గుమ్మం బయట చెప్పులు - కొడాలి సీతారామా రావు

Gummam bayata cheppulu

లిఫ్టులోంచి కాలు బయట పెడుతూనే ఎదురుగా వున్న ఫ్లాట్ బయట వున్న చెప్పులు మీద పడింది నా దృష్టి.ఆరు జతల మగ చెప్పులతో పాటు ఓ జత ఆడ చెప్పులు కూడా వున్నాయి.అవి మా ఇంట్లో పని చేసే కుమారివి.ఆవిడ మా ఇంటితో పాటు ఆ ⁸కాంప్లెక్స్ లో చాలా మంది ఇళ్ళలో పని చేస్తుంది షెడ్యూలు ప్రకారం.అలా ఆ ఫ్లాటు లో కూడా పనిచేస్తుంది.అది కాదు నాకు ఆశ్ఛర్యం కలగటానికి కారణం.ఆ సమయంలో ఆ అమ్మాయి ఆ ఇంట్లో పనిచేయకూడదు.అసలు ఆ ఫ్లోరులోనే వుండకూడదు. అందువల్లనాకుఅనుమానంవచ్చింది.కుమారిని వాళ్ళు వాడుకుంటున్నారేమోనని.ఆ అనుమానం తీర్చుకునేందుకు లిఫ్టుకి ఎడమవేపు రెండోదే మా ఫ్లాట్ అయినా, కుడి వేపు చివర కుర్చీలుంటాయి. అక్కడ కూచున్నా.వరండాలో ఎవరూ లేరు.పిల్లలు కింద ఫ్లోర్ వరండాలో ఆడుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ అమ్మాయి బయటికి వచ్చేదాకా అక్కడే కూచోవాలనుకున్నా. కుమారే కాదు ఆ ఇరవై అయిదు అపార్టుమెంట్ల సెక్యూరిటీ సముదాయంలో చాలా మంది పని వాళ్ళు అనేక ఫ్లాట్లలో టైము ప్రకారం పనిచేస్తారు.ఉదయమో, సాయంత్రమో ఒక పూటే వస్తారు.వచ్చాక చకచకా పనులు చేసేసి వెళ్ళిపోతారు. ఆ కాంప్లెక్స్ లో కొందరు ఇద్దరూ ఉద్యోగం చేస్తే,కొందరు ఆడవాళ్ళు ఇంట్లోనే వుంటారు.మొదటి రకం వారి ఇళ్ళలో అన్ని పనులూ చేస్తే, రెండో తరహా వారికి కొన్ని పనులే చేస్తారు.కొందరు పెద్దవాళ్ళొక్కరే వుంటే వారికి వంట కూడా చేస్తారు రెండు పూటలా. అందువల్ల టైము వాళ్ళకి చాలా విలువైనది.వచ్చిందగ్గర్నించీ గబగబా పని చేసి వెళ్ళిపోతారు. నాకింకా ఉత్సుకత కలిగించిన విషయం ఆ ఫ్లాట్ కాంతారావుది.అతనేం ఉద్యోగం చేస్తాడో తెలియదు కానీ వాళ్ళావిడ వూళ్ళో లేకపోతే తన స్నేహితులని పిలిచి మందు కొడతాడు.దానిలోకి నంజుడులు.ఐతే అంతమంది వున్నా శబ్దం బయటికి వినపడదు.మా అపార్టుమెంట్ వాచ్మన్నే వాళ్ళకి ఈ సరంజామా తెస్తుంటాడు.అతనే చెప్పాడు ఒక సారి ఆ విషయాలు. నాకు మా కనకారావు ఓ మాట చెప్పాడు కుమారి గురించి. వాళ్ళింట్లోనూ పనిచేస్తుంది. బైట కనపడ్డప్పుడు అడిగాడుట ‘వస్తావా’ అని.’ఎక్కడికి’ అందిట.మీ ఇంటికి అంటే ‘మా ఆయన వుంటాడు’ అందిట.అనీ ‘పోనీ మీ ఇంటికి వస్తా’ అందిట నవ్వుతూ.అతనన్నాడు ఆ అమ్మాయికి అలవాటే అని చాలా మంది చెప్పారు అని. పోనీ ‘హోటలికి రమ్మనాల్సింది’ అన్నా. ‘ఆ ఎందుకు అంతంత ఖర్చు’ అన్నాడు. ఆ మాటలే నాకు గుర్తొచ్చాయి.అందుకే ఆ అమ్మాయి బయటికి వచ్చేదాకా అక్కడే కూర్చోవాలనుకున్నా. ఎవరికీ అనుమానం రాకుండా తెచ్చుకున్న పేపరు చదువు తున్నట్టు నటిస్తున్నా.ఎంతసేపైనా మొదటి పేజీలోనే వున్నా.పేపరు దేముంది సాయంత్రమైనా చదవచ్చు.ఆ కుమారి విషయం తేలాలి. లోపల ఏం జరుగుతోందో నా మనసులో రూపు కడుతోంది.అమ్మో ఎంతన్యాయం.ఎంత దారుణం.పట్టపగలు ఎంత బరితెగించారు.పక్కన ఇన్ని కుటుంబాలు వుంటే.ఎవరన్నా సిగ్గుపడతారేమో కానీ వీళ్ళకి సిగ్గూ బిడియం లేవా. ఇలా ఆలోచిస్తుంటే రెండు గంటలు గడిచిపోయాయి.ఇంకా బయటికి రావటం లేదే. నాలో అసహనం,ఆత్రుతా పెరిగి పోతున్నాయి. అదిగో ఆ సమయంలో బయటికి వచ్చింది కుమారి మా ఇంట్లోంచి!! అలా బయటికి వచ్చి కాంతారావు ఫ్లాట్ ముందున్న చెప్పులు వేసుకుని లిఫ్టు దగ్గర నుంచుంది. అంటే ఈ రోజు ఆలస్యంగా వచ్చింది ఏ కారణంగానో . ముందు కాంతారావు వాళ్ళ ఇంట్లో పని చేసి మా ఇంటికి వచ్చిందన్న మాట. నా దుర్మార్గపు ఆలోచనలకి సిగ్గు పడ్డాను. ఎవరు ఇతరుల గురించి ఏం చెప్పినా నమ్మకూడదు. దేవుణ్ణి క్షమించమని పదే పదే వేడుకుంటూ మా ఫ్లాటు వేపు నడిచాను.

మరిన్ని కథలు

Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి
Naalugu taraala katha
నాలుగు తరాల కథ
- హేమావతి బొబ్బు
Marina manishi
మారిన మనిషి
- శ్రీమతి లతా మూర్తి
Baamma cheppina bhale kathalu
బామ్మ చెప్పిన భలే కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Bandham Anubandham
బంధం అనుబంధం
- కందర్ప మూర్తి
Aaradhana
ఆ'రాధ'న
- కొడాలి సీతారామా రావు
Pagavadiki koodaa ee anubhavam vaddu
పగవాడికి కూడా ఈ అనుభవం వద్దు
- మద్దూరి నరసింహమూర్తి