తప్పు - డి.కె.చదువులబాబు

Tappu

సుజాత ,గోవిందరావుల ఏకైక కూతురు సరళ.ఆరవ తరగతి చదువుతోంది.ఙ్ఞాపక శక్తి తక్కువ.చదువు లో కొంచెం వెనుకబడి ఉండేది.బాగా చదవమని,మంచిమార్కులు రావాలని తల్లిదండ్రులు ఒత్తిడిచేసేవారు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని తిట్టారు.కొట్టారు. ఇకముందు మార్కులు తక్కువొస్తే వీపు చీరేస్తామని బెదిరించారు.అలా దండించటం వల్ల బాగా చదివి,గుర్తుంచుకుంటుందని భావించారు.సరళకు తల్లిదండ్రులంటే, పరీక్షలంటే భయం పట్టుకుంది. ఆరునెలల పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులకు ప్రగతి పత్రాలిచ్చారు.తల్లి దండ్రులకు చూపించి సంతకం చేయించుకుని రమ్మన్నారు.తక్కువ మార్కు లు రావటంతో సరళ వణికిపోయింది. అమ్మ,నాన్న కొడతారని భయపడింది. ఆలోచిస్తే ఓ ఆలోచన తట్టింది.ప్రగతిపత్రం లోని మార్కులను ఎక్కువ మార్కులుగా జాగ్రత్తగా సరిదిద్దింది. ఇంట్లోచూపించింది. సంతృప్తిగా సంతకం చేశాడు గోవిందరావు. ప్రగతి పత్రం తెచ్చి తరగతి టీచర్ కిచ్చింది. మార్కులు విద్యార్థుల ప్రగతి పుస్తకంలో నమోదు చేసుకున్నారని సరళకు తెలియదు మార్కులు దిద్దినవిషయం ఉపాధ్యాయురాలు గుర్తించింది.చాలా పెద్ద తప్పు చేశావని సరళను దండించింది.సరళ మార్కులు దిద్దిన విషయం చెప్పాలని తల్లిదండ్రులను పిల్చుకు రమ్మంది.రెండు దినాలైనా తల్లిదండ్రులను పిల్చుకురాలేదు. మూడవరోజు తల్లిదండ్రులను తీసుకురమ్మ ని సరళను పాఠశాలనుండి బయటకు పంపింది టీచర్. పాఠశాలబయట నిల్చుండిపోయింది సరళ. ఇంటికెళ్ళి విషయం చెబితే వాతలుతేలేలా తంతారు.ఇంటికెళ్ళటం కుదరదు. పాఠశాలలోకెళ్ళటానికీ వీల్లేదు. ఏంచేయాలో,ఎక్కడికెళ్ళాలో అర్థంకాలేదు. వెక్కివెక్కి ఏడుస్తూ వుండిపోయింది. ఆలోచనలు రకరకాలుగా పరుగెడుతున్నాయి.పెద్ద తప్పుచేశానని కుమిలిపోతూవుంది. ఓవ్యక్తి కారు దిగిస్కూలువైపు వస్తూ కనిపిం చాడు.ఆయనను చూడగానే సరళకు ఓ ఆలోచన వచ్చింది.ఏపరిచయం లేకున్నా ఆయనను "అంకుల్...అంకుల్..."అని పిలిచింది.ఆయన ఆ పాప వైపు చూసి "ఏమ్మా!ఎవరునువ్వు?ఎందుకేడుస్తున్నా వు?"అని అడిగారు. ఏడుస్తూనే జరిగిన విషయం ఆయనతో చెప్పి"మార్కులు దిద్ది తప్పుచేశానంకుల్! ఎప్పుడూ అలాంటి తప్పుచేయను. మా అమ్మ,నాన్నలకి తెలిస్తే కొడతారు. మీరు నాకు అంకుల్ అవుతారని,నాన్న పంపారని టీచర్ తో చెప్పండి.ఇంకెప్పుడూ అలాంటిపని చేయనని తరగతిలో చేర్చు కోమనిచెప్పండి."అని వెక్కివెక్కి ఏడ్వసాగింది. "చూడమ్మా!నువ్వు మార్కులు దిద్దడం తప్పు.అదీగాక ఇప్పుడు నేను మీ అంకుల్ నని,మీ నాన్న పంపించాడని అబద్దమాడటం ఇంకా పెద్ద తప్పు.మీ టీచర్ తో నేను చెబుతానురా!"అంటూ ఆయన సరళచేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళా డు. ఫోన్ చేసి గోవిందరావును పిలిపించారు. ఉపాధ్యాయులు ఆగది దగ్గరకు చేరుకున్నారు.ఆయన జరిగిన విషయం గోవిందరావుకు వివరించి "పాప తాను చేసి న తప్పు తెలుసుకుంది.ఎప్పుడూ ఇలాంటి పనులు చేయనని బాధపడుతోంది.ఇలా జరగటానికి కారణం మార్కులు తగ్గితే మీరు దండిస్తారనే భయం.తన్నటం,తిట్ట డం వల్ల బాగా చదివి గుర్తుపెట్టుకుంటార నుకోవటం పొరపాటు.మంచి మాటలద్వా రా,ప్రశంసించటం ద్వారా,బహుమతులద్వా రా చదివేలా చేయవచ్చు.ఙ్ఞాపకముండటా నికి అవలంభించాల్సిన పద్దతులను అనుసరించాలి.టీచర్లు వ్యక్తిగత బోధన చేయాలి.ఉపాధ్యాయులు తయారుచేసిన ,విద్యార్థులు తయారుచేసిన అభ్యసన సామాగ్రి బోధనలో బాగా ఉపయోగించాలి. క్రమంగా వారి అభ్యసనలో మార్పుతేవాలి. కొట్టడం,తిట్టడం వల్ల పిల్లల్లో మార్పు రాకపోగా ,వాళ్ళ ఆలోచనలు పెడదారి పట్టే అవకాశముంది.పారిపోవటం లాంటి సంఘ టనలు జరుగుతాయి."అంటూ వివరించారు గోవిందరావుకు తన పొరపాటు అర్ధమయింది."క్షమించండి!మీరు చెప్పింది అక్షరాలా నిజం.నా కళ్ళు తెరిపించారు. ఇంతకీ మీరేం చేస్తుంటారు"అన్నాడు. "నేను ఈమండలానికి కొత్తగా వచ్చిన విద్యాధికారిని.పాఠశాల సందర్శనకు వచ్చాను."చెప్పారాయన. "క్షమించండి నాన్న!ఇంకెప్పుడూ తప్పులు చేయను"అంది సరళ. విద్యాధికారి నవ్వి"తప్పు చెయ్యడం ఒక తప్పయితే, ఆతప్పును కప్పి పుచ్చుకోవడా నికి మరో తప్పు చెయ్యడం పెద్ద తప్పు. తప్పులమీద తప్పులు చేస్తూపోతే జీవితం వ్యర్థమవుతుంది.ఫలితంగా జీవితంలో ఎందుకూ పనికిరాకుండా పోతారు.అలాగని తప్పుచెయ్యని వారు ఉండరు.పిల్లలుగానీ, పెద్దలుగానీ తమ తప్పు తెలుసుకుని, ఆతప్పును సరిదిద్దుకొని,మళ్లీ చెయ్యకుండా ఉంటే వారి జీవితం బంగారు బాటవుతుంది."అన్నాడు. గోవిందరావు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయాడు. * *

మరిన్ని కథలు

Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు
Alludigari alaka panpu
అల్లుడుగారి అలక పాన్పు
- మోహనరావు మంత్రిప్రగడ
Nruga maharaju
నృగ మహరాజు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి