విద్య-విచక్షణ - బి రాజ్యలక్ష్మి

Vidya vichakshana

బుట్ట క్రిందపెట్టి , క్రింద పడున్న కాగితం ముక్కలను యేరి పేర్చి అక్షరాలను కూడగట్టుకుని చదవడానికి ప్రయత్నిస్తూ ఒక బండ మీద కూర్చుంది గౌరి ,ఆ దారినే వెళ్తున్న మల్లి గట్టిగా పిలిచేదాకా చుట్టుప్రక్కల ధ్యాసే లేదు గౌరికి .

గౌరి కి ఆ చిన్న పల్లె తప్ప మరో ప్రపంచం తెలియదు .తండ్రి సీతయ్య తన కొద్దిపాటి పొలం పండించుకుంటూ పల్లె మోతుబరులకు పనిసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ..గౌరి చలాకి పిల్ల ,అందగత్తె ,అమ్మకు యింటిపనుల్లో ,నాన్నకు పొలం పనుల్లో చేదోడు వాదోడు గా వుంటుంది .

ఆ పల్లె చౌదరి గారి అమ్మాయి జానకి ,గౌరి చిన్నప్పటినించి కలిసిమెలిసి ఆడుకున్నారు,బొమ్మలపెళ్లిళ్లు చేసారు ,పచ్చని పైరులో పరుగెత్తారు .ఏడాది క్రిందట జానకి పెళ్లి సిటీ అబ్బాయి తో ఘనం గా జరిగింది .జానకి భర్త తో సిటీ వెళ్లిపోయింది .గౌరి ,జానకి విడిపోతూ పెద్దగా యేడ్చేసారు .కానీ సంవత్సరం తిరక్కముందే జానకి పురిటికి పుట్టింటికి వచ్చింది .మళ్లీ స్నేహితురాళ్లిద్దరూ దగ్గరయ్యారు .పల్లెనించి వెళ్లిన జానకి అమాయకమైన పల్లెపడుచు ,సిటీ నించి వచ్చిన జానకి కట్టూ బొట్టూ మారింది ,పుస్తకాలు తెచ్చుకుంది ,కథలు చదువుతున్నది అంతేకాకుండా గౌరికి చదివి వినిపిస్తున్నది .జానకి మార్పు గౌరికి వివరం గా అర్ధం అయ్యింది .

జానకి మొగుడు తన భార్యను తనకు అనుకూలం గా మార్చుకున్నాడు .లాలించి బుజ్జగించి ,అప్పుడప్పుడు కోప్పడుతూ జానకి కి అక్షరాలు నేర్పాడు .ఆర్నెలల్లో జానకి కథలు చదవడం ,మొగుడికి వుత్తరాలు వ్రాయడం నేర్చేసుకుంది .గౌరి కి ఆ విషయం చెప్పేసింది .గౌరికి తను కూడా చదువుకోవాలని కోరిక కలిగింది .జానకి గౌరికి అక్షరాలు గుణింతాలు వొత్తులు నేర్పింది .సహజం గా చురుకైనది అవడం వల్ల గౌరి సులభం గా నేర్చేసుకుంది .అక్షరాలు కూడబలుక్కుని చదవగలుగుతున్నది .జానకి పాపాయినెత్తుకుని అత్తవారింటికెళ్లింది .ఇప్పుడు గౌరి ఒంటరిదయ్యింది ,కథలు చదువుకోవాలని ఆసక్తి వుంది కానీ పుస్తకాలే లేవు ,అమ్మా ,నాన్నలను అడగాలంటే తిడతారేమోనని భయం .అందుకే వీధిలో కనిపించిన ప్రతి కాగితం ముక్క తీసుకుని అదేలోకం గా గడుపుతున్నది .తల్లితండ్రులు యిది గమనించి పెళ్లి చేసేద్దామని అనుకున్నారు .

ప్రక్కనే వున్న మరో పల్లె రైతు వెంకటేశం తో గౌరి పెళ్లి ఘనం గా జరిగింది .అతనికి చిన్నప్పుడే తల్లితండ్రి చనిపోయారు ,మేనమామ పెంపకం లో పెరిగాడు .కొద్దిపాలాన్ని పండించుకుంటూ పొదుపుగా వున్నాడు .గౌరి అతనికి చేదోడు వాదోడుగా వుంటూ తన చలాకీతనం అందం తో భర్తను ఆకట్టుకుంది .చిలకాగోరింకల్లాగా సంతోషం గా కాపురం సాగిపోతున్నది .

గౌరికి చదవాలన్న ఆశ మాత్రం తగ్గలేదు .కానీ కొత్తకాపురం లో మొగుణ్ణి అడగాలంటే బిడియం గా వుంది .రోజు రోజూ కు ఆశ పట్టుదలగా మారుతున్నది .పట్టుదల ధైర్యం గా మారింది .భర్త ను పుస్తకాలు తెమ్మని అడగాలనే ధైర్యం వచ్చింది .

ఒకరోజు వెంకటేశం ,”గౌరీ ,సిటీ వెళ్తున్నాను ,నీకేమైనా కావాలా ?”అడిగాడు .
గౌరి నవ్వుతూ మురిపెం గా మెరిసే కళ్లతో “నేను కావాలన్నది తెస్తారా ?” అన్నది .

“తప్పకుండా తెస్తాను “అన్నాడు

“అయితే నాకు కథల పుస్తకం చదువుకోవడానికి కావాలి తెస్తారా ?”గౌరీ భర్తను సందేహం గా చూసింది .

“నీకు చదవడం వచ్చా ?? తప్పకుండా తెస్తాను “అంటూ భార్యను ఆశ్చర్యం గా ఆనందం గా చూసాడు .తనకు చదువు రానందుకు సిగ్గుపడ్డాడు .వెంకటేశం సిటీ కి బస్ లో వెళ్లిపోయాడు .

వెంకటేశం తన పనులు ముగించుకుని పుస్తకాల షాపు కు వెళ్లాడు. అక్కడ పేర్చి వున్న లావాటి పుస్తకాలు ,చిన్న పుస్తకాలు అన్ని చూస్తూ నించున్నాడు .షాపు కుఱ్ఱాడు వచ్చి ఏం కావాలని అడిగాడు .వెంకటేశం బిడియపడుతూ “ఒక పుస్తకం కావాలి “అన్నాడు .

కుఱ్ఱాడు నవ్వుతూ “ఏం పుస్తకం కావాలి “అడిగాడు .

“కథల పుస్తకం “అన్నాడు వెంకటేశం .

కుఱ్ఱాడు మళ్లీ నవ్వుతూ “కథల పుస్తకాలు చాలా వున్నాయి మీరు పేరు చెప్తే యిస్తాను “అన్నాడు వేళాకోళం గా .

వెంకటేశానికి భార్య మీద కోపం వచ్చింది ,కనీసం పేరైనా చెప్పలేదని .అలాగే వుండిపోయాడు .ఇంతలో షాపు యజమాని వచ్చి “బాబు గారు యెవరి కోసం పుస్తకం కావాలి ?”నెమ్మది గా సౌమ్యం గా అడిగాడు .వెంకటేశం తన భార్య కు అని చెప్పాడు .

“ఎంత వరకు చదివింది ?”అడిగాడు .

“అక్షరాలు కూడ బల్కుని చదువుతుంది ,చిన్న చిన్న కథల పుస్తకం అడిగింది “అన్నాడు వెంకటేశం సిగ్గుపడుతూ .

షాపు యజమాని అంతా వెతికి అట్టమీద రంగురంగుల చిన్నపిల్లల బొమ్మ వున్న పుస్తకం వెంకటేశం చేతిలో పెట్టి “కథలు బాగుంటాయి మీ భార్యకు యివ్వండి “అన్నాడు .వెంకటేశం పుస్తకం ధర చెల్లించి పుస్తకం తీసుకుని బయటకు వచ్చాడు .

చీకటి పడే సమయానికి యిల్లు చేరాడు . వెంకటేశం ,.తెచ్చిన సరుకులన్నీ ఒక్కొకటి భార్య చేతికిస్తున్నాడు .గౌరి యాంత్రికం గా తీసుకుంటున్నది కానీ మనసంతా పుస్తకం మీదే వుంది .ఆఖరికి కండువాలో దాచిన కథలపుస్తకాన్ని నవ్వుతూ గౌరీకి యిచ్చాడు .అంతే …గౌరి భర్తకు స్నానానికి నీళ్లు పెట్టాలి ,భోజనం వడ్డించాలి అన్న విషయం కూడా మర్చిపోయి కథల పుస్తకం లో తలదూర్చేసింది ,చుట్టుప్రక్కల ధ్యాసే లేదు . గౌరి ముఖం లో ఆనందాన్ని చూసి సంతోషిస్తూ అలాగే గోడకు చేరగిలపడ్డాడు వెంకటేశం .

సుమారు అరగంట తర్వాత తలెత్తింది గౌరి .అతన్ని చూసి సిగ్గుపడుతూ పుస్తకం మూసేసి నీళ్లు తోడింది ,భోజనం వడ్డించింది .

క్రమం గా రోజులు గడుస్తున్నకొద్దీ యింటి మీద ,మొగుడి మీద ధ్యాస తగ్గింది .యాంత్రికం గా గబగబా పనులు ముగించుకుని కథలపుస్తకం చదువుకుంటున్నది .భర్త తో మాటలు ,మురిపాలు తగ్గిపోయాయి .వెంకటేశం గ్రహించాడు కానీ మౌనం గా వున్నాడు .

ఒక రోజు తలనొప్పి తో బాధపడుతూ వెంకటేశం పడుకున్నాడు .అయినా గౌరి గ్రహించకుండా ,పుస్తకం లో లీనమయ్యింది .వెంకటేశం తలరుద్దుకుంటూ భార్య ను కసిరాడు .అప్పటికి కానీ గౌరి కి స్పృహ రాలేదు .పుస్తకం మూసేసి భర్త దగ్గరకెళ్లింది .ఒళ్లు కాలిపోతున్నది .వెంటనే తన తప్పు తెలుసుకుంది .రెండు రోజులు పుస్తకం ముట్టుకోలేదు .వెంకటేశం జ్వరం తగ్గింది .ఆ రోజు నించీ గౌరి యింటిపనీ భర్త పనీ అయ్యాక కథలు చదువుకుంటున్నది .అలాగే భర్త యింటికి రాగానే పుస్తకం ముట్టుకోవడం లేదు .భార్య లో మార్పు కు వెంకటేశం సంతోషించాడు .మళ్లీ సిటీ కి వెళ్తే యింకో కథల పుస్తకం తెద్దామనుకున్నాడు .తాను కూడా భార్య దగ్గర అక్షరాలు నేర్చుకుందామనుకున్నాడు .

నేటి సమాజం లో విద్య ప్రతివారికీ అవసరం కానీ దానివల్ల బంధాలు చిన్నాభిన్నం కాకూడదు . అర్ధం చేసుకున్న బంధం మరింత బలపడుతుంది .

మరిన్ని కథలు

Tappevaridi
తప్పెవరిది
- మద్దూరి నరసింహమూర్తి
Pandaga maamoolu
పండగ మామూలు
- Madhunapantula chitti venkata subba Rao
Maanavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Prema pareeksha
ప్రేమ పరీక్ష
- శరత్ చంద్ర
Swayamvaram
స్వయంవరం
- తాత మోహనకృష్ణ
Maatruhrudaya mahattu
మాతృహృదయ మహత్తు!
- చెన్నూరి సుదర్శన్
Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి