పరశురామయ్య గారి ఫైల్ రహస్యం - Lanka Sita

Parasuramayya file rahasyam

కొత్తగా ప్రొమోషను మీద వచ్చిన పరుశురామయ్య గారు చంకలో ఫైల్ పెట్టుకుని తాలూకా ఆఫీస్ గుమ్మం మెట్లు ఎక్కారు. ఎదురుగా బీడీ కాలుస్తూ సుబ్బారావు కనపడ్డాడు. ఈయన నలిగిపోయిన పంచ, మెడమీద ఉత్తరీయం వాలకం చూసి ఏదో స్థలం వివాదం కాబోలు అని ఎంతో నిర్లక్ష్యంగా ఎవరు కావాలి అన్నాడు? సుబ్బారావు.

హెడ్ గుమస్తా గారిని కలవాలి అన్నారు పరుశురామయ్య గారు. లోపలి వెళ్లి కుడిచేతి వైపు గదిలో వుంటారు వెళ్ళు అన్నాడు. ఆయన తిన్నగా కుడివైపు గదిలోకి వెళ్లి ఎదురుగా వున్న హెడ్ గుమస్తా గారికి నమస్తే అన్నారు. ఆయన తనపని ధోరణిలో ఉండి తలెత్తకుండానే పది నిమిషాల తర్వాత ఏం కావాలి? అన్నాడు. పది నిమిషాలు ఆయన నిల్చునే వున్నారు. ఆయన తన ప్రొమోషను ఆర్డర్ హెడ్ గుమస్తా కి చూపించారు. వెంటనే నొచ్చుకుంటూ సారి సార్ కూర్చోండి అని ...సుబ్బారావు …. సుబ్బారావు అని కేకేశాడు. కానీ ఆసుబ్బారావు అనే సదరు ప్యూను వరండాలో బీడీ కాలుస్తూ ఫోను లో ఎవరి తోనో మాట్లాడుతున్నాడు. హెడ్ గుమాస్తాగారి పిలుపు విన్నాడో లేదో లేక వినిపించుకోలేదో పలకలేదు. ఇంతలో కామేశం పరుగెత్తుతూ వెళ్ళాడు. సుబ్బారావు ఎక్కడ ? మంచినీళ్లు తెమ్మను అన్నారు హెడ్ గుమస్తా గారు. కామేశమే మంచినీళ్లు తెచ్చాడు. తీసుకోండి సార్ అన్నాడు. పాపం ఎవరో తెలిసిన వారు గాబోలు అనుకుని కామేశం వెళ్ళిపోయాడు. కొంత సేపటి తరువాత పరుశురామయ్య గారు తన వివరాలు చెప్పి రోజు మంచిది అందుకే ట్రైన్ దిగి తిన్నగా ఆఫీస్ కె వచ్చాను అని జాయినింగ్ రిపోర్ట్ వ్రాసి హెడ్ క్వార్టర్ కి పంపమని హెడ్ గుమస్తా గారికి ఇచ్చారు. ఫార్మాలిటీ పూర్తీ అయిన తరువాత హెడ్ గుమస్తా గారు స్టాఫ్ అందిరిని గదిలోకి పిలిచి వోక్కక్కరిని పరిచయము చేశారు. ఆయన చిరుమందహాసము తప్ప నోరెత్తి ఒక్క మాట గూడా మాట్లాడలేదు. చాలా ముభావి అనుకున్నారు.

మరి కామేశం సామాన్యుడు కాదుగా ! బాసులని కాకా పట్టే రకం. ఎంతటి వాళ్ళని యిట్టె బుట్టలో పడేసే రకం. అవసరమున్నా లేకపోయినా ఆఫీసర్ల పర్సనల్ పనులు చేస్తూ మన్నలు పొందుతూ ఉంటాడు. విషయం ఆఫీసులో అందరికి తెలుసు. మిగతా స్టాఫ్ అంతా వాళ్ళ పనులేవో చూసుకోవడము తప్ప మిగతా విషయాలు పట్టించుకోరు. కొత్త సూపరిండెంటు గారు జాయిన్ అవడము తో ఆఫీస్ లో వాతావరణము మారింది. సూపరిండెంటు గారు తమ రూమ్ లోకి వెళ్లి కుర్చీలో కూర్చోగానే తమ ఫైల్ తీసి ఏదో వ్రాసి పక్కన పెట్టుకున్నారు. అది చూసిన హెడ్ గారు మిగతా అందరు చాటు

మాటు గా కొత్త ఆఫీసర్ గారిని చూస్తూనే వున్నారు. ఫైల్ లో ఏం వ్రాసారో అని అందరికి ఆదుర్దా. మన కామేశం మాత్రం ఆయన గదిలోకి వెళ్లి ఆయన గురించిన భోగట్టా తీయడం మొదలు పెట్టాడు.

ఇల్లు కావాలంటే ఆఫీస్ కి దగ్గర్లోనే ఒక పోర్షన్ ఉందని, కావాలంటే తను వాళ్లతో మాట్లాడుతానని, ఇంకా పనివాళ్లని, పాల వాళ్ళని గూడా కుదురుస్తానని చెప్పాడు.

మాత్రం సహాయం చేసే వాళ్ళు ఉంటే చాలు అనుకున్నారు పరుశురామయ్య గారు. రోజుకి హోటల్ లోనే ఉండి రేపు కామేశం చూపించిన ఇల్లు కుదుర్చుకుంటే ఫామిలీ తీసుకు రావచ్చు అనుకున్నారు. హెడ్ గుమస్తా గారు అడిగితే అదే చెప్ప్పారు. రోజుకి ఆఫీస్ టైం అయిపోయి అందరు వెళ్ళిపోయినా ఆయన బాత్రూం కయినా వెడితే ఫైల్ లో ఆయన వచ్చిన వెంటనే ఏం వ్రాసారో చూద్దామనుకుని కామేశం మాత్రం కొత్త ఆఫీసర్ గారి వెంట వెంటే ఉండి సహాయము చేసాడు. ఆయన ఫైల్ విడవకుండా ఎక్కడికి వెళ్ళలేదు.

పరశురామయ్య గారు డ్యూటీ లో జాయిన్ అయి నాలుగురోజులు గడిచింది. నాలుగు రోజులలోను ఆయన వస్తూనే ఫైల్ లో ఏదో వ్రాయడము మళ్ళీ దాన్ని డ్రాయరులో పెట్టి తాళం వేయడము, సాయంత్రము వెళ్లే ముందు మళ్ళీ ఫైల్ లో ఏదో వ్రాసి ఫైల్ చంకన పెట్టుకుని బయటకి నడవడము తప్ప ఫైల్ ని ఎవరికి చూసే అవకాశము ఇవ్వలేదు అనేకంటే ఎవరికి అవకాశము దొరక లేదు.

స్టాఫ్ అందరికి ఒకటే ఆలోచన, అనుమానము. ఈయన రోజు ఫైల్ లో ఏం వ్రాస్తున్నారు.....కొంపదీసి ఎవరు ఎలా పనిచేస్తున్నారో, ఎవరి ప్రవర్తన ఎలా ఉందొ అని గాని వ్రాయడము లేదుగదా ! సి. ఆర్. లు. వ్రాసేప్పుడు గుర్తుండడము కోసం రికార్డు చేసి పెట్టుకుంటున్నారేమో అని గూడా అనుమానాలు వచ్చాయి. ఎందుకయినా మంచిది అని అందరు ముందుకంటే చాలా అలర్ట్ గా వుండటము మొదలు పెట్టారు.

ఒక రోజు పరశురామయ్య గారు స్టాఫ్ మధ్య కి వచ్చి ఇలా అన్నారు....మనమందరము ఒక కుటుంబ సుభ్యుల్లాంటి వాళ్ళము. ఒకరినొకరు అర్ధం చేసుకుని కలిసి మెలిసి ఎవరి పనులు వారు సవ్యంగా చేసుకోవాలి. అంతే గాని నాకున్న అధికారాన్ని దుర్వినియోగము చేసే అవకాశము కలుగకుండా మీరంతా నాకు సహకారాన్నిచ్చి మీ మీ పనులు నిర్వర్తించమని కోరుతున్నాను అన్నారు. నేను చెప్పదలచినది ఇంతే ...మీ మీ డ్యూటీలు మీరు చేస్తూ వుండండి మిగతా నేను చూసుకుంటాను అని తన గదిలోకి వెళ్లిపోయారు.

స్టాఫ్ కి ఏమీ అర్ధం కాలేదు. ఈయన ఎందుకు ఇలా చెప్ప్పారు....దీని అంతరార్ధమేమిటి అని అందరు తలలు పగలకొట్టుకుని పరి పరి విధాలుగా ఆలోచించడము మొదలుపెట్టారు. ముందు ఆఫీసర్ గారు అస్తమానం చిర్రు బుర్రులాడేవారు. ఈయనేమిటి మెత్త మెత్త గా పదునైన కత్తి లాగ ముట్టుకుంటే తెగుతుంది అన్నట్లు చెప్పకనే చెప్పి వెళ్లారు. దీని అర్ధమేమి తిరుమలేశా ! అని ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు.

అందరు మన కామేశాన్ని ఆశ్రయించి బాబ్బాబు నువ్వే ఏదో ఉపాయము అలోచించి ఈయన గారి గురించి కూపీ లాగు అని ప్రాధేయపడ్డారు. ఆయన పద్ధతులు తెలిస్తే తగినట్లుగా వ్యవహరించ వచ్చకున్నారు. ముందున్న బాస్ కి కాస్త తిండి చపలత్వముండేది. ఆయన గారికి ఇష్టమయినవి తెచ్చి ఇచ్చి తృప్తి పరిచేవారు. ఈయనేమో మహా ముభావి ఆచి తూచి మాట్లాడే రకం. మిత భాషి అన్నారొకరు. మహా స్ట్రిక్ట్ ఏమో అన్నారింకొకరు. ఇక్కడ కొత్త గదా ముందు అలాగే వుంటారులే అన్నారెవరో ...ఏది ఏమయినా ఆయన గారి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి... ఆయన ప్రసంగంలో చెప్పిన ... “అధికారాన్నిదుర్వినియోగ పరచనీయద్దు” అన్న దానికి అర్థమేమిటి అనేది ఎవరికి అంతుబట్టలేదు. సీనియర్ గుమస్తా ఆచార్యులు గారు మరొక అర్ధం తీశారు........సమయం వస్తే ఎవరిని వొదిలి పెట్టను అని అర్ధం అన్నారు. అందుకనే కామేశాన్ని కాకా పట్టారందరు.

పరశురామయ్య గారు చడీ చప్పుడు లేకుండా ఇల్లు కుదుర్చుకోవడము , ఫామిలీ రావడము కూడా జరిగింది. మరి మన కామేశమే సహాయపడ్డాడో ఆయన మరి ఎవరి ద్వారా అయినా కుదుర్చుకున్నారో ఆభగవంతుడికే తెలియాలి. దీన్ని బట్టి తెలిసిందేమంటే ఆయన ఎవరి సహాయము తీసుకునే రకం కాదు. స్టాఫ్ సహాయం తీసుకుంటే నెత్తెక్కుతారు అనుకునే రకం. తన పనులేవో తానే చక్కబెట్టుకుంటారు. ఫైల్స్ పుచ్చుకుని స్టాఫ్ దగ్గిరకి ఆయనే వెడతారు తప్ప స్టాఫ్ ని తన గదికి పిలవరు. ఇందుకు రెండు కారణాలు ఉండచ్చు. ఒకటి స్టాఫ్ సీట్లో పనిచేస్తున్నారో లేదో చూడటము, రెండోది తాను బాస్ లాగ కాకుండా వాళ్ళల్లో ఒకడినే అనే భావన కల్పించడము.

రోజు ఆఫీసుకు 11 గంటలు దాటితే గాని ఆఫీస్ మొహం చూడని కామేశం వీధిలోంచి కూరల సంచీ పట్టుకుని వూగుకుంటూ మెల్లిగా వస్తూ ఇంట్లోచి బయటకు వస్తున్న పరశురామయ్య గారు ఆఫీసుకి వెళ్ళడము చూసి పరుగెత్తి కూరల సంచి అక్కడ పారేసి పక్క దారబంట పరుగెత్తి ఆఫీసు లో దూరాడు. ఆఫీసర్ గారు టైం కంటే ముందే వస్తున్నారు అని తెలిసిన స్టాఫ్ పంక్చువల్ గా ఆఫీసు కి రావడము మొదలుపెట్టారు. మునుపెప్పుడు లేనివిధంగా ఇప్పుడు ఆఫీస్ పది గంటలకల్లా కళకళలాడుతోంది.

అందరు కొత్త ఆఫీసర్ గారికి మెల్లిగా అలవాటు పడుతున్నారు. కానీ అంతుపట్టని విషయమొక్కటే. ఆయన ఆ ఫైల్ ని విడవకుండా వెంటబెట్టుకుని తిరగడము. పరశురామయ్య గారు ఆఫీసు కి నడిచే వస్తారు, ఇంటికి నడిచే వెడతారు. ఆఫీసు లోకి రాగానే ముందు చెప్పులు వరండాలో విప్పి కాళ్ళు కడుక్కుని బయట బెంచి మీద ఐదు నిముషాలు కూర్చుని భద్రాద్రి రాముణ్ణి తల్చుకుని లోపలి వెడతారు. ఆయన తీరుని అందరు తలొక రకంగా ఊహించుకున్నారు. ఎవరు ఎన్ని గంటలకి వస్తున్నారో అబ్జర్వ్ చేయడమని ఒకరు, కాదు నడిచి వచ్చి అలసిపోయి కూర్చుంటారు అని మరొకరు ఎవరికి తోచిన పరిభాషలో వాళ్ళు చెప్పుకున్నారు. తన ముందునుంచి ఆఫీస్ లోకి వెళ్ళేవాళ్ళని చిరునవ్వు తో చూడడము తప్ప ఎవరిని ఏమీ అనేవారు కాదు. తన గదిలోకి వెళ్లి ఫైల్ తీసి ఏదో వ్రాసి డ్రాయరులో పెట్టి మూస్తారు. మళ్ళీ సాయంత్రము వెళ్లే ముందు ఫైల్ తీసి వ్రాసి చంకన పెట్టుకుని బయటకు నడుస్తారు. చిదంబర రహస్యమేమిటో ఎవరికి అంతుబట్టడం లేదు.

కొత్త ఆఫీసర్ గారు వచ్చి ఒక నెల అయింది. హెడ్ గుమస్తా గారి ద్వారా తెలిసిన విషయమేమంటే పరశురామయ్య గారు నాలుగు రోజులు సెలవులో వెడుతున్నారని. అందరి ఆలోచన ఒకటే. ఆయన లేనప్పుడు వీలయితే ఫైల్ సంగతి చూడాలని. కానీ ఆ అవకాశము ఆయన ఇవ్వలేదు. ఫైల్ కూడా తీసుకునే వెళ్లారు.

సెలవు పూర్తీ అయి సోమవారం ఆఫీసర్ గారు వచ్చారు. ఎంతో ప్రశాంతముగా, ఆనందముగా కనిపించారు. ఆఫీసుకి వచ్చి తాను లేని రోజులలో పని పూర్తీ చేసి స్టాఫ్ అందరిని కామన్ హాలులో లంచ్ టైం లో సమావేశమవమని సుబ్బారావు చేత కబురు చేశారు. ఏం బాంబు పేల్చ బోతున్నారో అని అందరు బిక్కు బిక్కు మంటూ సమావేశమయ్యారు. అందరికి పార్టీ ఏర్పాటు చేశారు. ఓహో ప్రొమోషను పార్టీ కాబోలు అనుకున్నారు. ముందుగా పరశురామయ్య గారు అందరికి ప్రసాదము ఇచ్చి చెప్పడం మొదలుపెట్టారు. చూడండి ఆరు నెలల క్రిందట నేను రామ కోటి వ్రాయాలని సంకల్పించాను. అనుకున్న మరు రోజే నాకు ప్రమోషన్ వచ్చింది. మీ అందరి సహకారముతో ఇక్కడికి వచ్చాక రామ కోటి వ్రాయడము పూర్తీ అయి, నేను నా కుటుంబముతో భద్రాద్రి రాముణ్ణి దర్శించి నేను వ్రాసిన రామ కోటి ఆయన పాదాల చెంతకు చేర్చాను. నాకు మనసు ఎంతో తృప్తిగా వుంది. సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను అని ముంగిచారు. ఇందులో మీ భాగము సహకారము గూడా వుంది. భద్రాద్రి రాముడు మనందరికీ మంచే చేస్తాడు అన్నారు.

అందరు నోరెళ్లబెట్టడము తప్ప ఎవరు మాట్లాడలేదు. అందరు మనసులో అనుకున్నారు .....ఇదన్న మాట ఫైల్ రహస్యం. ఇన్నాళ్లు ఫైల్ లో వ్రాసింది రామ కోటన్నమాట. ఫైల్ రహస్యం మబ్బు వీడినట్లు వీడి అందరు హ్యాపీ గా ఫీల్ అయ్యారు. భద్రాద్రి రాముడు అందరిని రక్షించాడు అనుకున్నారు.

…………………..

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి