సహనం - వెంకటరమణ శర్మ పోడూరి

Sahanam

సహనం "ఓటీటి లో కొత్త సినిమా ఒకటి వచ్చింది. రా చూద్దాం " అని వంట ఇంట్లో పని ముగించుకుని బెడ్ రూం వైపు వెడుతున్న జానకమ్మ గారిని పిలిచారు, భద్రయ్య గారు. ఆవిడ వచ్చి కూర్చుంది. ఆ సినిమా ప్రారంభం అయిన కొద్ది నిముషాలకే, ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాల లో చూపించే సీన్ల కంటే, బాగా దిగజారిన సీన్ ఒకటి స్క్రీన్ మీద కి రావడం తో, ఆవిడ చిరాకు గా వెళ్ళిపోయి సెల్ ఫోన్ లో వాట్సాప్ చూసుకోవడం లో పడింది. అటువంటి వాటి విషయం లో పదేళ్ల క్రితమే వారి మధ్య ఫులస్టాప్ జరిగి పోయింది. ఆయన కాసేపు చూసి ఛానల్ మార్చి ఎదో పాత సినిమా పెట్టుకున్నాడు. *** బెడ్ రూం లోకి వెళ్లి మంచం మీద పడుకుని, సెల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కొంత సేపు చూసినా ఆవిడ మనసు ఆ వేళ మధ్యాహ్నం జరిగిన చిన్న సంఘటన మీదకి పదే పదే పోవడం ఆప లేక పోయింది. భద్రయ్య గారు, జానకమ్మ గారు, సింగపూర్ లో ఉన్న కొడుకు రాజా వాళ్ళ కోసం కొనిపెట్టిన ఫ్లాట్ లో ఉంటారు. ఒక్కొక్క ఫ్లోర్ లో నాలుగు ఫ్లాట్స్ చొప్పున నాలుగు అంతస్తుల కాంప్లెక్స్ వాళ్ళది. రాజా స్నేహితుడు మురళి కూడా, రాజా తీసుకున్న ఫ్లోర్ లోనే తన తల్లి తండ్రుల కోసం ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. మూర్తిరాజు గారు, భార్య వర్ధనమ్మ గారు అందులో ఉంటారు. కాంప్లెక్స్ లో చేరడానికి ముందే, మురళీ, రాజా లా స్నేహం దృష్ట్యా ఇరు కుటుంబాలకి పరిచయం ఉన్నా, ఇక్కడ ఫ్లాట్స్ లో మకాం పెట్టినప్పటి నుంచి జానకమ్మ గారి మధ్య, వర్ధనమ్మ గారి మధ్య స్నేహం పెరిగింది. ఎదో సమయం లో ఇద్దరు కలిసి కష్టం సుఖం చెప్పుకునే వారు. మనసులు విప్పి అన్ని విషయాలు మాట్లాడు కునేవారు. ఒకళ్ళ ఫ్లాట్ కి ఒకళ్ళు వచ్చినప్పుడు కాలింగ్ బెల్ కొట్టి లోపలికి వెళ్లడం అలవాటు. క్రితం రోజు, మద్యాహ్నం కునుకు తీసే ముందు వర్ధనమ్మ గారితో కార్తీక వన భోజనం గురించి మాట్లాడదామని వాళ్ల ఫ్లాట్ దగ్గరికి వెళ్ళింది జానకమ్మ గారు. బెల్లు కొట్టబోయి, తలుపు కొద్దిగా తీసి ఉండటం చూసి, మెల్లిగా తలుపు తెరిచి హాలు లో కొంచం దూరం గా కనపడిన సీన్ చూసి వెంటనే వెనక్కి వచ్చేసింది. ఉయ్యాలా బల్ల మీద కూర్చుని, అటు గా వెడుతున్న వర్ధనమ్మ గారి ని చేయి పెట్టి మూర్తి రాజు గారు తన వైపు లాగడం, ఆవిడ వెంటనే చిరాకు గా విదిలించడం, జానకమ్మ గారు చూసిన ఒక్క క్షణం లో ను జరిగి పోయాయి. " ఇంకా నయం వాళ్ళు చూడ లేదు నన్ను. తలుపు తెరిచి ఉండటం వాళ్ళు చూసుకోలేదు " అనుకుంది జానకమ్మ గారు వెనక్కి వస్తూ. ఈవిడ ఎప్పుడు వెళ్లినా మూర్తి రాజు గారు తన గది లో కంప్యూటర్ ముందు కూర్చునే ఉండేవాడు. అందుకనే తలుపు తెరిచి వెళ్ళ బోయింది. నిన్నటి నుంచీ అదే సీన్ గుర్తుకు వస్తూ అనేక ఆలోచన లు వస్తూనే ఉన్నాయి ఆవిడకి. భద్రయ్య గారితో పోల్చుకుని మూర్తి రాజు గారి ప్రవర్తనకి ఆవిడ చాలా ఆశ్చర్య పడింది. *** ఆ రెండు కుటుంబాలు ఉన్న ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ ఖాళీ అయి కాళింది అనే ఆవిడ వచ్చి చేరింది. ఆవిడ అందులో చేరడం వల్ల జానకమ్మ గారిని, వర్ధనమ్మని ప్రభావితం చేసే సంఘటన జరుగుతుంది అని అప్పుడు వాళ్ళు ఊహించలేదు. కాళింది గారు వీళ్లిద్దరి కంటే బాగా చిన్నది. వాచ్మన్ ఇచ్చిన సమాచారం బట్టి ఒంటరి విధవరాలు. బ్యూటిపార్లర్ నడుపుతుంది. ఈ మధ్యనే ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఆవిడ ఎక్కువ బయటికి వచ్చేది కాదు. ఒక రోజు, జానకమ్మ గారు, వర్ధనమ్మ గారు, కాంప్లెక్స్ ఆనుకుని ఉన్న రోడ్డు మీద వారం, వారం పెట్టే సంత లో కూరలు కొనుక్కోవడానికి వెడితే కాళింది కూడా వచ్చింది. ఆవిడ కట్టు బొట్టు తీరు, అంగ సౌష్టవం చాలా ప్రత్యేకం అని గమనించారు. దానికి నిదర్శనం అన్నట్టు ఆవిడ కేసి అన్ని వయసుల మగ వాళ్ళు, కళ్ళు తిప్పుకోకుండా సిగ్గు విడిచి చూడడం వీళ్లిద్దరు వింత గా చూశారు. కాళింది చేరిన కొన్ని నెలల తరువాత ఒక రోజు టెర్రస్ మీద బట్టలు ఆరేసి కిందకి వస్తోంటే ఒక దృశ్యం జానకమ్మ గారి కంట పడింది. కాళింది ఫ్లాట్ తలుపులు మెల్లిగా తెరుచుకుని, అటూ ఇటూ ఒక మాటు చూసి, మూర్తి రాజు గారు హడావిడి గా తమ ఫ్లాట్ లోకి వెళ్లిపోయారు. మెట్ల మీద ఈవిడ బాగా పైన ఉండటం వల్ల, ఆయన ఈవిడని చూసే అవకాశం లేదు. ఆయన కాళింది ఫ్లాట్ లోంచి అలా రావడం చూసిన ఆవిడకి, అక్కడ ఏమి జరిగివుంటుంది అన్న దాంట్లో ఏమీ సంశయం కలగ లేదు. ఆ మర్నాడు సాయంత్రం, మూర్తి రాజు గారు వాకింగ్ కి వెళ్లిన తరువాత వర్ధనమ్మ గారిని కలవడానికి వెళ్ళింది. ఆవిడతో ఉన్న సన్నిహిత్యం, స్నేహం దృష్ట్యా, తాను చూసింది చెప్పాలనుకుని ముందు అనుకున్నా, విషయం లో ఉన్న సున్నితత్వం కొంత వెనక్కి లాగింది. ఇదంతా అక్కడికి వెళ్లేదాకానే. ఆవిడ ని చూడగానే అంత వరకు ఉన్న సంధిగ్ధత పోయి" మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి " అంది కొంచం గొంతు తగ్గించి. " నిన్న మీ వారిని - " అని ప్రారంభించ గానే, " కాళింది ఫ్లాట్ కి వెళ్లడమేనా? " అంది వర్ధనమ్మగారు. కాఫీ పెట్టడానికి వంట ఇంట్లోకి వెడుతూ. " అదేమిటి? మీకు తెలుసా? " అంది ఆవిడ వెనకాలే వెడుతూ. " మీకు చాలా చెప్పాలి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం " అంది ఆవిడ. ఇద్దరు కాఫీ కప్పులు తో హాలు లోకి వచ్చి కూర్చున్నారు జానకమ్మ గారు మళ్ళి అడగ కుండానే వర్ధనమ్మ గారు చెప్పడం మొదలు పెట్టారు " మనం ఒక వయసు రాగానే రిటైర్ అయిపోతాం. మీకు తెలుసుగా అని అర్థవంతం గా చూసింది నవ్వుతూ. హార్మోన్ల ప్రభావం. మనం ఏమీ చేయలేము. కానీ మగవాళ్ళ లో అలాకాదు. చాలా మంది మగవాళ్ళు మనతో పాటు రిటైర్ అయినా వాళ్ల అవసరాలు నిద్రాణ మయి ఉంటాయి. ఎంత వయసు వచ్చినా వాళ్ల అవసరాలు వేరు. వ్యక్తి గత డిసిప్లిన్ ఉన్న వాళ్ళ విషయం వేరు. కానీ కొన్ని సందర్భాలులో అది సడలే ప్రమాదం ఉంది. వయసు లో అతి ఉత్సాహం గా ఉన్నా, రిటైర్ అయిన తరువాత ఈయన చాలా కాలం బాగానే ఉన్నారు. కానీ నాలుగేళ్ల నుంచి ఆయన చిన్నప్పటి ఫ్రెండ్ రామారావు వాట్సాప్ లో కాంటాక్ట్ లోకి వచ్చిన తరవాత, సమస్య ప్రారంభం అయింది. అతను రోజూ మెసేజెస్ పెడుతూ ఉంటాడు. బలే విచిత్ర మయిన మనిషి. ఒక మెసేజ్ విష్ణు మూర్తి బొమ్మ తో ఉంటే, నెక్స్ట్ మెసేజ్ అంగాలు అన్ని ప్రదర్శిస్తూ గుడ్డలు ఉండీ ఉండని విదేశీ ఆడవాళ్ళ బొమ్మలు పంపేవాడు. కొత్తలో ఒక మాటు నాకు చూపిస్తే, నాకు చిరాకు వేసి,, ఆయన్ని కూడా అవి చూసి బుర్ర పాడు చేసుకోవద్దని చెప్పాను ఆ తరువాత వచ్చిన వన్నీ ఆయన చూసి డిలీట్ చేస్తున్నారని తెలిసినా నేను పట్టించు కోలేదు రిటైర్ అయిన తరువాత ఎప్పుడూ లేనిది ఆ మధ్య చేయి పట్టుకు లాగడం వంటివి చేయడం మొదలు పెడితే, స్నేహితుడి ప్రభావం ముదిరిందని గ్రహించి, విదిలించి ఊరుకున్నాను. (అవును నేను చూశాను అనుకుంది మనసులో జానకమ్మ గారు ) మన స్థితి వేరు వాళ్ల స్థితి వేరు కదా. ఆయన్ని చూస్తే జాలి వేసేది. ఆ నేపథ్యంలో ఎలా జరిగిందో తెలియదు, మీరు చూసినది నా కంట కూడా పడింది. ముందు మనసు ఒక మాటు భగ్గు మన్నా, ఆయన పరిస్థితి మనసు కు వచ్చి సరిపెట్టుకున్నాను. ఆయన మీద ప్రేమనా , జాలా ఏమిటో తెలియదు కాని ఎక్కువ గొడవ చేయాలని అనిపించ లేదు. ఆవిడ పరిస్థితి కూడా ఈయన సమస్య లాంటిదేమో తెలియదు. మీరు మనసులో లో ఉంచుకోండి " అంది మొత్తం విన్న తరువాత జానకమ్మ గారి నోట మాట రాలేదు. ***** మరునాడు ప్రొద్దుటే లేచి స్నానం చేసి, ఫ్లాట్ బయట వేసి ఉన్న పేపర్ తో బాటు, పూల వాడు వేసిన పూల పొట్లం లోపలికి తెచ్చింది జానకమ్మ గారు. పొట్లం విప్పి, పూలు పూజ గదిలో పెట్టేముందు ఫ్రిజ్ మీద ఉన్న కృష్ణుడి ఫోటో ముందు రెండు పూలు పెట్టి వెళ్లడం ఆవిడకి అలవాటు. ఇవాళ కూడా రెండు పూలు అక్కడ పెట్టినప్పుడు, పక్కనే, పెళ్ళికి ముందు తీయించుకున్న భద్రయ్య గారి ఫోటో ఆవిడ కంట పడింది. ఎప్పుడూ లేనిది అవేళ రెండు పూలు ఆయన ఫోటో ముందు పెట్టింది. సమాప్తం. Ada

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి