అయ్యో! శంకరం మాస్టారు - తటవర్తి భద్రిరాజు (949 3388 940)

Ayyo sankaram mastaaru

ఊరి చివర ఉన్న రామకృష్ణ రైస్ మిల్ పక్క సందులో నుండి ఎడమ పక్కకు తిరిగితే గోపాలం హోటల్ ఉంటుంది. దానిపక్కనే ఒక SBI ఎటిఎం ఉంది. ఎటిఎం తలుపుకు ఉన్న అద్దం సగం పగిలి, లోపల ఉన్న ఏసీ చల్లదనం బయటకి పోతూ ఉంది. ఎండా కాలం లో కొన్ని వీధి కుక్కలు ఈ ఎటిఎం లోపల పడుకుని ఉంటాయి. ఈ ఎటిఎం పక్కనే ఉన్న ఖాళీ స్థలం లో ఈ మధ్యనే గోపాలరావు పాత వస్తువులు, పేపర్లు, పాత పుస్తకాలు కొనే షాప్ ఓపెన్ చేశాడు. 60 ఏళ్ల వయసు ఉన్న గోపాలరావు తన షాప్ లో సహాయపడడానికి సూర్యం అనే 15 ఏళ్ల కుర్రాడు ను పెట్టుకున్నాడు. తండ్రి చిన్నప్పుడే పోయిన సూర్యం, కుటుంబం గడవడం కోసం చిన్నప్పుడు నుండే రకరకాల పనులు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ చలాకీగా ఉండే సూర్యం ప్రతీ రోజు ఉదయాన్నే షాప్ కి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే వాడు. ఆ షాప్ లో ఉన్న పాత పుస్తకాలు చూసినపుడు అల్లా తను కూడా చదువుకుంటే బావుండేది అనుకునే వాడు. ఆ షాప్ లోని పాత పుస్తకాలు తీసుకొని వాటిలో బొమ్మలు చూస్తూ ఉండేవాడు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు వస్తే తనకు నచ్చిన పుస్తకం ఇచ్చి అందులో ఏమి ఉందొ చదివి చెప్పమనే వాడు. వేట్లపాలెం స్కూల్ లో తెలుగు మాస్టారు గా పని చేసే శంకరం మాస్టారు చాలా మంచి వారు అని పేరు ఉంది. ఆయన భార్య కొన్నేళ్లు క్రితం విజయనగరం దగ్గర జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం లో చనిపోయింది. శంకరం మాస్టారు కు పదవతరగతి చదువుతున్న కూతురు ఉంది. కూతురు అంటే మాస్టారు కు ప్రాణం. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, తన తల్లి పేరు మహా లక్ష్మీ అని పెట్టుకున్న కూతురు ను. ఓరోజు ఆ షాప్ కి వచ్చిన శంకరం మాస్టారు సూర్యం కి చదువు మీద ఉన్న ఆసక్తి చూసి ప్రతీరోజు పని అయిపోయాక ఒక గంట మా ఇంటికి వచ్చి చదువు నేర్చుకో అని చెప్పారు. అక్కడ నుండి ప్రతీ రోజు శంకరం మాస్టారు ఇంటికి వెళ్తున్న సూర్యం చదువు నేర్చుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు శంకరం మాస్టారు స్కూల్ నుండి రావడం లేట్ అయినా, ఆయన ఎక్కడికైనా వెళ్లినా మహాలక్ష్మి సూర్యం కి పాఠాలు చెప్తూ ఉండేది. ఆలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. నెమ్మది నెమ్మదిగా సూర్యం చదవడం రాయడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఓరోజు శంకరం మాస్టారు దిగులుగా ఉన్నారు. ఆ తరువాత రోజు కూడా ఆయన అలానే ఉన్నారు. ఎప్పుడూ ఆయన ఆలా ఉండడం చూడని సూర్యం ఎందుకు ఆలా ఉన్నారో తెలుసుకుందామని మహాలక్ష్మి ని అడిగాడు. తనకు తెలియదు అని చెప్పిన మహాలక్ష్మి, సూర్యం ఉండగానే ఏమయ్యింది నాన్నా? ఎందుకు ఆలా ఉన్నారు అని అడిగింది. కాసేపు మాట్లాడకుండా ఉన్న శంకరం మాస్టారు ఆ తరువాత సూర్యం కేసి చూసి నీ జీవితం లో ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయకరా! అన్నారు. ఏమీ అర్ధం కాని సూర్యం, ఏమయ్యింది మాస్టారు అని శంకరం మాస్టారు మొహం కేసే చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమి చెప్తారా అని. మన జీవితం లో నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయకూడదు ర సూర్యం అన్నారు భారంగా నిట్టూరస్తూ. ఏమీ అర్ధం కానీ సూర్యం ఏమయ్యింది మాస్టారు అని అడిగాడు మెల్లగా, నేను ఏదైనా తప్పు చేశానా అండీ అని. తప్పు నువ్వు చేయలేదురా, నేనే చేసాను అన్నారు శంకరం మాస్టారు. మీరు తప్పు చేయడం ఏంటి మాస్టారు ! మీరు వీలైతే సహాయం చేస్తారు. ఈ ఊళ్ళో మీకు ఎంత మంచి పేరు ఉందొ తెలుసు కాదా అన్నాడు సూర్యం. సూర్యం మాటలను మధ్యలోనే ఆపుతూ , శంకరం మాస్టారు, నేను చేసిన తప్పు తెలియాలంటే ఈ కథ విను నేను చేసిన తప్పు తెలుస్తుంది అని చెప్పడం ప్రారభించారు. పక్క ఊళ్ళో శ్రీనివాస చారి అని నాకు బాగా తెలిసిన వ్యక్తి ఉండేవాడు. బంగారు ఆభరణాలు చేస్తూ ఉండేవాడు. అతనికి భార్య, పదవ తరగతి చదువుతున్న కూతురు కూడా ఉన్నారు. శ్రీనివాసచారి మంచి మాటకారి. అలాగే చాలా నైపుణ్యం తో ఆభరణాలు చేసేవాడు. చాలా తక్కువ కాలం లోనే చుట్టుపక్కల గ్రామాలలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎవరికీ బంగారు ఆభరణాలు కావాలన్నా ఇతని దగ్గరే చేయించుకునే వారు. ఆలా కష్టపడి బాగానే సంపాదించుకున్నాడు. ఒక ఇల్లు కట్టుకుందాం అని కూడా అనుకున్నాడు. ఊహించినట్టు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది. అనుకోకుండా శ్రీనివాసచారి జబ్బు పడ్డాడు. కాళ్ళ లో నీళ్లు పట్టి బాగా ఉబ్బిపోయేవి. చుట్టూ ఉన్న వాళ్ళు దిష్టి తగిలింది అన్నారు. దూరపు చుట్టాలు చేతబడి అన్నారు. ఉండూరు అనే ఊళ్ళో మంత్రగాడు ఉంటే తీసుకెళ్లి పూజలు చేయించారు. అన్నవరం లో దేవుడి కి మొక్కుకున్నారు. కానీ జబ్బు తగ్గలేదు. చివరకి ఒకరోజు కాకినాడ భానుగుడి జంక్షన్ దగ్గర ఉండే లో కళ్యాణి హాస్పిటల్ చూపిస్తే ఒక కిడ్నీ పాడు అయ్యింది అన్నారు. హాస్పిటల్ లో వైద్యానికి ఇంతకాలం సంపాదించుకున్న డబ్బులు అన్నీ అయిపోతున్నాయి. రోజు రోజు కు నీరసంగా తయారవుతున్న శ్రీనివాసచారి ఇంతకు ముందు అంత బాగా పని చేయలేక పోతున్నాడు. నెమ్మది నెమ్మది గా తన దగ్గరకి జనం రావడం కూడా తగ్గిపోయింది. ఇతని పరిస్థితి చూసి నెల నెల ఆదాయం వచ్చే ఉద్యోగం బావుంటుంది అని నేను, నాకు తెలిసిన బ్యాంక్ లో గోల్డ్ వాల్యూయర్ గా ఉద్యోగం ఇప్పించాను. బ్యాంకు లో గోల్డ్ లోన్ తీసుకోవడానికి, తీసుకుని వచ్చే బంగారం నాణ్యత పరిశీలించి బరువు చూసి బ్యాంకు వారికి రిపోర్ట్ ఇవ్వడం ఇతని పని. కాకినాడ లో తీసుకుంటున్న వైద్యం తో కొంచం కొంచం కోలుకుంటున్న శ్రీనివాస ఆచారి, ప్రతీరోజు బ్యాంకు కు వెళ్తూ ఉన్నాడు. కానీ, అతనికి కూతురు చదువు, పెళ్లి గురించి, బెంగ పట్టుకుంది. తన ఆరోగ్యం పూర్తిగా పాడైయితే కుటుంబం ఏమయ్యి పోతుందో అనే ఆలోచన లు తో శతమతం అయ్యేవాడు. తన చిన్నతనం లో వడ్లమూరు అనే ఊళ్ళో రాజారావు అనే బ్యాంకు వాల్యూయర్ బ్యాంకు వాళ్ళ తో కలిసి దొంగ నోట్లు బ్యాంకు ద్వారా చాలామణీ చేసి బాగా సంపాదించుకున్నాడు అని ఎక్కడో విన్నాడు. ఒక ఇల్లు, పొలాలు కొని పిల్లలు ను విదేశాలు లో చదివించాడు అని తెలుసుకున్నాడు. తరువాత ఆ పని మానేసి మంచిగా జీవితం గడుపుతున్నాడు అని తెలుసుకున్నాడు. తానుకూడా ఆలా ఏదో ఒకటి చేస్తే కూతురు చదువు, పెళ్లి కూడా చేసేయచ్చు. తర్వాత ఆ పని మానేయచ్చు అనుకున్నాడు. తనకి ఉన్న మాటకారి తనం తో బ్యాంకు లో పరిచయాలు పెంచుకున్న శ్రీనివావాసచారి కొంత మంది బ్యాంకు సిబ్బంది తో కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గోల్డ్ లోన్ తీసు కోవడానికి వచ్చే వాళ్ళ ఆభరణాలు తీసుకుని , వాటి స్థానం లో నకిలీ ఆభరణాలు బ్యాంకు లో ఉంచేవాడు. ఆ బంగారం తనకి తెలిసిన వాళ్ళ దగ్గర అమ్మి మిగిలిన బ్యాంక్ ఉద్యోగులతో పంచుకునే వాడు. ఎవరికీ తెలియకుండా కొంతకాలం బాగానే గడిచింది. బాగా డబ్బులు వస్తూ ఉండడం తో ఒక ఇల్లు కట్టడం ప్రారభించాడు. ఓరోజు సడెన్ గా మొత్తం వ్యవహారం బయట పడింది. పై అధికారులు శ్రీనివాస ఆచారి అని మొత్తం సొమ్ము ఒకేసారి కట్టమన్నారు. మిగిలిన ఉద్యోగులు మాకు ఏమీ తెలియదు అని పక్కకు తప్పుకున్నారు. ఒకేసారి అంత సొమ్ము కట్టడం ఎలాగో తెలియక, ఈ విషయం బయటకు వస్తే ఊళ్ళో కూడా పరువు పోతుంది అని, అప్పుడు కూతురుకు పెళ్లి కూడా అవ్వదు అని బయపడి రాత్రి కి రాత్రే కుటుంబం తో ఎక్కడికో వెళ్ళిపోయాడు. శ్రీనివాసాచారి ని బ్యాంకు లో ఉద్యోగం లో పెట్టించినందుకు ఇప్పుడు నామీద కేసు పెట్టి, ఆ డబ్బులు ఇప్పుడు నన్ను కట్టమంటున్నారు. అంటూ చెప్పడం ఆపారు శంకరం మాస్టారు. ఇది. అంతా విన్న సూర్యం, అయ్యో శంకరం మాస్టారు! చేయని తప్పుకు ఈ శిక్ష ఏంటి అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

మరిన్ని కథలు

Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.