కొత్త ఉగాది - తాత మోహనకృష్ణ

Kottha ugadhi

"ఏమండీ..! ఏమిటో మీకీ మొద్దు నిద్ర..తొందరగా నిద్ర లెండి..ఈ రోజు పండుగ అని మీకు అసలు గుర్తుందా..?"
"నైట్ షిఫ్ట్ చేసి వస్తే.. అప్పుడే నిద్ర లేవాలా..? ఇంతకీ ఈ రోజు ఏం పండుగ..?"
"కొత్త సంవత్సరం అండి.."
"న్యూ ఇయర్ ఎప్పుడో అయిపోయిందిగా..కేక్ కుడా కట్ చేసి బాగా సెలబ్రేట్‌ చేసుకున్నాము కదా..?'
"అయ్యో రామ..! అది ఇంగ్లీష్ న్యూ ఇయర్..నేను చెప్పేది తెలుగు న్యూ ఇయర్ గురించి.."
"మరి నాకు ఆఫీస్ లో సెలవు ఇవ్వలేదుగా.."
"మీకు అన్నీ ఆ ఇంగ్లీష్ పండుగలకే సెలవులు ఇస్తారు..అదే తంటా.."
"నాకావన్నీ తెలియవు..ఎప్పుడూ జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అంతే..!"

రాణి కి కొత్తగా పెళ్లైంది. పెళ్ళి చూపులలో ఇష్టపడి మరీ పెళ్ళి చేసుకుంది రఘుని. సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి జీతం..చూడడానికి సినిమా హీరోలాగ ఉన్నాడని కోరి చేసుకుంది. ఇప్పుడు చూస్తే, మన ఆచారాలు, పండుగలు మీద అసలు పట్టు లేదని తెలిసింది. ఎప్పుడూ ఇంగ్లీష్ నెలలు, ఇంగ్లీష్ పండుగలే ఈయనకి గుర్తు. మా నాన్నకి కనుక ఈ విషయం తెలిస్తే, ఏమైనా ఉందా..? అసలే నాన్న ప్రవచన సామ్రాట్..అల్లుడికి ఉగాది పండుగ అంటే తెలియదంటే..అందరూ నవ్వుతారు.

"ఏమండోయ్ శ్రీవారు..! కాస్త మీ గూగుల్ లో అడగండి..ఈ రోజు ఏం పండుగో చెబుతుంది..అప్పుడే నమ్ముతారు కాబోలు.."
"హలో గూగుల్..వాట్ ఈజ్ టుడే..?" అని అడిగాడు రఘు
"టుడే ఈజ్ తెలుగు న్యూ ఇయర్ ఉగాది.."

"ఇక లెండి..లేచి స్నానం చేసి..రెడీ అయితే.. ఉగాది పచ్చడి తిందురు.."
"ఎక్కడ ఆర్డర్ చేసావు..మంచి రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తేనే తింటాను.." అన్నాడు రఘు
"నా కర్మ.. అమెరికా లో కొన్ని సంవత్సరాలు అఘోరించడం చేత, అసలు అన్నీ మర్చిపోయారు..ఈయనకి మొదటి నుంచి అన్నీ నేర్పించాలి కాబోలు..సరసాలు ఆడడం మాత్రం బాగా తెలుసు. ఆ విషయంలో నేను చాలా లక్కీ.." అని మురిసిపోయింది రాణి

"ఈ విషయంలోనైనా నన్ను గ్రేట్ అని ఒప్పుకున్నారు రాణిగారు.."
"ఒప్పుకోక పొతే ఎలా మరి..రోజూ వొళ్ళు హూనం చేస్తున్నారు..ఇప్పటికి రెండు మంచాలు విరిగాయి..ఇంపోర్టెడ్ మంచాలు కుడా ఆగట్లేదు మీ ధాటికి.."అని నవ్వుకుంది రాణి
"నవ్విందండీ నా శ్రీమతి " అన్నాడు రఘు

"పంచాంగ శ్రవణం వస్తుంది టీవీ లో..తొందరగా స్నానం చేసి రండి..చాలా బాగుంటుంది.."
"ఏమిటో అంత బాగుండేది..?"
"ఆదాయం, వ్యయం,రాజపూజ్యం, అవమానం చెబుతారు.."
"అంటే..?"
"అంటే.., ఈ ఇయర్ లో మీ ఫైనాన్షియల్ స్టేటస్, సోషల్ స్టేటస్ చెబుతారు.."
"అన్నింటికీ యాప్స్ ఉన్నాయి కదా..మరి ఇదేమిటి..?"
"ముందు స్నానం చేసి రండి..అప్పుడు చెబుతాను.."
"టవల్ ఇచ్చి రఘుని బాత్రూం లోకి పంపించింది రాణి. పెళ్ళైన మొదటి ఉగాది నాకు నిజంగానే కొత్త ఉగాది..అన్నీ మొదటి నుంచి చెప్పాలి మా ఆయనకి.." అనుకుంది రాణి

స్నానం చేసి వచ్చిన భర్త..జీన్స్, టీ షర్టు వేసుకుని వచ్చాడు.

"ఏమిటండి ఇది..పంచ కట్టుకుని రండి..మన సెల్ఫీ అసలే నాన్నచూస్తారు. మీరు ఇలా జీన్స్, టీ షర్టు వేసుకుంటే, ఆయన బాధ పడతారు.."
"నాకు పంచ కట్టుకోవడం రాదు గా..."
"అవును లెండి...పెళ్ళికి పంచ కుడా గురువుగారు కట్టారు..ఎప్పుడూ టక్కు, సూట్ లే కదా మరి.."
"నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు..నా జాబ్ అటువంటిది. ఊరకే ఇచ్చేస్తారా..లక్షల జీతాలు మరి..?" అన్నాడు రఘు

"మా ఆయనకి కోపం వచ్చినట్టుందే..! సారీ అండి..మీరు బాధపడితే నేను చూడలేను. మీకు అన్నీనేర్పిస్తాను. వచ్చే పండుగ నుంచి అన్నీ మీరే నాకు చెబుతారు..చూడండి. పండుగ పూట మీరు ఇలా ఉంటే మాత్రం, రాత్రంతా నాకు పస్తే ..అసలే మనకి కొత్తగా పెళ్లైంది.." అంది రాణి రఘుని గట్టిగా పట్టుకుని

******

మరిన్ని కథలు

Maa nava bandhalu
మా నవ బంధాలు
- బామా శ్రీ (బాలాజీ మామిడిశెట్టి)
Cycle nerchukovadam
సైకిల్ నేర్చుకోవడం
- మద్దూరి నరసింహమూర్తి
Konda godugu
కొండ గొడుగు
- టి. వి. యెల్. గాయత్రి.
Panimanishi
పనిమనిషి
- మద్దూరి నరసింహమూర్తి
Sanitorium
శానిటోరియం
- ఆకేపాటి కృష్ణ మోహన్
Chavu paga
చావు పగ
- వేముల శ్రీమాన్