భాగవత కథలు -26 ధర్మరాజు రాజసూయం - కందుల నాగేశ్వరరావు

Dharmaraju rajasuya yagam

భాగవత కథలు -26

ధర్మరాజు రాజసూయం

శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి వేంచేయుట:

ఒకనాడు నారదుడు నందనందనుని దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుడూ మిగిలిన యాదవులూ నారదమహర్షిని వినయంగా ఆహ్వానించి బంగారు సింహాసనంపై కూర్చుండబెట్టి గౌరవమర్యాదలతో పూజించారు. అప్పుడు కృష్ణుడు “మునీంద్రా సమస్తలోకాలు సంచరించే మీకు తెలియని విషయం అంటూ ఉండదు. పాండవులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలపండి” అని అడిగాడు. అప్పుడు నారదుడు చేతులు జోడించి “స్వామీ! నీకు తెలియని విషయం ఉంటుందా! ధర్మరాజు రాజసూయం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. నీ మేనబావ లోకహితం కోసం చేసే యజ్ఞాన్ని నీవు వెళ్ళిరక్షింప వలసి ఉంటుంది.నిన్ను చూసి రాజసూయానికి వచ్చిన మహారాజులు, మునీశ్వరులూ ధన్యులౌతారు”అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడి సలహా తీసుకొని రాజసూయానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు.

దారుకుడు తెచ్చిన దివ్యరథాన్ని అధిరోహించి పెద్దలందరికీ చెప్పి చతురంగ బలాలతో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థనగరానికి ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణుడి ఆగమనం తెలుసుకొన్న ధర్మరాజు అంతులేని సంతోషంతో బందు మిత్ర పురోహితులతో కలిసి స్వాగతం చెప్పాడు. పురుషోత్తముణ్ణి దర్శించడానికి పౌరులందరూ మేడలపై గుమిగూడారు.ముత్తైదువలు మంగళహారతులు ఇస్తుండగా శ్రీకృష్ణుడు అంతఃపురం ప్రవేశించాడు. కృష్ణుడు మేనత్త కుంతీదేవికి వందనం చేశాడు. ద్రౌపది కృష్ణుడికి వందనం చేసింది. శ్రీకృషునిభార్యలకు తాంబూలాలు, పట్టుచీరలు, మణిభూషణాలు ఇచ్చి అందరికీ విడిదులు, సౌకర్యాలు ఏర్పాటు చేయించారు.ధర్మరాజు చేసిన మర్యాదలకు సంతోషించిన శ్రీకృష్ణుడు కొన్ని నెలలు కాలం గడిపాడు.

ఒకనాడు సభాభవనంలో మంత్రులు, పురోహితులు, బందువులూ అందరూ ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం నెరవేర్చానే తన కోర్కెను శ్రీకృష్ణునికి తెలిపాడు. అప్పుడు కృష్ణుడు “ఓ ధర్మరాజా! నీ ఆలోచన సమంజసంగా ఉంది. శత్రు క్షయాన్నీ, కీర్తినీ, విజయాన్నీ సిద్ధింప చేస్తుంది కాబట్టి తప్పక ఈ యాగాన్ని ప్రారంభించు. నీ తమ్ముళ్లు శత్రువులను చీల్చిచెండాడగల సామర్థ్యం కలవారు. అవసరమైన సామగ్రిని సమకూర్చు.శత్రువులను జయించడానికినీ సోదరులను పంపు” అని చెప్పాడు.కృష్ణుని మాటలకు ధర్మరాజు సంతోషించి సహదేవుణ్ణిదక్షిణ దిశకు, నకులుణ్ణి పడమట దిశకు, అర్జునుణ్ణి ఉత్తర దిక్కుకు, భీముణ్ణి తూర్పు దిక్కుకు సేనలతో వెళ్ళి శత్రువులను జయించి రమ్మని పంపాడు. భీమార్జుననకుల సహదేవులు వెళ్ళి శత్రువులను జయించి కప్పాలు కట్టించుకొని, బహుమతులు అందుకొని తీసుకువచ్చి ధర్మరాజుకు అర్పించారు.తాను వెళ్ళిన దిక్కులో ఒక్క జరాసంధుడు తప్పమిగిలిన రాజులందరూ కుప్పం కట్టారని అర్జునుడు చెప్పాడు.

భీమసేన జరాసంధులయుద్ధం:

అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో “జరాసంధుణ్ణి చంపే ఉపాయం ఒకటి పూర్వం ఉద్దవుడు నాకు చెప్పాడు. జరాసంధుడికి బ్రాహ్మణులంటే భక్తి విశ్వాసాలు అధికం. వారు ఏదడిగినా లేదనకుండా తప్పక ఇస్తాడు. అందుచేత నేనూ, అర్జునుడూ, భీముడూ బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళి వాణ్ణి యుద్ధ బిక్ష పెట్టమని కోరుకుంటాము. అప్పుడు మల్లయుద్ధంలో భీముడు వాడిని చంపవచ్చు” అని చెప్పాడు. ధర్మరాజు అంగీకారంతో వారు ముగ్గురూ మారువేషాలలో గిరివ్రజపురానికి వెళ్లి మిక్కిల శ్రద్ధాభక్తులతో అతిథిసపర్యలు చేస్తూ ఉన్న జరాసంధుణ్ణి చూసారు.

జరాసంధుడు వారి ఆకారాలనూ, గంభీరమైన మాటలనూ, భుజాల మీద ఏర్పడ్డ కాయల గుర్తుల్నీ చూసి ‘వీరు బ్రాహ్మణ వేషం ధరించిన రాజశ్రేష్ఠులు కావచ్చు’ అని మనస్సులో తలంచాడు. వారెవరైనా సరే వారడిగినది దానమిచ్చి కీర్తిని పొందటమే ఉచితం అని తలిచినవాడై కృష్ణభీమార్జునులతో “మీ కోరిక తెలపండి. మీరేమిటి అడిగినా ఇస్తాను” అన్నాడు.

అప్పుడు కృష్ణుడు “మేము యుద్ధబిక్ష కోరుతున్నాం. నేను కృష్ణుణ్ణి, వీరు భీమార్జునులు. ఇందులో ఒకరితో యుద్ధం చేయవలసింది” అన్నాడు. కృష్ణుడి మాటలు విని జరాసంధుడు నవ్వి “కృష్ణా! నువ్వు నన్ను యుద్ధంలో ఎదిరించలేక ఎన్నో సార్లు పరుగెత్తి పారిపోయావు. నాకు భయపడి సముద్రం మధ్యలో ఇల్లు కట్టుకున్నావు. నీ పరాక్రమం నాకు తెలియనిది కాదు. అర్జునుడు బలశాలి అయినా చిన్నవాడు. ఈ భీముడు ఒక్కడే నాకు సరియైనవాడు. ఇతనితో యుద్ధం చేస్తాను” అన్నాడు.

పట్టణానికి వెలుపల చదునైన ప్రదేశంలో భీమసేన జరాసంధుల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. పెద్దపులుల్లా ఇద్దరూ ఒకరినొకరుభయంకరంగా గదలతో బాదుకున్నారు, ముష్టి యుద్ధానికి తలపడ్డారు. అప్పుడు జరాసంధుని పుట్టుకా చావూ తెలిసిన శ్రీకృష్ణుడు తన దివ్యతేజాన్ని భీమునితో ప్రవేశపెట్టాడు. తరువాత భీముడు చూస్తుండగా ఒక చెట్టు కొమ్మను పట్టుకొని రెండుగా చీల్చి ఎడమ భాగం కుడి వైపు, కుడి భాగం ఎడమ వైపు విసిరి ‘వీణ్ణి ఇలా చంపు’ అన్నట్టుగాసైగ చేసి చూపించాడు.భీమసేనుడు ఆ సూచన గ్రహించి జరాసంధుణ్ణి క్రింద పడేసి ఒక కాలిని తన కాలితో త్రొక్కిపట్టి రెండో కాలిని గట్టిగా పట్టుకొని తల వరకూ చీల్చి చంపాడు. ఇది చూస్తున్న పురజనులు హాహాకారాలు చేశారు. శ్రీకృష్ణుడు జరాసంధుడి కారాగారంలో ఉన్న రాజులందరనూ విడిపించాడు. చిక్కిశల్యమై, దుమ్ముకొట్టుకున్న శరీరాలతో, మాసిన బట్టలతో ఉన్న ఆ రాజులందరూ వారి పూర్వజన్మ సుకృతం వల్ల వాసుదేవుని దర్శించుకొని భక్తితో స్తుతించారు. శ్రీకృష్ణుడు ఆ రాజులందరి చేత మంగళస్నాలు చేయించి వారికి సముచిత వస్త్రాలు, మణి భూషణాదులు బహూకరించి వారి వారి రాజ్యాలకు పంపించాడు. జరాసంధుని కుమారుడైన సహదేవుడిని మగధరాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసి శ్రీకృష్ణుడు భీమార్జున సమేతంగా తిరిగి ఇంద్రప్రస్థపురం చేరాడు. పురజనులు విజయశంఖాలు పూరించారు. కృష్ణుడు ధర్మరాజుకు నమస్కరించి మగథలో జరిగిన వృత్తాంతం అంతా వివరించాడు. ధర్మరాజు కృష్ణునికి తనమీద గల స్నేహ వాత్సల్య కరుణలకు సంతోషిస్తూ స్తుతించాడు.

శిశుపాల వధ:

ధర్మరాజు కృష్ణుని ఆజ్ఞ ప్రకారం వేదవిజ్ఞాన పండితులైన బ్రాహ్మణులను యజ్ఞనిర్వాహకులుగా స్వీకరించాడు. వేదవ్యాసుడు, కశ్యపుడు, భరద్వాజుడు మొదలైన మునీశ్వరులనూ,ద్రోణకృపాది గురువులను, భీష్మధృతరాష్ట్రవిదురాది కురువృద్దులను, దుర్యోధనాది బంధుజనాన్ని, పుర ప్రముఖులను తన యజ్ఞానికి ఆహ్వానించాడు. వారందరూ సంతోషంతో వచ్చి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూండగా పురోహితులు యజ్ఞం ప్రారంభించారు. ధర్మరాజు వివిధ దేశాల రాజులు తనకు సమర్పించే కానుకలను స్వీకరించడానికి దుర్యోధనుణ్ణి నియమించాడు.యాచకులకు దానం చేయడానికి కర్ణుణ్ణి, భోజన పదార్థాలను తయారు చేయించడానికి భీముణ్ణి, శ్రీకృష్ణుడు ఆయన బృందం అవసరాలు చూడడానికి అర్జునుణ్ణి, యజ్జానికి కావలసినవి సమకూర్చడానికి నకులుణ్ణి, గురువులను, పెద్దలను పూజించడానికి సహదేవుణ్ణి, యాగానికి విచ్చేసిన సమస్త ప్రజలనూ అన్నపానాలతో సంతృప్తి పరచేందుకు ద్రౌపదినీ ధర్మరాజు నియమించాడు.

ధర్మరాజు చేస్తున్న యజ్ఞాన్ని అందరూమెచ్చుకున్నారు. యజ్ఞం పరిసమాప్తమైన చివరి దినం ధర్మరాజు ఋత్విక్కులను, సభాసదులను పూజించాలని అనుకున్నాడు. ఈ సందర్భంలో అగ్రపూజకు అర్హుడెవరనే ప్రశ్న ఉద్భవించింది. బుద్ధిమంతుడైన సహదేవుడు భగవంతుడైన కృష్ణుణ్ణి చూపించి“ఈ మహాత్ముణ్ణి పూజిస్తే సమస్తలోకాలు సంతోషిస్తాయ. సృష్టిస్థితి లయాలకు కారకుడైన ఈ పుణ్యపురుషుడు యజ్ఞఫలాన్ని ప్రసాదించే ప్రభువు, విష్ణుస్వరూపుడు. అగ్రపూజకు అర్హుడు ఇతడు కాక మరెవ్వరు?”అని అన్నాడు. సహదేవుడి మాటలకు సభలోని ప్రజలు, రాజులు, ఋషులు మొదలైన వారందరూ సంతోషంతో అంగీకరించారు. అప్పుడు ధర్మరాజు పద్మాల వంటి శ్రీకృష్ణుడి పాదాలను భక్తితో కడిగాడు. పాండవులు, కుంతి, ద్రౌపదీ శ్రీకృష్ణుడి పాదజలాన్ని తమ శిరస్సులపై జల్లుకొన్నారు. బంగారు పట్టువస్త్రాలతో, రత్నాలతో శ్రీకృష్ణుణ్ణి తస్కరించారు.

ఈ వైభవం చూసి ఓర్వలేకపోయిన శిశుపాలుడు అసూయతో ఆసనం దిగి శ్రీకృష్ణుడు వినేటట్లు సభాసదులతో ఇలా అన్నాడు. “యోగ్యులనూ అయోగ్యులనూ నిర్ణయించగల గొప్పవారు ఎందరో ఈ సభలో ఉండగా, ఈ పసివాడి మాటలు విని బుద్ధిహీనుడైన ఒక గొల్లపిల్లవాణ్ణి పూజించడానికి ఎలా సమ్మతించారు. కులగోత్రాలు లేనివాడు, తల్లిదండ్రులెవరో తెలియనివాడూ, దేవుడు లేనివాడూ, వావి వరుసలు లేనివాడూ అయినఈ గోపాలకుడు బ్రహ్మర్షుల పూజకు ఎలా అర్హుడవుతాడు?”. ఇలా ఇంకా ఎన్నో అమంగళకరమైన మాటలతో శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. శిశుపాలుడి మాటలు వినలేక మునులూ, రాజులూ చెవులు మూసుకొని సభ నుండి నిష్క్రమించారు.

పాండవులకు శిశుపాలుని మీద చాలా కోపం వచ్చింది. పాండవులూ, వారి మిత్రరాజులూ ఆయుధాలు ధరించి శిశుపాలుణ్ణి అదిలించి నిలబడ్డారు. శిశుపాలుడు ఏమాత్రం లక్ష్యపెట్టక డాలూ కత్తి తీసుకుని మరల శ్రీకృష్ణుణ్ణీ, అతణ్ణి అనుసరిస్తున్న వారినీ నిందించ సాగాడు. అప్పుడు కృష్ణుడు ఆగ్రహంతో లేచి తనకు ఎదురుగా నిలబడి దెబ్బలాటకు సిద్ధంగా ఉన్న శిశుపాలుని తీవ్రంగా చూస్తూ సుదర్శన చక్రంతో వాడి శిరస్సు ఖండించాడు.ఆ దృశ్యానికి చూచి శిశుపాలుడి పక్షంలోని రాజులు, సైనికులు తత్రపాటుతో పారిపోయారు. అందరూ ఆశ్చర్యపడేటట్లుగా శిశుపాలుని దేహం నుండి దివ్య తేజస్సు వెలువడి కృష్ణుడి శరీరంలో ప్రవేశించింది. మధుసూదనుని మీద అసూయతో మూడు జన్మలనుండి ముకుందుని నిందింస్తూ ఎల్లప్పుడూ విష్ణువుని ధ్యానిస్తూ ఉండడం వలన శిశుపాలుడు సమస్త పాపాల నుండి విముక్తుడై వైకుంఠ ప్రాప్తి పొందాడు.

ఆ తర్వాత ధర్మరాజు యజ్ఞం చేయించినఋత్విక్కులను, విచ్చేసిన సదస్యులను అనేక దక్షిణంతో తృప్తిపరిచి పూజించాడు.మహా సామ్రాజ్య వైభవంతో ధర్మరాజు గంగానదికి వెళ్ళి తన భార్యతో శాస్త్రోక్తంగా యజ్ఞానంతర స్నానం చేశాడు. ఆ సమయంలో దేవదుందుభులు మ్రోగాయి. పువ్వుల వాన కురిసింది. ధర్మరాజు యాగాన్ని చూడడానికి వచ్చిన మునులు, దేవతలు, పురోహితులు, ప్రజలు పాండవులను సంతోషంగా దీవించారు. శ్రీకృష్ణుని భక్తుడైన ధర్మరాజు చేసిన రాజసూయయాగాన్ని పొగుడుతూ, వచ్చిన వారంతా తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. శ్రీకృష్ణ భక్తులకు అసాధ్యమనేది లేదు కదా!

మయసభలో దుర్యోధనుడి భంగపాటు:

ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి పంపించడం ఇష్టంలేక ఇంకా కొన్నాళ్ళు ఉండమని కోరాడు. ధర్మరాజు ప్రార్థన మన్నించిన కృష్ణుడు యాదవులను తిరిగి ద్వారకకు పంపించి తాను కొద్దిమంది పరివారంతో ఇంద్రప్రస్థంలో వున్నాడు. ఐశ్వర్యంతోనూ యశస్సుతోనూ ప్రకాశిస్తున్న ధర్మరాజు అంతఃపురంలో కృష్ణుణ్ణి సేవిస్తూ ఉన్నాడు. దుర్యోధనుడు కూడా ఇంద్రప్రస్థనగరంలోనే ఇంకా కొన్నాళ్శు ఉన్నాడు.శ్రీకృష్ణసతుల మధ్య ప్రకాశిస్తున్న ద్రౌపదీదేవి సౌభాగ్యాన్నీ, ధర్మరాజు వైభవాన్నీ చూచి దుర్యోధనుడు అసూయతో లోలోపల బాధపడసాగాడు.

ఒకనాడు ధర్మరాజు తన మయసభాభవనంలో సింహాసనంపై కూర్చొని కొలువుతీరి ఉన్నాడు. ఆ సమయంలో రాజసం ఉట్టిపడే తేజస్సుతో తమ్ములు రాజులూ ఇరువైపులా అనుసరించి సేవింపగా దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. మయుడునిర్మించిన మాయలతోకూడిన మయసభ మధ్యలో, నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు ఎగగట్టుకొని, నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని దుర్యోధనుడు భ్రమకు లోనయ్యాడు. అది చూసిన భీమసేనుడు నవ్వాడు. ధర్మరాజు సైగచేస్తున్నా గ్రహించక అక్కడున్న ద్రౌపది మిగిలిన స్త్రీలూ పెద్దగా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఈ ఘోరమైన అవమానానికి సిగ్గుపడి కోపంతో దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయాడు.ఆ సమయంలో సభాసదుల ప్రవర్తనకు ధర్మరాజు చిన్నబోయాడు.భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి జరిగిన అవమానం గమనిస్తూ మౌనంగా ఉండిపోయాడు. తరువాత కృష్ణుడు ధర్మరాజు వద్ద శలవు తీసుకొని సతీసుత బంధు సహితంగా ద్వారకకు వెళ్ళిపోయాడు.

శ్రీకృష్ణుని ఆశ్శీసులతో ఆనాడు ధర్మరాజు కావించిన రాజసూయయాగం పాండవుల శక్తి సామర్థ్యాలను, వైభవాన్ని రాజులందరికీ చాటి చెప్పేందుకు, దుర్యోధనుడిలో అసూయా కోపాలను ప్రజ్వలింపజేసి తుదకు కురుక్షేత్రయుద్ధం జరగేందుకు నాంది అయ్యింది.

*శుభం*

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు