ఘర్ కా ఖానా - తాతా కామేశ్వరి

Ghar ka khana

ఐదేళ్ల క్రితం ఢిల్లీ ఆంధ్రాభవన్లో జరిగిన ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పరిచయమైన శ్యామల, సీత, హరిశ్రీల మధ్య చిరకాల స్నేహం ఏర్పడింది. పక్కపక్కనే ఉంటే బాగుంటుందని భర్తలని ఒప్పించి ఢిల్లీలోని ఒక పోష్ సొసైటీలో అద్దెకి దిగారు. వీరంతా ప్రవాస ఆంధ్రులు కావడంతో వారి కుటుంబాలు కూడా క్లోజ్ అయ్యాయి. ఆదివారాలు కలిసి భోజనం చేయడం, కలిసి షాపింగ్ చేయడం, సినిమాలు చూడటం, తెలుగు పండుగలు, పుట్టినరోజులు మరియు ఏనివర్సరీస్ వస్తే కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, అలాగే సెలవు దినాల్లో వివిధ ప్రాంతాలకు చిన్నపాటి పర్యటనలు చేయడం వీరి హాబీలు.

తమ పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడంతో ముగ్గురు స్నేహితుల భాధ్యతలు తగ్గినప్పట్టికీ, ఈ మధ్య మొగవారిలో పని ఒత్తిడి, ప్రతికూల ప్రభావాల వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వస్తున్నాయి అని వార్తా కథనాలు మరియు సోషల్ మీడియా పోస్ట్లలో చూసీ, వీరు తమ భర్తల ఆరోగ్యంపై దృష్టిని పెంచారు. ముగ్గురి భర్తలు ఉన్నతపదవులను కలిగి ఉండటం మరియు తరచుగా ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లడం వలన పని వత్తిడి పెరిగి వారికి కొలెస్ట్రాల్, హై బీపీ, డైబేటీస్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని వారి ఆహారంపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఎవరు ఏ ఆరోగ్య సూత్రాలు చెపితే వాటిని భర్తలపై ప్రయోగించి, ప్రతి ఆరునెలలకి ఫుల్ బాడి చెకప్లు చేయించి, డాక్టర్లు చెప్పిన విధంగా హెల్తీ మరియు పత్యముగా ఇంటీలో చేసిన భోజనమే పెట్టి తమ భర్తల పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ వారి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.

రోజంతా ఇంటి పనులతో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం పూట అపార్ట్మెంట్ లాన్లో కూర్చుని తమ కష్టసుఖాలు మాట్లాడుకుంటారు ఈ ఫ్రెండ్స్. కానీ ఆ కొద్దిసేపు కూడా ఇతర విషయాలు కన్నా ఎక్కువగా మాట్లాడేది వారి భర్తల గురించే. ఆ రోజు కూడా ఆఫీస్ నుండి భర్తల రాక కోసం ఎదురు చూస్తూ మాట్లాడుకుంటూ శ్యామల హరిశ్రీతోహరి, మీ ఆయనకి ఆ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నారు సుధీర్ గారు?” అన్నది.

దానికి హరిశ్రీ, “ఇప్పుడు బాగున్నారు. రోజూ బ్రేక్ఫాస్ట్ లో ఒట్స్, లంచ్కి కిచ్డీయే పెడుతున్నానుగా. అదీ కాక, మా పక్క ఫ్లాట్లో ఉండే పంజాబీ ఆంటీ చెప్పిన చిట్కా పాటించి రోజూ సోంపు గుండ కూడా ఇస్తున్నాను. దానితోపాటు బయట ఫుడ్ అస్సలు తిననీయటం లేదుఅంది కొంచం దర్పముగా.

ఇలా మాట్లాడుతుండగా సీతవచ్చే వారం వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి కదా, ఎక్కడికైనా చిన్న ట్రిప్ వెళదామాఅంది ఉత్సాహంగా.

దానికి హరిశ్రీట్రిప్ గురించి రేపు మాట్లాడుకుందాం. మా ఆయన వచ్చినట్టున్నారు, నేను ఇంట్లో లేకపోతే ఆయనకు తోచదు. ఆయనకి టీ- స్నాక్స్ ఇచ్చి, డిన్నర్ తయారు చేయాలిఅంటూ లేచింది.

దానికి మిగతా ఇద్దరు కూడాసరే ఈ విషయం రేపు ఆలోచిద్దాం, మేమూ వెళతాం, ఏడవుతుందిఅంటూ లేచారు.

అనుకున్నట్టే మరు రోజు సాయంత్రం కలిసి హరిద్వార్ ఢిల్లీకి దగ్గరే కనుక, అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేశారు. విమానంలో కాకుండా శతాబ్ది ఎక్స్ప్రెస్స్లో ప్రయాణించి ప్రకృతి అందాలను అనుభవించాలని నిర్ణయించుకున్నారు. వారు తమ నిర్ణయం గురించి భర్తలకు తెలియజేసి, ట్రైన్ టిక్కెట్లు మరియు హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు.

అనుకున్న రోజు మూడు జంటలు హరిద్వార్కి శతాబ్ది ఎక్స్ప్రెస్స్లో బయలుదేరారు. రైలు ప్రయాణంలో, మహిళలు ప్రతి గంట ట్రైన్లో సర్వ్ చేస్తున్న చిరుతిళ్లు, అల్పాహారం మరియు మధ్యాహ్న భోజనం అన్నింటినీ తెగ తిన్నారు. అయితే మోగాళ్ళకి మాత్రం ఇంటి నుండి చేసి తెచ్చిన భోజనం తప్ప ఏదీ ముట్టనివ్వలేదు. మధ్యానం వొంటి గంటకు హరిద్వార్లో హోటల్ చేరి భోజనం చేస్తే బాగుంటుంది అనుకున్నారు మొగవాళ్ళు. దానికి ఆడవారు "ట్రైన్లో చాలా హెవీగా తిన్నాముగా, ఇక ఏమి వద్దు", ఆంటూ రూమ్స్ వైపు దారి తీశారు. తప్పక మొహం వేలాడేసకోని మొగవాళ్ళు కూడా వారి వెంట రూమ్స్ దారి పట్టేరు.

రాత్రి మూడు జంటలు కలిసి హోటల్ రెస్టారెంట్లోకి ప్రవేశించి ఆరుగురు కూర్చునే పెద్ద టేబుల్ వద్ద కూర్చొన్నారు. కాసేపటికి వెయిటర్ వారి టేబుల్ వద్దకు రాగానే, స్త్రీలు తమ భర్తలకు ఘర్ కా ఖానా, అంటే సింపుల్ ఇంటి భోజనం, తక్కువ నూనె, ఉప్పు వెసిన ఆనపకాయ కూర, పెసరపప్పు, రెండేసి పుల్కాలు, సలాడ్, పెరుగు ఆర్డర్ చేసారు. వాళ్ళ కోసం మాత్రం గోభి పరాఠ, దాల్ మఖని, కబాబ్, ఫ్రైడ్ రైస్, గులాబ్ జామున్ ఆర్డర్ చేసుకొని రాగానే లొట్టలు వేసుకుంటూ తినడం మొదలుపెట్టారు. పాపం ఆ భార్య ప్రేమ బాధితులు లోలోపల ఏడుస్తూ, బయటకు బిగ్గరగా నవ్వుతూ తినడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో రుచికరమైన భోజనం చేయాలనే వారి కోరిక నిరాశగా మారింది. కానీ చివరికి హరిశ్రీ భర్త సుధీర్ ఉండలేక ఆమెతో "హరీ, నేను ఒక్క గోబీ పరాఠా తింటాను డియర్" అన్నాడు ఆశగా.

దానికి హరిశ్రీఏమిటండీ, మీకు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలుసుగా. వచ్చే వారం మీకు అమెరికా ట్రిప్ కూడా ఉంది. అక్కడ ఎలాగో నానా చెత్త తింటారుఅన్నది మందలిస్తూ.

ఆ మాటలు విన్న సుధీర్ మౌనంగా తన కోసం తెప్పించిన భోజనం తల ఏత్తకుండా తినడం కొనసాగించాడు.

ఆఫీసులో అందరినీ గడగడలాడించే సీత భర్త రామ్ కుమార్, శ్యామల భర్త శశి కిరణ్ కూడా నోరు మెదపకుండా ఆ పత్యముగా చేయించిన ఘర్ కా ఖానా తినసాగారు. బయటకు తిరగడానికి వస్తే ఇంటి భోజనం తప్పుతుంది అని భావించిన వారికి నిరాశే ఎదురైంది. భార్యలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ భోజనం చేయసాగారు.

అలా భోజనం చేస్తూ హరిశ్రీ భర్త సుధీర్ తోఏమండీ, భోజనం ఎలా ఉంది? మరి కాస్త ఆనపకాయ కూర పెట్టమంటారా?” అంటూ మెత్తటి గోబీ పరాఠా ఆరగిస్తూ అడిగింది.

మనసులో కోపంతో పళ్ళు కోరుకుతూ బయటకి వెకిలి నవ్వు నవ్వుతూహరీ, నీవు ప్రేమగా తెప్పించిన భోజనం ఇంటికంటే బాగుందిఅంటూ, మనసులోఅమ్మో, ఎలా లాగిస్తుందో గోభి పరాఠా. ఈ ఆడవారు వారి మితిమీరిన ప్రేమతో మా కడుపు మాడుస్తున్నారుఅనుకోని ఇంకెప్పుడూ వీరితో బయటికి వెళ్లకూదని ఒట్టు పెట్టుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి కూడా ఆడవారు నోరు ఊరించే పూరీ ఆలు కూర తింటూ, మొగవాళ్ళనేమో కార్న్ ఫ్లేక్స్ , ఓట్స్ తప్ప ఏమి ముట్టనిచ్చేవారు కాదు. పాపం మొగవాళ్ళు ఏడుపు మొహాలు పెట్టుకొని దీనికన్నా ఇల్లే నయం, పోనీ అక్కడ ఇంటిలో కాకపోయినా ఆఫీస్ లోనయినా టేస్టీ ఫుడ్ తెప్పించికోవచ్చు అని అనుకున్నారు. ఇక్కడ భార్యలు రోజంతా ఎదురుగా ఉంటే ఏమి తింటారు? వారు ఇలా మూడు రోజులు భార్యల చెప్పుచేతలో కష్టంగా గడిపి ఢిల్లీ చేరి ఊపిరి పీల్చారు.

కొద్దిరోజుల తర్వాత అనుకోకుండా మొగవాళ్ళు ముగ్గురూ సూపర్ మార్కెట్లో కలిశారు. కాసేపు పక్కనే ఉన్న కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ హరిద్వార్ లో తమ భార్యలు తినిపించిన ఘర్ కా ఖానా విషయం గుర్తు చేసుకుంటూ సుధీర్ఆ భోజనం, మరి మన భార్యల మితిమీరిన ప్రేమ గుర్తు వస్తే ఒళ్లు జలదరిస్తుంది అనుకోండి. ఏమి ప్రేమ వలకపోసారు మనమీద. వాళ్లేమో స్టఫ్డ్ పరాఠాలు, మనకి ఉప్పు-కారం లేని ఆనపకాయ కూర, ఎండు రొట్టెలు. మూడు రోజులు ఆ భోజనం చేసి నోరు చచ్చిపోయింది అనుకోండి. నాకు కొలెస్ట్రాల్, బీపీ కూడా బోర్డర్ లోనే ఉన్నాయి, దానికే ఎంత గొడవ చేసింది మా ఆవిడ".

దానికి సీత భర్త రామ్ కుమార్హరిద్వార్ నుంచి వచ్చిన మర్నాడే ఆఫిస్ కి వెళ్ళి, వాళ్ళ మీద కసికొద్ది నాకు చాలా నచ్చినవన్నీ తెపించుకుని తిన్నానుఅన్నాడు నవ్వుతూ.

దానికి శశి కిరణ్ వంత పాడుతూ "అవును అనుకోండి.. నేనూ అదే చేశాను .. చక్కగా నాకు నచ్చిన పంజాబీ ఛొలే భటూరే తెప్పించుకోని తృప్తి తీరా తిన్నానుఅన్నాడు కళ్ళు ఎగరెస్తు.

ఆ ముగ్గురు ఇలా వాళ్ళు హరిద్వా ర్లో పడిన బాధలకు ఎలా కసి తీర్చుకున్నారో చెప్పుకొని, ఇక ముందు ఎప్పుడూ భార్యలతో బయటకు తిరగడానికి వెళ్లకూడదు అని చెవులు పట్టుకున్నారు.

హరిద్వార్ ట్రిప్ వెళ్లిన మూడు నెలల తర్వాత ఒకనాడు ముగ్గురు మహిళలు మరలా వరుస సెలవులు ఉన్నాయి అని మనాలీకి ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన భర్తలు వేరే కారణాలు చెప్పి, ఒకరు క్లైంట్స్ తో ఇంపార్టంట్ మీటింగ్స్ ఉన్నాయి అని, మరొకరు తమకు చాలా పని ఉందని అని మరియు మూడవ వారు ఒక కాన్ఫరె న్స్కి హాజరు కావాలని చెప్పి ఘర్ కా ఖానా తినకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు.

***

మరిన్ని కథలు

Simhavalokanam
సింహావలోకనం
- మద్దూరి నరసింహమూర్తి
Mana garden
మన గార్డెన్
- తాత మోహనకృష్ణ
Andari bandhuvuluu
అందరి బంధువులు
- భానుశ్రీ తిరుమల
Teeram cherchina parugu
తీరం చేర్చిన పరుగు
- షామీరు జానకీ దేవి
Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం