పరివర్తన - టి. వి. యెల్. గాయత్రి.

Parivarthana

సాయంత్రం నీరెండ బాల్కనీ లో పడుతున్నది. పిల్లలు వస్తారని నీరజ టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టింది. ఈ రోజు ఆమె మనసు చాలా అందోళనగా వుంది. విరజ, కృష్ణమోహన్ లకు ఇద్దరు సంతానం. ఒక పాప, ఒక బాబు. కృష్ణమోహన్ వాటర్ వర్క్స్ లో ఇంజనీరు. పాప శరణ్య మెడిసిన్ రెండో సంవత్సరము చదువుతుంటే బాబు తేజస్వి ఇంజనీరింగ్ కోసము ఎంసెట్ కోచింగ్ తీసికొంటున్నాడు. ఈమధ్య కొడుకులో మార్పుని గమనిస్తోంది విరజ. చీటికి మాటికి తల్లితండ్రులను విసుక్కోవటము, అక్కని తిట్టడము చేస్తున్నాడు. వాడికి కావలసినవి కొనిపెట్టినా ఎందుకో ఎప్పుడూ చికాకు పడుతూనే వుంటున్నాడు. పొద్దున కాలేజీకి వెళ్లేటప్పుడు కూడా ఏదో ఒక గొడవలేవ దీసి కోపంతో వెళ్లి పోయాడు. అది చాలా చిన్న విషయమే. టిఫిన్ దగ్గర చిన్న పేచీ. పూరీ కూర చెయ్యమంటే పొద్దున్నే హడావుడిలో కుదరదని, సాయంత్రము చేస్తానని, ఇప్పటికి ఉప్పు పొంగలి తినమని చెప్పింది విరజ. ఒక్క ఎగురు ఎగిరాడు తేజస్వి. "ఎప్పుడూ దిక్కుమాలిన టిఫిన్లు. నాకు ఇష్టమైనవేవీ చేసిపెట్టవు. నేనంటే ప్రేమలేదు. ఎప్పుడూ అక్కకి ఏం కావాలన్నా చేస్తావు. నా మాట మాత్రము వినవు "అంటూ విసవిసా నడిచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నటికి బాక్స్ కూడా తీసికెళ్ళలేదు. కొడుకు ప్రవర్తనకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విరజకు. భర్త స్నానం చేసి వచ్చాక " వీడెందుకో ఈ మధ్య బాగా విసుక్కుంటున్నాడు. టిఫిన్ తినకుండా వెళ్లి పోయాడు. బాక్స్ కూడా తీసికెళ్ళలేదు. " అంది బాధగా విరజ. "ఈ ఏజ్ లో పిల్లలు కొంచెము డిస్టర్బ్ గా వుంటారు. ఎటూ కాని వయసు. నువ్వేమీ బాధ పడకు. సాయంత్రానికి వాడే సర్దుకుంటాడు." అంటూ భార్యను అనునయించాడు కృష్ణమోహన్. సాయంత్రం వాడికి ఇష్టమైన పూరి, కూర చేసింది విరజ. ధుమధుమలాడుతూ పెట్టినవి తిని గదిలోకి వెళ్లిపోయాడు తేజస్వి. రెండు రోజుల తర్వాత మళ్ళీ గొడవ. గదిలోకి వెళ్లి ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ గడుపుతున్నాడు తప్ప శ్రద్దగా చదువుకోవటము కూడా తగ్గిపోయింది. పిలిస్తే ఖయ్యి మంటాడు. కృష్ణమోహన్ మందలించినా కూడా ఇంకా కోపంగా తగవులాడుతున్నాడు తప్ప ఫలితము లేకుండా పోయింది. ఇంకా కోప్పడితే ఇంట్లోంచి వెళ్లి పోతాడేమోనని భయము.నెల రోజులు కొడుకుతో గొడవలతోనే గడిచింది. విరజకు దిక్కు తోచలేదు. తన ఫ్రెండ్ సరళ తో విషయము చెప్పింది. " ఈ కాలము పిల్లలే అంత. నా కూతురు కూడా ప్రతి విషయానికి మండి పడేది. ఈ మధ్య మా అత్తగారిని తెచ్చి పెట్టుకున్నాము. కొంచెము నయముగా వుంది. ఆవిడ మెల్లిగా చెప్తే కొద్దికొద్దిగా వింటున్నది. నువ్వుకూడా మీ మామగారికి విషయము చెప్పు. ఏమన్నా హెల్పు దొరుకుతుందేమో చూడు!అని సలహా ఇచ్చింది సరళ. సరళ మాటలు విని ఆలోచనలో పడింది విరజ. సరళకు మామగారు లేరు. అత్తగారు ఒక్కటే.కొన్ని రోజులు వీళ్ళు దగ్గర, కొన్ని రోజులు వాళ్ళ మరిది గారి దగ్గర ఉంటుంది. మరి తమ అత్తగారు, మామగారు వచ్చి ఈ సిటీలో వుంటారా! రాత్రి భర్తతో విషయము చెప్పింది విరజ. "నాన్నగారు ఇక్కడికి వచ్చి ఎలా వుంటారు? ఆయనకి ఈ సిటీ లైఫ్ అలవాటు లేదాయె. పైగా గుళ్లో పౌరోహిత్యము, అక్కడ చాలా కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ వదిలి రారు. మనమే వీడికి సర్ది చెప్పుకోవాలి."అన్నాడు కృష్ణ మోహన్. " పోనీ రేపు నేనొకసారి వెళ్లి అత్తయ్య గారితో, మామయ్యగారితో మాట్లాడతాను. " "సరే "అన్నాడు కృష్ణమోహన్. రెండోరోజు బస్సుకి రాజమండ్రి బయలుదేరింది విరజ. రాజమండ్రి పక్కన కొంతమూరు లో విరజ మామగారు పూర్ణయ్య శాస్త్రి గారు పూజారి. పూర్ణయ్య గారికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. అందులో పెద్దవాడు రాఘవ. అయన దగ్గరే వేదము చదివి తిరుపతిలో దేవాలయములో పూజారిగా వున్నాడు. అతనికి ఇద్దరు మగపిల్లలు. చదువుల్లో వున్నారు. కూతురు జానకి.విశాఖపట్నం లో ఉంటుంది. ఆమె భర్త లెక్చరరు. ఆమెకు ఇద్దరు అడపిల్లలు. ఈ మధ్యే ఒక అమ్మాయికి పెళ్లి చేశారు కూడా.ఇక మూడో కొడుకు కృష్ణమోహన్. ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు.పూర్ణయ్య గారు సాధారణంగా ఎక్కడికీ కదలరు. గుళ్లో జరిగే కార్యక్రమాలు చాలానే ఉంటాయి. ఆయనకు వాటితోనే సరిపోతుంది. ఎప్పుడైనా పిల్లలని చూసి వెళతారు తప్ప పిల్లల దగ్గర ఎక్కువ రోజులు ఉండటానికి ఆయనకు కుదరదు. అప్పుడప్పుడూ పిల్లలే వచ్చి చూసి పోతుంటారు. తండ్రికి విరజ బస్సులో వస్తుందని ఫోన్ చేసి, విరజను బస్సెక్కించాడు కృష్ణమోహన్. రాజమండ్రిలో బస్సుదిగి కొంతమూరుకు ఆటో మాట్లాడుకొని బయలుదేరింది విరజ. ఇంటిముందు అరుగు మీద కూర్చుని కోడలి రాకకోసము ఎదురు చూస్తూ వుంది అత్తగారు పార్వతమ్మ. విరజ ఆటో దిగగానే చాటంత ముఖము చేసుకొని కోడలికి ఎదురువెళ్లింది. ఆటో వాడికి డబ్బులిచ్చి " ఎలా వున్నారు అత్తయ్యా " అంటూ పలకరించింది విరజ. " మేము బాగున్నాము రా!రాత్రి వాడు ఫోన్ చేసి నువ్వొక్క దానివి వస్తున్నావని చెప్పేసరికి కొంచెము కంగారు పడ్డాము. ఏమిటి విషయము అన్నా వాడు నువ్వొచ్చి చెప్తావన్నాడు. పిల్లలు బాగున్నారు కదా" " కంగారు ఏమీ లేదత్తయ్యా!అంతా బాగానే వున్నాము " " బస్సు ప్రయాణము కదా!రాత్రి సరిగ్గా నిద్రపట్టదు. కాస్త టిఫిను తిని విశ్రాంతి తీసికో!మీ మామగారు వచ్చాక లేద్దువు కానీ " అంటూ పార్వతమ్మ విరజ చేతిలో బ్యాగు తీసికొంది. మధ్యాహ్నం పూర్ణయ్య గారు భోజనానికి వచ్చారు. భోజనాలు అయ్యాక ఉయ్యాల బల్ల మీద కూర్చుని "ఏమిటి తల్లీ!హడావుడి గా వచ్చావు? " అన్నారాయన. విరజ కొడుకు ప్రవర్తనలో వస్తున్న మార్పు గురించి చెప్పింది. " ఎందుకనో వాడు ఇలా మారి పోతున్నాడు మామయ్యా!అడిగినవన్నీ శక్తి కొద్దీ కొనిపెట్టినా కూడా విసుగు, కోపము ఎక్కువయ్యాయి. చదువు మీద శ్రద్ధ తగ్గింది. ఏం చెయ్యాలో అర్ధము కావటము లేదు. ప్రతి విషయానికి మండి పడుతున్నాడు. వాళ్ళ నాన్నని కూడా లెక్క చెయ్యటము లేదు. " మాట్లాడుతుంటేనే కళ్ళ నీళ్లు తిరిగి కంఠము గద్గద మయ్యింది విరజకు. "ఇప్పుడు అందరి ఇళ్లల్లోను ఇదే వరస. సెల్లు ఫోన్లు వచ్చాక పిల్లల ప్రవర్తనే మారిపోయింది. వెనుకటి రోజులు కావు "అంటూ నిట్టూర్చింది పార్వతమ్మ. "ప్రతి సమస్యకు పరిష్కారము ఉంటుంది. మనము వెతుక్కోవాలి అంతే. నువ్వేమీ దిగులుపడకు.వాడి ఈడు వాళ్లలో కొంచెము క్రమశిక్షణ వున్న వాళ్ళను చూస్తే మెల్లిగా మార్పు వస్తుంది." అన్నారు పూర్ణయ్య గారు. "మీరు వచ్చి కొద్ది రోజులు వుంటే బాగుంటుందని అనుకుంటున్నాము మామయ్యా!పెద్ద వాళ్ళు చెప్తే వింటాడేమోనని." "దానికేముంది? పిల్లవాడి భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యము కాదు. నువ్వు దిగులు పడకు. ధైర్యము గావుండు." మామగారి మాటలు వినేసరికి విరజ ముఖములోకి కళ వచ్చింది. రెండు రోజుల తర్వాత అత్తగారితో, మామగారితో హైదరాబాద్ వచ్చింది విరజ. బామ్మని, తాతయ్యని చూసి పిల్లలిద్దరూ చాలా సంతోషపడ్డారు. కబుర్లలో కాలము గడిచిపోతూవుంది. తేజస్వి చదువు గురించి వాడి ఫ్రెండ్స్ గురించి అడిగి తెలుసుకున్నారు పూర్ణయ్య గారు. అయన రాత్రి పూట మనవడి గదిలోనే పడుకుంటానన్నారు. కొంచెము ఇబ్బందిగా మొహము పెట్టాడు తేజస్వి. " నేను రాత్రి పూట కొంచెము ఎక్కువ సేపు చదువుకుంటాను తాతయ్యా!మీకు డిస్ట్రబెన్స్ అవుతుందేమో " "అదేమీ లేదు. మీ నాన్న చదివే టప్పుడు కూడా వాడి దగ్గరే వుండేవాడిని. నీకు ఇబ్బందిగా వుంటే చెప్పు. " తేజస్వికి తాతగారు చెప్పే కథలు, చిన్నప్పటి వాళ్ళ నాన్న, విషయాలు ఆసక్తిగా ఉండేది. మళ్ళీ ఫ్రెండ్స్ తో ఫోన్లో చాటింగ్ కి కుదరటము లేదు. తాతయ్యతో పాటు గార్డెన్ కి వెళ్లే డ్యూటీ కూడా పడింది. దానితో కొంచెము ఫ్రెండ్స్ కి దూరమయ్యాడు. చివరకు ఒకరోజు తండ్రిని అడిగేశాడు. బామ్మ, తాతయ్య ఇక్కడ ఎన్ని రోజులుంటారని. తాతయ్యకు పనులున్నాయని, ఒక రెండు నెలలు ఉంటారని బదులిచ్చాడు కృష్ణమోహన్. ఒక నెల గడిచింది. తేజస్వికి కొంచెము ఇబ్బందిగా వున్నాకూడా తాతయ్య చెప్పే విషయాలు ఆసక్తికరంగాఉండేవి. అయన చాలా సామాన్య స్థితిలో ఉండి కూడా గొప్పవాళ్లు అయిన మహనీయుల కథలు చెప్పేవారు . మన సంస్కృతి, ధర్మాల గురించి చెప్పేవారు. పిల్ల వాడిలో తనకు తెలిసిన ప్రపంచం కాకుండా తెలిసికొనవలసిన విషయాలు చాలా ఉన్నాయనిపించేది. అలాగే ఒక పుస్తకము ఇచ్చి పిల్లల్ని రోజూ కొద్ది పేజీలు చదవమనేవారు. తేజస్వి మెల్లి మెల్లిగా బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నాడు. తాతయ్య ఎలాగూ ఉండేది ఇంకో నెలే కాబట్టి అయన మాట వింటే సరిపోతుందని వాడి భావన. ఆ పై వారము పిల్లల్ని తీసికొని పూర్ణయ్య గారు ఒక సమావేశానికి హాజరయ్యారు. అక్కడ మన దేశపు ఔన్నత్యము గురించి, ధర్మము గురించి కొద్దిమంది మాట్లాడారు. తరువాత వేదిక మీదకు వెళ్లి పూర్ణయ్య గారు కూడా ఉపన్యాసము ఇచ్చారు. కార్యక్రమం అంతా అయ్యాక అందరూ ఇంటికి వచ్చారు. ఈ రెండు వారల్లో తేజస్వి కోపము కాస్త తగ్గింది. సెల్ ఫోన్ వాడకము చాలా వరకూ తగ్గింది. ఒక రోజు పూర్ణయ్య గారు మనవడికి రెండు పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు. అవి స్వామి వివేకానందకు సంబంధించిన పుస్తకాలు. " ఇవెందుకు తాతయ్యా!" " వచ్చే వారము స్వామి వివేకానంద గురించి డిబేట్ ఉంది. నువ్వు మాట్లాడుదువు గాని " అమ్మో!స్టేజ్ మీదే!నాకు మాట్లాడటం రాదు తాతయ్యా!నన్ను వదిలెయ్యి. " "లేదు లేదు!నువ్వు చక్కగా మాట్లాడతావు. ఏమీ భయము లేదు. ముందు ఇవి చదువు. నిన్ను నేను ప్రిపేర్ చేస్తాను." పూర్ణయ్య గారి బలవంతం మీద తేజస్వి డిబేట్ కి ప్రిపేర్ అయ్యాడు. మధ్య మధ్యలో తాతయ్యని, నాన్నని అడిగి ఎలా మాట్లాడాలో తెలుసుకుంటూ ప్రాక్టీసు చేస్తున్నాడు. ఆరోజు రానే వచ్చింది. అందరూ కలిసి డిబేట్ కి బయలు దేరారు. అక్కడ అందరూ తన ఈడు పిల్లలే వున్నారు. డిబేట్ కార్యక్రమం మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళే స్టేజ్ మీద మాట్లాడారు. తేజస్వి వంతు వచ్చింది. స్టేజ్ మీద నిల్చుని చూశాడు. ఎదురుగ్గా అమ్మా, నాన్న, తాతయ్య, బామ్మ, అక్క కనిపించారు. తాతయ్య భయం లేదన్నట్లుగా చెయ్యి ఊపారు. కృష్ణమోహన్ విజయ చిహ్నం పెట్టాడు. అందరూ తననే చూస్తూ వుంటే తేజస్వి మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడక్కడా తడబడ్డా బాగానే ఉపన్యాసం చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. తేజస్వి కి ఆరోజు కన్సులేషన్ ప్రైజు వచ్చింది. అందరూ ఆనందంగా ఇంటికి వచ్చారు. అప్పటి నుండి తేజస్వి లో మార్పు వచ్చింది. తాతయ్య ఇచ్చిన పుస్తకాలు చదివి కొత్త కొత్త విషయాలు తెలిసికుంటున్నాడు. పెద్ద వాళ్ళతో ఎలా మసులుకోవాలో తెలుసుకుంటున్నాడు. మెల్లి మెల్లిగా తల్లి తండ్రి తో మెచ్యూరుడుగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి వారము లైబ్రరీకి వెళ్లి బుక్స్ తెచ్చుకోవటము, డిబేట్స్ కి ప్రిపేర్ అవటము అలవాటుఅయ్యింది. చదువులో కూడా అంతకుముందుకంటే మెరుగయ్యాడు. రెండు నెలలు గడిచాయి. పూర్ణయ్య గారు, పార్వతమ్మ కొంతమూరుకు ప్రయాణమయ్యారు. తాతయ్య వాళ్ళుఊరు వెళ్ళడము తేజస్వికి అస్సలు ఇష్టము లేదు. అయన చెప్పే కథలు, కొత్త కొత్త విషయాలు వాడికి వేరే ప్రపంచాన్ని చూపించేవి. ఇప్పుడు అయన వెళ్లి పోతానంటే దిగులుగా ఉంది. పిల్లవాడికి సర్ది చెప్పి ఊరుకు వెళ్లారు పూర్ణయ్య దంపతులు. కృష్ణ మోహన్ పూర్ణయ్య గారి డ్యూటీ తీసికొని పిల్లలతో మాట్లాడుతూ, తెలియనివి చెప్తూ గైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు విరజకు పిల్లవాడి గురించి బెంగలేదు. తేజస్వి తండ్రి గైడన్స్ లో తన టాలెంట్ ని మెరుగు పఱుచుకుంటూ ఎదుగు తున్నాడు. ఇప్పుడు ఆ ఇల్లు అనురాగనిలయము లాగా కళకళ లాడుతున్నది. (సమాప్తం ) ----------------------

మరిన్ని కథలు

Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు
Suhasini
సుహాసిని
- బొబ్బు హేమావతి
Pelli
పెళ్లి
- Madhunapantula chitti venkata subba Rao