బామ్మ బర్త్ డే - ఇందు చంద్రన్

Baamma birthday

కండ్లముందు వొచ్చిపోయే వాళ్ళు కదలతాఉన్నే గాని మనసెక్కడో ఉండాది.

"ఏంది కాంతక్క? తెల్లారకముందే వాకిట్లో కూసోని ఉండావు. ఇంట్లో ఎవురు లేరా?” అంది ఎదురింటి సుబ్బులు.

మాట సెవిలోకి ఎక్కకపోగా ఏడనో సూస్తా ఉండాది.

"ఓ కాంతక్కో! నిన్నే పిలిసేది”అంది ఇంకో తూరి గట్టింగా

ఆ మాటకి ఉలిక్కిపడి " ఏందిమే అట్టరస్తాండావు ?ఈడనే గదుండా” అంది కాంతమ్మ

కసురుకుంటా.

"ఏంది? ఈడనే ఉండావా? పిలస్తాంటే పలికినావా ? ”అంది తిన్నెమీద కూర్చుంటా

"ఏంలేమే , కొడుకు కోడాలు సిన్నమ్మిని బడికాడ వొదిలేదానికి పోయినారు” అంది ఏదో ఆలోసిస్తా.

" ఏంది అదొమాదిరి ఉండావు? బయట కూసోని ఉండావు. ఎవరున్నా ఏమన్నా అన్నేరా? ”అంది సుబ్బులు ఆరాలు తీస్తా.

"ఎవురో ఏదో అంటే ఇట్టెందుకు ఉంటాలేమే,ఒంట్లో ఒపికుంటే మనం ఆడిందే ఆట మనం పాడిందే పాట మన సేతుల్లో ఏది నిలవనప్పుడు ఇట్ట మూల పడి ఉండాలే.సెప్పుకోలేని నా బాధలు సానా ఉండాయిలే అంది నిట్టూరుస్తూ.

" ఏందమ్మో ఏష్టపోతాండావు. అయినా నీకేం తక్కువ సెప్పు ? నా బోటి దానికైతే పిల్ల పెండ్లి సెయ్యాల , కొడుకు ఉద్దోగానికి పోవాల అని దిగులుంటాది. కొడుకు చేతులారా సంపారిస్తా ఉండాడు. కూతుర్ని మంచిసోట కట్టబెట్టేసినావు. ఇంగేం దిగులు? ”అంది సుబ్బులు చీర కొంగుతో ఇసురుకుంటా.

“ఓక్కోతూరి అనిపిస్తాదిమే , ఎద్దుగా ఏడాది బతికేదానికన్నా ఆంబోతుగా ఆర్నెళ్ళు బతికితేసాలని ”

అంది కాంతమ్మ మెల్లంగా

" ఏందక్కో ఉన్నట్టుండి ఇట్టంటాండావు? మీవోడు ఏమన్నా అన్నేడా?”అంది సుబ్బులు కాంతమ్మ మొకంలోకి సూస్తా

" నీదెగ్గిర సెప్పేదానికేం ఉండాదిమే, ఇల్లలికిన గుడ్డని మూల్లో బడేసినట్టు నా మాట ఇప్పుడు ఇంట్లో ఎవురి సెవుల్లో ఎక్కతాదని? నా మాట ఇననోళ్ళకి నా మనుస్సులో ఏంవుండాదని ఎట్ట తెలస్తాది? బతికినన్ని రోజులు ఒకరు సెప్పిదానికి తగిన మాదిరి బతికేది అలవాటుసేసుకున్నా.పుట్టిన కాడ్నించి మాయమ్మానాయనా నా మనుస్సులో ఏవుండాదని ఒక దినము అడగకపాయ, కట్టుకున్నోడేమో ఉన్నని రోజులు నేను సెప్పాలనుకున్నది ఇనయకపాయ. మనిశిగా పుట్టినా గదమే ఆశలకి కొదవా? ఆశలు గూడా రోజు మాదిరి మారతా అట్నే మర్సిపోతా వస్తాండా. వయసైపోతాంది ఇంకెన్ని రోజులుంటానులేమే? నా ఆశలు కూడా నా పానం మాదిరి గాల్లో కలిసిపోతాది అంది బాధగా

" ఏందిక్కోవ్ పొద్దన్నే అట్ట మాట్టాడతావు? ఇప్పుడేవైపోయిందని ? నీ మాట ఎవురినలేదు ? నేనడగతా సెప్పు అంది సుబ్బులు ఓదార్చాలన్నట్టు.

“ఎవురినడగతావు? పోయిన మాయమ్మానాయన్నా? పోయిన నా మొగుణ్ణా? ”అంది ఒక మాదిరి నిట్టూర్చి నవ్వతా.

“పోయినోళ్ళని ఏందడిగేది గాని నీ కొడుకుని అడగతా రాని ”అంది సుబ్బులు వొత్తి పలుకుతా.

“నువ్వు గమ్మునుండుమే తల్లే, ఏదో కూడు గుడ్డ ఇచ్చి సూసుకుంటాండారు అదే ఎక్కువలేమే నాకి. కాటికి కాలు సాపే వయుస్సులో ఆశలు అప్పడాలు అంటే నవ్విపోతారు” అంది కాంతమ్మ నవ్వతా.

" సరిపోనిలే, నీ ఆశల్ని ఆర్చి తీర్చలేనులేక్కా ఆశలేందో సెప్పు ఇంటాను అంది సుబ్బులు.

చుట్టూ చూసి ఎవరు లేకపోగా సుబ్బులు చెవి దగ్గిరికి వొంగి " చెప్పినాక నవ్వబాకమే అంది ఎచ్చరిస్తా. సుబ్బులు నోటి మీద వేలేసుకుని దగ్గరికి జరిగి కూసుంది.

" నాగ్గూడా పుట్టిన రోజు సేసుకోవాలని ఉండాదిమే. అందరూ నా సుట్టూరా సేరి సప్పట్లు కొట్టి అదేందది ? ఆపి బర్త్ డే అది సెప్తే ఇనాలని ఉండాది అంది నిస్సత్తువగా నవ్వతా.

ఆ మాట విన్న సుబ్బులు నవ్వతా " నువ్వేదో సెప్తావనుకున్నే గదక్కా ఇదా అంది పకపకా నవ్వతా.

" ఏందిమే కిండల్ గా ఉండాదా? నీకి అంది కాంతమ్మ కోపంగా.

" నేందానికి నవ్వలేదులేక్కా, నువ్వేమన్నా రెండో పెండ్లి సేసుకుంటా అన్నేవా? పుట్టిన రోజే కదా? సేసుకుంటే పోలా అంది సుబ్బులు.

" గట్టింగా అర్సబాక ఎవురన్నా ఇంటే నవ్విపోతారు. ఈ వయుస్సులో పుట్టినరోజు ఏందని? కాని నాకి మొన్న నా కోడాలి పుట్టిన రోజని మావోడు పెద్ద కేకు తీసుకొచ్చినాడు. వంగపూత రంగు కోక తీసుకొచ్చినాడు. నా సేతికిచ్చినాడు సూసేదానికి పాత కోకమాదిరే ఉన్నే కాని కట్టుకున్నేంక బాగునింది. మా అమ్మికి కూడా అల్లుడు ఉంగరం కొన్నిచ్చినాడంట, పోనులో పోటోలు సూపించినారు.అయన్ని సూసినప్పుడు , ఇన్నప్పుడు అట్టమాదిరి కోక బంగారం కొనియ్యకపోయినా గాని నాకు అట్ట మాదిరి అందరి మద్దిలో సిన్న బిడ్డమాదిరి నిలబడి కేకు కోస్తాంటే సప్పట్లు కొడతాంటే ఇనాలని ఉంది. ఊహ తెల్సినకాడ్నించి నాకిది కావాలి నాకిది సేసుకోవాలి అని ఆశపడిపోయి మురిసినానే కాని ఏది జరగల. మాయమ్మోళ్లింట్లో కూడు దొరికేదే కష్టంగా ఉండేది. ఆరుమందిలో నేనే ఆఖరి దాన్ని మాయక్కలు అన్నలు ఇచ్చేటివే నాకని ఏది కొనిచ్చేటోళ్ళు గాదు , అప్పిట్లో పాచి రంగు గుబ్బ సేతులు పెట్టి పట్టుపావడా కుట్టించమని మాయమ్మని అడిగి ఏడ్సేదాన్ని మాయక్కలవి పట్టించి నామొకాన ఏసేది ఏడ్సిన సీదినా కాని మళ్లా దాన్నే ఏసుకునే దాన్ని. అట్టనే పెండ్లి గూడా మాయక్క పెండ్లిలోనే పనిలో పనన్నట్టు సేసేనారు. అందరుకల్సి చేతిలిదిలించుకున్నట్టు ఇదిలిచ్చుకునిపోయినారు. పెండ్లి అయిన రోజే తాగొచ్చి గొడ్డుని కొట్టినట్టినాడు. అందురూ అయ్యో పాపం అన్నేరే కాని ఎవురు ఎందుకు అని అడగకపాయ. ఆరోజు మొదులుకున్న దెబ్బలు దినం అలవాటైనాది. పుట్టింటికి పోయినాగాని భారంగా సూసినారు. అన్ని దిక్కులూ తిరిగినాంక మొగుడే దిక్కని మళ్ళీ ఆడికేబోయినా. మా వోడు కడుపునపడినాక పానం పుట్టుకొచ్చినాది. మళ్ళా సంవసరానికే అమ్మి పుట్టింది. ఆళ్ళు పుట్టినాంక నా మొగుడు ఒక మాదిరిగా మారినాడు. కాయ కష్టంజేసి చేతిలో దుడ్డు ఉన్నాకాని పిల్లోళ్ల కోసమే బతికేసినా, నాకని ఒక కోక రైక గూడా కొనుకునిందే లేదు.

నీలం రంగు కోక , రవ్వల కమ్మలు కొనుక్కోవాలని దాసి పెట్టినా కాని పిళ్లోళ్ల కన్నా ఎక్కువా ?అనిపించినాది. బిడ్డల్ని సూసి సూసి పెంచినా, వాళ్ళని సాకేదానికే పాకులాడినా. ఇప్పుడు వోళ్ళు స్థిరంగా నిలబడిపోయినారు. మా ఇంటాయానా పోయి చేరిపోయినాడు. ఇప్పుడు నాకే దిగులు లేదు గాని నా ఆశలన్ని అట్నే ఉండిపోయినాయి. ఇంటి గోడలమద్దిలోనే గడిపేసినా. ఇప్పుడు నా బిడ్డలు బాగా సూసుకుంటున్నా ఇట్టాంటి సిన్న సిన్న కోరికలు కూడా అట్నే కాలంలో కల్సిపోతాంటే బైటికి సెప్పలేక బాధంగా అనిపిస్తాండాది.నలుగుర్ని కల్సి మాటాడాల, బయటబోయి తిరగాల అని ఉన్నే గాని వయసైపోయినాంక ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా అంటాడు మావోడు. వాడ్ని ఇసికిచ్చగూడదని గమ్మునుండిబోయినా.పొయ్యేముందు నాకేం సేసుకోలేకపోయినానే, ఇది నాకి నచ్చినాదో, నాకని ఉండాదనో ఒక నాపకం గూడాలేదు. అడగక్కుండానే అన్నీ సేసినోళ్ళు నీకేం కావల అని ఒక తూరైనా అడగతారని సూస్తా బతికేస్తా ఉండా అంది కాంతమ్మ చీర కొంగుతో తుడుచుకుంటా.

"కూడు గుడ్డ బెడితే బాగ సూసుకున్నట్టా కాంతక్క? వయుస్సు అయిపోతే ఏదో పాత గుడ్డాల్లాగా మూలనేసి ఉండమంటారు , వయుస్సులో ఉన్నప్పుడు మన బిడ్డలకి ఏం గావాలో సూసి సూసి జేస్తాము మనకి లేనివి మన బిడ్డల కైనా ఉండల గదా అనుకున్నేము కాని మన బిడ్డలకి మన అమ్మ నాయనలకి ఇట్టా ఉండాలని ఇట్ట జేసుకోవాలని ఉండదా? ఇయన్నీ వాళ్ళకి సూడాలని ఉండదా? అని అనుకోరు కాంతక్క. ఎంత తీరుబాటు లేని పనైనా మన బిడ్డల్ని మనవెట్ట సూసుకోలేదు. పిల్లకాయలు అట్టానుకుంటే గదా. మనకప్పిట్లో అన్నిటికీ కష్టంగా ఉన్నే సరే బిడ్డలకోసమే అని సేసినాం. ఇప్పుడు అన్ని సేతికే దొరికేమాదిరి ఉన్నే గాని టైం ఏడుండాది అంటారు అంది సుబ్బులు బాధగా

“వాళ్ళు బాగుండార్లే మే, మనకి అది సాల్లే మనం ఎన్ని కావాలనుకుని వొదులుకోలేదు, ఇప్పిటి దాకా మనం అనుకున్నట్టే జరిగినాదా? మన రాత ఇంతే మే.ఇట్టా సానా ఉండాయిలే మే, వొక్క కలరు కోక కొనుక్కోవాల , రాళ్ళ కమ్మలు ఏసుకోవాల , సినిమాకి పోవలా ఇట్ట సానా ఉండాయిలేమే , ఆ వయుస్సులో సెయ్యలేనివి సూడలేనివి ఇప్పుడు సూడాలనిపిస్తాంటాది అవన్నీ మర్సిపోలా ఇది కూడా కొన్ని రోజులు పోతే మర్సిపోతా అంది దిగులుగా

“ఇట్టాంటియి ఆలోసించి మనస్సు బంగ పెట్టుకోబాక, మన కాలంలో అట్ట బతికేసినాము. తల్సుకుంటే మనకని మనం ఏం ఎనకేసుకోలేదు తిరిగి సూస్తే మన కష్టం , మన బిడ్డలు అంతే కాంతక్క మనకి ఇట్టాంటివి సూసే అదృష్టం లేకపాయే అంతే ”అంది సుబ్బులు.

“అంతేలేమే...మన రాత ఇట్ట రాసిఉంటే ఎవురేంజేస్తారు”అంది కాంత మనస్సుకి సర్ది చెప్పుకుంటూ.

“నువ్వు ఇట్టంటియి ఆలోసిస్తా అట్ట ఉండబాగ అంది సుబ్బులు.

"ఉతారుగా సూసుకున్న అరవై ఉండవా? ఇంకా ఐదారేండ్లు అది గూడా ఆ బిపి చక్కెర రోగం లేకపోతేనే మళ్ళా పోయినాక ఎవురుపట్టించుకుంటార్లేమే పోటోలకి దండేసి దణ్ణం పెట్టుకునిపోతరు అంది కాంతమ్మ కిసుక్కుమని నవ్వతా

" నీకేం నువ్వు నూరేళ్ళు బాగుంటావులేగాని నువ్వు ఎప్పుడు పుట్టిన రోజు తెలుసా? అంది సుబ్బులు నవ్వతా.

" ఎవుడికి తెలుసుమే తిక్కలదానా, వినాయకపండగరోజు కుడుములు సేస్తాంటే పుట్టినానని మాయమ్మ అంటా ఉండేది అంది కాంతమ్మ గుర్తు చేసుకుంటా.

కాసేపు ఇద్దరూ మాట్లాడుకుని " పొయ్యొస్తా కాంతక్క ఇంట్లో ఏడవి ఆడ్నే ఇడిసిపెట్టొచ్చినా నీతో కూసున్నా మాటల్లో పడి మర్సిపోయినా” అంది సుబ్బులు పైకి లేస్తా.

"పో పొయి పనిసూడు అంది కాంతమ్మ మళ్ళా ఆలోచనల్లోకి దూరిపోతా.

"ఓ కాంతక్కా...కాంతక్కా! అని అరుస్తున్న సుబ్బులు గొంతు విని కాంతమ్మ మంచం మీద నుండి లేచి నెమ్మది గా వస్తూ "వస్తాండా మే”అంది.

సుబ్బులు ని చూసి " ఎందుకుమే అట్ట అరస్తాండావు” అంది చిరాగ్గా మొహం పెట్టి.

"సిన్న పనుండాది మా యింటికాడికి రా” అంది సుబ్బులు.

" ఏమ్మే? ఎందుకట్టా అరస్తా వొచ్చినావు ? ఏవైనాది” అంది కంగారుగా చూస్తూ.

"ఇంటికాడి దాకా రాక్కా” అంది సుబ్బులు.

పద మే అంటూ మోకాలు పట్టుకుని నెమ్మదిగా మెట్లు దిగి సుబ్బులు ఇంటి దగ్గరికి చేరింది.ఇంట్లో అంతా చీకటిగా ఉంది.

"వోమ్మే సుబ్బులూ లైట్ అయినా ఎయ్యొచ్చు గదమే సీకట్లో ఏం అగుపడట్లా, ఏంసేస్తాండారు” అంది చూస్తూ

ఇంతలో లైట్ ఆన్ చేయడంతో చుట్టూ చూసింద.పక్కింట్లో ఎదురింట్లో పిల్లలు , సుబ్బులు పిల్లలు కొంత మంది ఉన్నారు.

"హ్యాపి బర్త్ డే అంది సుబ్బులు కాంతమ్మ చేయిని పట్టుకుంటూ

కాంతమ్మ అట్నే కొయ్యబొమ్మమాదిరి నిలబడి చూస్తా ఉండాది, కాసేపటికి తేరుకుని “ఏందిమే ఇదంతా ”అంది కాంతమ్మ కంగారుగా.

“సర్ పైజ్” అంది సుబ్బులు నవ్వతా.

“అమ్మా అది సర్ పైజ్ కాదు ,సర్ ప్రైజ్”అంది సుబ్బులు కూతురు కవిత.

“ఏదో ఒకటిలే మాకిట్టే వొచ్చు”అంది సుబ్బులు నవ్వతా.

కాంతమ్మ ముందు చిన్న స్టూల్ వేసి దాని మీద కేక్ పెట్టి “కట్ సేయ్యి కాంతక్క”అంది సుబ్బులు.

కాంతమ్మ ఆనందంతో ఉప్పొంగిపోతూ వణుకుతున్న చేత్తో కేక్ కట్ చేస్తూ ఉంది.

అందరూ హ్యాపి బర్త్ డే టు యూ అంటూ పాడుతూ ఉన్నారు.

కాంతమ్మ కేక్ ముక్క తీసుకుని సుబ్బులుకి పెడుతూ “ మే నువ్వు ఇట్ట సేస్తావని అనుకోలేదు మే”

అంది కళ్ళ నిండా నిండుకున్న నీళ్ళతో.

“సిన్నబిడ్డ మాదిరి ఏడస్తాండావు ఏందక్కా” అంది సుబ్బులు ఓదారస్తా.

“సిన్నబిడ్డనే కదమే , ఈ రోజే పుట్టినా కదా” అంది కాంతమ్మ నవ్వతా కళ్ల నుండి జారిన కన్నీళ్ళని తుడుచుకుంటా.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి