పరిష్కారం - మద్దూరి నరసింహమూర్తి

Parishkaaram

బారెడు పొద్దెక్కి సూర్య కిరణాలు కిటికీలోంచి లోపలికి వచ్చి కళ్ళ మీద పడితే –

‘ఈరోజు ఇంత మొద్దునిద్ర పోతున్నానేమిటి, పోనీ ఈయన అయినా నాకు లేపవచ్చుకదా’ అని పక్కన చూసిన భారతికి ఎందుకో మనసు కీడు శంకించింది.

"ఏమండీ" అంటూ తట్టి తట్టి లేపినా ఎంతకీ లేవని భర్తని చూస్తూంటే తన కుడి కన్ను కుడి భుజం అదేపనిగా అదురుతున్నాయి.

ఏమిటీ అపశకునాలని, భర్త ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే - భారతికి రాత్రి తమ ఇద్దరి మధ్యన సంభాషణ గుర్తుకొచ్చింది.

"నాకు గుండెలో చిన్ననొప్పి వచ్చినంత మాత్రాన ఇంత గోల పెడతావేమిటి? మందు వేసుకున్నాను కదా. నా ఆరోగ్యం గురించి నాకు తెలీదా? నాకు ఏమి అవదు. నన్ను నీ గోలతో భయంతో మరి విసిగించకు. అంతగా నా ఆరోగ్యం గురించి చింత భయం ఉంటే, ‘హనుమాన్ చాలీసా’ లేకపోతే ‘మృత్యుంజయ మంత్రం’ అదీ కాకపోతే ‘శ్రీరామ’ అంటూ కళ్ళుమూసుకొని పడుకో. నేను పడుకుంటున్నాను.”

"అది కాదండీ, ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి చూపించుకొనివస్తే బాగుంటుంది.”

"ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా. రాత్రి మూడు దాటుతోంది. మరో రెండు గంటలకి తెల్లవారి పోతుంది. అంతగా అవసరమైతే రేపు పొద్దున్న హాస్పిటల్ కి వెళ్లొచ్చు.

--అవే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు.

పెళ్ళైన నెల రోజులలోనే భగవంతం మనః ప్రవృత్తి భారతికి అర్ధమైంది.

అతనికి ఎప్పుడూ తానే మిగతావారికంటే గొప్ప అన్న అతిశయం. తనకంటే తక్కువవారు -- ఎంత దగ్గర వారైనా - తన దగ్గర చేరితే అది తన దగ్గరున్న డబ్బు కోసమే అని అపోహ.

భగవంతంకి ‘భార్య’ అంటే వంటింటికి, పిల్లలని కని పెంచడం వరకే ఆమె పరిధి పరిమితి అన్న ప్రగాఢ విశ్వాసం.

డబ్బు విషయంలో కూడా ఇంటి అవసరాలకి కావలసినంత భార్యకి తాను ఇస్తాడు కాబట్టి ---

ఆ డబ్బు భర్తకి ఎలా వచ్చింది; నెలా నెలా ఎంత వస్తే భర్త అంత ఇవ్వగలుగుతున్నాడు;

అసలు భర్త చేసే పని ఏమిటి; ఎక్కడ పని చేస్తున్నాడు; కుటుంబానికి సంబంధించి భర్త చేసే

భవిష్యత్ ప్రణాళిక - అంటే జీవిత భీమా, బ్యాంకులో డబ్బు దాచడం వగైరా - ఏమిటి;

ఆ దాచింది కూడా ఎక్కడ; అసలు ఎవరి పేరులో దాస్తున్నాడు –

ఇటువంటి వివరాలు భార్యకి తెలియవలసిన అవసరం లేదు అనేది భగవంతం బలంగా నమ్మే సిద్ధాంతం.

-2-

పిల్లలని కూడా 'నన్ను ముట్టుకోకు నామాల కాకి' అన్న చందాన పెంచి 'వండి వడ్డించడం వరకే తల్లి, అంతకుమించి ఏమేనా అవసరాలుంటే తీర్చవలసినది తండ్రే కాబట్టి ఆమెకు ఏమీ చెప్పక్కరలేదు అని నూరిపోసేడు. పిల్లల చదువులైపోగానే పెద్ద చదువులు నెపంతో ఉన్న ఇద్దరు కొడుకులని విదేశాలలో నిలబెట్టి తల్లికి భౌతికంగా కూడా దూరం చేసేడు. ఆఖరికి, పిల్లలిద్దరూ ఎక్కడ ఉంటున్నారు వారితో నేరుగా మాట్లాడాలంటే ఎలాగా అన్నది కూడా ఆమెకు తెలియకుండా చేసేడు.

నాన్న పొతే, భారతి కంటే ఆరేళ్ళు పెద్దైన భాస్కరమే డిగ్రీ వరకూ చదివించి ఒక పెద్ద బ్యాంకులో ఆఫీసర్ గా పనిచేస్తున్న భగవంతంతో పెళ్లి చేసేడు. 'పిల్లని ఇచ్చేటప్పుడు మనకంటే ఎక్కువ అంతస్తులో ఉన్నవారికి ఇవ్వాలి' అన్న పెద్దల సందేశం ప్రకారం – ‘బాగా డబ్బున్న కుటుంబం, పైగా పెళ్ళికొడుకు పెద్ద బ్యాంకులో ఆఫీసర్ కాబట్టి భారతి సుఖపడుతుంది’ అనుకున్న భాస్కరం తన తాహతుకి మించిన పనైనా భగవంతం కుటుంబంతో వియ్యమందేడు.

భారతికి అన్న భాస్కరం అంటే చాలా గౌరవం చనువుతో కూడిన అభిమానం.

‘అన్న’ అంటే ఎంతగానో అభిమానించే భారతిని -- ' నీ అన్నకి తన ఇంటికి వచ్చే చనువు ఇవ్వకూడదని -- మెత్తటి మాటలతో శాసించేడు భగవంతం'.

ఒకసారి భగవంతం ఇంట్లో లేనప్పుడు భాస్కరం ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తే మాట్లాడిన భారతి “పని దినాలలో బ్యాంకు పని చేసే సమయాలలో ‘నువ్వే ఫోన్ చేయి అన్నయ్యా” అని ఏడుస్తూ వేడుకుంది. అన్నయ్య నంబర్ ఒక కాగితం మీద వ్రాసి తన బీరువాలో చీరెల మధ్యన భద్రంగా దాచుకుంది.

అన్నయ్యకి ఫోన్ చేసి జరిగింది చెప్పి వెంటనే రమ్మంది. అలా అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో దుఃఖపు ఛాయలు లేకపోవడం ఆమె అన్నయ్యకి తెలియకపోలేదు.

తరువాత, పక్కనున్న పార్వతమ్మగారి ఫ్లాట్ తలుపు తట్టి బయటకి వచ్చిన ఆమెతో “రాత్రి గుండెలో నొప్పి వచ్చి తగ్గి పడుకున్న మనిషి ఇప్పటి వరకూ లేవడం లేదు. మతిలేనిదాన్ని నేను కూడా ఇంతవరకూ మొద్దులాగా పడుకోబడిపోయేను. ఆయన పిలుస్తే పలకడం లేదు. తట్టి లేపడానికి నాకు ధైర్యం చాలడం లేదు. ఇంట్లో మరెవరూ లేరు. అన్నయ్య వచ్చేసరికి ఎంతలేదన్నా అరగంట అవుతుంది. ఈలోగా ఒక్కసారి అబ్బాయిని వచ్చి చూడమనరా" అని దైన్యంగా ఏడుస్తూ అడిగితే –

"అయ్యో దీనికి ఇంతగా అడగాలా మీరు పదండి నేను వాడితో కలిసి వస్తాను.”

పార్వతమ్మగారి అబ్బాయి రామేశం వస్తూనే ఒకసారి భగవంతం దగ్గరగా వెళ్లి చూసి"ఆంటీ మీరేమీ గాభరాపడకండి, మన కాలనీ లో ఉన్న డాక్టర్ గారిని తీసుకొనివస్తాను" అంటూ వెళ్లి డాక్టర్ గారిని తీసికొనివచ్చి చూపిస్తే –

-3-

“ఈయన ప్రాణం పోయి తక్కువలో గంట పైనే అయిఉంటుంది. బహుశా కార్డియాక్ అరెస్ట్ తో పోయినట్టుంది. పోస్ట్ మార్టం చేస్తే గానీ సరైన కారణం చెప్పలేం" అని చెప్పి వెళ్ళిపోయేరు.

ఆ మాటలు విన్న భారతి ఒక్కసారిగా పర్వతమ్మగారి చేతులలో వాలిపోయి -- "వదినగారూ, నాకు ప్రపంచమంతా చీకటి కమ్మేసినట్టుంది. నా దైవం, నా సర్వస్వం ఇక నాకు లేరా"

-- అంటూ ఏడుస్తున్న భారతిని పార్వతమ్మగారు పట్టుకొని ఓ పక్కన ఓదారుస్తూనే –

"ఇలాంటి సమయంలోనే ఎవరికైనా ధైర్యం కావాలి. మీ బాధ అర్ధం చేసుకోగలను. కానీ, మీ పిల్లలకి ఇంకా ఎవరికైనా ఈ విషయం తెలియచెయ్యాలి కదా. ముందుగా ఎవరికి ఫోన్ చేయమంటారు."

తన్నుకొస్తున్న దుఃఖాన్ని తనలోనే దిగమింగుకుంటూ “మా భాస్కరం అన్నయ్య వస్తే అన్నీ చూసుకుంటాడు లెండి" అని ఏడుస్తూ అలాగే ఉండిపోయారు.

వచ్చిన భాస్కరంని చూడగానే భారతి దుఃఖం కట్టలు తెంచుకొని "అన్నయ్యా" అంటూ అతని చేతుల్లో వాలి మూర్ఛ పడిపోయింది.

పార్వతమ్మగారు కాసిన్ని నీళ్లు జల్లుతే తేరుకున్న భారతి "అన్నయ్యా" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది.

"భాస్కరంగారూ, నేను పక్క ఫ్లాట్ లో ఉంటాను. నా పేరు పార్వతి. కొంచెం సేపు ఆవిడని ఏడవనివ్వండి, లేకపొతే ప్రమాదం. వీడు మా అబ్బాయి రామేశం. ప్రస్తుతానికి మేము వెళ్తున్నాము. మీకెటువంటి సహాయం కావలసినా మమ్మల్ని నిర్మొహమాటంగా పిలవండి. జరగవలసిన పనులు ఆలోచించండి. అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్లకి కూడా మా రామేశం చెప్పేడు. వాళ్ళు కూడా ఒక అర గంటలో వస్తారు. మీకు కావాల్సిన సహాయం చేస్తారు" అని, భారతికి ధైర్యంగా ఉండమని చెప్పి పార్వతమ్మగారు రామేశంతో కలిసి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళిపోయేరు.

వీధి తలుపు వేసి వచ్చిన భాస్కరం " ఏమిటే భారతి ఎలా జరిగింది. అంతా అయిన తరువాతా నాకు చెప్పేది." అని కొంచెం నిష్టూరంగా మాట్లాడేడు.

"అన్నయ్యా" అంటూ దుఃఖంతో నోటమాట రాని భారతిని పొదివి పట్టుకొని --

"నిన్ను నిందించాలని కాదే. బావకి ఒంట్లో బాగులేక పొతే వెంటనే నాకు చెప్తే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళేవాళ్ళం కదా. అసలు ఏమి జరిగింది, ఎలా జరిగింది"

"అర్ధరాత్రి వచ్చిన గుండెలో నొప్పి 'చిన్నదే, మందులు వేసుకున్నాను, బాగానే ఉంది, మాట్లాడకుండా పడుకుంటున్నాను, నువ్వు కూడా మాట్లాడకుండా పడుకో' అని ఆయన అంటే వెర్రిదాన్ని నమ్మి నేను కూడా పడుకోపడిపోయెను. నేను లేచేసరికి తెలవారడమే కాక నా బ్రతుకు కూడా తెల్లవారిపోయింది అన్నయ్యా" అంటూ ఏడుస్తూన్న భారతితో --

"పిల్లలిద్దరికీ తెలియచేయాలి కదా, వాళ్ళ నంబర్లు నీ దగ్గర ఉన్నాయా లేక అవి కూడా బావ మొబైల్ లోనే ఉన్నాయా"

-4-

"నీకు తెలియందేమిటి అన్నయ్యా 'నీకెందుకు, అన్నీ నేను చూసుకుంటాను కదా' అంటూ పిల్లల నంబర్లు కూడా ఆయన మొబైల్ లోనే ఉంచుకున్నారు, నాకు తెలియనివ్వలేదు.” అన్న భారతి వేపు జాలిగా చూసిన భాస్కరం -

"బావ సంగతి ఈరోజు కొత్తేమీ కాదులే. ఇంతకీ బావ మొబైల్ ఏదీ, పిల్లలకి చెప్పాలి కదా. నాతో వాళ్లెప్పుడూ ఫోన్ చేయకపోవడంతో నా దగ్గర కూడా వాళ్ళ నంబర్లు లేవు."

మంచం దగ్గరకి వెళ్లిన భారతి నిర్లిప్తంగా భర్త తలగడ కిందనున్న మొబైల్ తీసుకొని వచ్చి భాస్కరంకి ఇచ్చింది.

"ఇది ఓపెన్ అవడానికి పాస్వర్డ్ కావాలి. అది తెలియాలంటే పైకి వెళ్ళిపోయిన బావ దిగి రావాలి. ఇది ఓపెన్ అయితేగానీ పిల్లలతో మాట్లాడడం అవదు. పోనీ కష్టమో నష్టమో ఓపెన్ చేయిద్దామంటే చాలా ఎక్కువ సమయం కావాలి. అంతవరకూ బావ బాడీని ఇలా ఉంచుతే వంట పెంట మానుకున్న ఇరుగు పొరుగు వారు అపార్ట్మెంట్ లో ఇతర జనం ఊరుకుంటారా?"

"మరి ఏం చేద్దామన్నయ్యా"

"ప్రస్తుత సమస్యకి ఒక్కటే పరిష్కారం ఉంది"

"ఏమిటది"

"బావ అంత్యక్రియలు గంగా తీరంలో చేయడానికి నిశ్చయించుకున్నామని, పిల్లలు అక్కడకే నేరుగా వస్తారని, ఇక్కడున్నవారితో చిన్న అబద్ధం చెప్పి, బావ పార్థివ శరీరాన్ని మెడికల్ కాలేజీ వారి పరిశోధనకు దానం చేయడం. అపార్ట్మెంట్ జనం సహాయంతోనే ఇప్పటి కార్యక్రమం కానిచ్చేయాలి. దానితో నీకు సానుభూతితో కూడిన సహాయం దొరకడమే కాక పుణ్యం పురుషార్థం కూడా దక్కుతుంది. ఆ తరువాత ‘బావ చనిపోయిన నక్షత్రం మంచిది కాదు ఆరు నెలలు ఇల్లు వదిలిపెట్టాలి’ అని అందరికీ చెప్పి నిన్ను నాతో తీసుకొనివెళిపోతాను."

"నీ ఇష్టం అన్నయ్యా నువ్వెలాగంటే అలాగే."

"బావ మొబైల్ జాగ్రత్తగా దాచు. నేను తలుపు తీసి మన నిర్ణయం అందరికీ చెప్తాను" అని ముందుకు కదిలేడు భాస్కరం.

*****

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి