ప్రభుత్వ సారాయి దుకాణం - బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి

Prabhutwa sarayi dukanam

" కార్డా క్యాషా సార్ " కౌంటర్ లో అమ్మాయి అడిగింది "కార్డే " అంటూ కార్డు ఇచ్చాను "సెల్ నంబరు సార్" "ఎందుకు " అడిగా "కార్డు పేమెంట్ కి సెల్ నెంబర్ కావాలి సార్ " చేసేది లేక చెప్పా. సామాన్లు తీసుకుని మోర్ సూపర్ బజార్ నుంచి బయట పడ్డా. ఏసి నుంచి బయట కి వచ్చేనేమో బయట వేడికి భయమేసింది. మార్చి పదిహేనే అయినా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడు చార్ మినార్ చౌరస్తా లొ అస్టోరియా లో బిర్యాని తేవాలి. బ్యాంక్ యాన్యువల్ క్లోజింగ్ ఇంకా పదిహేను రోజులే. టార్గెట్స్ ఇంకా రీచ్ కావాలి. డిపాజిట్స్ పది కోట్ల పైగా నెగెటివ్. రేపట్నుంచి ఎలాగూ బ్యాంక్ కే అంకితం. ప్రమీల ఒక్కదాని కి ఇంట్లొ బోర్. పిల్లలు ఇద్దరు స్టేట్స్ లో ఉండడం తొ కనీసం ఈ ఆదివారం అయినా బిర్యాని తొ ఎంజాయ్ చేయాలని బిర్యాని ప్రపోజల్ నేనే పెట్టా. సరే ఆ వేడికి తోడు హెల్మెట్ ఒకటి. స్కూటర్ స్టార్టు చేద్దాం అని కిక్ కొట్టా బోయా. అంతలో " రవికుమార్" అని పిలుపు. ఎవరబ్బా అని చుట్టూ చూస్తే తెలిసిన ముఖం కనపడ లేదు. మళ్లీ కిక్ కొట్టా బోతే ఈసారి "రవి" అంటూ బిగ్గరగా గా వినపడింది. వెనక్కు చూస్తే మోర్ సూపర్ బజార్ పై మెట్టు మీద ఒక వ్యక్తి టీషర్ట్ జీన్స్ ప్యాంట్ గాగుల్స్ తెల్ల గడ్డం తో నన్ను చూస్తూ ఆగమని సంజ్ఞ చేస్తూ నా దగ్గర గా వొచ్చి "హాయి రవి ఎలా వున్నా వు " అన్నాడు. ఎవరబ్బా తెలిసిన ముఖం కాదు. కస్టమర్ అయి ఉండాలి. నా ఇబ్బంది చూసి "ఏంటీ.. గుర్తు పట్ట లేదా " అని నవ్వి" ఒకే. హింట్ ఇస్తా " అంటూ"ఏ స్కూల్ లో చదువు కున్నావు బాబూ " అన్నాడు. అంటే ఇతను నా క్లాస్ మేట్ అన్న మాట. మరి నా కంటే వయసు ఎక్కువ గా ఉంది అను కుంటూ "ఎ వి school చిక్కడపల్లి" "ఓహో గుర్తుందే మరి క్లాస్ మేట్లని మరచి పోయావా" కన్ఫ్యూజన్ గా వున్న నన్ను చూస్తూ "కనీసం నీకు గుర్తున్న మన ఫ్రెండ్స్ పేర్లు చెప్పు"అన్నాడు. "ఆత్మరాం కిషన్ సిద్ది రాములు అచితరాజ్ కృష్ణ ప్రసాద్ రాంప్రసాద్..." "ఆగు ఆగు.. మరి ప్రభత్వ సారాయి దుకాణం" ప్రశ్నర్థకం గా ముఖం పెట్టాడు. "అదేంటి" ఆశ్చర్యంగా నేను. "నీకు ఉత్త ప్రసాద్ పేరు గుర్తు లేదా.. అదే నన్ను అందరూ ప్రభుత్వ సారాయి దుకాణం షార్ట్ కట్ లో ప్ర .సా. దు. అనేగా అందరూ బనాయి ఇంచే వారు కదా " అన్నాడు. నాకు మళ్లీ కన్ఫ్యూజన్. "ఇంతకీ ఏం చేస్తున్నావ్ " అతని ప్రశ్న . " స్టేట్ బ్యాంక్ లో అబిడ్ రోడ్ బ్రాంచ్ మేనేజర్. మరి మీరు..ఏం చేస్తున్నారు " నేను. "వెరీ గుడ్. మీరు ఏమిటయ్యా.. నువ్వు అను. నేను చార్టెడ్ అకౌంటెంట్. నాకు ఒక కన్సల్టెన్సీ అండ్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. మా వైఫ్ డాక్టర్. నేను బంజారా హిల్స్ లో వుంటా. నిన్ననే టూర్ నుంచి వొచ్చా. నా BMW కారు కొంచం ట్రబుల్ ఇస్తుంటే మా మెకానిక్ దగ్గరకు వచ్చాను. వాడి ఇల్లు ఇక్కడే.ఇవాళ సండే కదా వాడి షాపు క్లోజ్. అందుకే వాడి ఇంటి దగ్గరే చూస్తున్నాడు. ఇంకా మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు " "నాకు ఎక్కు వగా టచ్ ఉన్నది ఆత్మ రామ్. వాడు ఎల్ఐసి బషీర్ బాగ్ లో పని చేస్తున్నాడు. రెగ్యులర్ గా కలుస్తాడు. తక్కిన వాళ్ల సంగతులు వాడే చెప్తూ వుంటాడు " " ఓహో ఆత్మ రామ్ .. నేనూ వాడిని కలుస్తుంటా.. లాస్ట్ మంత్ వాడికి టార్గెట్ కి తక్కువ పడిందంటే వన్ క్రోర్ పాలసీ మా పిల్లల పేరు మీద ఇచ్చా. అంతకు ముందు ఐదు కోట్ల పాలసీలు ఇచ్చి వుంటా.. సరే ఇంటికేనా.."అడిగాడు. "లేదు. మళ్లీ రేపట్నుంచి బ్యాంక్ లో బిజీ కనుక మా ఆవిడ తొ ఇవాళ బిర్యాని లంచ్.. బిర్యాని తేవడానికి అస్స్టోరియా కేఫ్ చార్ మినార్ చౌరస్తా వెళుతున్నా.." "అరె.. నా బండి రిపేరు ఇంక గంట పైనే పడుతుంది. టైం పాస్ కి నేను వస్తా. చాలా రోజుల తరువాత కలిశాం." నా మదిలో ఒక మెరుపు మెరిసింది. ఇతనితో నా డిపాజిట్ టార్గెట్ రీచ్ కావచ్చు. మెల్లిగా విషయం కలప వచ్చు అని అతన్ని తీసుకుని చార్మినార్ చౌరస్తా కి బయలు దేరాం. నేను బిర్యాని ఆర్డర్ చేస్తుంటే " రవి నీవు ఏమను కోకుంటే నాకు కూడా బిర్యాని , చికెన్ స్టార్టర్స్ ఆర్డర్ చేయి. నా సెల్ ,పర్స్ రెండూ కార్ లోనే వుంచా. వెళ్ళగానే డబ్బులు ఇచ్చేస్తా " అన్నాడు ఇదీ అవకాశమే అనుకుని అలాగే అతనికి కావలసిన ఫుడ్ ఆర్డర్ చేసా. ఆర్డర్ వెయిటింగ్ టైంలో మెల్లగా నా టార్గెట్స్ గురించి చెప్పా. అతను గట్టిగా నవ్వి" ఎందుకు సందేహిస్తూ న్నావ్. ఎంత డిపాజిట్ కావాలి " "పది కోట్లు " అన్నా భయం భయం గా. "అంతేనా. ఇరవై ఇస్తా. కానీ మా కంపెనీ అకౌంట్ మీ బ్యాంక్ లో లేదు. వేరే బ్యాంక్ చెక్స్ ఇస్తా. సరిపోతుందా.." " నేను క్లియరెన్స్ చేసు కుంటా. మళ్లీ మే నెలలో ఇచ్చేస్తా " " మాకు అవసరం బట్టి అడుగుతా. జూన్ వరకు అడిగే ప్రశ్నే లేదు . నా కారు లో నా విజిటింగ్ కార్డు వుంది. అది తీసుకుని రేపు ఉదయం పదకొండు గటలకి మా ఆఫీసు కి వొచ్చేయి. మా ఫైనాన్స్ ఆఫీసర్ చెక్స్ ఆరెంజ్ చేస్తాడు. నేను ఇంస్ట్రక్షన్ ఇస్తా. వచ్చేటప్పుడు మీ ఫార్మాలిటీస్ ప్రకారం అకౌంట్ ఓపెనింగ్ ఫామ్స్ తీసుకు రా" ఎగిరి గెంతేయాలని ఉంది కానీ సభ్యత కాదని వూర్కున్న. మొత్తం బిల్ మూడు వేలు చెల్లించి అతని పాకెట్ అతనికి యిచ్చి వెళదామా అన్నట్లు చూసా . " ఒక సారి సెల్ ఇస్తావా మా మెకానిక్ కి ఫోన్ చేయాలి. రిపేరు అయిపోయిందా లేదా అని" నా దగ్గర సెల్ తీసుకుని మాట్లాడి.. " రవీ.. వాడికి ఒక పార్ట్ కావాలట. సండే కదా షాప్స్ క్లోజ్. సంధ్య టాకీస్ పక్క గల్లి లో ఒకడు ఇంట్లోనే అమ్ముతాడుట. ఇక్కడే కదా అది తీసుకుని వెళ్ళిపోదం. పని అయిపోతుంది. కాస్ట్ రెండు వేలు ట. నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్న. మొత్తం డబ్బులు కారు దగ్గరకు వెళ్ళగానే ఇచ్చేస్తా. ఏమనుకోకు." "దానికేముంది. షాపు ఎక్కడ " "ఎదురు గుండా సందే. రోడ్ క్రాస్ చేయాలి. ఒక పని చేయి. నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తూ వుండు. పది నిమిషాలు లో వొచ్చేస్త . బండి మీద అయితే అంతా తిరిగి రావాలి ఒన్ వే కదా. టైం వేస్ట్ ". అని నా దగ్గర రెండు వేలు తీసుకుని ఆ ఇరుకు గల్లి లోకి వెళ్ళాడు. రోజూ రీజినల్ మేనేజర్ తో చస్తూ వున్నా. డే అండ్ నైట్ ఒకటే ఫోన్.. కన్ఫర్మ్ టార్గెట్స్ అచీవ్డ్ అంటూ. వెంటనే ఆయనకి ఇన్ఫామ్ చేయాలి అనుకుంటూ ఫోన్ చేసా. " ఏమిటి ఆది వారం ఈ టైంలో.". విసుగ్గా అన్నాడు ఆయన. వెంటనే విషయం చెప్పా. "సరే. నీ బ్రాంచ్ కి పది కోట్లు చాలు కదా. మిగిలింది రాంనగర్ బ్రాంచి కి ట్రాన్స్ఫర్ చేయి. మీ రెండు నెగెటివ్ బ్రాంచ్ ల తోనే ప్రాబ్లం. అయినా రేపు చెప్పొచ్చు గా నిద్ర లేపి చెబుతున్నావ్" అంటూ విసుగ్గా ఫోన్ పెట్టేసాడు. ఛీ.. బ్యాంక్ మేనేజర్ అంత అలుసు జాబ్ ఇంకోటి లేదు అనుకుంటూ ప్రసాద్ గురించి వెయిట్ చేస్తూ వున్నా. అరగంట గడిచింది. ఏమి అయిందా అంటూ ఆ సన్న సందులో కి వెళ్ళా. అక్కడ షాప్స్ గానీ ఇళ్లు గాని ఏమి లేవు. ముందు కి వెళ్తే డెడ్ ఎన్డ్ లెఫ్ట్ కి వెళ్తే మళ్ళీ అటు మైన్ రోడ్ వెళ్ళ వచ్చు. అంటే... ఒక్క సారి గుండె గుభేల్ మంది. అక్కడ ఒక తెల్ల బంగ్లా తప్పా ఏమీ లేదు. ఆ బంగ్లా ముందు కొందరు కూర్చోని మందు కొడుతున్నారు. అందులో ఒక వ్యక్తిని ఎంక్వయిరీ చేస్తే ఒక మనిషి అలా రోడ్ మీదకి వెళ్ళాడు అతని చేతిలో ఏదో ఫుడ్ పార్సెల్ కూడా ఉందని చెప్పాడు. ఇప్పుడు ఎలా. యేం చేయాలి. అప్పుడు గుర్తొచ్చింది అతను నా సెల్ నుంచి మెకానిక్ కి ఫోన్ చేయడం. వెంటనే ఆ నంబరు ట్రై చేద్దామంటే ఆ నంబరు లో తొమ్మిదే అంకెలు గుర్తించాను. అంటే ఫేక్ నంబరు అన్న మాట. వెంటనే ఆత్మ రామ్ కి ఫోనే కలిపి విషయం చెప్తే వాడు " ఒరేయ్ మన క్లాస్ లో వట్టి ప్రసాద్ అనే వాడు లేడు రాంప్రసాద్, కృష్ణప్రసాద్ తప్పా.నన్ను ఏ ప్రసాద్ కలవలేదు పాలసీ ఇవ్వ లేదు. వాడు తెలివిగా నీ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచే లాగి నిన్నే ఫూల్ నీ చేశాడు. నువ్వు మోస పోయావ్" అంటూ ఫోనే పెట్టేసాడు.. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం రీజినల్ మేనేజర్. ఆయనకి ఏమ్ చెప్పాలి.రేపు నా తాట వొలుస్తాడు. అక్కడ గోడకు ఆనుకుని నెత్తి మీద చేతుల పెట్టుకుని కూర్చుని వుండిపోయా. తలెత్తి పైకి చూస్తే ఎదురు గా వున్న బంగ్లా మీద తాటికాయ అంత అక్షరాలతో "ప్రభుత్వ సారాయి దుకాణం" అని రాసి ఉంది.

మరిన్ని కథలు

Adde talli
అద్దె తల్లి
- Madhunapantula chitti venkata subba Rao
Dongalu dorikaru
దొంగలు దొరికారు..!
- - బోగా పురుషోత్తం
Oddika
ఒద్దిక .
- Aduri.HYmavathi.
Maro konam
మరో కోణం
- గాయత్రి
Snanam
స్నానం
- మద్దూరి నరసింహమూర్తి
Swaadheenapatika
స్వాధీన పతిక
- వీరేశ్వర రావు మూల
Ekkadainaa baava
ఎక్కడైనా బావ..
- ఎం బిందు maadhavi