చేజారిన జీవితం - బి .రాజ్యలక్ష్మి

Chejaarina jeevitham

చందన కుందనపు బొమ్మలా తలదించుకుని సోఫా లో కూర్చుంది .ఎదురుగుండా సోఫాలో చంద్రం అతని తల్లి కూర్చున్నారు .పెళ్లిచూపులు జరుగుతున్నాయి .

“నేను ఆ అమ్మాయి తో మాట్లాడాలి “చిన్నగా తల్లి చెవిలో గొణిగాడు చంద్రం .చందన తండ్రి రామకృష్ణయ్య కి ఆ మాటలు వినిపించాయి .మరుక్షణం లో ఆ పెళ్లిచూపుల హాల్లోనించి వాళ్లిద్దరినీ వుంచి అందరూ వరండాలోకి వచ్చారు .

“ఒకసారి తలెత్తి నన్ను చూస్తారా “అన్నాడు చంద్రం .

సోగకళ్లతో రెప్పలాడిస్తూ తలెత్తి చంద్రం వైపు చూసింది .ఆ చూపులకే మంత్రముగ్దుడయ్యాడు .చందన యిరవైయేళ్ల పరువం పరుగులెత్తే జలపాతం లా వుంది .చందన అందగత్తె .

“చందనా ,నేను బొంబాయ్ లో బ్యాంక్ లో వుద్యోగం చేస్తున్నాను . నాది సాధారణ జీవనం మీరు నాకు నచ్చారు .మరి నన్ను సరిగా చూసి మీ అభిప్రాయం చెప్పండి “ముక్కుసూటిగా మృదువుగా నెమ్మదిగా చిరునవ్వుతో చంద్రం అన్నాడు .

చందన అతనిని ఆపాదమస్తకం చూసి తలగుండ్రం గా తిప్పుతూ తలవాల్చింది .ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు .చంద్రానికి తండ్రి చిన్నతనం లోనే చనిపోయారు .ఒక అక్కయ్య వుంది .పెళ్లయ్యింది .ఉత్తరభారతం చిన్నఊళ్ళో వుంటుంది .తల్లి సీతమ్మ పల్లెటూళ్లో స్వంతింట్లో పొలం పనులు చూసుకుంటూ గడుపుతున్నది .చంద్రం పెళ్లయితే కొడుకు దగ్గరే వుందామనుకుంటున్నది .

చందన ఒక్కతే ఆడపిల్ల .ఒక తమ్ముడు చదువుకుంటున్నాడు .చందన డిగ్రీ ప్యాసయ్యింది .తండ్రి ప్రభుత్వ వుద్యోగం చేసి రిటైరయ్యారు .

చందన ,చంద్రం ల వివాహం వున్నంతలో వైభవం గా జరిగింది .చంద్రం పదిరోజులు అక్కడే వున్నాడు .రోజులు క్షణాలయ్యాయి .సెలవులు యింకా రెండురోజులు వున్నాయి . చందన భర్త తో కాపురానికి అన్నీ సర్దుకోవడం మొదలు పెట్టింది . పదిరోజుల్లో చందన స్వభావం చంద్రానికి అర్ధం అయ్యింది .పెంకితనం .పట్టుదల ,మొండితనం ,అహంకారం బాగా వున్నాయి .అందరూ తనమాటే వినాలి , తన చుట్టే తిరగాలి .చంద్రానికి అర్ధమయినా ,నెమ్మదిగా భార్య స్వభావాన్ని మార్చవచ్చులే అని అనుకున్నాడు .

తల్లి కూడా తమతో వస్తుందని చెప్పాడు చంద్రం భార్యతో . చందన ఒప్పుకోలేదు .

“చందనా ! అమ్మ వుంటే నీకు తోడు వుంటుంది పైగా మన పద్ధతులన్నీ నేర్పుతుంది ,”అని నచ్చచెప్పాడు చంద్రం .

“నాకేం భయం లేదు ,నేను అన్నీ తెలుసుకున్నాను మీ అమ్మ వద్దు ,మనిద్దరమే వెళ్దాం “అని పట్టుదల గా అన్నది చందన .

కొత్తగా మొదటిసారి భార్య తో వెళ్తూ తగదాలెందుకని చంద్రం ఒప్పుకున్నాడు ,తల్లికి సర్ది చెప్పాడు .

చంద్రం ,చందన బాంబే లో మధ్యతరగతులుండే కాలనీ లో ఒక అపార్టుమెంట్ లో కొత్తకాపురం మొదలుపెట్టారు .వారం రోజులు యింటికి కావాల్సిన కనీస అవసరాలు కొనుక్కోవడం తోనే గడిచిపోయింది .ఆ వారం రోజులు యింట్లో వంట లేదు .పనిమనిషి కుదిరింది .చందన అంతా హాయిగా సాగిపోతున్నది .బ్యాంక్ నించి రాగానే ప్రతి రోజు బాంబే లో చూడాల్సిన స్థలాలు చూసొస్తున్నారు .

ఒక రోజు బ్యాంక్ కి త్వరగా వెళ్లాల్సివున్నందున వంట త్వరగా చెయ్యమన్నాడు చంద్రం .

“నాకు బద్ధకం గా వుంది మీరే వంట చెయ్యండి “అన్నది యింకా పక్క మీదే పడుకుని .

“నాకంత టైం లేదు ,నేను హోటల్లో తింటాను నువ్వు నీమటుకు వంట చేసుకో “అంటూ బైక్ మీద వెళ్లిపోయాడు చంద్రం .

సాయంత్రం బ్యాంక్ నించి రాగానే “చందనా ,భోజనం చేసావా ? “అడిగాడు .

“లేదండీ ,బిస్కట్స్ తిన్నాను “అన్నది .

చంద్రానికి ఒళ్లుమండింది కానీ నిగ్రహించుకున్నాడు .

“రాత్రి కి వంట చెయ్యి ,బంగాళా దుంప వేపుడు ,కందిపచ్చడి చారు “అంటూ చంద్రం ఆర్డర్ వేసాడు .

“మరి మీరు సాయం చెయ్యాలి “అంది చందన సోగకళ్లతో .

“అలాగే శ్రీమతిగారూ “అన్నాడు ఉషారుగా చంద్రం .

ఇంతలో చంద్రం ఫ్రెండ్ విశ్వం వచ్చాడు ,యిద్దరూ కలిసి బయటకెళ్లారు .వెళ్తూ వెళ్తూ చంద్రం ,చందనను వంట సిద్ధం చెయ్యమని చెప్పి వెళ్లాడు .

చంద్రం ఏడున్నర కు వచ్చాడు .”చందనా ,ఆకలి మండిపోతున్నది .త్వరగా వడ్డించు “అంటూ కాళ్లు కడుక్కుని డైనింగ్ టేబుల్ దగ్గర తీరిగ్గా కూర్చున్నాడు .

చందన వంటకాలన్నీ టేబుల్ మీద సర్దింది .యిద్దరూ భోజనానికి కూర్చున్నారు .కందిపచ్చడి వేసింది .చంద్రం కాస్త నోట్లో వేసుకున్నాడు ,అంతే గబుక్కున లేచి వుమ్మేద్దామనుకుని వెంటనే తమాయించుకుని కాసిని మంచినీళ్లు తాగాడు ..అలాగే వేపుడు మూత తీసాడు ,ముక్కలు నల్లగా మాడాయి .అన్నం గింజలు గింజలుగా వుంది .

“చందనా ,అందుకే అమ్మను మనతో పాటు తెస్తానన్నాను ,నీకు వంట నేర్పేది మనం కూడా రుచి రుచిగా తినేవాళ్లం “అంటూ అర్ధాకలి తో భోజనం ముగించాడు చంద్రం .చందన మూతి ముడిచింది చంద్రం సరిగా తినలేదన్న విషయం తెలిసికూడా ఏం మాట్లాడలేదు .

చంద్రం ,చందన వంటకు అలవాటు పడిపోయాడు ,చెప్పటం మానేసాడు యెందుకంటే చందన మనసుపెట్టి భర్త కు రుచిగా చెయ్యాలన్న శ్రద్ధే లేదు .ఏదో గబగబా తోచినట్టు చేసేసి టేబుల్ మీద పెట్టేస్తుంది .టీవీ చూస్తూ కూర్చుంటుంది . చంద్రం కూడా హోటల్ తిండికి అలవాటు పడిపోయాడు .

చంద్రానికి యిప్పుడు యే వుత్సాహం లేదు .చందన భర్త అవసరాలను పట్టించుకోదు ,కానీ తనకు నచ్చినట్టుగా అతను వుండాలని పట్టుబడుతుంది .చంద్రానికి సాయంకాలం ప్రశాంతం గా పచ్చని ప్రకృతిలో భార్య తో అందం గా గడపాలని వుంటుంది ,చందన కు సాయంకాలం Tv చూస్తూ యింట్లో వుండాలని వుంటుంది .ఈ రకం గా చిన్న చిన్న కారణాలతో దూరం పెరుగుతున్నది .

చందన మహిళా క్లబ్ లో సభ్యురాలైంది ..ఇంచుమించు చంద్రం వచ్చే టైం కి అతనికి అవసరమైనవి టేబుల్ మీద పెట్టేసి అందం గా తయారయ్యి క్లబ్ కి వెళ్లిపోతుంది .చంద్రం ఒకటి రెండు పర్యాయాలు నివారించడానికి ప్రయత్నించాడు కానీ లాభం లేకపోయింది .

చంద్రానికి సహనం నశించి మామగారికి చందన విషయం విపులం గా వుత్తరం వ్రాసాడు . ఆయన నాలుగు రోజుల్లో రెక్కలు కట్టుకుని కూతురింటికి వచ్చారు .చందన తండ్రిని వాటేసుకుని పెద్దగా యేడ్చేసింది .

“నాన్నా ,నీతో వచ్చేస్తాను ,యీయన నన్నెక్కడికీ తీసుకెళ్లరు ,నా వంట నచ్చదుట ,తోచడం లేదని క్లబ్ కి వెళ్తున్నాను అదికూడా వద్దంటున్నారు “అంటూ భర్త మీద కంప్లైంట్ యిచ్చింది .చంద్రం విస్తుపోయాడు .
“నేను అల్లుడితో మాట్లాడుతానులే “అన్నాడు ,ante కానీ కూతురి ప్రవర్తన సరిదిద్దాలని అనుకోలేదు .
చంద్రం వ్రాసిన వుత్తరం చందన కు చూపించాడు .ఇంకా ఫైర్ అయ్యింది చందన .తండ్రి ముందే భర్తను యిష్టం వచ్చినట్టుగా మాటలు అనేసింది .

తండ్రి కూడా చందన పక్షానే అల్లుడిని విసుక్కున్నాడు .
“నీలాంటి వాడికి బంగారం లాంటి నా కూతురిని యిచ్చి తప్పుచేసాను “అంటూ చంద్రాన్ని కోపం గా చూస్తూ అరిచాడు .

చంద్రానికి ఓపిక ఓర్పు చచ్చిపోయాయి ,”అయితే మీ కూతురును మీ దగ్గరే పెట్టుకోండి “అంటూ అరిచాడు .

“పద నాన్నా ,ఆయన పొమ్మంటుంటే యిక్కడే వేళ్లాడడానికి మనం అభిమానం లేని వాళ్లమా “అంటూ చందన భర్తను కోపం గా చూసింది .చంద్రం కూడా చేతిలోని గ్లాస్ విసురుగా నేలకేసి కొట్టి “నీ ఖర్మ “అంటూ బయటకెళ్లిపోయాడు .

“అవునమ్మా పద ,అతీగతీ లేనివాళ్లం అనుకుంటున్నాడేమో “అంటూ చందన తండ్రి కూతుర్ని రెచ్చగొట్టారు .పావుగంటలో చందన తన లగేజ్ సర్దేసుకుంది .తండ్రి కూతుళ్లు యింటికి తాళం వేసి ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్లిపోయారు .

చంద్రం తొమ్మిదవుతుండగా రోడ్లన్నీ తిరిగితిరిగీ యింటికొచ్చాడు .అతను వూహించినట్టుగానే తలుపు తాళం వెక్కిరించింది .డూప్లికేట్ తాళంచెవి తో తలుపు తీసి కుర్చీలో వాలిపోయాడు .అంతా నిశ్శబ్దం ! చందన చిరాకు ప్రవర్తన లేదు .చందన మొండితనం ,మూర్ఖత్వం చంద్రాన్ని ఒక నిస్సహాయ జీవిగా చేసింది .సరదాలు సంతోషాలు చచ్చిపోయాయి .

చందన తండ్రి ప్రోత్సాహం తో చంద్రానికి విడాకులిచ్చింది .చంద్రం కూడా చందనకు సరిపడా డబ్బులిచ్చేసి వదిలించుకున్నాడు .వారిద్దరి గమ్యాలు దారులు వేరయ్యాయి .కాలచక్రం లో రెండు సంవత్సరాలు గిర్రున తిరిగిపోయాయి .

చంద్రం తన బ్యాంక్ లో పనిచేసే మల్లిక ను పెళ్లి చేసుకున్నాడు .మల్లిక తల్లితండ్రులు రైల్ ప్రమాదం లో చనిపోయారు . తనవాళ్లంటూ యెవరూ లేరు .మల్లిక చంద్రం కోరుకున్న జీవితాన్ని యిచ్చింది .చంద్రం ఆమె లో తన తృప్తిని ప్పొందాడు . ఇప్పుడు వారిద్దరి జీవనం హాయిగా సాగిపోతున్నది .

చంద్రం ,మల్లిక స్వామి దర్శనానికి తిరుమల వెళ్లారు .అక్కడ చందన కనిపించింది .అయిదు సంవత్సరాల తర్వాత ఒకరికొకరు ఎదురుపడ్డారు .ప్రక్కన మెళ్లో మంగళసూత్రం తో చంద్రం చెయ్యి పట్టుకున్న మల్లికను చూడగానే చందనకు. అర్ధం అయ్యింది .అందుకే మౌనం గా అక్కడినించి వెళ్లిపోయింది .బాగా సన్నబడింది .జీవకళ లేదు .పండంటి కాపురాన్ని మూర్ఖత్వం తో జారవిడుచుకుంది .చంద్రానికి మనసు లోతుల్లో కన్నీటిచుక్క తడిసింది .

చందన లో తాను జారవిడుచుకున్న సౌభాగ్యాన్ని తల్చుకుని కళ్లు తడిసాయి .తమ్ముడు మరదలు మధ్య గడుపుతున్న తన జీవితం మీద తనకే అసహ్యం వేసింది ..భర్త సహనానికి పరీక్ష పెట్టింది .తాను జీవితం లో ఓడిపోయింది .స్త్రీ కి ఆత్మాభిమానం వుండాలి కానీ అహంకారం వుండకూడదు .

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు