సహజీవనం - టి. వి. యెల్. గాయత్రి.

Sahajeevanam

"ఇల్లు చూడటానికి ఎవరినో తీసికొస్తానన్నాడు ఏజంటు." అన్నాడు రమణ. "మంచి ఫ్యామిలీ ఏనా?" అడిగింది శాంత. ఇంటి పక్కన పోర్షన్ ఖాళీగా వుంది. అద్దెకు ఎవరికన్నా ఇద్దామని ఏజంట్ కి చెప్పాడు రమణ. ఐదేళ్ల క్రితం రమణ పక్కపక్కనే అపార్ట్మెంట్లు కొనుక్కున్నాడు, ఒక దానిలో వాళ్లున్నారు. రెండోది అద్దెకిచ్చారు. ఈ మధ్యే వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోయారు. 'మళ్ళీ ఎవరన్నా మంచి వాళ్ళు వస్తే బాగుండు.'అనుకుంది శాంత. మధ్యాహ్నం క్రొత్తగా పెళ్లయిన జంటను తీసికొని వచ్చాడు ఏజంట్. ఇద్దరూ చూడముచ్చటగా వున్నారు. ఎవరు? ఏమిటీ? అని అడిగారు. అన్నిటికీ సమాధానం చెప్పాడు అతడు. అతనిది రాజమండ్రి, ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఈ మధ్యే పెళ్లయింది. ఆ అమ్మాయి పుట్టిల్లు వైజాగ్. అతడి పేరు రేవంత్, ఆ అమ్మాయి పేరు సుష్మ. వాళ్ళ మాటతీరు మర్యాదగా ఉండటంతో వాళ్ళకే ఇద్దామనుకున్నారు రమణ శాంత. ఇద్దరూ ఉద్యోగస్తులు కావటంతో పొద్దున వెళ్తారు, రాత్రికి వస్తారు. శని, ఆది వారాలు ఎక్కడికైనా వెళ్తుంటారు. శాంత వాళ్ళ పనిమనిషి మంగ సుష్మా వాళ్లకు కూడా చేసిపెడుతోంది. ఆ అమ్మాయితో మాట్లాడదామని చాలా సార్లు అనుకున్నా శాంతకు అవకాశం దొరకటం లేదు. ఉదయం వాళ్లిద్దరూ ఆఫీసు కు వెళ్లే హడావుడి, రాత్రి లేటుగానే వస్తారు. పక్క పోర్షన్ లో ఇద్దరు మనుషులున్నట్టే లేదు. ఏమిటో ఈ నిశ్శబ్దం. ఆ రోజు శనివారం.పక్కింటి పిల్లను పలకరిద్దామని గారెలు, పాయసం చేసి తీసికొని తలుపు తట్టింది శాంత. ఆ అమ్మాయి తలుపు తీసి 'ఏం కావాలి?'అన్నట్టు చూసింది. "ఇవి మీ కోసం తెచ్చాను." అంటూ బాక్స్ చేతిలో పెట్టింది శాంత. సుష్మ మొహమాటంగా "వద్దండీ "అంది. "నువ్వు మా అమ్మాయి లాంటి దానివే. ఒక్కళ్ళే వుంటున్నారు. ఏం వండుకుంటున్నారో! ఏం తింటున్నారో!రేపు మా ఇంటికి భోజనానికి రండి!" సుష్మ అసహనంగా మొహం పెట్టింది. "రేపు మేము బయటికి వెళ్తున్నాము," ఇంకేమీ మాట్లాడటానికి లేదన్నట్లు వున్న వాలకం. కనీసం లోపలికి రమ్మని కూడా పిలవలేదు.మనసు చివుక్కు మనిపించింది శాంతకు. సరే అని వెనక్కు వచ్చింది. "ఈ పక్కింటి పిల్ల చూశారా!కొంచెం టెక్కు. కనీసం నన్ను లోపలికి రమ్మని పిలవలేదు. ఒక మాట లేదు మంతి లేదు. పెద్దదాన్ని స్వీటు హాటు చేసి తీసికెళ్లి భోజనానికి పిలిస్తే ఆ పిల్ల నాతో మాట్లాడితేనా!సరిగ్గా మాట్లాడటం కూడా రాని వాళ్లకి ఇల్లు ఇచ్చాము " భర్తతో చెప్పి వాపోయుంది. "పోనీలే!చిన్న పిల్లలు. ఏదో వాళ్ళ లోకం వాళ్ళది. కొత్తగా పెళ్లయిన వాళ్ళు. ఊరికే వెళ్లి డిస్టర్బ్ చెయ్యకు ఏదన్నా అవసరం వుంటే వాళ్ళే వచ్చి అడుగుతారు." సర్ది చెప్పాడు రమణ. నాలుగు రోజుల తర్వాత సుష్మ తలుపు తట్టింది. పని మనిషిని రెండు రోజులు రావద్దని, ఉరెళ్తున్నామని చెప్పటానికి. అప్పుడు చూసింది శాంత ఆ పిల్లని పరీక్షగా. మెడ బోసిగా వుంది. ఒక సన్న చైన్ వేసుకుంది. 'అయ్యో!రామా!'అనుకుంటూ "ఆ పిల్ల మెడలో మంగళ సూత్రం లేదు. పోనీ నల్ల పూసలైనా వేసుకోలేదు. సాంప్రదాయమే తెలీదులా వుంది " "నీ నస ఆపుతావా!కొంపలేమీ అంటుకుపోలేదు. ఈ కాలం పిల్లలందరూ ఇలాగే వున్నారు. ఇలాటి చిన్న చిన్న విషయాలు ఆలోచించకు!" భర్తను చూస్తే చిర్రెత్తుకొచ్చింది. 'ఏమిటో!ఈయన అయోమయం!'అనుకుంటూ పనిమనిషిని ఆరా తీసింది కానీ వాళ్ళిద్దరిగురించి పెద్ద సమాచారం రాబట్టలేక పోయింది శాంత. "భార్యా భర్త బాగానే ఉన్నారు. అద్దె ఠంచనుగా చెల్లెస్తున్నారు. ఇంకేమి కావాలి?" రమణ మాటలకు అప్పటికి ఊరుకుంది శాంత. రోజులు గడుస్తున్నాయి. ఆరు నెలలు తిరిగాయి. ఒకరోజు పొద్దున్నే శాంత పాల పాకెట్ తీసుకొంటుంటే రేవంత్ బ్యాగ్ పట్టుకొని వెళ్తుంటం కనిపించింది. 'వాళ్ళ ఊరు వెళ్తున్నాడేమో ' అనుకుంది. తొమ్మిదింటికి పనిమనిషి మంగ పనిచేస్తూ "అబ్బాయి గారు ఉరెళ్లారమ్మా! అమ్మాయి గారు ఒక్కరే వున్నారు. ఈ రోజు ఆఫీసుకు కూడా వెళ్ళలేదు. ఒంట్లో బాగలేదట."అంది. 'ఏమన్నా విశేషమేమో!' అనుకుంటూ 'ఎంతైనా చిన్నపిల్ల!ఒంట్లో బాగలేకపోతే పక్కన వుండి కూడా పలకరించక పోతే బాగుండదు ' అని తలుపు తట్టింది శాంత. సుష్మ తలుపు తీసింది. జుట్టు చిందర వందరగా వుంది. కళ్ళు ఉబ్బి వున్నాయి. ఆ పిల్ల వాలకం బాగలేదు. "అబ్బాయి ఊరెళ్లాడు కదా! నీకు బాగాలేదని మంగ చెప్పింది.జ్వరమా!మందు వేసుకున్నావా!" "కొంచెం తలనొప్పి. తగ్గి పోతుంది లెండి." "అమ్మా వాళ్ళు ఒక్కసారన్నా రాలేదు. ఎప్పుడొస్తారు?" సుష్మ మాట్లాడలేదు. ఏటో చూస్తూ కూర్చుంది. సుష్మని పరీక్షగా చూసింది శాంత. వచ్చినప్పటి కంటే బాగా మార్పు కనిపిస్తోంది. బంతి లాగా వుండే పిల్ల. చిక్కిసగమయ్యింది. కళ్ళ కింద నల్ల చారలు. మొహంలో దిగులు గూడు కట్టుకొన్నట్లుగా వుంది. 'ఏమై వుంటుంది?' అనుకుంటూ "నేను నీకు కాస్త టిఫిన్ పట్టుకొస్తా!కాస్త తిని రెస్టుతీసికొందువు గాని " శాంత మాటలు వినిపించుకోనట్లుగా శూన్యంలోకి చూస్తూ వుంది సుష్మ. తన పోర్షన్ లోకి వచ్చింది శాంత. ఇడ్లీ చట్నీ చేసి బాక్స్ లో పెట్టుకొని బెల్ కొట్టింది. తలుపు తీయ లేదు సుష్మ. నాలుగు సార్లు బెల్ కొట్టినా బదులు లేదు. బాత్ రూమ్ లో ఉందేమో అనుకుంటూ పావుగంట చూసింది. తలుపు తెరుచుకోలేదు. గాభరా పుట్టింది శాంతకు. 'ఆ పిల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిందేమో!' అనుకుంటూ ఇంట్లోకొచ్చి తన దగ్గర వున్న డూప్లికేటు తాళంతో తలుపు తీసింది. అక్కడ దృశ్యం చూడగానే గుండెలదిరి పోయాయి శాంతకి. సోఫాలో వాలిపోయి వుంది సుష్మ. క్రింద టాయిలెట్ క్లీనర్ బాటిల్ దొర్లివుంది.సుష్మ నోటిలోనుండి నురగ వస్తోంది. పెద్దగా కేకలు పెట్టింది శాంత. శాంత కేకలకి పరిగెత్తుకొని వచ్చాడు రమణ. వెంటనే సుష్మను లేవనెత్తి శాంతను కూడా పట్టుకోమని చెప్పి మెల్లిగా కారు దాకా తీసికొని వచ్చి కారులో పడుకోబెట్టి స్టార్ట్ చేసాడు. కారులో సుష్మ పక్కన బిగుసుకుపోయి కూచుంది శాంత. 'ఈ ఉపద్రవం నుండి గట్టెక్కించు దేవుడా!'అనుకుంటూ ప్రార్థించ సాగింది. రెండు వీధుల అవతల వున్న తన ఫ్రెండ్ డాక్టర్ జగదీశ్ హాస్పిటల్ కు తీసికొని వచ్చాడు రమణ. నర్సులు సుష్మకు స్టమక్ క్లీన్ చెయ్యటానికి లోపలికి తీసికెళ్లారు. అక్కడే బెంచీ మీద కూలబడింది శాంత. అంతా అగమ్యగోచరంగా వుంది. రమణ రేవంత్ కు ఫోన్ చేస్తూ వుంటే స్విచ్ డాఫ్ వస్తోంది. ఒక గంటకి జగదీశ్ బయటకు వచ్చి "అమ్మాయి కేమీ ఫర్వాలేదు. సమయానికి తీసికొని వచ్చారు. నిద్రపోవటానికి మందు ఇచ్చాను. ఒక టు అవర్స్ లో మెలుకువ వస్తుంది. ఎవరీ అమ్మాయి? బంధువులా?" అన్నాడు. రమణ క్లుప్తంగా వాళ్ళగురించి చెప్పాడు. "భార్యా భర్త ఏదో గొడవ పడి వుంటారు. ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ డాఫ్ లో వుంది. నేను ఇంటి కి వెళ్లి ఆ అమ్మాయి ఫోన్ నుండి వాళ్ళ వాళ్లకు కాల్ చేసి విషయం చెప్తాను. " శాంతను సుష్మ దగ్గర కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళాడు రమణ. సుష్మకు ఇంకా మెలకువ రాలేదు. కాసేపటికి తిరిగి వచ్చాడు రమణ. "వాళ్ళ వాళ్ళతో మాట్లాడారా!" "ఆ!దొరికారు. వైజాగ్ లో వుంటారు. విషయం చెప్పాను. ఫ్లైట్ లో వస్తున్నారు. సాయత్రం నాలుగింటికల్లా వస్తారు." కొంచెం రిలీఫ్ అనిపించింది శాంతకు. వాళ్ళ వాళ్ళు వస్తే పిల్లను చూసుకొంటారు. మధ్యలో సుష్మ లేచింది కానీ మత్తుగా వుండి మళ్ళీ పడుకొంది. జగదీశ్ వచ్చి ఆ అమ్మాయి ని చూచి అంతా నార్మల్ గానే ఉందని చెప్పాడు. సాయంత్రం నాలుగింటికి సుష్మ తల్లి తండ్రులు వనజ, శ్రీనివాస్ లు వచ్చారు. పిల్లను చూసి బావురుమంది వనజ. "మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు. మీ ఋణం తీర్చుకోలేము " రమణ చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు శ్రీనివాస్. "సమయానికి మీ అల్లుడు కూడా లేడు. ఉదయమే ఊరెళ్లాడు. ఏదో గొడవ పడినట్లున్నారు...." రమణ మాటలు ఇంకా పూర్తి కాలేదు. "అల్లుడా! పాడా! వాడొక రోగ్!మా అమ్మాయి వాడు ప్రేమించుకొన్నారు. సరే ఉద్యోగం వుంది, ప్రేమ, ప్రేమ అంటోంది అని పెళ్లి చేస్తామన్నాము. పెళ్లి మీద నమ్మకం లేదు. ఏదో లివింగ్ రిలేషన్ షిప్ అని నా కూతురు వాడి వెంట వచ్చింది.మేము ఎంత మొత్తుకున్నా వినలేదు. మా దురదృష్టం!" శ్రీనివాస్ మాటలు విని కొయ్యబారిపోయింది శాంత. "అంతా మా ఖర్మ!" వనజ ఏడవటం మొదలు పెట్టింది. "అమ్మాయి ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. అందుకు సంతోషించండి. మన పిల్ల క్షేమంగా ఉండటం ముఖ్యం.అమ్మాయిని ఏమీ అనకండి. ఈ కాలం పిల్లలు, వాళ్ళ తలతిక్క సిద్ధాంతాలు ఇలాగే వున్నాయి. మనం పెద్ద వాళ్ళం. కాస్త సంయమనముతో సమస్యని టాకిల్ చెయ్యాలి. అమ్మాయి భవిష్యత్తు వున్నపిల్ల.మీరు ధైర్యంగా వుండి అమ్మాయికి ధైర్యం చెప్పండి!" డాక్టర్ జగదీశ్ మాటలని బలపరిచాడు రమణ. ఓ గంట తర్వాత శాంతను తీసికొని ఇంటికి వచ్చాడు రమణ. "నువ్వు మంగతో ఏమీ చెప్పకు. అది అందరిళ్ళల్లో అంటిస్తుంది. పాపం చిన్న పిల్ల!అనవసరంగా ఎగతాళి పాలవుతుంది. ముందు ఆ పిల్ల జీవితం నిలబడాలి." రమణ మాటలకు మౌనంగా తలవూపింది శాంత. మనసంతా గజిబిజిగా వుంది. అసలు వాళ్లిద్దరూ భార్యాభర్తలు కారన్న విషయం చాలా షాకింగ్ గా వుంది శాంతకు. "సమాజానికి అంటుకున్న కొత్తరకం జాడ్యం సహ జీవనం. యువత ఎటు పోతుందో అర్థం కావటం లేదు. విపరీతమైన స్వేచ్ఛవలన కొందరు డ్రగ్స్ బారిన పడుతున్నారు. మరికొందరు సంప్రదాయం వదిలేసి వెఱ్ఱి మొఱ్ఱి వేషాలు వేసి ఇదిగో ఇలా చివరకు ప్రాణాలు తీసికొంటున్నారు.విదేశాల నుండి ప్రాణాలు తీసే మహమ్మారి వచ్చినట్లే దిక్కుమాలిన విష సంస్కృతి మన దేశానికి వస్తోంది.దీని ప్రభావం ఎంత మందిని బలితీసుకుంటుందో!..." రమణ మాటలు వింటూ భారంగా అతని భుజంమీద తల వాల్చింది శాంత. రెండో రోజు సుష్మను తీసికొని ఇంటికొచ్చారు వనజ, శ్రీనివాస్ లు సుష్మ తేరుకోవటానికి నాలుగు రోజులు పట్టింది. ఇక్కడ వున్నన్ని రోజులు వంట గింటా ఏమీ పెట్టుకోవద్దని వాళ్లకు అన్నీ చేసి పెడుతూ వుంది శాంత. ఈ నాలుగు రోజుల్లో వనజ, శాంత బాగా కలిసిపోయారు. 'అమ్మాయి భవిష్యత్తు నిలబెట్టడమే ముఖ్యం. ఇదొక యాక్సిడెంట్. దీని నుండి కోలుకొని కొత్త జీవితం అమ్మాయి ప్రారంభించాలి.' ఇలా మాట్లాడుకుంటూ గడిపారు ఆ నలుగురు. వారం తర్వాత సుష్మను తీసికొని వైజాగ్ ప్రయాణమయ్యారు వనజ, శ్రీనివాస్ లు. వనజకు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ పెట్టింది. సుష్మకు వివేకానందుని పుస్తకాల సెట్ చేతిలో పెట్టాడు రమణ. "ఇవి చదువు తల్లీ!జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో తెలుస్తుంది." సజల నయనాలతో రమణ, శాంతల పాదాలకు వంగి నమస్కరించింది సుష్మ. సుష్మను హృదయానికి హత్తుకొంది శాంత. తల్లీ తండ్రి చెరోవైపు నడుస్తుంటే నెమ్మదిగా కదిలి వెళ్తున్న సుష్మని చూసి కళ్ళు చెమర్చాయి శాంతకు. * * * ప్రక్క పోర్షన్ మళ్ళీ ఖాళీ అయింది. "ఈ సారి కాస్త పిల్లా జెల్లా వున్న వాళ్లకు ఇద్దామండీ!" శాంత మాటలకు తలూపాడు రమణ. పక్క పోర్షన్ లో కాస్త నడి వయసు వాళ్ళు వచ్చి చేరారు. వనజ అప్పుడప్పుడూ శాంతకు ఫోన్ చేసి మాట్లాడుతూ వుండేది. సుష్మ ఆఫీసుకు వెళుతోందని, మానసికంగా కూడా మెల్లిమెల్లిగా ధైర్యం తెచ్చుకుంటోందని చేప్తూ వుండేది. రెండేళ్లు గడిచాయి. ఒక రోజు వనజ శాంతకు ఫోన్ చేసింది. సుష్మకు పెళ్లి కుదిర్చామని పిల్లవాడు బంధువుల అబ్బాయే అని, అన్ని విషయాలు చెప్పాక వాళ్ళు ఒప్పుకున్నారని, పెళ్ళికి తప్పకుండా రమ్మని కోరింది. ఆ వార్త వినటంతో చాలా సంతోషం వేసింది శాంత, రమణలకు. ఇద్దరూ సుష్మ కొత్త జీవితం సుఖమయంగా సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నారు. సమాప్తం *******************

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి