అర్థం లేని అపార్థం - క్రాలేటి

Ardham leni apaardham

భోగి రోజు తెల్లరకట్ల ఇంటికి చేరు కుందాం అని రైల్వే స్టేషన్ లో రైల్ దిగి ఇంటికి బయల్దేరాను ... బ్యాంక్ లో ఉద్యోగం ఇంటికి వారం వారం వచ్చే వీలుండడం వల్ల నా స్ప్లెండర్ ని రైల్వే స్టేషన్ లోనే ఉంచాను.... ఇంకా పూర్తిగా తెల్లార లేదు.... ఇంటి బాట పట్టాను నా బండి మీద..... దారిలో ఎదురుగా మోహన్ కనిపించాడు.... వాడు ఇంతకుముందు సడెన్ గా అవసరమై ఒక 10000/- రూపాయలు అప్పుగా తీసుకున్నాడు... ఎంత అవసరమో తెలియదు కానీ చాలా సార్లు ధన్యవాదాలు చెప్పాడు.... వాడిని చూడగానే అదే గుర్తుకు వచ్చింది....మోహన్ పలకరిస్తాడని అనుకుంటుండగానే నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు... కనీసం మొహమాటానికి అయినా నవ్వలేదు వాడు... అప్పుడు అనిపించింది మనుషుల్లో స్వార్థం పెరిగిపోయిందని.... అవసరానికి అప్పు ఇవ్వగానే ఇప్పుడు కనీసం పలకరింపు కూడా నోచుకోలేదని నాలో నేనే నొచ్చుకుంటూ ఇంటి వైపు సాగిపోయాను.... ఏవో ఆలోచనలు కమ్ముకుంటున్నాయి.... ఇంతలో ఎదురుగా సూర్యనారాయణ అంకుల్... ఆ మధ్య ఒంట్లో బాలేకపోతే వాళ్ళ అబ్బాయి రాజు నా ఫ్రెండ్ అవ్వడం వల్ల వాడు ఫారిన్ లో ఉండడం వల్ల... నేను దగ్గరుండి హాస్పిటల్ లో చేర్పించి మూడు రోజులు సెలవు పెట్టి...ఆరోగ్యం కుదుట పడిన తరువాత వాళ్ళ ఇంట్లో చేర్చి తిరిగి నేను నా జాబ్ కి వెళ్ళిపోయాను ... అంకుల్ కి చేసిన సహాయానికి నన్ను పలకరిస్తారు అని అనుకుంటూ ఉంటుండగానే ఆయన కూడా నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయారు కనీసం పలకరింపు కూడా లేకుండా..... నా ఆలోచనలు ఇంకా తీవ్రమయ్యాయి... ఇంతే ఈ మనుషులు అవసరం తీరిపోగానే చెత్త బుట్ట ని పడేసినట్టు పడేస్తారు.... అన్ని రోజులు హాస్పిటల్ లో చేసిన సేవ కూడా గుర్తు లేదు ఆయనకి.... కనీసం పలకరిస్తే ఆయన సొమ్ము ఏమైనా పోతుందా? ఛీ ఛీ ఇలాంటివారికి భవిష్యత్తు లో అస్సలు సహాయం చెయ్యకూడదు అనుకుంటూ ఇల్లు చేరుకున్న.... అసంతృప్తి అంతా అమ్మ కి వెళ్ళబోసు కుంటూ నా రూం లో బాగ్ పెడదామని వెళ్ళా.... నా రూం లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో ఒక్కసారి చూసుకున్నా.... భోగి రోజులు కదా... చలి వేస్తోందని... మంకీ క్యాప్ పెట్టి పూర్తిగా జర్కిన్ వేసుకున్న నన్ను నేను అద్దంలో చూసుకున్నా.... కొద్ది సేపటి వరకు నన్ను నేనే గుర్తు పట్టలేకపోయా.... అప్పుడు గుర్తుకొచ్చింది మోహన్ మరియు సూర్యనారాయణ అంకుల్ నన్ను ఎందుకు పలకరించలేదు అన్న విషయం.... మొద్దు బుర్ర కి అప్పుడు తట్టింది.... సంక్రాంతి వేషాల లాగా నేను అన్ని బిగించుకొని వస్తుంటే గుర్తు పట్టలేక పోయారు అందుకే పలకరించలేదు అని.... నన్ను నేనే తిట్టుకుంటూ అమ్మ నీ ఒక మాంచి కాఫీ అడిగా అర్థం లేని అపార్ధాలని తిట్టుకుంటూ.....

మరిన్ని కథలు

mamidi komma malli poochenulae
మామిడి కొమ్మమళ్ళీ పూచేనులే
- ప్రభావతి పూసపాటి
Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు