చిలిపి మొగుడు అనుమానం పెళ్ళాం - పద్మావతి దివాకర్ల

Chilipi mogudu anumanam pellam

చిన్నిక్రిష్ణ భార్య అనంతలక్ష్మికి తన భర్తపైన అనంతమైన అనుమానం. పేరుకి చిన్నిక్రిష్ణ అయినా మనిషి మాత్రం చిలిపిక్రిష్ణుడని మా చెడ్డ అనుమానం ఆమెకి. ప్రతీరోజూ ఆఫీసునుండి తిరిగి వచ్చిన తర్వాత అతని జేబులు, బాగ్, టిఫిన్ బాక్సు అన్నీ చెక్ చేస్తుందామె ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని. అలాగే ఆ రోజు కూడా ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని జేబులో చెయ్యపెడితే ఆమె వెతకబోయే ఆధారాలకు బదులు చేతులకి చిరిగిపోయిన జేబు దారాలు మాత్రం తగిలాయి.

సాయంకాలం ఆఫీసు నుండి తిరిగివచ్చి ఫ్రెష్అవుతున్నప్పుడు కూడా ఏవైనా సందేహాస్పద సందేశాలు ఉన్నాయేమోనని ఫోన్ కెలుకుతుందామె. అలాగే ఆ సాయంకాలం చిన్నిక్రిష్ణ ఆఫీసునుండి వచ్చి బాత్రూంలో ఫ్రెష్ అవుతుండగా అతని వస్తువులన్నీ తనిఖీ పూర్తి చేసుకొని చేతులోకి ఫోన్ తీసుకుందామె. యధాలాపంగా సెల్‌లో ఉన్న పేర్లు చూసిన అనంతలక్ష్మి అనుమానం రెట్టింపైంది. ఉదయంనుండి వచ్చిన ఫోను వివరాలు ఆత్రంగా చూసింది. ఉమ నుండి అయిదు మిస్డ్‌కాల్సు ఉన్నాయి. అలాగే ఇంకొంతమంది నుండి కాల్సు చూసిన ఆమె అనుమానం మరింత ధృవపడింది. చిన్నిక్రిష్ణ ఫోన్ చేసిన వాళ్ళలో రమ, రాధ, గిరిజ, భవాని కూడా ఉన్నారు.

అసలే అనుమానం మనిషైన అనంతలక్ష్మి కోపంతో ఊగిపోయింది. తెల్లటి ఆమె ముఖం క్షణంలో ఎరుపెక్కింది. ‘చిన్నక్రిష్ణ బాత్రూంనుండి రానీ అతని పనిపడ్తాను’ అని ఆవేశంగా అనుకుంది. బాత్రూంనుండి వచ్చిన చిన్నిక్రిష్ణ భార్య బట్టలు అందిస్తుందని ఎదురు చూస్తున్నవాడల్లా వంటింట్లోంచి వచ్చే శబ్దాలు విని ముందు కంగారుపడ్డాడు. భూకంపం వచ్చిందేమోనని ముందు కంగారుపడ్డాడు కానీ, అది భార్య ప్రతాపమేనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఎందుకో అనంతలక్ష్మి అలిగి ఉంటుందిలే అనుకొని తనే బట్టలు వెతుక్కొని వేసుకుని సోఫాలో కూర్చున్నాడు. 'కాఫీ' అని కేకవేయబోయి ఆగిపోయాడు. అసలే అలకమూడ్‌లో, కోపంగా ఉంది అనంతలక్ష్మి. వేడివేడి కాఫీ తెచ్చి మొహం మీద పోసినా పోయవచ్చు, మౌనమే ఉత్తమమైన మందు అనుకొని మాట్లాడకుండా కూర్చున్నాడు. అనంతలక్ష్మి హాల్లోకి రానే వచ్చింది. చేతిలోని కాఫీ కప్పుని దబ్‌మని శబ్దం చేస్తూ టీపాయిపై పెట్టి ఏదో మాట్లాడాలని నోరు తెరిచేసరికి అక్కడే ఉన్న సెల్ మోగింది. పేరు చూసాడు. ఉమ నుండి వచ్చిందా ఫోన్. వెంటనే ఎత్తాడు.

"ఎంతసేపటినుండో ఫోన్ చేస్తూంటే తియ్యవేం?" అడిగింది అవతలవైపు కంఠం చిరాగ్గా.

"సారీ ఉమా!...నేను బైక్ నడుపుతూ ఉండటంవల్ల ఫోన్ ఎత్తలేదు. అయితే, ఉమా!...ఎప్పుడు వస్తున్నావు మన ప్రోగ్రాంకి?" అడిగాడు చిన్నిక్రిష్ణ.

"నేను వచ్చే శనివారం కోణార్కులో బయలుదేరుతున్నానని చెప్పడానికే ఫోన్ చేసాను. ఆదివారం అక్కడికి చేరుకున్నాక మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు ముందు అన్నట్లుగా హోటల్ 'మోతీ'లో మంచి డీలక్సు రూము బుక్ చెయ్యు! ఆదివారం నన్ను స్టేషన్‌లో పికప్ చేసుకోవడానికి రావాలి సుమా, మర్చిపోవద్దు. మిగతావాళ్ళ ధ్యాసలో పడి నన్ను మర్చి పోవద్దు సుమా!"

"అలాగే ఉమా! నిన్నెక్కడ మర్చిపోతాను? నిన్ను మర్చిపోతే నువ్వు నన్ను బతకనిస్తావా? చాలా రోజులైంది నిన్ను కలిసి, ఎప్పుడెప్పుడు వస్తావా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను." అన్నాడు చిన్నిక్రిష్ణ చిరునవ్వు నవ్వుతూ.

చిన్నిక్రిష్ణ చిరునవ్వు చూసిన అనంతలక్ష్మికి తన ఒంటిపై కారం పూసిన భావన కలిగింది. మనసులోనే కుతకుతా ఉడికిపోయింది. ఇలాంటివాడికి ఇచ్చి తన పెళ్ళి చేసినందుకు తల్లితండ్రుల మీద కోపం వచ్చింది. ఆనక చాలా మంచి సంబంధమని, చిన్నిక్రిష్ణ చాలా మంచివాడని, ఉత్తముడని చెప్పి పెళ్ళిసంబంధం తెచ్చిన పేరయ్యపంతుల్ని కసిదీరా తిట్టుకుంది. అక్కడే ఆ పేరయ్య ఉండిఉంటే ఆమె చూపులకి నిలువునా భస్మమై పోయి ఉండేవాడు. భర్తపైన కోపం అంతకంతకూ కొండలా పెరిగిపోతోంది. ఇన్నాళ్ళూ తన భర్త చిన్నిక్రిష్ణే అనుకుందికాని ఇప్పుడు ఈ వ్యవహారంతో చిలిపి క్రిష్ణుడని పూర్తిగా తేలిపోయింది. 'మరి ఇలా లాభం లేదు! తగిన ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిందే!' అని మనసులోనే నిశ్చయించుకుందామె.

చేస్తున్న పని సగంలోనే ఆపి వంటింట్లోంచి కోపంగా వచ్చిందామె చేత్తో అప్పడాలకర్రతో. అనంతలక్ష్మి భర్తతో ఏదో అనబోయేంతలోనే మళ్ళీ సెల్ మోగటం, చిన్నిక్రిష్ణ ఫోనెత్తి మాట్లాడటం జరిగింది. లావాలా ఎగిసిపడుతున్న కోపాన్ని బలవంతాన దిగమింగుకొని మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిందామె. అయితే ఆమె చెవులు మాత్రం ఫోన్లో భర్త మాట్లాడే మాటల్ని ఓ పక్క గ్రహిస్తూనే ఉన్నాయి.

"హల్లో! రమా...ఇప్పుడే నేను నీకు ఫోన్ చేయాలని అనుకునేలోగా నువ్వే చేసావు. మన కార్యక్రమం పక్కా అయింది. ఈ విషయం మిగతా అందరికీ కూడా చెప్పు." అన్నాడు చిన్నిక్రిష్ణ.

ఎంత చెవి రిక్కించి వినడానికి ప్రయత్నించినా అటువైపునుండి జవాబేమి వచ్చిందో ఏం మాత్రం తెలుసుకోలేకపోయింది అనంతలక్ష్మి. కానీ మొత్తానికి తనకి తెలియకుండా ఏదో జరుగుతోందని మాత్రం నిర్ధారణకి వచ్చిందామె. చిన్నిక్రిష్ణమీద పట్టరాని కోపం ముంచుకొచ్చింది. తనని 'డార్లింగ్..డార్లింగ్' అంటునే తన వెనక ఇంత భాగోతం నడిపిస్తున్నాడన్నమాట. ముందు ఉమతో మాట్లాడాడు. ఇప్పుడేమో రమ! వీళ్ళిద్దరేకాక తను ఫోనులో చూసిన రాధ, గిరిజ, భవాని కూడా ఉన్నారాయే! 'అమ్మో, అమ్మో! ఎంతో ఉత్తముడు అనుకున్న తన భర్త ఇంత గ్రంధసాంగుడా!' అంటూ మనసులో కుమిలిపోతూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది అనంతలక్ష్మి. ఆమె అనుకున్నట్లుగానే చిన్నిక్రిష్ణ ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసాడు. అందులో ఇద్దరితో ఒడియా భాషలోను, ఇంకొకరితో హిందీలోనూ మాట్లాడటంవల్ల చిన్నిక్రిష్ణ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో అర్ధమవలేదు అనంతలక్షికి. మంచి సంబంధమని, కట్నంలేదని, బుద్ధిమంతుడని చెప్పి దూరమని కూడా చూడకుండా ఒడిషాలో ఉద్యోగం చేస్తున్న చిన్నిక్రిష్ణకిచ్చి తన వివాహం చేసి గొంతుకోసారు. వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కముక్క అర్ధమైతే ఒట్టు! ఆర్నెల్లుగా ఎంత ప్రయిత్నించినా ఒక్కముక్క కూడా నేర్చుకోలేకపోయింది. ఇప్పటికే ఆయనకి ఐదుగురు గర్ల్ ఫ్రెండ్సున్నారు. ఈ అయిదుగురేకాక ఇంకెంతమందితో పరిచయం ఉందో ఏమిటో? అనంతలక్ష్మి మరి భరించలేకపోయింది. తన కోపం, ఆక్రోశం వంటింట్లో ఉన్న పాత్రలపైన, గిన్నెలపైన చూపించసాగింది.

చిన్నిక్రిష్ణ ఫోన్లోంచి బయటపడగానే, "మీరింత బరితెగిస్తారనుకోలేదు. మీలో ఇన్నికళలు ఉన్నాయని నాకు తెలియదు.” అని ఆవేశంతో రెచ్చిపోతూనే కుళాయి విప్పిందామె ముక్కు చీదుతూ.

అనంతలక్ష్మి ఏ విషయం మాట్లాడుతుందో అర్ధంకాక, "ఏమైందిప్పుడు?" అనడిగాడు.

"ఏమీ తెలియనట్లు మాట్లాడకండి. మీరేదో చాలా మంచివారని అనుకున్నానుగానీ ఇలాంటి వారని అనుకోలేదు. నా బతుకు నాశనం చేస్తారనుకోలేదు." అందామె మళ్ళీ కుళాయి విప్పుతూ.

"నేనేం చేసాను? నేనేం తప్పుడు పనులు చెయ్యలేదే?" చెప్పాడు చిన్నిక్రిష్ణ ఆమె మాట్లాడుతున్నదేమిటో అర్ధంకాక.

"ఆహాఁ...ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు వినే ఇప్పటివరకూ మోసపోయాను. ఇకముందు నన్ను మోసం చెయ్యలేరు. మీ బండారం పూర్తిగా బయటపడింది."

అనంతలక్ష్మి అంటున్నదేమిటో, బండారమేమిటో, బయటపడటమేమిటో ఏమీ అర్థం కాలేదు చిన్నిక్రిష్ణకి. "బండారమేమిటి, బయటపడటమేమిటి?" అడిగాడు చిన్నిక్రిష్ణ విస్మయంగా.

"నాకు తెలియదనుకోకండి! మీరు ఉమ, రమలతో మాట్లాడలేదూ? వాళ్ళేకాక, ఇంకా ముగ్గురు, మొత్తం అయిదుగురితో నా ముందే మాట్లాడుతున్నారు. అందర్నీ రమ్మని పిలిచారు కూడా? ఈ అయిదుగురేకాక మీకు ఇంకెంతమంది అమ్మాయాలతో పరిచయాలున్నాయో? ఛీ!...మీరు నా భర్త అని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. చేసింది చాలు, నాకు ఇంకేం చెప్పవద్దు. ఇంక మీరేం చెప్పినా వినే స్థితిలో నేను లేను. నన్ను ఎల్లకాలం మోసం చేయలేరు. నేనిక మీతో కాపురం చేయలేను. నేనిప్పుడే పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. అక్కడికి చేరిన తర్వాత మీకు విడాకులు నోటీసు పంపబోతున్నాను." దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పి తన బ్యాగ్ సర్దుకోసాగింది. అది చూసి చిన్నిక్రిష్ణ తెల్లబోయాడు.

బట్టలు సర్దుకుంటున్న అనంతలక్ష్మివద్దకు వెళ్ళి, "ఒక్కసారి నా మాట విను అనంతం!..." అని ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా, "నాకు ఇంకేం మీరు చెప్పనక్కరలేదు. నాకంతా తెలిసింది. ఇక మీ ముఖం నాకు చూపించకండి. నా నుంచి విడాకులకోసమే ఎదురు చూడండి." విసురుగా అని బ్యాగ్ సర్దుకొని వీధిలోకి వెళ్ళింది. ఏం చెప్పినా వినిపించుకోకుండా వీధిలో కనిపించిన ఆటోఎక్కిన అనంతలక్ష్మిని చూస్తూ నిట్టూర్చాడు చిన్నిక్రిష్ణ.

తన సంజాయిషీ కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయిన భార్యని ఏమనాలో తెలియలేదు. అప్పటికీ చాలాసార్లు ఫోన్ చేసినా కట్ చేసిందికాని ఫోనెత్తలేదు అనంతలక్ష్మి. రాయబారం పంపినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. భార్యకెలా నచ్చచెప్పాలో బోధపడలేదు. అసలు మాట్లాడటానికైనా ఆస్కారం ఇస్తేకదా ఆమె! ఇలా ఆలోచిస్తూ విచారంగా కూర్చున్న చిన్నిక్రిష్ణకి ఉమనుంచి అప్పుడే ఫోన్ రావడంతో అతని విచారమంతా దూదిపింజలా ఎగిరిపోయింది. ఫోనెత్తి ఉత్సాహంగా మాట్లాడసాగాడు.

భర్తపై విపరీతమైన కోపంవచ్చి పుట్టింటికి వచ్చిందేకాని, అనంతలక్ష్మి మనసు మనసులో లేదు. తను వచ్చినతర్వాత చిన్నిక్రిష్ణ ఎన్ని చిలిపి వేషాలు వేసి తన కొంప ఎక్కడ ముంచుతాడో అన్న భయం ఓ పక్క మనసులో ఉండనే ఉంది. ఆదివారంనాడు ఎలాగైనా బయలుదేరి చిన్నిక్రిష్ణని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీయాలని నిర్ణయించుకుందామె. ఆ రోజు ఉదయమే తమ్ముడు రాంబాబుని తోడు తీసుకొని బయలుదేరింది.

హోటల్ మోతీలో రూం సులభంగానే కనుక్కొన్నారు. ఇక చిన్నిక్రిష్ణ బండారం బయటపెట్టడానికి సిద్ధమైన అనంతలక్ష్మి తమ్ముడితో ఆ రూం తలుపుతట్టింది. తలుపు తీసిన చిన్నిక్రిష్ణ భార్యని చూసి అవాక్కయ్యాడు.

విపరీతమైన ఆవేశంతో అతన్ని జాడించడానికి వచ్చిన అనంతలక్ష్మి లోపలికి చూసి అమితాశ్చర్యం చెందింది. కారణం ఆమె అనుమానించినట్లు అక్కడెవరూ ఆడవాళ్ళు లేరు.

చిన్నిక్రిష్ణే ముందు తేరుకొని, "రా! అనంతం! వీళ్ళందరూ నా స్నేహితులు. ఇతను ఉమ, పూర్తిపేరు ఉమాపతి. ఇతను రమాపతి. మేం రమ అని పిలుస్తాం. వాళ్ళేమో రాధామోహన్, గిరిజాప్రసాద్, భవానీశంకర్. వీళ్ళందరూ నా క్లాస్‌మేట్స్. ఇక్కడ మా పూర్వవిద్యార్థుల సమావేశం ఉండటంవల్ల అందరూ వచ్చారు. నువ్వేమో పేర్లు చూసి అపార్థం చేసుకున్నావాయే! అప్పటికీ నీకు చెప్దామన్నా ఫోన్ కట్ చేసేసావు." తన స్నేహితులని పరిచయం చేస్తూ అన్నాడు.

వాస్తవం గ్రహించిన అనంతలక్ష్మి మరేమీ మాట్లాడలేకపోయింది. చిన్నిక్రిష్ణని అపార్థం చేసుకున్నందుకు సిగ్గుతో ఆమె తలవాలిపోయింది.

"ఇంటికి వెళ్ళు. ఓ గంటలో వీళ్ళని మనింటికి తీసుకువస్తాను. వీలైతే టిఫిన్ ఏదైనా చేసి ఉంచు."అన్న చిన్నిక్రిష్ణ మాటలకు అలాగేనని తలూపి వెనుదిరిగింది అనంతలక్ష్మి.

--------------------------

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి