శీను - Dr.Vivekanand Rayapeddi

Seenu

కారు ఔటర్ రింగ్ రోడ్డు మీద దూసుకుపోతోంది. నేను వేగంగా నడుపుతున్నాను.

నా పక్కనే కూర్చున్న రాజారావు కి ఫోన్ వచ్చింది.

ఫోన్లోంచి మాటలు బయటికి వచ్చి, లీలగా చేరుతున్నాయి నా చెవుల్ని.

"నాన్నా! నేను ఇంటికి రావటానికి ఆలశ్యం అవుతుంది. మా ట్యూషన్ మేష్టారు లెసన్స్ అన్నీ రివైజ్ చేస్తున్నారు. ఈ విషయం చెప్దామని ప్రయత్నిస్తుంటె, అమ్మ ఫోన్‍కి ,సిగ్నల్స్ అందటం లేదు, నువ్వే అమ్మకి కూడా చెప్పేయ్"-

రాజారావు నా సహోద్యోగి. మేమిద్దరం పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాము. ఇద్దరి ఇళ్ళు దగ్గరే కావడంతో కార్ షేర్ చేసుకుంటాం.

రాజారావు భార్య కూడా పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో చాలా ఉన్నత స్థాయిలో ఉంది.

నేను కార్ నడపటంపై ఏకాగ్రత చూపుతూ నిశ్శబ్దంగా నడుపుతున్నాను.

ఆ అమ్మాయి మాటలు వింటుంటె నాకు అనుకోకుండా డాన్స్ శీను , అతని ట్యూషన్ పాయింట్ గుర్తు వచ్చాయి. సామాన్యమయిన ఙ్జాపకాలా అవి. ఒళ్ళు జలదరిస్తుంది అవి తలచుకున్నప్పుడల్లా.

మానభంగం, హత్య, నమ్మకద్రోహం ఇలా భయంకరమైన అంశాలు ఉన్నాయి ఆ ఙ్జాపకాలలో.

ఫోన్ లో మాట్లాడటం ముగించి రాజారావు ఫోన్ పక్కన పెట్టేశాడు.

చలి కాలం అవటాన మంచు తెరలు అలుముకుంటున్నాయి నాలుగు దిక్కులా.

రాజారావు కి ఒకటే ఆడపిల్ల. ఆ పిల్ల పదవతరగతికి వచ్చింది. నాకు ఇద్దరు అబ్బాయిలు.

యధాలాపంగా మొదలైన మా మాటల్లో పిల్లల చదువుల గూర్చి చర్చ మొదలయ్యింది.

"రాజా! నీవు మీ అమ్మాయి ట్యూషన్ మాన్పించకూడదా!" అకస్మాత్తుగా అనేశాను.

"నీవు ఐఐటీ లో చదివావు, పాపకి తను స్కూలు నుంచి వచ్చాక, ఈ పాటి పదవ తరగతి పాఠాలు నీవే ఇంట్లో , చెప్పించలేవా" నేను సూటిగా ప్రశ్నించాను

"నీకు తెలియంది ఏముంది, మనకు టైం దొరకదు కద" అతను ఏదో నసిగాడు

అప్పుడు అరిచాను నేను "నీవా వెధవ ట్యూషన్ మాన్పించేయి, అంతే. నాతో వాదించకు!" నేను చాలా గట్టిగా కేకేశాను అనుకుంటా, "ఆర్యూ ఓకే" రాజారావు నా వంక విస్మయంగా చూస్తూ కంగారుగా అడిగాడు.

విశాలమైన అవుటర్ రింగు రోడ్ నిర్మానుష్యంగా ఉంది. ఉండుండి ఒకటీ అర వాహనాలు వెళుతున్నాయి.

నేను ’నథింగ్ టు వర్రీ’ అన్న అర్థంలో తలూపుతూ, ’సారీ’ చెప్పాను.

అతను నా వంకే చూస్తుండి పోయాడు. వేగంగా కారు నడుపుతున్న నేను అతని వంక తల తిప్పి చూడకున్నా అయోమయంతో కూడిన అతని వదనం నాకు తెలుస్తూనే ఉంది.

మాకు డబ్బుకు కొదవలేదు. ఆధునిక సౌకర్యాలకు కొదవ లేదు, వస్తు వాహానాదులకు, సంపదకు కొదవలేదు.

లేనిదల్లా ఐశ్వర్యం ఒక్కటే. డబ్బుకు కొదవలేదు, సంపద ఉంది అంటున్నాడు ఒక వంక, అదే నోటితో ఐశ్వర్యం లేదు అంటున్నాడు, అదేంటి రెండూ ఒక్కటే కద అని అనుకుంటున్నారా?

ఇటీవల ఓ ప్రవచనకారుడు చెబుతుంటే చెవులలో పడింది ఓ మాట, నాకు బాగా నచ్చింది అది, డబ్బుండటమొక్కటే ఐశ్వర్యం కాదు - పిల్లలతో కుటుంబంతో ఆనందంగా గడపగల్గటం కూడా అష్ట ఐశ్వర్యాలలో ఒకటి అని చెప్పుకొస్తాడు.

అందుకే అన్నాను మా వద్ద సంపద ఉంది కానీ ఐశ్వర్యం లేదు.

మాకుఏదైనా కొదవ ఉంది, అది కుటుంబాలతో సమయాన్ని గడపలేకపోతున్నాము. పేరుకు ఇంట్లో ఉన్నాకూడా , వర్క్ ఫ్రం హోం పేరిట రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని మేము యాంత్రికంగా పని చేసుకుంటూ, మరమనుషుల్లా మారిపోవటమే మాకున్న పెద్ద కొదవ. అంటే కుటుంబాలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోతున్నాము.

***

ఎందుకో డాన్స్ శీను, అతని ట్యుటోరియల్ పాయింటు గుర్తు వస్తున్నాయి.

నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి.

శీను జీవిత కథ లో ఒక విషాదభరితమైన ముగింపు ఉంటుంది.

ఇది వ్రాద్దామా వద్దా అని చాలా రోజులు విచికిత్సకి గురయి చివరికి వ్రాద్దామనే నిశ్చయం చేసుకుని వ్రాసేస్తున్నా.

ఎందుకు విచికిత్స అని మీరు అడగవచ్చు.

కథలు వ్రాయటం మొదలెట్టే తొలి రోజుల్లోనే నేను ఒక నిర్ణయం తీస్కున్నాను. నా కథల ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు. వీలయినంత వరకు ఆనందం కలిగించే విషయాలు మాత్రమే వ్రాయాలి, నా కథల ద్వారా నలుగురికి ఏదైనా మంచి ప్రేరణ కలగాలి అని.

కానీ ఈ కథ ద్వారా ఎవరినీ బాధ పెట్టబోవడం లేదు, తలచుకునే కొద్దీ నాకే బాధవుతుంది. నేను కాస్త నేర్పుగా వ్యవహరించి ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలిగి ఉండేవాడిని. నేర్చుకోగలిగిన వారికి చక్కటి పాఠాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ కథలో.

తమిళ్ లో ఒక పాట ఉంది, చేరన్ దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఆటోగ్రాఫ్ అనే చిత్రంలో ’ఙ్జాపగం వరుదే, ఙ్జాపగం వరుదే..’ అనే పాట అది.

అందులోని ఒక వాక్యం ఇలా ఉంటుంది, ’మొదల్ మొదల్ అళుత్తా స్నేగిదన్ మరణం’ అని. దానికి అర్థం , స్నేహితుడి మరణాన్ని అతి చిన్న వయసులోనే చూసి, తొలిసారి ఏడ్చిన సందర్భం నాకింకా గుర్తుంది అని. (ఈ సినిమాని తెలుగులో కూడా తీశారు, రవితేజ హీరోగా ’నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస” నేను కెరియర్ లో బాగా బిజీ అయిపోవటం వల్ల రెండు భాషలలో ఈ సినిమా చూడలేదనుకోండి. పాట విన్నాను అంతే.)

అలా నేను ఊహ తెలిసిన తర్వాత చూసిన మొదటి మరణం అది. ఏమీ చేయలేక నిస్సహాయంగా ఏడ్చిన సందర్భం అది.

ఈ శీను ఎవరు? అతన్ని డాన్స్ శీను అని ఎందుకు అంటారు? అతనితో నా పరిచయం ఎలా అయింది? ఎందుగ్గాను అతను చనిపోయాడు? అతని మరణం సహజమైందా లేదా నాకు బలంగా అనిపిస్తున్నట్టు హత్యేనా, లేదా ప్రమాద వశాత్తు జరిగిందా, ఈ సంఘటన ద్వారా యువత ఏదయినా నేర్చుకోవాల్సి ఉందా ఈ ప్రశ్నలన్నింటికీ ఈ కథలో సమాధానాలు లభిస్తాయి.

ఈ కథ వ్రాయటానికి ప్రధాన కారణం, అతని మరణం ద్వారా యువత ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన గుణ పాఠాలు ఎన్నో ఉన్నాయి.

ఇది జరిగి సుమారు ముఫై అయిదేళ్ళ పైమాటే అయి ఉంటుంది.

మరి ఈ సంఘటనలు ఇప్పుడు నెమరు వేసుకుంటున్న కారణం , రాజారావుతో ఇందాకటి సంభాషణ.

****

అది ఓ చిన్న ఊరు. అన్ని ఊర్లలాగానే అదీ ఒక ఊరు.

కొన్ని సినిమా థియేటర్లు, కొన్ని స్కూళ్ళు, కాలేజీలు ఇలా ఉండేది ఆ ఊరి వాతావరణం, పెద్ద ప్రత్యేకతలు ఏమీ లేని ఊరది.

నేను అప్పట్లో ఇంటర్మీడియేట్ చదువుకుంటున్నాను. నేను ఆ రోజుల్లో బక్కగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉండేవాడిని.

డాన్స్ శీను అనబడే ఈ శీనివాస్ అనే కుర్రాడు నా కంటే ఒక సంవత్సరం సీనియర్. అతనికెందుకో నా పైన అకారణమైన అభిమానం. బహుశా నన్ను చూడంగానే జాలి కలిగి, జాలితో కూడిన అభిమానంతో కూడిన ఇష్టం అనుకుంటా.

ఆ రోజుల్లో అందరూ మాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్ట్స్ కి ట్యూషన్లకి వెళ్ళే వారు. అప్పటికి ఇంకా కార్పొరేట్ కల్చర్ రాలేదు. ఆ చిన్న ఊళ్ళో ఇంటర్ మీడియేట్ చదవాలంటే, ఒకటి మా ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ ప్రయివేట్ జూనియర్ కాలేజి, లో చదవాలి లేదా ఊరి చివర ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజి లో చేరాలి.

మా నాన్నగారుండుకుని, "ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంట్లో అక్కయ్యలు కూడా చెప్పిస్తారు, మేథమేటిక్స్ చాలా ముఖ్యం. నువ్వు మేథ్స్ కు ట్యూషన్ కి వెళ్ళాలి" అని ఒక రోజు ప్రకటన చేశారు.

ఇంకేముంది, రెండో రోజే ట్యూషన్ లో చేరటం జరిగింది. మేము ప్రతి రోజు సాయంత్రం ట్యూషన్ కి వెళ్ళే వారం. మా బాచ్ కి ముందు సీనియర్ల బాచ్ నడుస్తూ ఉండేది.

అ రోజుల్లో మాట్యూషన్ మాష్టర్ గారు సరదాగా విద్యార్థులతో డాన్స్ ప్రదర్శనలు, పాటలు పాడించటం చేసే వారు. మా బాచ్ లో అంతా నాకు తోడు బోయిన వారే ఉండెవారు. సరదాగా ఓ డాన్స్ చేయటం లేదా ఏదయినా పాట పాడటం వచ్చేది కాదు మా బాచ్‍లో ఎవరికీ, కానీ మాకు ముందున్న సీనియర్స్ బాచ్ లో కుర్రాళ్ళు పాటలు పాడటం, డాన్స్ లు చేయటం ఇలా నానా హంగామా చేసే వారు. అందరూ కాదు కానీ, సన్నగా పొడుగ్గా చలాకిగా ఉండె ఒక కుర్రాడు చాలా చక్కగా డాన్స్ చేసేవాడు. అతనే మన కథానాయకుడు శీను.

డాన్స్ అంటే కూచి పూడో భరతనాట్యమో కాదు. సినిమా పాటలకు ఏవో ఓ నాలుగు స్టెప్పులు వేయటం అన్నమాట.

ఆరోజుల్లో మైకెల్ జాక్సన్ లాగా, చిరంజీవి లాగా స్టెప్పులు వేయటం ఓ పిచ్చి యువకులందరిలో.

పాంటుని బెల్ట్ బకుల్ దగ్గర ఎడమ అరచేత్తో పట్టుకుని ఇంకో చేయి గాల్లో ఊపుతూ, పొత్తి కడుపుని కాస్త అసభ్యంగా ఎగరేస్తు చేసేది ఓ ప్రధాన స్టెప్పు ఈ డాన్స్ లో భాగంగా.

ఓ సాయంత్రం మేము ట్యూషన్ కెళ్ళేటప్పటికి ఈ శీను యమా చలాకీగా ఈ తరహా డాన్స్ చేస్తున్నాడు. అవి ఖైదీ, వేట తదితర చిత్రాలు ఒక ఊపు ఊపుతున్న సందర్భాలు.

మేము అసంకల్పితంగా చప్పట్లు కొట్టాము. కళాకారులకు చప్పట్లకంటే మించిన ప్రొత్సాహం ఏమి ఉంటుంది? అతను ఆనందంగా మాకు కళ్ళతోనే అభినందనలు తెలిపాడు.

అతను కళ్ళతోనే భావాలు పలికించగలడు. నడుస్తుంటే కాస్త నాట్యం చేసినట్టు ఉంటుంది.

ఇక మా బాచ్ మొదలవ్వాలి కద, వాళ్ళు వెళ్ళి పోవటానికి ఆయత్తమయ్యారు. అప్పుడు శీను నా వద్దకు వచ్చి, కాస్తా వంగి (నాకంటే చాలా పొడవు అతను) మెల్లిగా గుస గుసగా అడిగాడు ’నిజంగా బాగా చేశానా’ అని.

నేను కంగారు పడ్డాను. కంగారు పడ్డప్పుడు నాకు తెలియకుండానే ఇంగ్లీష్ మాట్లాడతానట. (ఇది నా సన్నిహిత స్నేహితుల అభిప్రాయం).

’అన్నా అదరగొట్టావు’ అనే అర్థంలో ఇంగ్లీష్ లో ఏదో చెప్పాను.

అబ్బ ఈ కుర్రాడు ఇంగ్లీష్ భలే మాట్లాడతాడు అని అతను నా గూర్చి అప్పటి నుంచి విపరీతమైన ప్రచారం మొదలెట్టాడు.

ఇది నాకు శీనుకి మొదటి పరిచయం ముచ్చట.

ఆ తర్వాత నేను డిగ్రీ చదవటానికి వేరే ఊరికి వెళ్ళటం వల్ల ఆ ఊరితో టచ్ లో కోల్పోయాను. ఈ శీను ముచ్చట్లు తెలియవు నాకు.

కొన్నేళ్ళ తర్వాత నేను తిరిగి ఆ ఊరికి వచ్చి ఉంటున్న సందర్భంలో అతి యాధృచ్చికంగా కలిశాడు ఈ శీను.

పర్సనాలిటీ డెవలెప్ మెంట్ లెసన్స్ విషయంగా నాకు ఆదిగురువు అనదగ్గ ఓ బాంకు ఎంప్లాయి, క్జేవియర్ ని తరచు కలిసేవాడిని. ఆ రోజుల్లో నేను పైచదువులకి వెళ్ళలేదు, ఇటూ ఉద్యోగ ప్రయత్నాలు చేయటం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఎందుకో ఇంట్లో కూర్చుని బోలేడు కథలు వ్రాసే వాడిని.

ఇంకో సంగీతం మేష్టారు శ్రీ శంకర్ గారు కూడా మాతో కలిసేవారు. ఈ క్జేవియర్కి సంగీత సాహిత్యాల పిచ్చి. శంకర్ మేష్టారు గారికి సంగీతం పిచ్చి.

వీళ్ళకు తోడు, ఆరోజుల్లో ఓ పొడగాటి కుర్రాడు వచ్చి వీళ్ళిద్దరితో నాట్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు కూలంకషంగా మాట్లాడేవాడు. అతను అన్నమయ్య కీర్తనలకి , ఇతర జావళీలకి , జానపద గీతాలకి పిల్లలతో నృత్యాలు చేయిస్తూ కాలక్షేపం చేస్తున్నాడని తెలిసింది.

ఆ కుర్రాడు నన్ను చూడంగానే ఒక రోజు చనువుగా నాతో "హేయ్! బాగున్నావా. ఎక్కడికి వెళ్ళావు ఇన్నేళ్ళు?" అని పలకరించాడు. బుర్ర గోక్కున్నా అతనెవరైంది గుర్తు రాలేదు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా కూడా నాకు అనిపించలేదు.

ఇదో బలహీనత నాకు. మనుషుల పేర్లు, ముఖాలు గుర్తుండవు. ఏదైనా ఒక విషయం గుర్తు పేట్టుకోవటానికి, పెట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఫోకస్ లేకపోవడమే అని చెబుతారు.

ఎవరితోనయినా మాట్లాడుతున్నప్పుడు నేను పైకి, ’క్కిక్కిక్కి’ అని నవ్వుతూ వాళ్ళ మాటలు వింటున్నట్టు ఉంటాను కానీ, బహుశా నేను నిరంతరం నా ఆలోచనల్లో నిమగ్నమయి ఉంటాను.

ఆ కుర్రాడు నన్ను పరిశీలనగా చూసి, "హేయ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్! నన్ను మరిచి పోయావా" అనేశాడు. ఇంతకూ ఆ కుర్రాడు ఎవరో కాదు మన కథా నాయకుడు శీనునే.

అలా మా పరిచయం మళ్ళీ రెన్యూ అయింది. అతనికి అకారణమైన అభిమానం నా పై అని చెప్పాను కద.

ఆ రొజుల్లో నేను ఎవ్వరినీ కలిసే వాడిని కాదు. కేవలం బేసిక్, కోబాల్ అని కంప్యూటర్ కోర్స్‌లు నేర్చుకునే వాడిని. అప్పటికింకా విండోస్ ప్రవేశపెట్టబడలేదు.

నేను కేవలం కాలక్షేపానికి నేర్చుకునేవాడిని ఈ కోర్సులను. నాకు అప్పటికి తెలియదు, ఈ చిన్ని చిన్ని కంప్యూటర్ కోర్స్‌లతో మొదలైన ఆ ప్రయాణం నా జీవిత గమనాన్ని నిర్దేశిస్తుందని.

ఇక మళ్ళీ పరిచయం అయ్యాక ఈ శీను నన్ను వదిలే వాడు కాదు. అదే పనిగా మా ఇంటికి సైకిల్ వేసుకుని వచ్చి, నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసే వాడు.

కనీసం అంటే ఓ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళ ఇల్లు, ఊరికి దూరంగా కొత్తగా అభివృద్ది చెందుతున్న కాలనీ లో ఉండేవాడు అతను. ఆ రోజుల్లో అది చాలా గొప్ప దూరం. మా ఇల్లు ఊళ్ళో నడిబొడ్డున ఉండేది.

’నువ్వు ఎందుకు ఎప్పుడు నీలో నీవే ఉంటావు’ అని పట్టు పట్టి నన్ను సినిమాలకి తీస్కు వెళ్ళేవాడు.

ఆ రోజుల్లో నన్ను అనేక సినిమాలకి తీసుకువెళ్ళే వాడు. నేను టికెట్కి డబ్బులు ఇస్తానన్నా వద్దనే వాడు.

’నేను డాన్స్ లు నేర్పించి సంపాయిస్తున్నాను బాస్. నువ్వు ఇంకా సెటిల్ అవలేదు కద. అయ్యాకా చూద్దాం’ అనే వాడు .

అతనితో కల్సి, హరీష్, ఛార్మిళ నటించిన "ప్రాణదాత", రాంగోపాల్ వర్మ "రాత్రి", కే బాలచందర్ "అక్టోబర్ రెండు" ఇలా చిత్ర విచిత్రమైన సినిమాలు చూసే వాడిని.

అతనితో బాటుగా విధిగా ఓ నలుగురయిదుగురు స్నేహితులు వచ్చేవారు. వారు నాతో పెద్దగా కలిసే వారు కాదు. ఇతను కూడా నన్ను వారితో కలవనిచ్చేవాడు కాదు. ’నువ్వు మంచి కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయివి కృష్ణా. వీళ్ళందరూ చీప్ ఫెల్లోస్. నాకు తప్పదు కాబట్టి తిరుగుతున్నాను ఈ వెధవలతో’ అని నసిగే వాడు. ఎందుకు తప్పదో నాకు తెలిసేది కాదు.

ఆ చీప్ ఫెల్లోస్ అనబడే ఆ మిత్రులు అతని హత్యకి కారణం అవుతారని ఆ క్షణంలో నాకు తెలియదు.

ఆ రోజుల్లోనే గాంగ్ లీడర్ సినిమా కూడా వచ్చింది. శీను ఆ డాన్స్ లు కూడా చక్కగా చేసి చూపే వాడు అందరికీ. అడగని వాడు పాపాత్ముడు.

ఇవన్నీ ఇలా ఉండగా, నేను గమనించింది ఏమిటి అంటే, రోజులు గడిచే కొద్ది,ఈ శీను కి డాన్స్ పిచ్చి ముదిరిందే తప్పనిచ్చి తగ్గలేదు. నేను ఆ ఊళ్ళో లేని, అయిదేళ్ళ కాలంలో అతను సశాస్త్రీయంగా గురువు దగ్గర కూచిపూడి నృత్యం కూడా నేర్చుకుని ఏదో సర్టిఫికెట్ కూడా పొందాడు.

క్రమంగా అతని వ్యవహారనామం ’డాన్స్ శీను’ గా స్థిరపడింది.

అతను బాంకు పరీక్షలు వ్రాయాలని కానీ, ఇతర కాంపిటీటివ్ పరీక్షలు వ్రాయలని కానీ అనుకునేవాడు కాదు. అతని ధ్యాస ఎంతసేపున్నా నృత్యం మీదనే ఉండేది.

వాళ్ళింటికి కూడా తీసుకువెళ్ళే వాడు అప్పుడప్పుడూ.

వాళ్ళ నాన్న గారెప్పుడూ నాకు తారసపడలేదు. ఆ వివరం అతను చెప్పలేదు , నేను అడగలేదు. ఆయన చనిపోయారా, వాళ్ళకి దూరంగా ఎక్కడన్నా ఉంటున్నారా ఏమిటి అన్నది తెలియదు. ఆ ప్రస్తావన వచ్చినపుడు మౌనం వహించేవారు.

అతనికి ఒక చెల్లెలు ఉండేది. ఆ అమ్మాయికి మహా అంటే పదిహేను ఏండ్లు ఉంటాయి అప్పుడు. చాలా చక్కగా ఉండేది తను. జాలి. అకారణంగా ఆ అమ్మాయిని చూడంగానే నాకు కలిగిన మొదటి భావన అది.

ఇతను తన స్నేహితులని వాళ్ళింటికి తీస్కువెళ్ళినప్పుడల్లా వాళ్ళ అమ్మ గారు గోల పెట్టే వారు.

ఒక సారి నేను వెళ్ళినప్పుడు లోపలి గదిలోంచి వాళ్ళ అమ్మగారి మాటలు వినబడ్దాయి.

"ఇలాంటి స్నేహితులతో గడుపు నాన్నా. నీ తతిమ్మా స్నేహితులను వదిలించుకో" అంటోంది ఆవిడ. నాలో ఏమి కనపడిందో ఆవిడకి.

ఆ అమ్మాయి కూడా ’అన్నయ్యా’ అంటూ చక్కగా మాట్లాడేది నాతో.

తల్లి బాధ్యత, చెల్లి బాధ్యత ,చూసుకుంటూ తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుంటాడో కద ఇతను, అనిపించేది నాకు. అతను చూస్తే అసలు కెరియర్ అనే మాటే ఎత్తుకునే వాడు కాదు.

ఎట్టకేలకు అతనికి చిన్న ఊళ్ళో అప్పటికే పేరెన్నికగన్న ఓ పెద్ద క్రిష్టియన్ మిషనరీ స్కూల్లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. డాన్స్ టీచర్ గా అని గుర్తు.

అతను స్కూల్‍కి వెళ్ళి రావటం, సాయంత్రాలు ఒకటో రెండో బాచులు ఏర్పాటు చేసుకుని ఇంటి దగ్గర పిల్లలకి డాన్స్ చెప్పించటం చేసేవాడు.

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. అతనికి ఏ దురలవాట్లు లేవు. కాకపోతే జీవితంలో ఎదిగిపోవటానికి కావలసిన విద్యార్హతలు సంపాయించలేకపోయాడు, అందరిలా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవటానికి పరీక్షలు వ్రాసే ప్రయత్నాలు ఏవీ చేసే వాడు కాదు. అతని ధ్యాస అంతా డాన్స్ మీదనే ఉండేది.

రోజులు నింపాదిగా గడిచిపోతున్నాయి. పిల్లవాడు కుదురుగా ఉన్నాడు అని వాళ్ళ అమ్మగారు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

రోజులన్నీ ఒకేలాగా గడిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది.

మధ్యలో ఓ నెల రోజులు నేను మా బంధువల ఇంటికి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. నేను వచ్చీ రాంగానే, ఓ సాయంత్రం మా ఇంటికి వచ్చాడు, అతను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రావటం రావటమే, "ఇంగ్లీష్ ప్రొఫెసర్! నిన్ను ఓ సాయం అడుగుతాను. కాదనకు" అంటూ ముందరికాళ్ళకు బంధం వేశాడు. నాకేం అర్థం కాలేదు. అతనేం అడగబోతున్నాడో.

"మేము ఫ్రెండ్స్ అంతా కల్సి ఓ ట్యుటోరియల్ పాయింట్ పెట్టాము. మా ఫ్రెండ్స్ మిగతా సబ్జక్ట్స్ చెపుతారు. మేథ్స్ చెప్పించటానికి ఎవరో ఎందుకు నువ్వే చెప్పాలి. నీకు ఏదయినా పెద్ద ఉద్యోగం వచ్చేవరకూ సరదాగా ఉంటుంది, ఎంత సాయంత్రం ఓ రెండు గంటలు అంతే కద. ప్లీజ్ ప్లీజ్" అని నేను ఏమి అనలేని పరిస్థితిలో నన్ను ఇరికించేశాడు.

నేను అవును - కాదు కి మధ్యస్తంగా తల ఆడించాననుకుంటాను. అతను దాన్నే నా అంగీకారంగా భావించేసుకుని,

చంకలో ఉన్న బాగు లోంచి ఓ కలర్ ఫోటో ఆల్బం తీసి చూపాడు. వాళ్ళ ట్యుటోరియల్ పాయింట్ తాలూకు ప్రారంభోత్సవ దృశ్యాలు ఉన్నాయి. ఎవరో స్థానిక పెద్ద మనిషి వచ్చి రిబ్బన్ కట్ చేయటం, ఉపన్యాసాలు ఇవ్వటం, రంగు రంగుల తోరణాలు, షామియానాలు, కుర్చీలు, ఆహూతులు కాస్తా హడావుడిగా నే జరిగింది ఫంక్షన్.

అంతా బాగానే ఉంది కానీ టీచింగ్ లో నాకు ఎటువంటి అనుభవం లేదు. చీప్ ఫెల్లోస్ అని అతనిచే కితాబు ఇవ్వబడ్డ మిగతా వ్యక్తులు ఇప్పుడు నా మొదటి ఉద్యోగంలో నా సాటి ఉద్యోగుల హోదా వెలగబెట్టబోతున్నారు. టీచింగ్ విషయంలో నాకు ఏ మాత్రం అనుభవం లేదు అనుకుంటె, వాళ్ళు నాకన్నా అథమ స్థాయిలో ఉన్నారన్నది నిర్వివాదాంశం. వాళ్ళలో ఏ ఒక్కడూ ఇంటర్మీడియేట్ కూడా గట్టెక్కలేదు.

"అరే మనం టెన్త్ లో చదువుకున్న పాఠాలే. నీవు కాస్త మనసు పెట్టి చెబితే నీలాగా ఎవ్వరూ చెప్పలేరు. నా మాట విను" అంటూ నన్ను చివరికి ఎలాగో ఒప్పించాడు. వృక్షము లేని చోట ఆముద వృక్షమే మహా వృక్షం కద.

’సరే వీళ్ళ ట్యూషన్ పాయింట్‍కి పిల్లల్నెవరు పంపిస్తారులే, క్రమంగా విసుగొచ్చి వీళ్ళే ఊరుకుంటారు, వీళ్ళ మాట కాదనడం ఎందుకు, నేను ఓ రెండ్రోజులు వెళ్ళి ఆ ముచ్చటా చూసొస్తే పోలా?’ అని అనుకుని ఓ సాయంత్రం అక్కడికి వెళ్ళిన నాకు ఆశ్చర్యం కలిగిస్తూ అక్కడ బోలెడు మంది పిల్లలు కనపడ్డారు.

ఇలా ఎక్కడికి పడితే అక్కడికి పిల్లల్ని ఎలా పంపిస్తారు తల్లితండ్రులు, నా మనసులో కలిగిన మొదటి ఆలోచన అది, అక్కడ అంత మంది పిల్లల్ని చూడంగానే.

అప్పుడే అభివృద్ది చెందుతున్న ఆ కాలనీ ఊరికి కాస్తా దూరంగా విసిరేసినట్టు ఉండేది. ట్యూషన్లకి ఊరిలోకి వెళ్ళాలంటే ఇబ్బంది కాబట్టి, తమ కాలనీలోనే వెలసిన ట్యూషన్ పాయింట్ అన్చెప్పి తల్లితండ్రులు నమ్మకంతో పంపిస్తున్నారేమో.

కాలనీ లోనే ఓ డబల్ బెడ్ రూం ఇండిపెండెంట్ ఇల్లు తిస్కుని బయట బోర్డు పెట్టేసి వీళ్ళు ట్యూషన్లు మొదలెట్టేశారు.

డాన్స్ శీనుతో పాటు ఓ ముగ్గురు ఫ్రెండ్స్ టీచర్లన్న మాట.

ఫలానా పెద్ద స్కూల్లో టీచర్ మన శీను అన్నది ఒక్కటే అక్కడ తల్లి తండ్రులకు చెప్పుకోదగ్గ అంశం. మిగతా టీచర్లు ఎవరు, వారి అర్హతలు ఏమిటి అన్నది ఎవ్వరూ అడగలేదు, శీను చెప్పలేదు.

కళ్ళు బైర్లు కమ్మే నిజాలు, నేను జీవితంలో ఎన్నడూ చూడకూడని ఘోరాలు అక్కడ చూడబోతున్నానని నాకు చూచాయగా కూడా తెలియదు అక్కడ చేరిన మొదటి రోజు.

అంతా చుట్టు పక్కల కాలనీలోని పిల్లలు అనుకుంటా. అబ్బాయిలు, అమ్మాయిలు అంతా చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ కుర్ర టీచర్లు ఏమి చెబుతాన్నారా అని చూసిన నాకు మిడిగుడ్లు పడ్డాయి.

ఆ పిల్లలకి వాళ్ళ వాళ్ళ స్కూళ్ళలో ఇచ్చిన హోం వర్కులు ఇక్కడ కూర్చుని వ్రాసుకుంటారు కాసేపు. ఆ తరువాత ఏదో డౌట్ క్లారిఫయింగ్ సెషన్ అని చెప్పి, వాళ్ళేదో అడిగిన శాస్త్రం చేస్తారు, వీళ్ళేదో చెప్పిన శాస్త్రం చేస్తారు.

ఆ తరువాత సినిమాల గూర్చి, క్రికెట్ గూర్చి బాగా నేలబారుగా కామెంట్లు చేసుకుంటూ ఏదో సంభాషణ జరుగుతుంది.

అక్కడ టీచర్లలో గానీ , పిల్లల్లో గానీ చదువు కి సంబంధించి ఏ విధమైన ఆసక్తి కనపడదు. అంతా ఏదో ఒక కాలక్షేపం జాతర లాగా ఉంటుంది.

అక్కడ ఇంతకూ నేను పని చేసింది పట్టుమని ఒక అయిదు రోజులు మాత్రమే. కానీ ఒక జీవిత కాలానికి సరిపడ అనుభవాలు మూట కట్టుకున్నాను.

నేను శ్రద్దగా, ఏకాగ్రతగా నా పని నేను చేసుకుంటూ వచ్చాను.

పదవ తరగతిలో నేను చదువుకున్న పాఠాలే కాబట్టి చెప్పటంలో నాకు ఇబ్బంది ఏర్పడలేదు. టీచింగ్ అన్నది అలవాటు లేని పని కావటాన మొదట ఒకట్రెండు రోజులు అలవాటు కావటానికి సమయం తీస్కున్నాను.

అక్కడి పిల్లలు కూడా నా శ్రద్దని గమనించి నా దగ్గర పద్దతిగానె ఉండేవారు.

ఇక కథలో కీలక మలుపు అనదగ్గ సంఘటన వద్దకు వచ్చేసాము. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం వింటే మీకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

కార్తీక, పదో తరగతి చదివే అమ్మాయి. ఉన్నత కులానికి చెందిన పిల్ల అని ఇట్టే తెలిసిపోతుంది తనని చూడగానే , ఆ అమ్మాయి చాలా సిరిగల కుటుంబానికి చెందిన అమ్మాయని చెప్పాడు శీను ఆ తర్వాత.

లేత తమలపాకులా నాజూగ్గా, బంగారు వర్ణం మేని ఛాయతో, సన్నగా ఉంటుంది ఆ అమ్మాయి. ప్రపంచంలో ఉన్న అమాయకత్వం అంతా ఆ అమ్మాయి కళ్ళలోనే నిండి ఉంటుంది. వాళ్ళనాన్నగారు, అమ్మగారు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులట. వాళ్ళ నాన్నగారు వేరే ఏదో ఊర్లో పని చేస్తున్నారట, వారాంతంలో మాత్రమే వచ్చి ఒక రోజు ఉండి వెళతారు అట.

నేను పాఠం చెప్పిన ఆ నాలుగు రోజుల్లో మొదటి రోజొక్కటే ఆ అమ్మాయి చివరి దాకా నా క్లాసులో కూర్చుంది. కానీ చురుకుగా పాల్గొన లేదు. ఏ ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేకపోయింది. ఏదో అన్య మనస్కంగా ఉన్నట్టు తోచింది.

నాకు కేటాయించిన సబ్జక్ట్ మేథ్స్. అందరికీ ఆ సబ్జక్ట్ పట్ల భయ భక్తులు ఉండటం వల్లనుకుంటాను, నా క్లాసులో మాత్రం పిల్లలందరూ బుద్దిగా ఉండేవారు.

క్లాసులో నా వీపు వైపు తలుపు ఉంటుంది. రెండో రోజు క్లాసు ప్రారంభం అయ్యాక, సరిగ్గా ఓ పది నిమిషాల తర్వాత తలుపు దగ్గర ఎవరో నిలబడ్డట్టు అయింది. అంతే మంత్ర ముగ్ధలా లెచి నిలబడి, నడుచుకుంటూ బయటికి వెళ్ళింది కార్తిక. నన్ను అనుమతి అడగాలనే నియమం కూడా పాఠించలేదు. ఆమె కళ్ళలో ఏదో ఆనందం.

’ఏయ్! ఎక్కడికి వెళుతున్నావు?’ అని నే అడుగుతూనే ఉన్నాను. సమాధానం లేదు

’ఇక కార్తిక క్లాసులకు వచ్చినట్టే. మొయినుద్దీన్ సార్ వచ్చాడు కద’ పిల్లలు కిసుక్కున నవ్వారు.

నాకేమి అర్థం కాలేదు.

నేను డస్టర్, చాక్ పీసు పక్కన పెట్టేసి, చేతిలో ఉన్న టెక్ట్స్ బుక్ అలాగే పట్టుకుని గేటు దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్న డాన్స్ శీను దగ్గరికి వెళ్ళాను.

కార్తిక విషయం చెప్పి, ఇలా క్రమశిక్షణ లేకుంటే ఎలా అన్నాను.

అప్పుడు అతడు కాస్తా తడబడ్డాడు.

కాసేపు ఏదో నసిగి, చివరికి గొంతు పెగుల్చుకుని "ప్రొఫెసర్! నేను చెప్పాను కద. వీళ్ళు చీప్ ఫెల్లోస్ అని. నీవు ఏమి అనుకోకుండా నీ లెసన్ చెప్పేసేయ్. నిన్ను అందరూ బాగా ఇష్ట పడుతున్నారు" అన్నాడు.

అతని వివరణ నాకు ఏ మాత్రం అర్థం కాలేదు. నేను చెప్పింది ఏమిటి అతడు నాకు చెబుతున్నది ఏమిటి? క్లాసులోకి వెళ్ళబోయే ముందు అటూ ఇటూ అన్ని గదులలో చూశాను. నాకు ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు.

నా పాటికి నేను పాఠం చెప్పి వచ్చేశాను.

రెండో రోజు కూడా ఇలాగే జరిగింది. ఇక నేను ఆగలేకపోయాను. నీవు రేపటి నుంచి నా క్లాసులోకి రావద్దు అని చెప్పేశాను ఆ అమ్మాయికి. మూడో రోజు ఆ అమ్మాయి నా క్లాసులోకి రానేలేదు.

మూల గదిలో వాటర్ కూలర్ ఉంటుంది. ఆ వాటర్ కూలర్ పక్కనే ఒక గది ఉంటుంది. ఆ గది సాధారణంగా తలుపు వేసి ఉంతుంది.

ఆ రోజు క్లాస్ మధ్యలో దాహం వేసి, నేను వాటర్ కూలర్ వద్దకు వెళ్ళినపుడు నా దృష్టికి వచ్చింది ఆ ఘోరం.

తలుపులు మూసి ఉన్న పక్క గదిలోంచి ఏవో మూలుగులు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో ఏవో మాటలు. ఆ మాటలు, మూలుగులు నన్ను అప్రమత్తుడిని చేశాయి.

మొయినుద్దీన్ గొంతు, కార్తీక గొంతు వినిపిస్తున్నాయి లోపల నుంచి.

ఇంతలో, ఇంకో లెక్చరర్ ఆ వాటర్ కూలర్ ఉన్న గదిలోకి వచ్చాడు.

"ఒరే ఎంత సేపురా! త్వరగా రా! నేను వెయిటింగ్ ఇక్కడ" అనుకుంటూ వచ్చాడు రావటం రావటమే.

వాటర్ కూలర్ వద్ద నేను ఉండటం ఊహించలేదు అతను. కాస్తా ఖంగు తిన్నాడు. అతని పేరు రజాక్ అని గుర్తు.

ఇంతలో లోపలనుంచి సమాధానం వచ్చింది, ’ఓరే ఉండురా, ఇంకో పది నిమిషాలు. ఆ తర్వాత నువ్వు సూపర్‍గా ఎంజాయ్ చేద్దువు గానీ. మన కార్తీక ఫుల్ మూడ్ లో ఉంది ఈ రోజు’ లోపల్నుంచి మొయినుద్దీన్ గొంతు వినిపిస్తోంది.

నేను ఇంక అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాను.

ఈ వెధవలు ఆ అమ్మాయికి ఏవైనా మాయమాటలు చెప్పి లోబరచుకున్నారో, భయపెట్టారో, ఏదైనా బలహీనతని చిక్కిచ్చుకుని ఆమెని ఎటూ వెళ్ళనీకుండా ఇలా హింసిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు.

క్షణాలలో బయటికి వచ్చేశాను. సైకిల్ ఎక్కి నేరుగా ఇంటికి వచ్చేశాను.

’నాకేమి తినబుద్ది అవడం లేదని’ చెప్పి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకునుండి పోయాను.

నాలో కలిగిన భావనలని మాటల్లో చెప్పలేను.

కోపం, ఉక్రోషం, అసహాయత. ఆ వెధవలని అక్కడే ఎందుకు నేను పాతిపెట్టలేకపోయాను. ఎందుకింత అసమర్థత నాలో అని ఒక వేదన.

ఎందుకు పారిపోయి వచ్చేశాను అని నా మీద నాకే ఒక విధమైన కోపం.

నేను మరుసటి రోజు వెళ్ళలేదు ఇక, డాన్స్ శీను ,తనే రాత్రి ఎనిమిదింటికి సైకిలేసుకుని వచ్చి టీ స్టాల్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు. అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కద.

ఏదో వివరణ ఇవ్వబోయాడు.

"శీను నేనేమి మాట్లాడదలచుకోలేదు. ఆ వెధవలని వదిలించుకోకుంటే నీకు ఫ్యూచర్ ఉండదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఉసురు నీకు తగలక మానదు" అని ఆవేశంగా చెప్పాను

"నా తప్పేమీ లేదు. ఇందులో నా ప్రమేయం లేకుండానే నేను ఇరుక్కుపోయాను...." అంటూ ఏదో చెప్పబోయాడు. నేను ఇంకేమి వినలేదు.

సైకిలేసుకుని వచ్చేశాను. అతను బుద్ది మంతుడే కావచ్చు కానీ, తను ఏర్పాటు చేసిన సంస్థలో ఇంత ఘోరం జరుగుతూ ఉంటే అడ్డుచెప్పకుండా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు.

***

ఓ సంవత్సర కాలం గడిచిపోయింది.

ఈ సంవత్సరకాలంలో డాన్స్ శీను గూర్చి అసలు పట్టించుకోలేదు నేను. అతనేం చేస్తున్నాడో, అతని ట్యూషన్ పాయింట్ ఎలా ఉంది ఏమిటీ, ఇలాంటి విషయాలు కనుక్కునే ప్రయత్నాలేమీ నేను చేయలేదు.

కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఓ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తుండగా, క్లాక్ టవర్ సర్కిల్ వద్ద, దారిలో రజాక్ మోటార్ సైకిల్‍పై ఎదురు వచ్చాడు. నేను అతన్ని కనీసం గ్రీట్ చేయలేదు కూడా. చూపు మరల్చుకుని నా పాటికి నేను సైకిల్ నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాను.

అతను యూ టర్న్ తీసుకుని వెనక్కు వచ్చి,

"శీను చనిపోయాడు" ఉరుము లేని పిడుగులా ప్రకటించాడు.

నాకు ఒక నిమిషం ఏమీ అర్థం కాలేదు. షాక్‍కి గురయి అతన్నే చూస్తుండి పోయాను.

ఊళ్ళో ఎండలు చుర్రుమంటున్నాయి. రోడ్డు మీద ట్రాఫిక్ కూడా పలచగా ఉంది. దూరంగా ఎక్కడో ఒక కాకి దాహంతో అరుస్తూ ఉంది. అంత ఎండలో కూడా అతని మాటలకి నాకు వణుకు వచ్చింది

"ఈ ఉదయం శిరువెళ్ళ గ్రామం వద్ద నదికి ఈతకు వెళ్ళి నీళ్ళలో మునిగి చనిపోయాడు" అతనే తిరిగి చెప్పాడు. నాకేదో తేడాగా అనిపించింది. శిరువెళ్ళ వద్ద నదిలో అసలు నీళ్ళే ఉండవు, అందులో ఈ ఎండాకాలంలో ఎక్కడనుంచి వస్తాయి నీళ్ళు?

"నదిలో ఒక పాయలో ఊబిలో ఇరుక్కుని చనిపోయాడు. శవాన్ని ఇంటికి తెచ్చారు. మేము అంతా వెళుతున్నాం. నీవు కూడా వచ్చి చూస్తే బాగుంటుంది" అని చెప్పేసి వెళ్ళిపోయాడు

నేను క్జేవియర్ కలిసివెళ్ళాము శీను భౌతికకాయాన్ని చూడాటానికి.

నేను జీవితంలో చూసిన మొదటి మరణం అది. అక్కడి వాతావరణం చాలా విషాదంగా ఉంది. వాళ్ళ అమ్మ మాటలు రాక నిస్సత్తువగా గోడని ఆనుకుని కూర్చుని ఉండిపోయింది. ఉత్సాహానికి మారుపేరులా ఉండే వాళ్ళ చెల్లి విషాదానికి ప్రతిరూపంగా ఉంది. అక్కడి వాతావరణంలోనే ఒక విధమైన శోకం ఉంది.

’తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం

సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

పరివేదన బరువుబరువు కాగా

అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ

చిరునవ్వు చేయూత ఇవ్వక

మురికితనం కరుకుతనం నీ

సుకుమారపు హృదయానికి గాయం చేస్తే...

అటు పోతే, ఇటు పోతే అంతా

నిరాదరణతో అలక్ష్యంతో చూసి

ఒక్కణ్ణీ చేసి వేధించారని, బాధించారని,

వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయావా నేస్తం

తలవంచుకు వెళ్ళిపోయావా, నేస్తం

సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...

మహాప్రస్థానంలో మిత్రుడికి నివాళి ఇచ్చిన శ్రీ శ్రీ గారి వాక్యాలు గుర్తు వచ్చాయి

అతని నలుగురు మిత్రులు పైకి విషాదం చూపుతున్నారే కానీ వాళ్ళ కళ్ళలో దుఃఖానికన్నా భయం, బెదురు కనిపించాయి నాకు.

శీనుది సహజ మరణం కాదు అనేది ఎలాగూ తెలుస్తూ ఉంది, కానీ అది ప్రమాదం అంటే నమ్మబుద్ది కావటం లెదు నాకు .

వాళ్ళ ట్యుటోరియల్ పాయింట్ లో నేను చూసిన హేయమైన సంఘటనకి, శీను మరణానికి ఏదో బలమైన సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది.

అంతకు మూడు రోజులక్రితమే శీను నాకు వ్రాసిన ఉత్తరం కూడా నా అనుమానాలకి ఊతమిస్తోంది.

"ప్రొఫెసర్!

ఇదేమిటీ ఉండూరులోనే ఉంటూ ఉత్తరం వ్రాస్తున్నాను అని ఆశ్చర్య పోతున్నావు కద.

నీతో కుదురుగా మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వటంలేదుగా ఈ మధ్య. ఒక వేళ నీవు ఆ అవకాశం ఇచ్చినా నీకు సారీ ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి నాది.

పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. నీకు తెలుసు నాకు ఏ దురభ్యాసాలు లేవు. నాకు ఉన్న ఒకే ఒక బలహీనత ఈ నలుగురితో స్నేహం.

ఈ నలుగురు వెధవలు చిన్నప్పటి నుంచి క్లాస్‍మేట్స్ అవటం వల్ల ఇలాగే కొనసాగిస్తున్నాను. వీళ్ళకి వయసు వచ్చే కొద్ది చదువులు ఒంటబట్టలేదు కానీ, నానా చెడు అలవాట్లు మాత్రం ఒంటబట్టాయి.

క్రమంగా నా పరువు మర్యాదలు కూడా పోయే పరిస్థితులు కలగజేస్తున్నారు. నాకు డాన్స్ మాస్టార్ గా మంచి పేరు వస్తోంది, దూరదర్శన్ నుంచి కూడా అవకాశం వచ్చింది, అలాగే సినిమాలకి కూడా వెళ్ళే అవకాశాలు సుదూరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు ఒక స్థిరమైన ఉద్యోగం కూడా ఉంది. అయినప్పటికీ, ఈ వెధవలకి కాస్తా కుదురు వస్తుందనే ఒకే ఒక అభిప్రాయంతో నేను ట్యుటోరియల్ పాయింట్‍పెట్టటం జరిగింది.

కానీ నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటి.

నా వేలితో నేనే కంట్లో పొడుచుకున్నట్టు అయిపోయింది.

ఇలాంటివి ఇక్కడ జరగకూడదు, అని మొన్న నేను గట్టిగా చెప్పాను వాళ్ళకి. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెబుతాను అని వీళ్ళని బెదిరిస్తూ గట్టిగ చెప్పాను. ఆ విషయంగా గొప్ప గొడవ అయింది మా అయిదుగురి మధ్య.

తరువాత ఆశ్చర్యకరంగా ఆ మరుసటిరోజు నుంచి, వీళ్ళు చాలా బుద్ది మంతులుగా మారిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నారు.

నాకు ఈత రాదని తెలిసి నాకు ఈత నేర్పిస్తామని పోరు మొదలెట్టారు.

శిళ్ళంగేరి ఏటికి వెళ్దాం అనుకుంటున్నాం వచ్చేవారం. వీళ్ళు నలుగురు కుదురుగా ఉన్నారు ఇప్పుడు. వీళ్ళు నలుగురూ బాగు పడితే నాకంతకంటే ఏమి కావాలి.

నీవు అలుక మానేసి, మళ్ళీ మా దగ్గర మేథ్స్ చెప్పటానికి రాకూడదా?

ఇట్లు

నీ శీను."

ఇది ఆ ఉత్తరం సారాంశం.

అతని మనసు నేనెరుగుదును. అతను ఏ కల్మషం లేని పసిపిల్లాడిలాంటి వాడు. తెల్లనివన్నీ పాలని నమ్మేశాడు. ఈ నలుగురు కలిసి అతన్ని అడ్డు తొలగించుకున్నారు అని నాకు బలంగా అనిపిస్తోంది.

నేను అక్కడ ఉన్నంత సేపు వాళ్ళు ముళ్ళ మీద ఉన్నట్టు ఇబ్బంది పడ్డారు.

నేను క్జేవియర్ కాసేపు ఉండి వచ్చేశాము. మేము అక్కడ ఉండి కూడా చేయగలిగింది ఏమీ లేదు.

****

’డోంట్ సే ఎస్, వెన్ యూ వాంట్ టు సే నో’ అని ఇంగ్లీష్ లొ వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతారు.

’నీకు ఇష్టం లేని విషయాన్ని ఇష్టం లేదని సూటిగా చెప్పటం వ్యక్తిత్వం.

సూటిగా నీ భావాల్ని ఎదుటివారికి చెప్పలేకపోవడం ఒక పెద్ద లోపం. ఎదుటివాడు నొప్పి పడతాడేమో అని చెప్పి మనం వాళ్ళ ప్రతీ మాటకి అవును అవును అంటూ తలూపడాన్నిసబ్‍మిస్సివ్ కేరెక్టర్ అంటారు.

అదేదో ముతక సామెతలో చెప్పినట్టు, మొహమాటానికి పొతే- ఏదో అయ్యిందటగా.

ఇలాంటి మెతక స్వభావం గల వాళ్ళని తమ అవసరాలకి లాఘవంగా వాడుకునే అతితెలివి పరులు ఎక్కడైనా ఉంటారు.

శీను విషయంలో జరిగింది అదే. ఆ నలుగురు అప్రయోజకులని స్నేహితులనే భావనతో నెత్తికెక్కించుకుని చివరకి తన ప్రాణాలే కోల్పోయాడు.

ఈ యావత్తు కథలో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను అనే అసంతృప్తి నాకు ఇప్పటికీ ఉంది. నేను కొంచం స్థిరంగా నిలబడి, గట్టిగా అనుకునుంటే ఆ వెధవలని చట్టానికి అప్పజెప్పటమో, శీనుని గట్టిగా మందలించి వాళ్ళని ఆ ట్యుటోరియల్ పాయింట్‍నుంచి తన్ని తగలేయటమో చేసి ఉండాలి. వీటిలో ఏ ఒక్కటి నేను చేసి ఉండినా శీను ప్రాణాలని కాపాడగలిగి ఉండేవాడిని.

నేను కూడా ఒకరకంగా చేతకానివాడినే. మంచితనం ముసుగు వేసుకుని బ్రతికేస్తున్నాను బహుశా.

****

నేను ఒక నిశ్చయానికి వచ్చాను.

అప్పుడంటే చిన్నతనం. నిర్ణయాత్మకంగా వ్యవహరించలేకపోయాను.

కనీసం ఇప్పుడైనా, నాకు సరైంది అన్న విషయం చెప్పడం ధర్మం అనిపిస్తొంది.

సరైంది అని నాకు అనిపించిన విషయం చెప్పకపోవటం, విషయాన్ని నాన్చటం భావ్యం కాదని అనిపించింది.

"మీ అమ్మాయి ట్యూషన్ కి నీవు వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడి పరిస్థితులు నీకు అన్ని విధాలా సంతృప్తికరంగా అనిపిస్తేనే అమ్మాయిని ట్యూషన్ కి పంపు.

లేదా మనం చదువుకున్న చదువులతో పిల్లలకి మనమే చక్కగా చదువులు చెప్పుకోవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ కంపెనీలకి మన జీవితాల్ని బలిచేస్తున్నాము. పిల్లా పాపలతో సమయం గడపటానికి మాత్రం మనకు వెసులుబాటు ఉండదు."

అని కాసేపు ఆగి ఊపిరి పీల్చుకుని చెప్పాను "ఇప్పుడు నీకు ఒక జరిగిన కథ చెపుతాను..."

నేను చెప్పబోయే విషయానికి నాందిగా ఈ మాటలు చెప్పి, గొంతు సవరించుకుని, శీను కథ చెప్పటం మొదలెట్టాను.

రాజారావు శ్రద్ధగా వింటున్నాడు నా మాటల్ని.

కార్ వేగంగా ముందుకు వెళుతోంది.

సమాప్తం.

మరిన్ని కథలు

Sammohanastram
సమ్మోహనాస్త్రం
- బొబ్బు హేమావతి
Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి