పగిలినకాళ్ళు - VinodKumar.Mokka

Pagilina kaallu

మే31 2022 ప్రతినెలా చివరిరోజు లాగానే రఘు ఆరోజు కూడా తన సాలరీ కోసం ఎదురుచూస్తున్నాడు, ప్రతి 2నిమిషాలకి ఒకసారి తన ఫోన్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి ఫోన్ వైబ్రేట్ అయింది, సాలరీ మెసేజ్ అనుకుని ఆత్రంగా ఫోన్ వైపు చూసాడు కానీ వచ్చింది మెసేజ్ కాదు, వాళ్ళ నాన్న దగ్గరనుంచి కాల్. కానీ రఘు ఆ కాల్ ఎత్తకుండా సైలెంట్లో పెట్టి మళ్లీ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, మళ్లీ ఫోన్ వైబ్రేట్ అయింది, ఈసారి కూడా మళ్లీ వాళ్ల నాన్న ఫోన్ నుంచే కాల్ వస్తుంది. రఘు మళ్లీ కూడా కాల్ ఎత్తకుండా సైలెంట్లో పెట్టి మళ్ళీ తన పని తాను చేసుకుంటూ...ఎందుకు ఈన ఇన్నిసార్లు చేస్తున్నాడు, సాలరీ ఇంకా పడలేదు కదా పడంగానే నేనే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను కదా అని మనసులో విసుగ్గా అనుకుంటూ ఉండగా ఈసారి మళ్లీ ఫోన్ వైబ్రేట్ అవుతుంది, ఈసారి మాత్రం వచ్చింది నాన్న దగ్గరనుంచి కాల్ కాదు, తాను ఎదురుచూస్తున్న సాలరీ... తన అకౌంట్లో ఒక లక్షా పదివేలు రూపాయలు పడినట్టు బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తుంది. అది చూసిన రఘు ప్రతి నెల లాగానే ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఆ ఆనందంలో ఉండగానే మళ్లీ వాళ్ళ నాన్న నుంచి కాల్ వస్తుంది, కోపంగా ఆ కాల్ కట్ చేసి, తిరిగి వాళ్ళ అమ్మ ఫోన్ కి కాల్ చేస్తాడు. వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి ఎత్తంగానే రఘు, ఎందుకుమా ఆయన ఊరకే ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడే జీతం పడింది, ఇంటి లోను, ఆయన చేసిన అప్పులకి, నా అవసరాలకు పోను మిగిలింది, రేపు ఆయన అకౌంట్లో వేస్తాను కదా...ఈలోపే ఊరకే ఫోన్ చేయాలా, తు..ఒట్టి డబ్బు మనిషి యాడున్నాడో కాని అని ఠక్కున ఫోన్ పెట్టేసి, ఆఫీసు క్యాంటీన్ కి వెళ్లి ఒక అరటిపండు జ్యుస్ తీసుకుని , కుర్చీలో కూర్చుని, కోపం తగ్గించుకుని మళ్లీ తిరిగి వాళ్ళ అమ్మ ఫోన్ కి కాల్ చేస్తాడు. ఈసారి కూడా వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తి ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. రఘు ఇటువైపు నుంచి హలొ...హలొ అమ్మ ఏంటి మాట్లాడవు, అన్నీ ఖర్చులు నా అవసరాలకి ఫోను ఇంకా 40వేలు మిగులుతాయి అందులో బాబు అకౌంట్లో 30 వేలు వేసి, మిగిలినవి నాతో ఉంచుకుంటా, మన ఊరు రాములవారి తిరణాల వస్తుంది కదా వచ్చే నెల, నీకు చీర తెస్తా ఏ రంగు చీర కావాలి చెప్పు, వద్దులే నువ్వు చెప్పొద్దు నేనేగా ప్రతిసారీ తెచ్చేది, నేనేం రంగు తెచ్చినా నీకు నచ్చుతుందికానీ, ఇంకా ఏంటమ్మా సంగతులు అక్క ఫోన్ చేసిందా అని రఘు ఎంత మాట్లాడినా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం ఉండదు. రఘు హలొ...అమ్మా...అమ్మా ...అంటూ ఉండగా...అవతలి నుంచి... వాళ్ళ అమ్మ ఇలా మాట్లాడుతుంది... నాకొక తెల్లచీర...మీ నాన్నకి ఒక పూలమాల తీసుకునిరా...బంతిమాల తీసుకో...గులాబీమాల వద్దు పూలకి ఉండే ముళ్ళు గుచ్చుకుంటాయి... అని బోరున ఏడుస్తూ... బండిడు కష్టం చేసే మనిషి చిన్న ములక ముల్లుకి కూడా బయపడతాడు, రేపొద్దున ఆ ముళ్లకట్టెలపైన , మంటల్లో ఎలా బతుకుతాడో అని ఏడుస్తూ ఉంటుంది...ఇదంతా వింటున్న రఘు కి ఏమి అర్థం కాక సైలెంట్ గా నిల్చుని ఉంటాడు, ఇంతలో అవతలి నుంచి రఘు మేనమామ రాఘయ్య ఫోన్ తీసుకుని, అల్లుడు ఆఫీసు కి ఒక 2 వారాలు సెలవు పెట్టి, ఈరోజు నైట్ బస్సెక్కి ఊరికి రారా, అని రఘు మాట్లాడపోయేలోపు ఫోన్ పెట్టేస్తాడు... రఘుకి ఇప్పటి వరకు తాను విన్నది నిజమేనా లేక నా భ్రమ అన్నంతగా ఏమి అర్థంకాక కాసేపు అలాగే నిల్చుని, కాసేపటి తరువాత క్యాంటీన్లో ఎవరిదో ఫోన్ రింగ్ అవగానే ఆ శబ్దానికి తేరుకుని, టైం చూసుకుంటాడు అప్పటికే రాత్రి 8 గంటలైంది. వెంటనే బస్టాండ్ కి బయలుదేరుతాడు, రఘు వెళ్లేసరికి తాను ఎక్కాల్సిన బస్సు సిద్ధంగా ఉంటుంది, ఎక్కి సీట్లో కూర్చున్న రఘుకి మా బాబుకి ఏమైందో , అసలు ఇంటి దగ్గర ఎం జరిగిందో అని ఆలోచిస్తూ ఏవో జ్ఞాపకాలలోకి జారుకుంటాడు. అయినా ఆ జ్ఞాపకాలలో వాళ్ళ బాబుకి సంబంధించి కనీసం ఒక్కటంటే ఒక్క జ్ఞాపకం కూడా ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే రఘుకి వాళ్ళ నాన్న తో ఉన్న సంబంధం అంతంతమాత్రమే. ఎందుకో తెలియదు రఘుకి అన్నీ ఇచ్చిన వాళ్ళ బాబు, తండ్రి ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే రఘు వాళ్ళ ఊరి పొలిమేరల్లోకి బస్ వస్తుంది, పొలిమేర దాటుకుని వచ్చేటప్పుడు, దారిపక్కనే ఉత్తరాన ఉన్న స్మశానంలో ఎవరినో దహనం చేయడానికన్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుట్టి 25 సంవత్సరాలు దాటినా ఏనాడు కూడ అటువైపు చూడలేదు, కానీ ఈరోజు రఘుకి తెలియకుండానే కళ్ళు అటువైపు చూసాయి. అలా తానేందుకు చూసానో తనకే అర్థంకాక ఏంటో అని ఆలోచిస్తూ బస్ దిగి ఇంటి ముందుకి వస్తాడు బస్ దిగిన రఘుకి అక్కడ ఏం జరుగుతోంది అర్థంకాలేదు, వాళ్ళ ఇంటిముందు ఒక టెంట్ వేసి ఉంది, ఇంటి నిండా జనాలు గుమిగూడి ఉన్నారు, అందరి కళ్ళు ఎర్రగా మారాయి. పక్కనే నలుగురు ఎండు తాటాకులతో మంటేసి ఎప్పుడో తాను చూసిన తోలు తప్పెట్లకు సెగ కాస్తున్నారు. ఇంకో ఇద్దరు ఎదో రెండు ఎదురు బొంగులతో, దానిపైన వరిగడ్డి వేసి తాళ్లతో కడుతున్నారు. ఇదంతా కూడా రఘుకి కొత్తగా ఒకింత భయంగా అనిపించింది. రఘుని చూడగానే అక్కడే ఉన్న వాళ్ళ బంధువులు, ఊరివాళ్ళు ఒక్కసారిగా రఘుకి పట్టుకుని పెద్దగా ఏడుస్తూ, పంచలో ఉన్న బాడీ ఫ్రీజర్ దగ్గరకు తీసుకొని వెళ్తారు, దానిపైన అన్నీ పూలమాలలతో కప్పి ఉంటారు, అన్నీ కూడా బంతిపూల మాలలే. ఆ మాలలు పక్కకి జరిపి చూసిన రఘుకి నోటమాట రాలేదు, కంటిలోనుంచి నీళ్ళు రాలేదు...అలా నిశ్చలంగా నిలబడిపోయాడు. అంతలో రఘు వాళ్ళ మేనమామ వచ్చి , రఘు చెయ్యి పట్టుకుని లోపలకి తీసుకుని పోతాడు. అక్కడ ఎదురుగా వాళ్ళ నాన్న ఫొటో దగ్గర వాళ్ళ అమ్మ స్పృహ లేకుండా పడుకుని ఉంటుంది. ఆ ఫొటో రఘు వాళ్ళ బాబు వయసులో ఉన్నప్పటి ఫోటో, చూడటానికి పెళ్ళైన కొత్తల్లో ఒకటో రెండో సంవత్సరాలకి దిగిన ఫోటో లాగా ఉంటుంది. రఘు వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుని అమ్మా, అమ్మా అని చేతితో తట్టి పిలుస్తాడు. ఆ స్పర్శకు ఆ పిలుపుకు స్పృహలోకి వచ్చిన ఆమె, రఘుకి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. రఘు కూడా ఏడుస్తూ వాళ్ళ అమ్మకి ఓదార్చడానికి... ఇలా అంటాడు... ఎప్పుడూ తాగిన మైకంలోనే ఉండేవాడు కదమ్మా, తాగి తాగి ఎక్కడ మంచాన పడి నిన్న ఇబ్బంది పెడతాడో అని అనుకున్నా, పోనీలే ఇలా ఏ బాధ లేకుండా ఇలా ప్రశాంతగా వెళ్ళాడు. నువ్వేమి భయపడకమ్మా నీకు నేనున్నాను, నిన్ను కూడా నాతోపాటు హైదరాబాద్ తీసుకుని వెళ్తా ఈ మద్య నాకు జీతం కూడా బాగా పెంచారు అని ఇంకా ఏదో చెప్పబోతుండగానే... రఘు చెంప చెల్లుమంటుంది... రఘు తేరుకునేలోపే వాడి కాలర్ పట్టుకుని వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న దగ్గరకు తీసుకొనిపోతుంది... అక్కడకు వచ్చిన వాళ్ళందరూ ఎం జరుగుతుందో తెలియక ఇదంతా చూస్తూ ఉండిపోతారు...అప్పుడు వాళ్ళ అమ్మ, రఘు మేనమామ అయిన రాఘయ్యతో చూసావా రాఘన్నా ఈడు ఎంత మాట అన్నాడో, పోతే పోనీలే అంతా మన మంచికే అంటున్నాడు. ఏరా... రోజు తాగిన మైకంలో ఉండేవాడా...అసలు ఆయన ఎందుకు తాగేవాడో నీకు తెలుసంట్రా. అసలు నువ్వు ఎప్పుడైనా ఆయన పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడవా, చదువుకునే రోజుల్లో డబ్బులు అవసరమైతేనే ఆయన నీకు గుర్తొచ్చేవాడు కానీ ఆయన అసలు నిన్ను ఎప్పుడు మర్చిపోలేదు, నువ్వు సంపాదించడం మొదలుపెట్టాక అసలు ఆయన నీ కళ్లకు కూడా కానరాలేదు. కానీ ఇప్పుడు నువ్వు పోనీలే పోయాడు అంతా మంచికే అంటావా. అవునురా ఆయన తాగేవాడు ఎందుకో తెలుసా...పొద్దులొస్తాం ఆ జివ్వాల ఎంబడ ఆ కొండల్లో తిరిగి తిరిగి వొళ్ళు పులిసిపోయి ఎదో ఆ నొప్పుల నుంచి బయటపడేదానికి తాగేవాడు. ఆయనంటే ఎందుకురా నీకు పడదు,చిన్నప్పుడు నీతో ఉండలేదనా, అందరి నాన్నల్లా నిన్ను ఎత్తుకుని తిప్పలేదనా, లేకుంటే ఎప్పుడూ నీతో కఠినంగా ఉండేవాడనా. ఒరేయ్ ఒరేయ్ ఆయన అలా ఉండబట్టేరా నువ్వు ఈరోజు ఇలా ఉన్నావ్. పెళ్ళాం, పిల్లల్ని వదిలేసి ఎవరూ కావాలని నెలలు, సంవత్సరాల తరబడి ఇంకిటి, ఊరికి దూరంగా ఉండిపోరురా...ఇక్కడ జివ్వాలకి తినడానికి గడ్డి, నీళ్లు లేకపోతే, ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు దూరంలో ఉండే అడవికి మందికి పోయేవాళ్ళురా, అక్కడ అడవి దోమలు కుట్టి జరాలొస్తే , ఆ బాధ పడుతూనే వాటిని కాసేవాడు, ఎవడి కోసరా... మీ తాత మీ నాన్నకి 90 సెంట్లు పొలం ఇస్తే అది ఇప్పుడు 4 ఏకరాలయింది, ఎలా అయింది ఊరికినే కాలేదురా, మీ నాన్నలగా నువ్వు కష్ట పడకూడదు, నలుగురిలో నువ్వు గౌరవంగా బతకాలని తాను బతికినంతకాలం చస్తూ, బతుకుతూ కష్టపడ్డాడురా. నీలాంటి కొడుకులకి తండ్రుల చొక్కా జేబులు మాత్రమే కనిపిస్తాయిరా, ఆ జేబు ఎత్తుగా ఉన్నా, లేకున్నా మీ జేబులు నింపేవాళ్ళేరా తండ్రులు. లోపలున్న ఫొటో చూసావా, అదీ నువ్వు పుట్టినరోజు, ఆయనకి కలిగిన ఆనంద ఎప్పుడూ అలాగే ఉండాలని ఆరోజు వెళ్ళి తీయించుకున్నాడు, అది మొదలు ఆ తరువాత నీ భవిష్యత్తు కోసం పడే కష్టంలో ఆనందం ఫొటోలో తప్ప ఆయన ముఖంలో లేదు... అసలు ఎప్పుడైనా ఆయన పాదాలు చూసావంట్రా...అని రఘుని గట్టిగా నెట్టి తాను ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది...రఘు వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ దగ్గర కూలబడి, ఆ పాదాలను అలా చేతితో తాకుతాడు, అప్పుడు అప్పుడు రఘుకే కాదు రఘు లాంటి ఎందరో కొడుకులకి...మీ పాదాలు కందకుండా పెంచడానికి, ప్రతి తండ్రి పాదాలు ఎంతలా పగిలి నెత్తురోడుతుంటాయో ఆ క్షణం తెలుస్తుంది... తండ్రి జేబుని కాకుండా...

తండ్రి కష్టాన్ని గుర్తెరిగి నడుచుకునే కొడుకులకి ఈ కథ అంకితం...

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల