సింహం కూన ముచ్చట - సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

Simham koona muchata

ఒక ఏనుగు అడవిలో దారి వెంబడి ఆహారం కొరకు నడుస్తున్నది. అప్పుడు దానికి తప్పిపోయిన సింహంకూన ఎదురైంది. ఏనుగు ఆ సింహంకూనకు భయపడి వెనుకకు తిరిగి పారిపోవాలని చూసింది . కానీ దానికి మూడు రోజులుగా ఆహారం లేకపోవడంతో అది శక్తి లేక ఉన్నచోటనే కూలబడిపోయింది . ఇంతలో అక్కడికి వచ్చిన సింహం కూనను చూసి ఏనుగు నెమ్మదిగా పైకి లేచి వీలైనంత ఓపిక తెచ్చుకొని తొందరగా వెళ్ల సాగింది. అప్పుడు ఆ సింహం కూన కూడా ఆ ఏనుగు వద్దకు వచ్చి దాని పైకి ఎగుర సాగింది . అది చూసిన ఏనుగు నవ్వి "నీవు నా పైన దాడికి సమయం ఇంకా ముందు ఉందిలే!; ఇప్పుడు నేను పెద్దగా ఉండడం వల్ల అది నీకు సాధ్యం కాదులే!" అని అంది . అది విన్న సింహంకూన "అయ్యో !ఏనుగు మామా! నేను నీ పైన దాడి చేయాలని రాలేదు. నీ పైన ఎక్కి అడవి అంతా తిరగాలని అనుకుంటున్నాను .అందుకే ఈ ప్రయత్నం" అని అంది . అప్పుడు ఏనుగు దాని మాటలకు సంతోషించి అక్కడ ఉన్న చెట్ల ఆకుల చివరలను తిని తన కడుపును నింపుకొంది. తర్వాత అలా ఎగురుతున్న సింహంకూనను తన తొండంతో పైకి లేపి తన పైన కూర్చోబెట్టుకుంది. అక్కడ తన బిడ్డ కనబడకపోవడంతో తల్లి సింహం కాలు గాయంతో నెమ్మదిగా నడుస్తూ దాని కొరకు వెతుకుతూ కనబడని వారినందరిని అడిగింది. అవి తాము దాన్ని చూడలేదని చెప్పాయి . అప్పుడు ఆ సింహం అటువైపు వచ్చింది . వెంటనే ఏనుగు దాన్ని చూసి సింహం కూన తో పాటు పరుగు తీసింది. తల్లిసింహం దాన్ని ఆగమని ఎంత అరిచినా ఏనుగు ఆగలేదు . ఆ తర్వాత అది సింహం కూనతో "ఓ బుజ్జీ! నీవు నా పైనుండి దూకు లేదా ఏ చెట్టుకొమ్మనైన పైన పట్టుకో . నేను పరుగు తీస్తాను" అని అంది . అప్పుడు సింహంకూన "ఏనుగు మామా! వచ్చేది మా అమ్మనే! అది నిన్ను ఏమీ చేయదు. నీకేం భయం లేదులే! దానికి నేను నిన్ను ఏమీ అనకుండా చెబుతాలే "అని అంది. దాని మాటలు విన్న ఏనుగు "ఒరేయ్ బుజ్జీ! నీకేం తెలియదు. మీ అమ్మ నాపై దాడి చేస్తుంది . మీ పిల్లల మాటలను ఎవరు పట్టించుకోరు . అందుకే నీవు నా పైనుండి దూకు" అని అంది . చివరకు ఆ సింహంకూన ఆ ఏనుగు పై నుండి దూకింది. ఆ ఏనుగు అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత వచ్చిన దాని తల్లితో ఆ సింహంకూన " అమ్మా! నిన్ను చూసి ఏనుగు ఎందుకు భయపడుతున్నది? అది నన్ను తనపైన ఎంచక్కా ఎక్కించుకొని అడవి అంతా తిప్పుతున్నది. నీవే అనవసరంగా వచ్చి నా విహారాన్ని పాడుచేశావు" అని అంది. అప్పుడు సింహం "ఔనురా! మనం ఆకలైనప్పుడు ఏనుగు పైన దాడి చేస్తాం . అందువల్లనే అది నేనంటే భయపడుతున్నది . నీవు చిన్నపిల్లవు కనుక నిన్ను చూస్తే దానికి భయం వేయడం లేదు "అని అంది . "అయితే మనకు ఉన్న ఈ చెడ్డ పేరు ఎప్పుడు తొలగిపోతుందమ్మా? నీవు ఎలాగైనా ఏనుగును తీసుకొని రా ! ఊ...ఊ....ఊ...."అని ఏడుస్తూ అంది సింహంకూన. ఆ సింహం 'సరే'నంది . అది మరునాడు ఏనుగుకు అది తినే ఆహారాన్ని దారిలో ఉంచి ఒక చెట్టు చాటున దాక్కుంది. ఆ సింహంకూన కూడా ఏనుగును చాటు నుండి చూడ సాగింది. అప్పుడే అటువైపు వచ్చిన ఏనుగు ఆ ఆహారాన్ని చూసి సంతోషించి చుట్టూ చూసింది . అక్కడ దానికి చెట్టు చాటున సింహంకూన కనబడింది . దాని వెనుక తల్లి సింహం కూడా కొంచెం కనపడింది. వెంటనే ఏనుగు వెనుకకు తిరిగి పారిపోయింది. అప్పుడు ఆ సింహం తన బిడ్డతో "నేను ముందే చెప్పలేదా! నీవు చాటుగా ఉండమంటే వినకుండా దాన్ని చూసావు . అందువల్ల అది మనను చూసి పారిపోయింది. ఇప్పుడు మనం మంచి చేసినా , దానికి చెడుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిన తర్వాత మంచి పేరు రావాలంటే చాలా సమయం పడుతుంది. మంచి పేరును సంపాదించడం కష్టం. చెడ్డ పేరు నిమిషంలో వస్తుంది "అని అంది . చేసేది లేక అవి తిరిగి ఇంటికి చేరుకున్నాయి. ఆ తర్వాత మరొక్కసారి ఏనుగు ఒక వేటగాడు తవ్విన గుంతలో పడిపోయింది. అది గమనించిన సింహంకూన వెంటనే ఆ సంగతి తన తల్లికి చెప్పింది. అప్పుడు ఆ తల్లిసింహం ఏనుగు బంధువులన్నింటికీ తన బిడ్డ సింహం కూన ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఆ ఏనుగులన్నీ వచ్చి ఆ గుంతలో పెద్దపెద్ద చెట్లను ,మట్టిని దొర్లించి అది పైకి వచ్చేటట్టు చేసి దాన్ని కాపాడాయి. అవి సింహంకూన గురించి ఏనుగుకు చెప్పాయి . ఏనుగు సంతోషంతో తిరిగి ఆ సింహంకూనను తన పైన ఎక్కించుకుంది. అప్పుడే వచ్చిన దాని తల్లి సింహాన్ని చూసి ఈ ఏనుగుతో పాటు మిగిలిన ఏనుగులు పారిపోసాగాయి. అది చూసి ఆ తల్లి సింహం " ఆగండి. ఏనుగుల్లారా! భయపడకండి! నేను మిమ్మల్ని ఏమీ చేయను. నా మాట నమ్మండి . మీ ఏనుగు నా బిడ్డను ఎక్కించుకుని అడవిలో తిరిగి దాని ముచ్చటను తీర్చడం వల్ల మిమ్మల్ని కూడా నేను ఏమీ అనను" అని అంది. దాని మాటలకు ఏనుగులన్నీ ఆగిపోయి ఎంతో సంతోషించాయి. ఆ ఏనుగు చేసిన చిన్న సాయం ఆ ఏనుగుల మొత్తానికి వరమై ఆ సింహం బాధ లేకుండా చేసింది.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల