి పెళ్లికి రాలేకపోవడంతో ఒకసారి కలుసుకుని వెళదామని వచ్చాను " అని చెప్పాను. .

"అవును బాబూ మీ గురించి మా అబ్బాయి చెప్తూ వుంటాడు. వాడు ఇప్పుడు ఇక్కడ లేడు. విడిగా వుంటున్నాడు" అన్నాడు పేపర్లోకి తలదూరుస్తూ.

"ఈ రోజుల్లో పెళ్లైపోగానే వేరు కాపురాలు పెట్టడం మామూలేగా" అనుకున్నాను మనసులో . .

" ఓహో అలాగా సార్ . అయితే ఇప్పుడెక్కడున్నాడు ?" అన్నాను తెలుసుకోవాలన్న ఆసక్తితో . ..

"వేరు కాపురం అనుకుంటున్నావా బాబూ . కాదు . ఇప్పుడు వాడు భార్యతో కూడా వుండకుండా వేరే రూము తీసుకుని వుంటున్నాడు. ఇక్కడ వుండటం మీ ఇద్దరికీ ఇష్టం లేకపోతే పోనీ మీ మామగారింట్లోనే వుండండి మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా అటూ ఇటూ కాకుండా మా అందరికీ దూరంగా వుంటున్నాడు. ఇది కాకుండా కొత్తగా పెళ్ళయిన ఆ అమ్మాయిని కూడా క్షోభ పెడుతున్నాడు . . అలా ఎందుకు చేస్తున్నావని ఎన్ని సార్లు అడిగినా జవాబు చెప్పనే చెప్పడు . మేమూ పట్టించుకోవడం మానేశాం. అదేదో గౌరీశంకర పురంట. అక్కడ రూము తీసుకుని వుంటున్నట్టు తెలిసింది. బాబూ మీరు మా వాడికి బాగా దగ్గరగా మసులుకునే వాళ్ళట కదా ! . వాడితో మాట్లాడి నచ్చచెప్పి ఎలాగో అలా మా దగ్గరికి చేర్చి పుణ్యం కట్టుకోండి. . మా వియ్యంకుడి దగ్గర తలెత్తు కోలేకపోతున్నాం. వాడిమీద వాళ్ళకు ఇప్పుడు చాలా అనుమానాలు కూడా మొదలయ్యాయి. మిమ్మల్ని ఆ భగవంతుడే పంపించాడని అనుకుంటాం. మా కుటుంబాన్ని ఎలాగో అలా మీరే ఈ సమస్యనుండి బయటపడేయ్యాలి " అన్నాడు ఆయన నా చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ .

" అయ్యో అలాగా ! మీరేం కంగారు పడకండి. కారణాలు ఏవైనా కానియ్యండి . రమేషుకు నచ్చచెప్పి తీసుకొస్తాను. మీరు ధైర్యంగా వుండండి " అని చెప్పి ఆ క్షణం నుండే నా అన్వేషణ ప్రారంభించాను.

మొత్తానికి నేను వేసుకున్న స్కెచ్ ప్రకారం రమేష్ వుంటున్న రూమును పట్టుకోగలిగాను. గదంతా చిందరవందరగా పుస్తకాలు పడేసి వున్నాయి.మరో పక్క శుభ్రం చెయ్యని అంట్ల గిన్నెలు అస్తవ్యస్తంగా మూలుగుతున్నాయి. ఒక పక్క స్టౌ మీద ఏదో కూర వుడుకుతున్న వాసన వస్తోంది. . .

అక్కడే నిలబడి చూస్తున్న నా అలికిడి విని వెనక్కి తిరిగి చూశాడు రమేష్ ఆశ్చర్యపోతూ.

" ఒరేయ్ నువ్వా ? ఏమిటి ఎక్కడనుండి సడన్గా వూడిపడ్డావ్ ? మా ఇంటికి వెళ్ళావా ఏమిటి నాగురించి వాకబు చెయ్యడానికి ? రా .. కూర్చో. ఇప్పుడు నీ చెయ్యెలా వుంది ? నీతో చాలా విషయాలు మాట్లాడాలి . నాతో పాటే నీ భోజనం ఈ రోజు సరేనా ?"' అన్నాడు రమేష్ మొహంనిండా అనిర్వచనీయమైన ఆనందాన్ని పులుముకుని.

"సరే సరే. ఇక్కడే నీతోనే నా భోజనం ఈ రోజు. ఇంకా అన్నం వండి వుండవు . ఇంకో గ్లాసుడు బియ్యం ఎక్కువ పొయ్యి. కూర ఇద్దరికీ ఏమి సరిపోతుంది కానీ హోటల్లో సాంబారు పార్సిల్ చేయించుకుని పచ్చిమిరపకాయ బజ్జీలు తెస్తాను. భోజనం చేసేశాక ఇద్దరం తీరిగ్గా మాట్లాడుకుందాం " అని చనువు తీసుకుని వాడిని పక్కకు నెట్టి స్టవ్ మీద అన్నం పడేశాను .

" సురేష్! నేను నీకు ఒక విషయం చెప్పకుండా దాచాను. నాకు డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయింది. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మ్యానేజ్ చేశాను. ఆఖరికి పెళ్లి వాళ్ళకు కూడా. ఆ తర్వాతే అసలు చిక్కొచ్చి పడింది. పెళ్ళైన నెల రోజుల తర్వాత మా మామగారు వాళ్ళమ్మాయిని మన కాలేజీలో పీజీ చదివించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడుట. . మా ఇద్దరి పెళ్లయ్యాక మమ్మల్ని ఒకరోజు కూర్చోపెట్టి " అల్లుడుగారూ మీరు కూడా డిగ్రీ చదివారు కాబట్టి ఎంచక్కా ఇద్దరూ కలిసి కాలేజీకి వెళ్ళి పీజీ చేయండి. దీనివల్ల అమ్మాయికి రక్షణగానూ వుంటుంది. మీ ఇద్దరూ చదువు పూర్తిచేశాక నా ఇన్ఫ్లూయెన్స్ వుపయోగించి ఇద్దరికీ అదే కాలేజీలో లెక్చరర్ గా వేయిస్తాను . మీ లైఫ్ చక్కగా సెటిల్ అయిపోతుంది "అంటూ ఒక ప్రపోజల్ తీసుకువచ్చాడు.

“ నాకు పీజీ మీద కానీ ఆ తర్వాత లెక్చరర్గా చేయాలన్న విషయం మీద ఆసక్తి లేదండీ. బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను కావాలంటే మీ అమ్మాయిని చదివించుకోండి “ అని నిర్మొహమాటంగా చెప్పాను . .

“ పోనీలెండి అల్లుడుగారు . కాలేజీలో పాఠాలు చెప్పడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే వ్యాపారమే చేసుకుందురు గాని . కానీ పీజీ మాత్రం వద్దని అనొద్దు . ముచ్చటగా మీరిద్దరూ కాలేజీకి వెళ్లొస్తూంటే మాకు కూడా సొసైటి లో గౌరవంగా వుంటుంది . నా మాట వినండి దయచేసి ” అంటూ బలవంతం చేశాడు మా మామగారు.

"ఈ విషయంలో మా మధ్య చాలా సేపు తర్జనభర్జనలు జరిగాయి. ఆయన ఇక నా విషయం వదిలేసి చేసేదిలేక కూతుర్ని పీజీలో చేర్చడానికి సంసిద్దుడయ్యాడు. ఆశ్చర్యంగా నా భార్య కూడా నన్ను నిర్లక్ష్యం చేసి కాలేజీకి వెళ్లడానికి సిద్దపడిపోయింది . ఆ రోజునుండి నేను మామామగారింటికి వెళ్ళడం తగ్గించేశాను. పీజీ చదవడం విషయంపై నేను మా మామగారితో విభేదించానని మా నాన్న కూడా నాతో ముభావంగా వుండటంతో నాకు మొహం చెల్లక మా ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో వున్న ఈ రూముకు మకాం మార్చి ముందు నా మిగిలిపోయిన సబ్జెక్టు పూర్తిచేయ్యాలని గట్టిగా నిర్ణయించుకున్నాను . ఇప్పుడు నీకు అర్ధం అయ్యింది కదా. నా సబ్జెక్టు పూర్తిచేయ్యకుండా నేను పీజీలో ఎలా చేరగలను ? ఆ విషయం ఎవరికీ తెలియకుండా దాచి వుంచడంతో నా పరిస్తితి ఇలా అస్తవ్యస్తంగా తయారయ్యిందిరా సురేష్ ! " అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు రమేష్ .

" సరే సరే. నువ్వు ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకు . . ప్రస్తుతం పోయిన సబ్జెక్టు మీద దృష్టి పెట్టు.అప్పుడప్పుడు వచ్చి నేను కూడా సహాయం చేస్తూ వుంటానులే " అని ధైర్యం చెప్పి ఇంటికి వచ్చేశాను.

రమేష్ రూముకు అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ వుండటంతో ఇంకా కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చాయి. రమేష్ అటు తల్లి తండ్రులతోనూ , ఇటు అత్తగారి ఇంట్లోనూ ఉండక వేరే రూంలో వుండటం అతని మామగారికి సుతారం నచ్చలేదు. పెళ్లైనప్పటినుండి అల్లుడిలో ఉత్సాహం ఏ కోశానా కనిపించకపోవడం , పై చదువు మీద ఆసక్తి చూపకపోవడం పైగా అతన్ని విశిష్టా చేసేసి కూతురిని కాలేజీకి పంపడం ఈ కారణాలతో అల్లుడు మనస్తాపం చెంది అందరికీ దూరంగా వుంటున్నాడని మామగారు గ్రహించాడు. .

అటువంటి క్లిష్ట పరిస్తితిలో రమేష్కు పక్కనే అండగా వుండి మిగిలిపోయిన అతని ఒక్క సబ్జెక్టు పూర్తికావడానికి నిజానికి నేను ఎంతో శ్రమించాల్సి వచ్చింది.

ఆ తర్వాత అనుకోకుండా నాకు వేరే వూళ్ళో చిన్న ఉద్యోగం దొరకడంతో ఆ వూరు వదిలి వెళ్లిపోవడం జరిగింది. అలా ఎన్నో ఉద్యోగాల పేరు మీదట ఎక్కడెక్కడో తిరిగాను. ఈ మధ్య కాలంలో మేము కలుసుకోవడం కానీ , ఎక్కడున్నామో ఒకరినొకరు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా జరగలేదు. దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అనుకుంటా ఎవరో ద్వారా రమేష్ హైదరాబాద్లో వుంటున్నాడని అడ్రెస్ తెలుసుకుని వెళ్లాను. ఒక సబ్జెక్టు తప్పి పాసవడానికి రెండు సంవత్సరాల సమయం తీసుకుని మామగారి దగ్గర ఘోరంగా అవమానింపబడిన ఒకనాటి నా ప్రియ మిత్రుడు రమేష్ నేడు ఒక పెద్ద బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పదవీ విరమణ చేసి అదే వూళ్ళో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్న ఇద్దరు కొడుకులతో హాయిగా జీవితం వెళ్లబోస్తున్నాడని తెలిసి ఆశ్చర్య పోయాను. నేను మాత్రం ఎన్నో చిన్న ప్రైవేట్ కంపినీల్లో గుర్తింపులేని ఉద్యోగాలు చేసి చేసి ఆర్ధికంగా జీవితంలో స్థిరపడలేక పోవడం గురించి తల్చుకుంటూ వుంటే దేనికైనా యోగం ఉండాలని ఎన్నో సార్లు అనుకుని విరక్తిగా నవ్వుకునే వాడిని .******

సమాప్తం

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి