పరాన్నభుక్కు - అంబల్ల జనార్దన్

Paraannabhukku

పరాన్నభుక్కూ (ప.భు.) అతని గ్లాస్ మేట్ వంతమాగధి రావూ(వ.రా.) సెషన్ లో కూచున్నారు. మందు సీసా, గ్లాసులు, నంజుకోడానికి వేయించిన చికెన్ ముక్కలు, పల్లి పకోడీ, జీ హుజూర్! అంటున్నాయి. వ.రా. భార్య పుట్టింటికి వెళ్లినప్పుడల్లా, వారికది ఆటవిడుపు. ప.భు. అలాంటి అవకాశాల కోసం అర్రులు చాస్తుంటాడు.

“సర్! అమ్మగారు రాసిన కథలు భలేగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన వారి రెండవ కథా సంపుటి లోని కథలన్నీ చదివాను. ఈ వయసులో వారు కలం పట్టి అంత బాగా రాయడం, మీ సహవాసం వల్లే అనుకుంటాను.” తన మొదటి పెగ్ పూర్తి చేశాడు వ.రా. అతనికి ప.భు. ప్రాపకంతో పురస్కారాలు కొట్టేయాలని ఉబలాటం. అందుకే అలాంటి మందు పార్టీలు.

“రాతలా పాడా? వట్టి వంటింటి కుందేలు. ఆవిడకి సాహిత్య గంధ మేమిటి? మనలో మాట. ఎక్కడైనా నోరు జారేవు సుమా! నేనే రాసి, మా ఆవిడ పేర పంపుతుంటాను. పుంఖానుపుంఖలుగా రాస్తున్న నాకు, పత్రికలు సరిపోవడం లేదు. అందుకని కొన్ని కథలు మా ఆవిడ పేర పంపుతుంటాను. పాఠకులు కూడా బాగా స్పందిస్తున్నారు. ప.భు. మూడో పెగ్ ముగించాడు” “మీకేంటి సర్! కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీతలు. యూనివర్సిటీ లో పెద్ద పదవులు నిర్వహించారు. తెలుగులోని అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. శతాధిక గ్రంథాలు వెలువరించారు. మీ మార్గదర్శనంలో ఎందరో యం. ఫిల్., పీ. హెచ్ డీ. లు చేశారు. అలాంటి మిమ్మల్ని అతిథిగా ఆహ్వానించడం ఎన్నో సంస్థలకు గర్వకారణం.” వ.రా. తన రెండో పెగ్ లోకొచ్చాడు.

“అది నేను పదవిలో ఉన్నప్పటి మాట. రిటైరయింతర్వాత నన్ను అడిగేవారు కరువయ్యారు. ఎవరైనా ఉదయించే సూర్యుణ్ణి కొలుస్తారు కాని అస్తమించిన భానుడివైపు కన్నెత్తి చూడరు కదా? ఒక్క క్షణం తీరిక లేకుండా గడిపిన వాడికి ఇప్పుడు ఒక్కణ్ణే గోళ్లు గిల్లుకుంటూ ఇంట్లో ఉండడం ఇబ్బందిగా ఉందోయ్. అదీ కాక మందు ఖర్చు తట్టుకోలేకుండా ఉన్నాను” నాలుగో పెగ్గుకు నాందీ పలికాడు ప.భు. ఇతరుల ఖర్చుతో మందు తాగడం అలవాటైన అతనికి, రిటైరైన తర్వాత, సొంత ఖర్చుతో తాగడానికి ప్రాణం మీది కొస్తోంది.

“మీ శిష్యులు మన రాష్ట్రమంతటా అయా కాలేజీల్లో లెక్చరర్లుగా, రీడర్లుగా ఉన్నారు కదా సార్? వారు ఏ గ్రంథావిష్కరణకో, కవి సమ్మేళనానికో పిలుస్తుంటారు కదా? మీరు ఖాళీగా ఉండడమేమిటీ?” వ.రా. ప.భు.ని ఉబ్బించాడు.

“నువ్వన్నది నిజమే కానీ అప్పుడప్పుడు, ఎక్కడికైనా అతిథిగా నన్నొక్కణ్ణే పిలుస్తున్నారు. నా ఒక్కడిఖర్చే భరిస్తున్నారు. మా ఆవిడపేర కూడా రచనలు చేస్తే ఆమె ప్రభ వెలుగుతుంది. అప్పుడు మేము కలిసి వక్తలుగా వెళ్లవచ్చు. అన్నట్టు నీకింకో రహస్యం చెబుతున్నాను. ఎక్కడా నోరు జారేవు సుమా! దినమంతా ప్రయాణంలో, సాయంత్రం, రాత్రి సభల్లో గడుస్తుంది కానీ, రాత్రిళ్లు వేరే ప్రాంతాల్లో ఒక్కడినే పడుకోవడం ఇబ్బందిగా ఉందోయ్. మా ఆవిడ పక్కన లేనిదే నాకు నిద్ర పట్టదు. నువు అర్థం చేసుకున్నావనుకుంటాను. అందుకే మా ఆవిడను కూడా సాహితీవేత్తగా తీర్చి దిద్దుతున్నాను” ప.భు. గుట్టు బయట పెట్టాడు. వ. రా. ఖంగుతిన్నాడు. అయినా తమాయించుకొని..

“అది సరే కానీ మాలాంటి వాళ్లవైపు కూడా ఓ కన్నేసి ఉంచండి. మీరు ఎడమ చేత్తోనైనా అలవోకగా రాసి పడేస్తారు. మా వంటి వారి కలం, ఓ పట్టాన కదలదు. నా మీదా ఓ కన్నేస్తే, మీ మేలు జన్మలో మరిచిపోను.” వ. రా. కాకా పట్టాడు.

“అది నువు చెప్పాలా వరా! ఎప్పటినుంచో నువు నా దృష్టిలో ఉన్నావ్. సమయమొచ్చినపుడు నీకే తెలుస్తుంది. నేను చేతల రాయుణ్ణే కాని, మాటల మాంత్రికుణ్ణి కాదు. అన్నట్టు, నువు నీ పరపతి వాడాలోయ్. నీకు దిల్లీ, ముంబయి, భిలై, ఖరగ్ పూర్, ఒడిసా, బెంగుళూరు, చెన్నై, కోల్ కతా మొదలగు తెలుగు రాష్టేతరాల్లో ,తెలిసిన వారున్నారుగా?

తెలిసిన సంస్థలను పట్టి, మా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చెయ్. మా లాంటి సాహితీ దిగ్గజాలను సత్కరించే అవకాశం కల్పిస్తే, వారికి గూడా బాగా పేరొస్తుంది. మీ అమ్మగారు విమానాల్లో శికార్లు చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఒక సభలో నేను ముఖ్య అతిథిగా ఉంటే, శ్రీమతి విశిష్ట అతిథిగా ఉంటుంది. ఇంకో చోట మీ అమ్మగారు ముఖ్య అతిథిగా ఉంటే, నేను విశిష్ట అతిథిగా ఉంటాను. మా ప్రసంగాలతో వారందరినీ ఊదరగొట్టేస్తాం. మా సాహితీ ప్రతిభతో వారికి తెలుగు భాషపై మమకారం కలిగేలా చూస్తాం. ఆయా చోట్ల మా సభలు పెట్టిస్తే, దేశమంతటా మా పేరు మారు మోగుతుంది. మా శ్రేయోభిలాషిగా అది నీకూ గర్వ కారణం కదా?” మనసులో ‘మా చేతి చమురు వదలకుండా హాయిగా దేశమంతా తిరగొచ్చు.’ అన్నట్టు, నా ఫలానా… నవలని జ్ఞానపీఠకి శిఫారసు చేస్తున్నారని తెలిసింది. అదిగాని వస్తే, నేను మీకు అందుబాటులో ఉండక పోవచ్చు. అందుకని ఇప్పుడే పనిలోకి దిగు. నీ ఋణం ఉంచుకోను. నీకూ ఏదో అవార్డో, పురస్కారమో ఇప్పిస్తాను.” ప.భు. ,నాలుగో పెగ్ పూర్తి చేసి, మాంచి హుషారుగా ఉన్నాడు.

ప.భు. అన్నది విన్నాక, వ.రా, దిమ్మ దిరిగింది. ఎక్కిన నిషా దిగింది. ‘ఔరా గుంటనక్కా! నా మందు తాగుతూ, నా ఆతిథ్యం స్వీకరిస్తూ, ఇంకా నీ పరపతి పెంచుకోడానికి టెండరేస్తావా? ఇన్నేళ్లుగా నీకు చాకిరి చేస్తే నాకు ఒరిగిందేమిటి? బొచ్చెడు ఖర్చు తప్ప! అదను చూసి నీ పని పడతాను’ అని మనసులో అనుకుని పైకి మాత్రం..

“అది మీరు చెప్పాలా సర్! మీరు చెప్పడం కంటే ముందే, వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలిసిన వారితో మాట్లాడాను. వచ్చే నెల నుంచి చూడండి, ప్రతి నెల మీ ప్రభ, ఒక్కో రాష్ట్రంలో వెలుగుతుంది.” ఒక్క గుక్కలో అతను మూడో పెగ్, గొంతులోకి దించాడు.

సెషన్ పూర్తవగానే వ.రా., తూలుతున్న ప.భు.ని తన మామూలు ఆటో వాడి చేతిలో కొన్ని నోట్లు కుక్కి, “సార్ ఇల్లు తెలుసు కదా? జాగ్రత్తగా వారిని ఇంట్లో దింపి తిరిగి వచ్చి, నాకు ఫోన్ చెయ్” అన్నాడు. ఆ తర్వాత ఒక మిత్రునికి ఫోన్ చేసి ఏదో చెప్పాడు.అతను చెప్పింది జాగ్రత్తగా విని, అలాగేనని ఫోన్ పెట్టాడు.

మరో పది రోజుల తర్వాత కాకారావు ఇంట్లో ఫోన్ మోగింది “నేను ప.భు.ని మాట్లాడుతున్నాను. ఏమిటీ మరీ నల్ల పూసవై పోయావు? నేను పదవీ విరమణ చేశాక కనిపించడమే మానేశావు ? వచ్చే నెల నీ పి.హెచ్.డి. కి వైవా ఉంది కదా?”

కాకారావు గతుక్కు మన్నాడు. ‘నా వైవా సంగతి ఈ జలగకి ఎలా తెలిసిందబ్బా? కొంపదీసి ఈయన ఇంటర్వ్యూ టీం లో ఉన్నాడా? ’ అని వెంట్రుకలు అంతంత మాత్రంగా ఉన్న తలను గోక్కున్నాడు. అంతలో “ఏమిటి? బెల్లం కొట్టిన రాయిలాగ ఉలుకవు, పలుకవు” ప.భు. కంఠం ఖంగు మంది.

“లేదు సర్ ఏదో పరధ్యానం ఉండి, వెంటనే స్పందించ లేదు. సర్! నిజానికి నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను. మీ నుంచి గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. నయమైంది సర్! రేపు సాయంత్రం మన గెస్ట్ హౌస్ లో కలుద్దామా?” ప.భు. ఉద్దేశ్యం పసికట్టి కాకారావు చొరవ తీసుకున్నాడు.

“రేపు నాకు వేరే ముఖ్యమైన పని ఉంది కానీ, నీ కొరకు అది వాయిదా వేస్తాను. నా బ్రాండ్ తెలుసు కదా?”

“తెలియకేం? మనది ఐదేళ్ల అనుబంధం కదా? రేపు ఆరు గంటలకు కలుద్దాం” ప.భు. సరేననగానే కాకారావు ఫోన్ పెట్టాడు.

కాకారావు వ. రా. కి ఫోన్ చేసి ప.భు. విషయం చెప్పాడు. ఆ విషయంపై వారు పది నిమిషాలు మాట్లాడుకున్నారు.

వారనుకున్న గెస్ట్ హౌస్ లో ప.భు., కాకారావు మధ్య, ఏదో కొంచెం తేడాతో వ. రా. ఇంటి సెషన్ లో జరిగిన సంభాషణలే పునరావృత్తమయ్యాయి. తానే కాకారావు వైవాలో ముఖ్య పరీక్షకుణ్ణి అని ప.భు. చెప్పాడు. దానికి కాకారావు “ఇవి చేతులు కావు, కాళ్లు అనుకొని నన్ను గట్టెకించండి” అని ప.భు. ని వేడుకున్నాడు.

“నీ లాంటి ప్రతిభావంతునికి ఆ మాత్రం చేయకపోతే ఎలా?” అని ప.భు. తన మూడో పెగ్ పూర్తి చేశాడు. కాకారావు కూడా తన ఆటో వాడికి డబ్బిచ్చి, సార్ ను సురక్షితంగా ఇంట్లో దింపమని చెప్పాడు. నెల ఐనా కాకారావుకి పి.హెచ్. డీ. రాలేదు. వ. రా. కి ఏ సాహితీ పురస్కారం రాలేదు. ఐతే వారి రైవల్ గ్రూపు సభ్యులకి అవి దక్కాయి. దానికి ప.భు. భారీ రొక్కం తీసుకున్నాడని తెలిసింది. వారు అంతకుముందు తామనుకున్న పథకాన్ని అమలు పరచాలనుకున్నారు. తమ మీడియా మిత్రుని సహకారం కోరారు. వారి మధ్య మరో “మందు సెషన్” జరిగింది.

ఓ నెలతర్వాత “ఓ విశ్రాంత తెలుగు ఆచార్యుని కీర్తి కండూతి లీలలు” అనే మకుటంతో అన్ని ప్రముఖ పత్రికల్లో ఓ వార్త గుప్పుమంది. ప.భు., వ.రా. తో ఆ నాటి మందు సెషన్ లో అన్న మాటలన్నీ తు.చ. తప్పకుండా ప్రచురింపబడ్డాయి. కాకారావు సెషన్, వీడియో షూటింగ్ లోని క్లిప్పులు ప్రసారమయ్యాయి. ఆ వీడియోలో ప.భు. ఆకారాన్ని మరుగు పరిచారు. అదే వార్త, వాట్సాప్, ఫేస్ బుక్ లో చక్కర్లు కొట్టి, వైరల్ అయింది. పరాన్న భుక్కుని పేర్కొనక పోయినా, అతని ఆకారాన్ని చూపక పోయినా, చాలా మందికి ఆ ప్రొఫెసరెవరో తెలిసింది. అతనికి తగిన శాస్తి జరిగిందని వారు సంతోషించారు. అతన్ని గైడ్ గా పెట్టుకొని ప.భు. ఇంట్లో వెట్టి చాకిరి చేసిన వాళ్లంతా, తమ ‘శ్రమ’ కు తగ్గ ఫలితం దక్కిందని ఆనంద పడ్డారు. ‘చేసుకున్న వారికి చేసుకున్నంత’ అని వ. రా., కాకారావు లా, ప.భు. నుండి భంగపడ్డ వారంతా చాలా సంతోషించారు. ప.భు. నుండి ‘తీర్థ ప్రసాదాలు’ పుచ్చుకుని జ్ఞానపీఠకు శిఫారసు చేసినవారు అవాక్కయ్యారు. లోపాయకారిగా తమ శిఫారసు వాపసు తీసుకొన్నారు.

అది తెలిసి ప.భు. బేజారయ్యాడు. తనచే తాగించి, తన మాటలన్నీ సెల్ ఫోన్లో రికార్డు చేసిన వంతమాగధి రావుపై, కారాలు, మిరియాలు నూరాడు. వీడియో తీసిన కాకారావుపై మండిపడ్డాదు. ఐనా చేతలుడిగి చతికిల పడ్డాడు. తిరుగులేని సాక్ష్యం ఉండడం, తన పేరు ప్రచురించక పోవడంతో మిన్నకున్నాడు. ఏమైనా ప్రతిఘటిస్తే, గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టౌతుందని కుక్కిన పేనయ్యాడతను. వంతమాగధి రావు కళ్లు చల్ల బడ్డాయి. కాకారావు మరో వైవాకి సన్నద్ధమౌతున్నాడు. వారు పెట్టిన ఖర్చు, వడ్డీతో సహా తీరిగొచ్చినట్టైంది .

వారు ఇంకో ప.భు. వేటలో పడ్డాడు, తామనుకున్నది సాధించడం కోసం!

-----------------x----------------x-----------------x------------------

మరిన్ని కథలు

SankalpaSiddhi
సంకల్ప సిద్ధి
- రాము కోలా.దెందుకూరు.
Voohala pallakilo
ఊహల పల్లకిలో
- కందర్ప మూర్తి
Vishanaagulu
విషనాగులు
- కొల్లా పుష్ప
Manishi nallana manasu tellana
మనిషి నల్లన..మనసు తెల్లన..
- బోగా పురుషోత్తం
Sandatlo Sademiya
సందట్లో సడేమియా
- అంబల్ల జనార్దన్
Viharayatralo vinodam
విహారయాత్రలో వినోదం
- కందర్ప మూర్తి