 
                                        శివగిరి పెద్ద పర్వత ప్రాంతం.. చుట్టూ కొండలు, కోనలు ఉండడంతో ఓ పెద్ద పులి సంచరించేది.
 రోజూ అది పగలంతా గుహలో వుండి రాత్రి పడగానే అడవంతా తిరిగి కనిపించిన చిన్నచిన్న జంతువులను నోట కరుచుకుని వెళ్లిపోయేది. ఆ జంతువులు గావు కేకలు పెట్టి అరుస్తున్నా కనికరించక లాక్కువెళ్లి గుహలో ఆరగించేది.
 ఓ రోజు మూడు నెలలు నిండిన తనపిల్ల కుందేలు కనబడకపోవడంతో తల్లి కుందేలు ఆందోళనతో పరిసరాలు వెతికింది. ఆ ప్రాంతంలో పులి సంచరించిన అడుగులు గుర్తించిన తల్లి కుందేలు పులిపై అనుమానంతో బిడ్డను కోల్పోయిన దిగులుతో ఆహారం మాని చిక్కిశల్యమైపోయింది.
 కుందేలు దిగులును గమనించిన మిత్రుడు తాబేలు పరిష్కార మార్గం వెతకసాగింది. అంతలో తల్లి కుందేలు చచ్చిపోయింది.
 మరో రోజు ఓ జింక తన నాల్గు నెలల పిల్ల జింక కనిపించక పోవడంతో అడవి అంతా వెతకసాగింది. పిల్ల జింక ఆచూకీ ఎంతకీ కన్పించకపోవడంతో దిగులుతో కృంగి చనిపోయింది. దీన్నంతటిని గమనిస్తున్న తాబేలు కారణం ఎవరా? అని ఆలోచించింది.
 వారం రోజులు గడిచాయి. ఓ రోజు గజరాజు తన గున్న ఏనుగును వదిలి అడవికి వెళ్లి సాయంత్రం వచ్చి చూసే సరికి గున్న ఏనుగు కనిపించలేదు. ఆందోళనతో ఆహారం తినక పెద్ద ఏనుగు చనిపోయింది.
 వీటి వెనుకగల రహస్యం ఏమిటో తెలుసుకోవాలని తాబేలుకు కుతూహలం కలిగింది.
 ఓ రెండు రోజుల తర్వాత పులిమీద అనుమానం వచ్చింది. పులి నివసిస్తున్న గుహ వద్దకు నడిచింది. తన అనుమానం నిజమైంది. గుహ లోపల ఎముకలు గుట్టలుగుట్టలుగా పడివున్నాయి. ఈ సంగతిని తన మిత్రుడైన కోతికి చేరవేసింది తాబేలు.
 కోతి తన మిత్రులైన తాబేలు, ఏనుగు, జింక, ఎలుగుబంటి, దుప్పి, కొండగొర్రెను వెంటబెట్టుకుని పులి గుహ వద్దకు వెళ్లింది.
 అవి తన గుహవైపు పెద్దగా అరుస్తూ రావడంతో పులి కాస్త భయపడిo ది. వాటికి ఏమి సమాధానం చెప్పాలో అని బాగా ఆలోచించింది. వాటి అలికిడికి ‘‘ ఎవరక్కడ?’’ అని గర్జించింది పులి.
 ‘‘ మేమెవరో కనిపించడం లేదా? లేదా నాటకాలాడుతున్నావా? కనిపించని మా బిడ్డల్ని ఏమి చేశావో చెప్పు?’’ గట్టిగా నిలదీశాయి జంతువులు.
 పులి చలించలేదు. ‘‘ అయ్యో..నాకేం తెలుసు..నాకు చత్వారం వచ్చి రెండేళ్లుగా కళ్లు కనిపించక అల్లాడుతున్నాను. అసలు దారి కనిపించక బయటకు వెళ్లడమే మానుకున్నాను..’’ అని మాట మార్చింది.
 ‘‘అలాగైతే ఈ ఎముకల అస్తి పంజరాలు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ ప్రశ్నించాయి జంతువులు.
 ‘‘ ఏ ఎముకలు..?’’ ఏమీ కనిపించనట్లు ఎదురు ప్రశ్న వేసింది పులి.
 పులి నాటకాన్ని గమనించాయి జంతువులు.
 ‘‘ అయ్యో పాపం! అలానా? బయటకు వెళ్లకుంటే తిండిదొరక్క చిక్కి శల్యమైపోతావు కదా? రేపు మేమందరం మంచి విందు ఇస్తాం..గజరాజుకు గున్న ఏనుగు పుట్టిన సందర్భంగా మీరు తప్పక రండి..మీరే మా అతిథి’’ అంటూ ఆహ్వానించాయి.
 పులికి ఎక్కడలేని ఆనందం వేసింది. ‘‘ మీరంతగా పిలుస్తుంటే రాకపోతానా..?ఏం చెయ్యను.. నాకు అసలు కళ్లు కనిపించవు ! ’’ దిగులుగా ముఖం పెట్టింది పులి.
 ‘‘ నువ్వేం దిగులు పడకు.. మేమందరం వచ్చి నీ చేయి పట్టుకుని తీసుకెళతాం లే..?’’ అన్నాయి జంతువులు.
 మరుసటి రోజు పులి విందుకోసం ఎదురుచూసింది.
 పులిని తీసుకెళ్లడానికి జంతువులు రానే వచ్చాయి.
 పులి ఆనందంతో జింక చేయి పట్టుకుంది. వాటి పక్కనే కోతి, ఎలుగు బంటి, పులి నడుం పట్టుకున్నాయి.
 పులి ముందుకు నడిచింది.
 జంతువులన్ని ముందే విందు కోసం సిద్ధంగా వుంచిన ప్రదేశానికి చేరుకున్నాయి. పులి ఆహారం కోసం తహతహలాడిరది. అదే సమయానికి ఎలుగుబంటి పులి దగ్గరకు వచ్చి ‘‘ ఇదుగోండి.. మీకెంతో ఇష్టమైన కుందేలు రక్తం.. తాగి ఆనందించండి..’’అంటూ గ్లాస్ అందించింది.
 పులి గ్లాస్‌ను చేతికి అందుకుంది. అది ఎర్రగా లేదు..పసుపురంగులో వుంది. రంగు గురించి చెబితే చత్వారం లేదన్న సంగతి తెలిసిపోతుందని సందేహించింది పులి. పసుపు రంగులో వున్న మామిడి పండ్ల రసం గుటగుట తాగేసింది. కాసేపటికే అందులో కలిపిన విషానికి పులి కళ్లు తిరిగి స్పృహతప్పి పడిపోయింది. పులి అబద్ధపు నాటకం ఆడి తప్పించు కుందామనుకున్న వ్యూహం బెడిసికొట్టి గిలగిల తన్నుకు చనిపోయింది. తమ పాచిక పారి పులి బాధ తప్పినందుకు జంతువులన్ని స్వేచ్ఛగా హాయిగా ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి.
 








