పొదుపు తెలిసిన కోడలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Podupu telisina kodalu

గుంటూరులో నివాసం ఉండే రంగనాధం తనకుమారుడికి వివాహం చేయదలచాడు. మంచి సంబంధాలలు వెదకగా జాగర్లమూడి లోని రాఘవయ్య గారి కుమార్తె కన్యక, సిరిపురం లోని పరంధామయ్య గారి కుమార్తె రాధిక అనే ఇరువురు రంగనాధానికి బాగానచ్చారు. కాని ఆఇద్దరి లో ఎవరిని ఎంపిక చేసుకొవాలో తెలియక తన మిత్రుడు చంద్రయ్యను సహయం చేయమన్నాడు. దానికి ఏంచేయాలో వివరించాడు చంద్రయ్య.

ముందుగా కబురు పంపిన విధంగా రాఘవయ్య గారి ఇంటికి భోజనానికి వెళుతూ , బుట్టనిండుగా పలు రకాల పండ్లు తీసుకువెళ్ళారు. భోజనంలో అన్ని రకాల కాయకూరలు వేసిన పప్పుచారు, దోసకాయ రోటి పచ్చడి, పెరుగు, వడియాలు,అప్పడం ఊరగాయ వడ్డించారు. భోజనం చేస్తున్న చంద్రయ్య " అమ్మా కన్యక వడ, పాయసం అంటే సరి చేయలేదు ఇంటి ముందర అన్ని కోళ్ళు తిరుగుతున్నాయి ఒకదాన్ని కోసి కూర వండవచ్చు కదా! " అన్నాడు. సాధారణ వస్త్రధారణలో ఉన్నకన్యక " మామయ్య గారు ఒక కోడిని కోసుకుని వండుకు తింటే ఆపూట సంతోష పడతాం అదేకోడి రోజు ఒక గుడ్డు పెడుతుంటే ప్రతిదినం మనకు ఐదు రూపాయల ఆదాయం లభిస్తుంది. అంటే మనకోడి మనకళ్ళ ముందే ఉంటు అది రోజు ఐదు రూపాయలు మనకు ఇస్తుంటే ఆసంతోషం వేరు. కోళ్ళపైనే కాకుండా పెరడులోని కూరగాయలపైన, ఇంటి పాడి పసువుల పాలవ్యాపారం పైనా రాబడివస్తుంది. సమయం,సందర్బం ,అవకాశం ఉన్నప్పుడు ధనం సంపాదించాలి మన అవసరాలకు పొదుపుగా వాడుకోవాలి,రేపటి అవసరాలకు ధనం దాచుకోవాలి " అన్నది . కన్యక మాటలకు నవ్వుకున్నాడు చంద్రయ్య.

మరుదినం పరంధామయ్య గారి ఇంటికి పళ్ళ బుట్టలు తీసుకుని భోజనానికి వెళ్ళారు రంగనాథం,చంద్రయ్యలు. భోజనంలో వడ, పాయసం, కోడి,మేక కూరతోపాటు, పలురకాల కాయకూరల వంటకాలు వడ్డించబడ్డాయి. " చాలా పదార్ధాలు వడ్డించారే " అన్నాడు చంద్రయ్య.

" మాస్ధాయికి తగిన భోజనం మామయ్య గారు " అన్నది రాధిక ఖరీదైన దుస్తుల్లో మెరిసిపోతూ .మౌనంగా భోజనం ముగించిన మిత్రులు తమఊరికి ప్రయాణమైయ్యారు. దారిలో చంద్రయ్య... " రంగనాథం పరంధామయ్య, రాఘవయ్య ఇద్దరు మధ్యతరగతి కుటింబీకులే! లేని ఆధిక్యత చూపించబోయింది రాధిక. ఉన్నంతలోనే పొదుపుగా జీవించాలి ఆడంబరాలు,డాంబికాలు వద్దు జీవించడానికే ఆహరం,ఆహరం కొరకు జీవించకూడదు అనే సందేశాన్ని ఇచ్చింది రాఘవయ్య కుమార్తె కన్యక తెలివి,అందం బుద్ధిమంతురాలైన కన్యక నీఇంటి కోడలుగా ఉండే అర్హతలన్ని ఉన్నాయి "అన్నాడు చంద్రయ్య. "నువ్వు చెప్పింది నిజమే రేపటి గురించి నేడు ఆలోచన చేయడం మంచిలక్షణం.ఉన్నంతలో పొదుపుగా జీవించాలి అనుకున్న కన్యక మాయింటికి తగిన కోడలు " అన్నాడు రంగనాధం.

మరిన్ని కథలు

Avititanam evariki?
అవిటితనం ఎవరికి?
- రాము కోలా.దెందుకూరు
Kannappa
కన్నప్ప
- పుల్లేటికుర్తి కృష్ణ మోహన్
Maya pesarapappu vadalu
మాయా పెసరపప్పు వడలు
- హేమావతి బొబ్బు
The roadless travelled
ది రోడ్ లెస్ ట్రావెల్డ్
- రాపాక కామేశ్వర రావు
Veyyi roopayala jaree cheera
వెయ్యి రూపాయిల జరీ చీర
- పూర్ణిమ పెమ్మరాజు
Peddarikam
పెద్దరికం
- Prabhavathi pusapati