సూర్య ప్రకాష్ కి ఓ ఏభై ఐదేళ్లు ఉంటాయోమో!మనిషి చూడడానికి అంత లావుగా,సన్నంగా కాక మధ్యస్తంగా ఉంటాడు.ఆరోగ్య స్పృహ కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం,ఆరోగ్య సూత్రాలు పాటించడం చేస్తాడు. ఆరోగ్యానికి సంభందించి ఎవరేది చెప్పినా తూచా తప్పక పాటిస్తాడు. కొందరికి సలహాలు కూడా ఇస్తూ ఉంటాడు. కొందరు వింటారు, ఎందరు పాటిస్తారు?..కానీ తను సలహాలివ్వడమనే హోమాన్ని ఆపే ప్రశక్తే లేదన్నట్టు సలహాలు కొనసాగిస్తూనే ఉంటాడు. సూర్య ప్రకాశ్ శ్రీమతి సుభధ్ర భర్తకు తగ్గ భార్య, అంటే ఆరోగ్య సూత్రాలు పాటిస్తుందనుకునేరు. ఈయన చెప్పేవన్ని చేస్తూ, సమయానికి అన్నీ అందిస్తూ ఉంటుంది. భార్యంటే చాలా ఇష్టం అతనికి. తనని ఇంటినుండి బయటకు అడుగు పెట్టనివ్వడు. చాలా అపూరూపంగా చూసుకుంటాడు. కానీ కోపం వచ్చిందో అన్నీ మరిచి పోతాడు. అతనికి అన్నీ సమాయానికి అమరాలి,లేకపోతే ముక్కు మీదే కోపం ఉంటుంది. ఆలస్యమైతే ఇల్లు పీకి పందిరేయడమే తరువాయి. పాపం సుభధ్ర ఎప్పుడు దురుసుగా జవాబు చెప్పిందే లేదు.. మరీ కోపం వస్తే ఓ తీక్షణమైన చూపుచూస్తుంది అంతే. సూర్య ప్రకాశ్ ఆ మధ్య బయట ఊరికి వెళ్లినప్పుడు, ఉదయం అల్పాహారం తిననందు వలనో లేక మరే కారణాల వలనో అక్కడ స్పృహ కోల్పాయాడు. భయపడి అన్ని టెస్టులు చేయించుకుంటే చెడు కొలస్ట్రాలు కొంచెం ఎక్కువగా ఉందన్నారు డాక్టర్. చాలా ఫీలైపోయి గూగులంతా వెదికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. అదెంటంటే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్. అంటే రోజుకు రెండు సార్లే భోజనం , నో బ్రేకఫాస్ట్. అది ఎలా అంటే ఉదయం కొన్ని గింజలు మరియు అంబలి లాంటి ద్రవ పదార్థాలు తీసుకొని ,మధ్యాహ్న భోజనం పన్నెండు గంటలకే ముగించి , రాత్రి భోజనం సాయంకాలం ఏడు గంటలకే తిని ,అటుపైన ఉదయం వరకు ఏమీ తినకుండా ఉండటం. దీని వలన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది. శరీరంలో ని చెడు కొవ్వుకూడా కరుగుతుంది అనేది దాని సిధ్ధాంతం. మొత్తం మీద ఆ ప్రక్రియని కొన్ని నెలల నుండి ఓ నిబధ్ధతతో అనుసరిస్తూ వస్తున్నాడు. కానీ ఓ ఉదయాన సుభధ్ర అంబలి ఇవ్వలేదు. పోనీలే మరిచిపోయుంటుంది అనుకొని ఊరుకున్నాడు. అలా నాలుగు రోజులు గడిచాయి, అప్పుడు అడిగాడు " ఎందుకు ఉదయం అంబలి ఇవ్వటం లేదు"..అని. "పిండి నిండుకుందండి, సూపర్ మార్కెట్ వెలితే తెచ్చుకోవాలని" ఇక సూర్య ప్రకాశ్ సూరీడే అయ్యాడు. "అంటే సూపర్ మార్కట్కి వెళ్లి నేను తెచ్చేంత వరకూ నాకు ఉదయాన ఏమీ ఇవ్వవా?".... అంటూ ఇంకేవో మాటలు విసిరేసి ,తన దిన చర్యలో భాగంగా వ్యాయమం చేసుకోవటంలో నిమగ్నమై పోయాడు. వ్యాయామం పూర్తి అయి కూర్చున్న తరువాత సుభద్ర కొన్ని గింజలు,అంబలి తీసుకొచ్చి ముందు పెట్టింది. సూర్య ప్రకాష్ కి సుభధ్ర పైన కోపం ఇంకా తగ్గలేదు, పిండి గురించి వివరాలేమీ అడగకుండా గింజలు నమిలి అంబలి తాగే సాడు. ఈ తతంగమంతా గమనిస్తున్న సూర్య ప్రకాశ్ కూతురు జాహ్నవి, కొంచెమాగి అప్పుడు చెప్పింది. "మీ ఆవిడ పిండి తీసుకు రమ్మని నన్నడిగింది. మీరు అమ్మను కోపడ్డారని మీ మీద కోపంతో నేను వెళ్లనన్నాను. పాపం తనే వెళ్లి తీసుకొచ్చింది "అని. ఆమె అంత దూరంగా ఉన్న షాప్ కి వెళ్లి పిండి తీసుకు రావటం సూర్య ప్రకాశ్ కి ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే తనకి ఒంటరిగా బయటకళ్లే అలవాటే లేదు. తనకి బిడియం ఎక్కువ. అందుకే తను ఎప్పుడు తనని బయటకెళ్లి ఏదీ తీసుకురమ్మని బలవంత పెట్టడు. కూతురు విషయం చెప్పిన తరువాత సూర్య ప్రకాశ్ పశ్చాతాప పడ్డాడు, సుభధ్ర తన కోసం ఎంత కేర్ తీసుకంటుందో కదా!, తన రక్తం పంచుకు పుట్టిన కూతురుకి తన మీద కోపం వచ్చిందని స్పందించకుండా ఊరుకుంది, కానీ సుభధ్ర ని తను మాటలతో గాయపరిచినా, ఎంతో సహనంతో వ్యవహరించి తన సౌకర్యం కోసం తను ఎప్పుడూ చేయని పని చేసుకొచ్చింది అని. విషయం చిన్నదైనా సూర్య ప్రకాశ్ ఎందుకో కొంచెం ఎక్కువగానే స్పందించాడు. ఇంట్లో ఏదో పనిచేసుకుంటున్న సుభధ్ర దగ్గరకు వెళ్లి ,సుభధ్రా! అని పిలిచి , ఆమె ఇటు తిరిగిన వెంటనే దగ్గరకు తీసుకుని చిన్న పిల్లాడిలా , " నేను వెళ్లిన తరువాతనే నీవు వస్తావు కదూ " అంటూ గద్గదమైన స్వరంతో కన్నీటి పర్యంతమైనాడు. ఆ మాటను కొంచెం ఆలస్యంగా అర్థం చేసుకున్న సుభధ్ర "ఊరుకోండి!చిన్న పిల్లాడిలా ఏమీటామాటలంటూ... ఓదార్చింది!