పెద్ద చదువులు - టి. వి. యెల్. గాయత్రి.

Pedda chaduvulu

ఆ రోజు ఆఫీసులో పనిచేసుకుంటున్నాడు రఘురామ్. జ్యోతి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. "మంజూకు బాగలేదట.నడవటం కష్టంగా ఉందట. స్కూలు ప్రిన్సిపాలు ఫోన్ చేసింది. మీరు స్కూలుకు వెళ్ళి పాపను తీసికొని వస్తారా? నేను క్యాబ్ లో వెళ్లనా?"గబగబా చెప్పింది జ్యోతి. "నువ్వేమీ కంగారు పడకు!నేనే వెళ్లి మంజూని తీసికొని వస్తాను." రఘురామ్ ఆఫీసు నుండి స్కూలు దగ్గరే. ఇంటి దగ్గర్నుంచి జ్యోతి క్యాబ్ పట్టుకొని వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది. రఘురామ్,జ్యోతిలకు ఒక్కటే పాప మంజు. మంజు ఎయిత్ క్లాసు చదువుతోంది. నాలుగు రోజులుగా పాప నడకలో మార్పు వచ్చింది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటూ మెల్లగా నడుస్తోంది. అసలే కొంచెం బొద్దుగా ఉండే పిల్ల.ఈ మధ్య మంజుకు మెట్లక్కటం, దిగటం చాలా కష్టంగా ఉంది.శనివారం స్కూలుకు సెలవే కాబట్టి డాక్టర్ దగ్గరికి తీసికెళ్దామనుకుంది జ్యోతి. ఈ లోపలే స్కూలు నుండి ఫోన్ వచ్చింది. ఒక గంటలో మంజుని తీసికొని ఇంటికి వచ్చాడు రఘురామ్. ఎడమకాలు పైకెత్త లేకపోతున్నది మంజు. బాధతో విలవిలలాడుతున్న కూతురుని చూస్తే గాభరా పడింది జ్యోతి.వాపుగానీ, గడ్డగానీ ఉందేమోనని చూసింది. అదేమీ లేదు. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర అప్పాయింటుమెంటు తీసికొన్నాడు రఘురామ్. డాక్టర్ ప్రతాప్ ఊర్లోనే మంచి పేరున్న ఆర్థోపెడిక్ సర్జన్. మంజుని పరీక్షచేసాడు. ఎక్సరే తీయించి తీసికొనిరమ్మన్నాడు. ఒక గంటతర్వాత పాపను తీసికొని డాక్టర్ దగ్గరికి వచ్చారు రఘురామ్ దంపతులు. "మంజు ఏ క్లాసు చదువుతోంది?" "ఎయిత్ క్లాసు డాక్టర్!" బదులిచ్చాడు రఘురామ్. "ఊ..స్కూలు టైమింగ్స్ ఏమిటి?" పాప కాలునొప్పికి స్కూలు టైమ్ కి సంబంధం ఏమిటో అర్థం కాలేదు రఘురామ్ దంపతులకు. "పొద్దున ఎనిమిదింటికి బస్సులో బయలుదేరుతుంది. సాయంత్రం వచ్చేసరికి ఐదవుతుంది." చెప్పింది జ్యోతి. "స్కూలు నుండి వచ్చింతర్వాత ఏమి చేస్తుంది?" "కాసేపు టి. వి. చూస్తుంది. ఆ తర్వాత హోమ్ వర్క్ చేసుకుంటుంది." "స్కూలులో స్టడీ అవర్స్ కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? స్పోర్ట్స్ క్లాసెస్ అలా..." డాక్టర్ ప్రశ్నకు జవాబుగా "ఇంతకు ముందు స్కూలులో పిల్లలకు ప్లే గ్రౌండ్ ఉండేది. స్పోర్ట్స్ క్లాసెస్ వారానికి నాలుగు ఉండేవి. ఇప్పుడు స్కూలు మార్చాము. ఈ స్కూలులో అలాంటి గ్రౌండ్ లేదు. అందుకని స్పోర్ట్స్ క్లాసెస్ కూడా లేవు."చెప్పాడు రఘురామ్. డాక్టర్ ప్రతాప్ కళ్ళజోడు తీసి బల్లమీద పెట్టాడు. "మీరు పాపను వేరే స్కూలుకు ఎందుకు మార్చారు?" "మేము మా పాపని మెడిసిన్ చదివించాలని అనుకున్నాము. ఎయిత్ క్లాసు నుండి కోచింగ్ ఇప్పిస్తే ఇంటర్ లో ఉండే పోటీ పరీక్ష వ్రాయటానికి సులభమవుతుంది. అందుకని ఈ స్కూలుకు మార్చాము."వివరించాడు రఘురామ్. నవ్వాడు ప్రతాప్. "మాకు పోటీ వస్తుందన్న మాట మంజు... గుడ్ గర్ల్. రాంక్ తప్పకుండా వస్తుంది. ఇది చిన్న ప్రాబ్లెమ్. తగ్గిపోతుంది!పాప బ్లడ్ లాబరేటరీలో ఇచ్చి వెళ్ళండి!రేపొద్దున్న లాబ్ వాళ్ళు నాకు రిపోర్ట్స్ పంపిస్తారు. దాన్ని చూసి ఏమి చెయ్యాలో చెప్తాను. నేనొక ఆయింట్ మెంట్ ఇస్తాను. అది కొంచెం నొప్పి ఉన్నచోట రాసి, వేడినీళ్ల కాపడం పెట్టండి!" "రేపు పాపని తీసికొని రమ్మంటారా డాక్టర్!"అడిగింది జ్యోతి. "అవసరంలేదు. ఇప్పుడు చూసాను కదా!ఒక నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. ఏమీ లేదు. కొంచెం స్ట్రెయిన్ అయింది అంతే." డాక్టర్ మాటలతో జ్యోతికి కొంచెం గాభరా తగ్గింది. మంజుని తీసికొని ఇంటికి వచ్చారు రఘురామ్ దంపతులు. ** ** ** ** ** ** ** ** ** ** రెండోరోజు డాక్టర్ క్లినిక్కుకు వెళ్ళాడు రఘరామ్. ఇద్దరు ముగ్గురు పేషంట్లను చూచి తర్వాత రఘురాముని పిలిచాడు డాక్టర్ ప్రతాప్. "పాప బ్లడ్ రిపోర్ట్స్ బాగానే వున్నాయి కదా!" కొంచెం దిగులు ధ్వనించింది రఘురామ్ కంఠంలో. "భేషుగ్గా ఉన్నాయి. మీరు పాపను చేర్పించిన కొత్త స్కూలు ఫీజు ఎంత?" "సంవత్సరానికి రెండు లక్షలు." పాప కాలునొప్పికి, స్కూలు ఫీజుకు సంబంధం ఏమిటో అర్థం కాలేదు రఘురాముకు. అయోమయంగా చూసాడు డాక్టర్ వైపు. "మీరు చేస్తున్న పొరబాటే ఈ రోజు చాలా మంది తల్లి తండ్రులు చేస్తున్నారు రఘురామ్ గారూ! పిల్లలను పెద్ద చదువులు చదివించాలని మంచి కోచింగ్ ఇచ్చే స్కూళ్లల్లో చేర్పిస్తే సరిపోదు. మంచి చదువు చదవాలంటే పిల్లలకు ఆరోగ్యం, ఫిట్ నెస్ అవసరం. వాళ్లకు రిక్రియేషన్, వ్యాయామం ఉందా? పొద్దున లేచి స్కూలు బస్సులో వెళ్ళటం, తర్వాత చదువు అండ్ చదువు. ఒక ఆట లేదు.ఒక పాట లేదు. ఒక ఐదేళ్లలో మీ పాప ఎంత మాత్రం ముందుకు వెళ్తుందో తెలీదు కానీ ఇలాగే కొనసాగితే ఆమె ఆరోగ్యం దెబ్బతినటం ఖాయం. డాక్టర్లు, ఇంజనీర్లు తప్ప మనవాళ్లకు ఇంకో కోర్సులు కనిపించటం లేదు. పాప శరీరానికి వ్యాయామం లేదు. చిన్నపిల్లలు ఆటలు ఆడుకోవాలి. ఆటలు ఆడితేనే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. మీ పాప ప్రాబ్లెమ్ అధిక బరువు. దానితో నరాలు పట్టేసాయి. ఏ మందులూ అవసరం లేదు. రోజూ ఉదయం అరగంట ఎండలో ఆడించండి. సాయంత్రం ఒక గంట ఆడించండి.'డి 'విటమిన్ వస్తుంది. ఆటలాడితే మెదడు చురుకుగా ఉంటుంది. మరీ బస్తాలో వేసి కుక్కినట్లుగా చేస్తే పిల్లలు మందబుద్దులవటమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అనారోగ్యంతో ఉన్న పిల్లలు డాక్టర్లు అయ్యి ఎవరిని ఉద్దరించాలి? ముందు పాపకు వ్యాయామం అవసరం...మన చిన్నప్పుడు స్కూళ్లల్లో ఈ అలవాటు ఉండేది. కనీసం ఒక గంట ఎండలో నిల్చొని ప్రార్థనాగీతాలు, వందేమాతరం లాటివి పాడే వాళ్ళం కదూ! ఇప్పుడు అలాంటి అవకాశమే లేదు. అంతా చదువే అయిపోయింది. ఎండ తగలకుండా పెరగటం వలన విటమిన్స్ లోపాలు, చర్మరోగాలు, నరాల బలహీనతలు, ఎముకల్లో శక్తి లేకపోవటాలు ఇలా అన్ని రోగాలు పుట్టుకొస్తున్నాయి. మీ పాపకు మందులేమీ వద్దు. నేను చెప్పినట్లు చెయ్యండి!" ఒక నిమిషం ఊపిరి పీల్చుకొన్నాడు ప్రతాప్. డాక్టర్ చెప్పినదంతా విని విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు రఘురామ్. అతడికి కర్తవ్యం బోధ పడింది. "మీకు కొంచెం స్ట్రాంగుగా చెప్పాను... ఏమీ అనుకోవద్దు!" "లేదు లేదు!డాక్టర్! మీరు మంచివారు కాబట్టి ఇలా చెప్పారు. ఇంకో డాక్టర్ అయితే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని ఇంకా డబ్బు గుంజి కాలయాపన చేసేవాడు . పాపను మీ దగ్గరికి తీసికొని రావటం నా అదృష్టం. మీరు చెప్పినట్లే చేస్తాను." చేతులు జోడించి డాక్టర్ దగ్గర సెలవు తీసికొన్నాడు రఘురామ్. అతని మనసిప్పుడు తేలికగా వుంది. పాప ఆరోగ్యం ఇప్పుడు అతడి చేతుల్లో ఉంది మరి! *********************************************************

మరిన్ని కథలు

Sukhamaina siksha
సుఖమైన శిక్ష.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Sougandhi
సౌగంధి
- మూల వీరేశ్వర రావు
podupu mantram
పొదుపు మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Jnapakala dontara
‘జ్ఞాపకాల దొంతర’
- మద్దూరి నరసింహమూర్తి
O satya katha
ఓ సత్య కథ
- తటవర్తి భద్రిరాజు
Safari kooli
సఫారీ కూలీ
- మద్దూరి నరసింహమూర్తి
Anoohyam
అనూహ్యం
- మూల వీరేశ్వర రావు
Food delivery
ఫుడ్ డెలివరీ
- మద్దూరి నరసింహమూర్తి