విజయ రహస్యం - - బోగా పురుషోత్తం

Vijaya rahasyam
వింజమూరు రాజు వీరకేశవ వర్మ ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి తన తండ్రి ఎంతో కష్టపడి సంపాదించిన రాజ్యంలో ప్రజలు సుఖ శాంతులతో జీవించేవారు. కొద్ది రోజుల క్రితం వీర కేశవ వర్మ తండ్రి రుషీకేశవర్మ కన్నుమూయడంతో పాలనా బాధ్యతలు చేపట్టాడు వీరకేశవ వర్మ.
వీరకేశవ వర్మ అతి చిన్న వయసు కావడంతో దురుసు స్వభావం కలిగిన వాడు. పాలనలో ప్రజల కష్టాలు పట్టలేదు. వర్షాలు అధికంగా పడి ఊర్లుఊర్లు కొట్టుకు పోసాగాయి. రాజ్యంలో అధిక భాగం జనం లేక వెలవెల పోయింది. ప్రజలు ఆహారం లేక అల్లాడసాగారు. వీరకేశవ వర్మ ఇదేమి ఆలకించలేదు. తన కోరిక ప్రకారం పర రాజ్యాలపై దండయాత్రలు చేసి ఆ భూభాగాన్ని హస్తగతం చేసుకునేవాడు. ఆ రాజ్యాల్లో రాజులు, సైనికులు చేతులు, కాళ్లు పోగొట్టుకుని విగత జీవులై బానిస బతుకులు బతుకుతుంటే నవ్వుతూ తన ప్రతీకార జ్వాలకు ఆజ్యం పోసి ఆనందించేవాడు. దీన్ని గమనించిన మంత్రి వివేకవర్థనుడు ‘ రాజ్యాన్ని చక్కదిద్దడం ఎలా?’’ అని తీవ్రంగా ఆలోచించసాగాడు.
ఓ రోజు విరూపాక్షపురం రాజు విక్రమసేనుడుని ఓడిo చి బందీని చేసి చెరసాలలో బందించి అతని రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు.
దీన్ని గమనిస్తున్న మంత్రి వివేకవర్థనుడు వివేకం ప్రదర్శించి ‘‘ ప్రభూ.. రాజ్యంలో వరదలు వచ్చి ప్రజలు అల్లకల్లోలమయ్యారు.. పంటలు కొట్టుకుపోయి తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్నారు.. వారి బాధలు ఆలకించండి..’’ అని సలహా ఇచ్చాడు.
అది వీరకేశవ వర్మకు నచ్చలేదు. ‘‘ మన పాలన అంతా బాగుంది.. మా తండ్రి నాలుగు వందల కిలోమీటర్ల మేర వున్న రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాలుగు వేల కిలోమీటర్ల పరిధికి వింజమూరు రాజ్యం విస్తరించింది. ఇంత అభివృద్ధి దిశగా దూసుకుపోతుంటే విమర్శలు చేయడం ఏమిటీ?’’ ప్రశ్నించాడు.
వివేకవర్థనుడు ఎంత మంచి చెప్పినా రాజు వినలేదు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటకముందే చక్కదిద్దేందుకు నడుం కట్టాడు మంత్రి.
కొద్ది రోజుల తర్వాత పక్కరాజ్యాధిపతి రవివర్మపై దండయాత్ర చేశాడు. రాజు తన కత్తికి ఏదో పూస్తుండడం చాటుగా చూశాడు మంత్రి. రాజు అటు బయటకు వెళ్లగానే ఆ కత్తిని దాచి మరో కత్తిని ఆ స్థానంలో వుంచాడు. కాసేపటికి రాజు వీరావేశంతో ఆ కత్తి తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు. రాజు పరాక్రమంతో వీరవర్మపై కత్తిదూశాడు. అది రవివర్మ చేతిని ఖండిo చింది. అయినా రవివర్మ మెరుపుదాడి చేసి వీరకేశవ వ ర్మ కత్తిని కింద పడదోశాడు. క్షణాల్లో వీరవర్మ సైన్యం వీరకేశవ వర్మను చుట్టుముట్టింది. చావు తప్పి మట్టి చల్లి కళ్లుగప్పి తప్పించుకు పారిపోయాడు.
మారువేషంలో తన రాజ్యంలో తిరగసాగాడు వీరకేశవ వర్మ. ‘‘ మనల్ని పీడించే వీరకేశవ వర్మ ఇకలేడు..ఎక్కడికో పారిపోయాడు.. ఇక ఆనందంగా బతకవచ్చు.. వీరకేశవ వర్మ తండ్రి రుషీకేశవ వర్మ పాలన ఎంతో హాయిగా వుండేది. ’’ అంటూ రుషీకేశవ వర్మ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం చూసి చలిం చాడు. తన అకృత్యాలను ప్రజలు అసహ్యించుకుంటుంటే సహించలేక పోయాడు వీరకేశవ వర్మ. తను ప్రజా శ్రేయస్సును మరిచి చేసిన పాపాలకు ప్రాయశ్చితం వెతికాడు.
అప్పటికే మంత్రి వివేక వర్థనుడు చెరసాలలో వున్న పరదేశ రాజులందరినీ విడిచిపెట్టాడు. ప్రజలను కన్నబిడ్డల వలే పాలించసాగాడు. ఎన్నో ఏళ్లుగా మారువేషంలో తిరుగుతున్న తనను ఓ రోజు మంత్రి వెళుతూ గుర్తు పట్టాడు. అప్పటికే వీరకేశవ వర్మకు వృద్ధాప్యం సమీపించింది. మంత్రి తనను గుర్తించకముందే తప్పించుకు పారిపోదామనుకున్నాడు. క్షణాల్లో సైనికులు వీరకేశవ వర్మను చుట్టుముట్టారు. రాజభవనం వద్దకు తీసుకెళ్లి ‘‘ ఇదుగోండి.. మీ సామ్రాజ్యం.. పరిస్థితులు చక్కబడ్డాయి. నా కర్తవ్యం అయిపోయింది. .ఇక విశ్రాంతి ఇవ్వండి ’’ అని చేతులు జోడిo చాడు మంత్రి.
మంత్రి ఔన్నత్యానికి వీరకేశవ వర్మ అవాక్కయ్యాడు.‘‘ రాజ్య విస్తరణే విజయంగా భావించి ఇన్నాళ్లు ప్రజల శ్రేయస్సు విస్మరించి అక్రమ మార్గంలో విషపు కత్తులతో విదేశీ రాజులను సంహరించాను..నా పాపాలకు నివృత్తి లేదు..నాకు తగిన శిక్ష విధించండి..ప్రాయశ్చిత్తం తీర్చుకుంటాను..’" అని చేతులు జోడిo చాడు రాజు.
‘‘ రాజా మీరు ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకున్నారు..ఆ తప్పుకు తగిన శిక్షను విధించమని కోరడానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు.. ఇకనైనా పాలనా బాధ్యతలు చేపట్టి మీ తండ్రిలా ప్రజారంజకంగా పాలించండి..’’ అని రాజును రాజ పీఠంపై కూర్చోబెట్టాడు మంత్రి.
విజయ రహస్యం గ్రహించిన వీరకేశవ వర్మ తనకు అపఖ్యాతి తెచ్చిన విషపు ఖడ్గాన్ని దూరంగా విసిరివేసి శాంతితో వివేక పాలన అందిస్తూ వింజమూరుని విజయపథంలో నడిపించాడు. ప్రజలు ఎంతో సంతోషించారు.

మరిన్ని కథలు

Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి
Evarini Chesukovali
ఎవరిని చేసుకోవాలి?
- తాత మోహనకృష్ణ
Mana oudaryam
మన ఔదార్యం
- సిహెచ్. వెంకట సత్య సాయి పుల్లంరాజు
Swardha poorita pani
స్వార్ధపూరిత పని
- మద్దూరి నరసింహమూర్తి
Ratee manmadhulu
రతీ మన్మథులు
- కందుల నాగేశ్వరరావు