నిశీధి నేత్రాలు - రాము కోలా.దెందుకూరు.

Niseedhi netralu

దైవం కొందరి జీవితాల్లోని వెలుగులు దూరం చేస్తాడెందుకో?. అలా దూరం చేయబడిన జీవితాల్లో అలివేలు,గిరీశం దంపతులు కూడా ఉన్నారు. తమ చుట్టూ ఉన్నది చీకటో?లేక వెల్తురో తెలియని జీవితం అలివేలుది. గత ముప్పై సంవత్సరాలుగా వెలుగుకూ, చీకటికీ ఉన్న తేడాలను గుర్తించలేని స్థితి గడుపుతున్నా! , ఏ రోజు ఇంతగా , గిరీశం కోసం ఎదురు చూసిందే లేదు అలివేలు. తన పక్కన ఉన్న శరీరాన్ని తడిమి చూస్తుంది అలివేలు మనసులోని అలజడి రేపుతున్న ప్రతిక్షణం. దగ్గరగా వినిపించే అడుగుల శబ్దం కోసం. ఏకాగ్రతను తోరణాలుగా చేసి ప్రతిక్షణం గడుపుతుందామె. తనను ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళిన తన భర్త అడుగుల అలికిడి కోసం తలపిస్తూ ఎదురు చూస్తున్నది. **** ప్రతి రోజు తమ అవసరాలకు సరిపోయేలా, చిన్నచిన్న వస్తువులు , బొమ్మలు అమ్ముకుని, సాయంత్రం కాగానే పంచాయతీ ఆఫీస్ చేరుకోవడం అలివేలు గిరీశం దంపతులకు అలవాటుగా మారడంతో. ఈ రోజు కూడా భర్తతో కలిసి వచ్చింది అలివేలు. భుజానికి తగిలించిన సంచులు ఒక ప్రక్కగా దించుతూ,అలసట తీర్చుకునేందుకు సంచిలోని బొంత నేల బారుగా పరిచి ,కాస్త పక్కకు జరిగి పడుకోవాలి అనుకుంటూ నేలను తడుముతుంది అలివేలు. ప్రతి రోజు తన చేతితో నేలతల్లిని ముద్దాడేది అలివేలు.. కానీ ఈ రోజామె చేతికి ఎదో మెత్తగా తగలడంతో,అనుమానంగా మరోసారి తడిమి చూసింది. తనకు దగ్గరలో ఉన్నది ఏదో చేతికి తగిలింది అనే విషయం అర్థమైంది అలివేలుకు. మరోసారి తడిమి చూసింది. మనిషి శరీరం అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అలివేలుకు. సన్నగా కంపిస్తున్న శరీరం నిప్పుల కుంపటిలా వెచ్చగా తగులుతుంటే, అది తన భర్తది కాదని గుర్తించిన వెంటనే, భర్తను పిలిచింది అలివేలు. "హా! అలివేలు ఇక్కడే ఉన్నా"అంటు తన చేతిలోని కర్రకు బిగించిన బెల్ మ్రోగించాడు గిరిశం. "గిరీ!నా పక్కన ఎవరో ఉన్నారు. పైగా శరీరం జ్వరంతో కాలిపోతుంది . ఒకసారి చూడు."అన్న అలివేలు మాటలు వినిపించిన వైపు చేతులతో నేలపై వెతుకుతున్న గిరీశం చేతులకు ,అలివేలు చెప్పినట్లుగానే ఒక శరీరం తగిలింది. జ్వరంతో కాలిపోతుంది. "అవును అలివేలు ." "ఎవ్వరో పాపం జ్వరంతో ఇక్కడ పడిపోయారు. ఎం చేద్దాం" అన్నాడు గిరీశం. "గిరీ!కాస్త ఓపిక చేసుకుని పక్కరోడ్డులోని మందులు షాపుదాకా వెళ్ళి, విషయం చెప్పి ఎవరినైనా వెంట తీసుకునిరా." "త్వరగా వెళ్ళిరావాలి."అంటునే చీర కొంగున దైవం కోసం ముడుపు కట్టి దాచిన డబ్బులు తీసిచ్చింది అలివేలు. అలా వెళ్ళిన తన భర్త కోసమే అలివేలు చూపులు ఇప్పుడు ప్రహారా కాస్తున్నాయ్. ***** మెడికల్ షాపులో ఉన్నతను ఏమనుకున్నాడో ఏమో?, గిరీశంతో వచ్చి,అక్కడ‌ జ్వరంతో ఉన్న వ్యక్తికి ఇంజెక్షన్ చేసి , జాగ్రత్తగా చూసుకోమని ,మూడు గంటలకు ఒక సారి ట్యాబ్లెట్ వేయమని,వీలు కుదిరితే తడిగుడ్డతో తూడుస్తుండమని చెప్పి వెళ్ళిపోయాడు. అలా తెల్లవార్లు చేస్తూనే ఉన్నారు దంపతులు ఇరువురు.. తమకు ఏమాత్రం సంబంధం లేని ఒక జీవితాన్ని కాపాడేందుకు, ఇదేనేమో దైవం సంకల్పం. ఎవ్వరెవ్వరినో దగ్గర చేస్తాడు. మరికొందరిని దూరం చేస్తాడు. తెల్లవారింది . తనకు సేవచేస్తున్నది,ఇరువురు కంటిచూపు లేని వారని వారు ప్రవర్తించే తీరు చూస్తూనే అర్దం చేసుకున్నాడు రాత్రి విపరీతమైన జ్వరంతో పడివున్న యువకుడు. ఒకరికి ఒకరు తోడుగా ,ఒకరి మాటను మరొకరు గౌరవించుకుంటూ తనకు విసనకర్రతో విసురుతూ ఒకరు, తడిగుడ్డతో తూడుస్తున్నది మరొకరు. మెల్లగా కన్నులు తెలుస్తున్న యువకుడికి అర్థమౌతుంది. తన తల ఒక స్త్రీ ఒడిలోనే ఉందని. బాల్యంలో తన తల్లి ఒడిలో ముడుచుకు పడుకున్నది గుర్తుకు రావడంతో జలజలా మంటూ కన్నీరు రాలుతుంటే. వెచ్చని చెమ్మా చేతికి తగలడంతో. బాబూ!నిద్రలేచావా. నీకేం కాలేదు.కాస్త జ్వరం అంతే ఇప్పుడు పర్వాలేదు. అంటున్న అలివేలు మాటలకు మనసు వెన్నపూసలా కరిగిపోతుంది . ఆయువకునిలో పశ్చాత్తాపం మొదలైందేమో. చదువుకున్న తను జీవితంలో ఏమీ సాధించలేనని ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునేందుకు, తన ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయి వచ్చింది గుర్తు చేసుకున్నాడు. సిగ్గుతో తలవంచుకున్నాడు అప్పటి వరకు జ్వరంతో కన్నులు తెలివిలేని స్థితిలో ఉన్న యువకుడు.. తన మనస్సును అంటిపెట్టుకుని ఉన్న నిరాశా నిస్పృహలు, మబ్బుతెరల్లా విడిపోతున్నాయి. తను ఎంత మూర్ఖత్వంతో ,ప్రవర్తించింది, తల్లిదండ్రులను వదిలేసి జీవితం ముగించాలనే నిర్ణయం తీసుకున్నందుకు తనపై తనకే అసహ్యం వేస్తుంటే. రేపటి జీవితం నీదే అనే భరోసా కల్పిస్తున్న దంపతులు సమక్షంలో ,దంపతులే తనకు ఆదర్శం అనుకుంటూ. నేటి నుండి తన జీవితాన్ని సరికొత్తగా మలుచుకునేందుకు ప్రణాలికలు రచించుకుంటున్నాడు ఆ యువకుడు.. అలివేలు ఒడిలో సేద తీరుతూ. *శుభం*

మరిన్ని కథలు

Maa inti gomaata
మాఇంటి గోమాత
- కందర్ప మూర్తి
Sarve jana sukhino bhavanthu
సర్వేజనా సుఖిఃనో భవంతు ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Aapadbandhavulu
ఆపద్బాంధవులు
- జీడిగుంట నరసింహ మూర్తి
Maa balakanda lo kishkindakanda
మా బాలకాండలో కిష్కింద కాండ
- వారణాసి సుధాకర్
Padutoo lestoo
పడుతూ లేస్తూ
- ఆమ్లజని
Tagani korika
తగని కోరిక .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Surprise shock
సర్ప్రైజ్ షాక్
- కందర్ప మూర్తి