
"ఒరేయ్ మల్లిగా, ఏడ సచ్చినవురా " మోతుబరి మల్లారెడ్డి గొంతు ఖంగున మోగింది. "వస్తున్న పటేలా " అంటూ పరుగెత్తుకుంటూ వచ్చిండు మల్లిగాడు. "ఒక్కసారి పిలువంగనే రావెందుకురా, చెవులల్ల దూదులు పెట్టుకున్నావురా, నా పేరుల సగం పేరు పెట్టుకున్నవు గానీ నీకు కొద్దిగ కూడ మైండ్ లేదురా ". "తెల్ల కోడె మిగిలిన ఎడ్లను పొడుస్తుంది, దాన్ని కొట్టంల గుంజకు కట్టేసి వరి మేత ఏసి వస్తున్న పటేలా ". "గొప్ప పని చేసినవులే గానీ, నేను చెప్పిన పని ఏమైందిరా ". "మాల్ గురించే కదా. నాకు యాది ఉంది పటేలా ". "యాది ఉండుడు కాదురా, ఎంత దాక వచ్చిందని అడుగుతున్న ". "అయిపోద్ది పటేలా, ఇంకో మూన్నాలుగు దినాల్ల మాల్ తెప్పిస్తనన్నడు ". "ఇట్ల అనబట్టి 15 దినాలు దాటింది కదరా. మాల్ మంచిగ ఉండాలె. అది గనక బాగా లేదనుకో, నిన్ను, మహేష్ గాన్ని పండబెట్టి తొక్కుత బిడ్డా, సమజైతుందా ". "మహేష్ సేటు అట్ల చేసెటోడు కాడు పటేలా. ఆయనకు తెల్వదా మాల్ సంగతి, మీ సంగతి " "మహేష్ తోని నేను మాట్లాడుత. ఒకసారి పిల్వనంపు ". "అట్లనే పటేలా, జల్దిన పొయ్యి తోలుకొస్త ". అర్ధగంట లోపే మల్లిగాడు మహేష్ ను వెంటబెట్టుకొని వచ్చిండు. " సేటూ, లోపటికి రా, పటేలు టీవీ చూసుకుంట మలసాల్ల కూసున్నడు." అంటూ మల్లిగాడు మహేష్ సేటును లోపలకు తీసుకపోయిండు. "మహేషూ, వచ్చినవా, నీకు మాల్ గురించి మల్లిగాడు చెప్పి ఇప్పటికి ఎన్ని దినాలయ్యిందయ్యా " ప్రశ్నించాడు మల్లారెడ్డి పటేల్. " బాగనే అయింది. మీకు తెల్వనిది ఏముంది, పదిహేను దినాల నుండి ఒకటే ఎడ తెరిపి లేని ముసుర్లాయే. ఇయాల్లనే కాస్త తెర్పిచ్చింది " బదులిచ్చాడు మహేష్ సేటు. " ఇగో మహేషూ, ఈ ముచ్చట్లు చెప్పి తెప్పించుకోకు. నువ్వేమన్న నడిచి పోయి నడిచి వచ్చేదుందా. పొయ్యేటప్పుడు ఎట్లైన బస్సుల్నే పోతవు. మాల్ తోని వచ్చేటప్పుడు టాక్సీల వస్తవు. అయినా నా ఒక్క పని మీదనే కాదు కదా నువ్వు పొయ్యేది, నీక్కూడ అక్కడ మస్తు పనులు ఉంటయి కదా ". "అవుననుకోండి, టౌనుకు పోతే ఈ ముసుర్లకు ఏ పని జరుగదు పటేలా. నేను పోయిన్నంటే స్వామి కార్యం స్వకార్యం చేసుకొని రావాలి ". "సర్లే ఏదో ఏడువు. ఈ రెండు మూడు దినాల్ల మాల్ తీసుకరా. అసలే ముందు ముందు పండగలు వస్తున్నయి, నీకు మళ్ళీ టైం దొరకదు. మాల్ మాత్రం మంచిగ ఉండాలె మహేషూ ". "మీరు క్వాలిటీ గురించి నాకు వదిలేయండి పటేలా. మీరు ఇష్టపడే మాల్ ఎట్లైన గుంటూరు టౌన్ ల దొరికిచ్చుకొని తెచ్చే బాధ్యత నాది. నేను మీకు తెచ్చే మాల్ గుంటూరు కెల్లి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తరు. అందుకే ఫస్ట్ క్వాలిటీ దొరుకుడు అంత ఈజీ కాదు". " పదిహేను దినాల సంది నోరు సప్పబడింది మహేషూ. ఒళ్ళంత సచ్చు బడ్డట్టు అయింది. మా పటేలమ్మ కు ఇదంటే అస్సలు నచ్చదు. ఒక సారి అలవాటు పడితే, మానుకోవుడు కష్టమే. పాణం దానివైపే గుంజుతా ఉంటది. " "మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి కదా " వీళ్లిద్దరు ఇలా మాట్లాడుకుంటుండగానే మల్లారెడ్డి పటేల్ భార్య శ్రీమతమ్మ రానే వచ్చింది. "ఏందయ్యో, మాల్, గుంటూరు, క్వాలిటీ అని శాన మాట్లాడుతుండ్రు" ప్రశ్నించింది మల్లారెడ్డి పటేల్ వైపు సీరియస్ గా చూస్తూ. "ఏమీ లేదే, మహేష్ తన దుకాణ్ లకు కావలసిన సరుకులు తేనీకి గుంటూరు పొయ్యే ముచ్చట గురించి చెబుతాండు లే", మాట మార్చాడు మల్లారెడ్డి పటేల్. "ఆయన సరుకుల గురించి నీకు ఏందయ్యా రంది". "అది కాదే, నేనేమో అందరి బాగోగులు విచారిస్తనాయె. ఏదో కష్ట సుఖాలు చేప్పుకోనీకి మహేష్ వచ్చిండు, అయినా నీకెందుకే అంత అనుమానం వచ్చింది." "మాల్ మంచిగుండాలె, పండుగ లొస్తున్నయి, మళ్ళీ దొరకదు, అని మీరిద్దరు అనుకుంటుంటే, నాకే కాదు ఎవరికైనా అనుమానం వస్తది" అంటూ తన సందేహాన్ని బహిర్గతం చేసింది శ్రీమతమ్మ. "సరుకులు బాగుంటేనే కదా మహేష్ బేరం సక్కగుండేది. సర్లె గానీ, నువ్ లోపల్కి పో", అని మల్లారెడ్డి పటేల్ కోపంగా అనగానే శ్రీమతమ్మ విసుక్కుంటూ లోపలకు వెళ్ళింది. "పటేలమ్మకు అనుమానమొచ్చింది, ఆమెకు తెల్వకుండ మీరు ఎట్ల నడిపిస్తరు పటేలా!" ప్రశ్నించాడు మహేష్ సేటు. "నా బాధేందో నేను పడ్త గానీ, మాల్ పేరు వర్జీనియా కదా. " అడిగాడు మల్లారెడ్డి పటేల్ మహేష్ సేటును. "అవును. గుంటూరులో దొరికే వర్జీనియా పొగాకు అంటే ఒకప్పుడు చుట్ట తాగేటోళ్ళు ఆ పొగాకే వాడేది. ఆ పొగాకు తోటే సిగరెట్లు తయారైతయి. ఎంతైనా ఇప్పుడు సిగరెట్టు, చుట్ట తాగేటోళ్లు బాగా తగ్గిండ్రు పటేలా ". " సరేలే, ఈ ఒక్కసారికైతే గుంటూరు పొయ్యి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ వర్జీనియా పొగాకు తీసుక రా. నాకూ దగ్గు ఎక్కువయితుంది. నేను పొగాకు కాలుస్తున్ననని తెలిస్తే పటేలమ్మ మస్తు బాధ పడుతది. వచ్చే ఫస్ట్ తారీఖు కెళ్లి పొగ తాగుడు బంద్ చేస్త. పోయిరా మహేషూ " అంటూ చెక్క వాలు కుర్చీలో నుండి లేచాడు మల్లారెడ్డి పటేలు. *****-*********