గుమ్మడి గుట్టు. - Aduri.HYmavathi.

Gummadi guttu

మరుధ్వతీపుర జమీందారుకు ఒక వింతైనరోగం పట్టుకుంది. ఆయన ఆస్థాన వైద్యులు ఎన్ని రకాల మందులు మార్చి మార్చి ఇచ్చినా తగ్గక నీరసించి పోసాగాడు జమీందారు మాధవ వర్మ.

తమకు వచ్చిన అనారోగ్యాన్ని తగ్గిస్తే వారిని ఆస్థాన వైద్యులుగా నియమిస్తామని ప్రకటన చేయించాడాయన.

కనీసం ప్రతిరోజూ కాలవిరేచనమైనా కాక, కడుపు ఉబ్బరం వచ్చి, పొట్టలో పిత్తం చేరి మాధవ వర్మ చాలా బాధపడసాగాడు. దీనికి తోడు చక్కెర వ్యాధి, రక్త పోటు, పొట్టనొప్పి వచ్చి మాధవ వర్మ మహాబాధ పడుతూ' తనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చినవారికి లక్షవరహాలు కూడా ఇస్తామని' మరో ప్రకటన చేయించాడు.

మరుధ్వతీపురంలోని వైద్యుడైన వసంతుడు ఆయన కుమారుడు మనోహరుని విదేశాలకు పంపి డాక్టరీ చదివించాడు. మనోహరుడు ఆరోజే విద్యపూర్తి చేసుకుని మరుధ్వతీపురం తిరిగి రావటాన, తన కుమారునితో జమీందారు మాధవ వర్మకు వైద్యం చేయించి, అటు ఆస్థాన వైద్యునిగానూ ఇటు లక్ష వరహాల బహుమతీ పొందవచ్చనీ, విదేశీ వైద్యం ఏవ్యాధినైనాఇట్టే తగ్గించేస్తుం దనీ విశ్వసించాడు. వెంటనే మాధవ వర్మను కలిసి తనకుమారుని పరిచయం చేసి విదేశీ వైద్యంగురించి గొప్పగా చెప్పాడు.

మాధవవర్మ తన దివానును పిలిచి చర్చించి అంగీకరించా డు. వైద్యం మొదలైంది .

రకరకాల రంగుబిళ్ళలు, రంగునీళ్ళూ రోజుకు పది మింగిస్తున్నాడు మాధవవర్మచేత మనోహరుడు. పక్షం అయ్యేసరికి మాధవవర్మకు అనా రోగ్యం బలిసి, విసుగొచ్చి, కడుపులో మంటవచ్చి నీరసం పెరిగింది. విసుగూ,నిరాశా కూడా పెరిగాయి.ఇక ఈ వైద్యం తనకు పనిచేయదని భావించి మనోహరుని వైద్యాన్ని నిరాకరించి, అతడిని పంపేశాడు మాధవవర్మ.

ఆ జమీ నివాసిఐన అచ్యుతుడు ఆయుర్వేద వైద్యుడు.పేదలకు మాత్రమే వైద్యం చేసేవాడు. అచ్యుతుడు తన కుమారుడు భిషగ్వరుని తక్షశిలలోని ఆశ్రమంలో పురాతన ఆయుర్వేద వైద్యం అభ్యసించను ఇరవై ఏళ్ళ క్రితం పంపిఉండగా భిషగ్వరుడు ఆయుర్వేదం లో అనేక వైద్య విధానాలు ఔపోసన పట్టి , దిట్టై తిరిగి ఇల్లుచేరాడు.

అచ్యుతుడు మరేమాత్రం ఆలస్యం చేయక ధర్మమూర్తి ఐన తమ పరిపాలకుడైన మాధవవర్మను కాపాడుకోవాలని కుమారునితో కలసి దివాణానికి వెళ్ళాడు. మాధవవర్మ అనేక వైద్యాలతో విసిగిపోయి ఉన్నం దున తనకిక ఏవైద్యమూ అవసరం లేదని బతికినంత కాలం ఇలాగే ఉంటాననీ దివానుచేత చెప్పి పంపాడు.

అచ్యుతుడు దివానుతో, "ఇది వైద్యంకాదని కేవలం ఆహార మార్పనీ ప్రభువులకు చెప్పి ఒప్పించండి సహజమైన ప్రకృతిలో లభించే ఆకులు, కాయలు గింజలతో భోజనం లాగా మాత్రమే వైద్యం ఉంటుంద నీ ఏ మందులూ మాకులూ ఇవ్వమనీ" చెప్పి పంపుతాడు. దివానుమాటలతో మాధవవర్మ అంగీకరించి భిషగ్వరుని వైద్యానికి అంగీకరిస్తా డు.

భిషగ్వరుడు ఇచ్చే అనుపానాలతో ఒక వారం కాగానే మాధవవర్మకు కొంతఆరోగ్యం బాగవుతున్నదన్న విశ్వాసం కుదురుతుంది.దాంతో ఇంకాశ్రధ్ధగా భిషగ్వరుడు ఇచ్చే పదార్థాలను తినసాగాడు.

జమీందారు కోలుకుంటున్నాడని జమీ అంతాపాకింది. ఆస్థాన వైద్యులు, మనోహరుడు,వసంతుడు కూడా ఆశ్చర్యంగా ఎలావైద్యం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆత్రంతో,మాధవవర్మను పరామర్శించే నెపంతో దివాణానికి వస్తారు. అక్కడ భిషగ్వరుడు ఒలిచి ఇచ్చేగుమ్మడి గింజలను తింటున్న మాధవవర్మను చూసి ఆశ్చర్యపడ్డారు.

" జమీదారుగారికి భిషగ్వరులు ఏదో గొప్ప మందులు ఇస్తున్నారని భావించాము. గుమ్మడి విత్తనాలా? " అన్నారు.

భిషగ్వరుడు " విత్తనాలేకాదు, తగుపాళ్ళలో గుమ్మడికాయ కూర, గుమ్మడి రసము,లేత ఆకులూకూడా కూడా ఇస్తున్నాను. " అన్నాడు

"ఐతే వీనిలో ఏదో మందులు కలిపి గోప్యంగాఇస్తుండాలి. లేకపోతే ఇంతకాలం ఎంతో అనుభవజ్ఞులమైనమామందులు కాక నీ గుమ్మడి విత్తనాలూ, గుమ్మడికాయా,ఆకులూ పని చేసి జమీందారుగారికి ఆరోగ్యా న్నిస్తున్నాయని మేము నమ్మము. ఏదో మోసం చేస్తున్నావు " అన్నారు. వారి అసూయ వారిచేత ఏదేదో మాట్లాడించింది.

భిషగ్వరుడు చిరునవ్వుతో," మీ భావన సరైనదే,విషయం తెలియ నపుడు అలాగే భావిస్తారు. ఐతే నేను 20సం. పాటు నేర్చిన ఆయుర్వేద శాస్త్రంలో మన హిందూ వైద్యంలో ఏముందో మీకు అవగాహనలేదు. గుమ్మడిలో ఎన్ని వైద్య విలువలు ఉన్నాయో మీకు తెల్సి నట్లు లేదు." అన్నాడు.

"మాకు తెలీని ఆ విలువలేంటో చెప్పు వింటాం " అన్నారు వారు.

" అసలు మీకు అయుర్వేదవైద్యం గురించి తెలుసా!ఆయుర్వేదం అంటే ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసేది. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అనేది నానుడి. భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలోఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత కొంచం వెనకబడినా ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని నయం చేస్తాయి.

అగ్నివేశుడు - అగ్నివేశ తంత్రము , చరకుడు చరక సంహిత, సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే గ్రంధాలు వ్రాశారు. అవేనేను పఠించిన ఆయుర్వేద వైద్యం రీతులు.

"ఐతేమాత్రం గుమ్మడి వైద్యమేంటీ?" అన్నారువారు.

" ఆయుర్వేదవైద్యంలో ఏఏపదార్థాలు సులువుగా లభిస్తాయో వాటితో వైద్యం చేయవచ్చు. మనకు ప్రస్తుతం గుమ్మడి బాగాలభిస్తున్నందున దానిని ఎంచుకున్నాను. గుమ్మడిలో వివిధ రోగాలను నివారించే గుణం ఉంది. మలబద్ధకం నుండి మధుమేహం వరకూ చాలా రోగాలను నిరోధి స్తుంది, తగ్గిస్తుంది కూడా.ఆంగ్ల వైద్యంలో పేర్లు చెప్తేనే మీకు నమ్మకం కనుక అవీచెప్తాను.దీనిలో బీటా కెరోటిన్ ఉంటుంది,అది శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది, విటమిన్ సి ఉంది.చక్కెర వ్యాధి రానివ్వ దు, వున్నా తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. పీచు పదార్ధము ఎక్కువగా ఉండటాన కొలెస్టరాల్ను తగ్గిస్తుంది. గుమ్మడితో విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ వంటి శరీరానికి మేలు చేసే పోషకాలున్నాయి. గుమ్మడి విత్తనాలు తినడం వలన మల బద్ధకం నివారణ ఆవుతుంది. లేత ఆకుల కూర ఆమ్ల దోషన్నీ, వాతము, గుల్మము, జ్వరము, ఉబ్బులనుపోగొడుతుంది. అందుకే వీటిని రోజూ ఒక ప్రమాణంలో దానిలో కలప వలసిన బెల్లం, చింతపడు,ఇంకాఇతర పదార్థాలను తగుపాళ్ళలో కపిలి వండించి జమీందారుగారికి ఇవ్వటాన వారికి కాల విరోచనమై ఆకలి కలుగుతున్నది. ఒక్కో ఇబ్బందీమాయమ వు తున్నది . ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతున్నది.

మన భారతీయ ఆయుర్వేదవైద్యం ఆంగ్లవైద్యానికి పోటీగా వ్యాధినివా రణ చేస్తుంది. ఐతే జాగ్రత్తగా పాళాలుగమనించుకుని తినిపించాలి. ఇది మందు కాదు ఆహార మార్పు మాత్రమే. " అనివివరించాక వారు నోరెత్తలేదు.

మాధవ వర్మ , దివానూ కూడా ఆవివరాలకు ఎంతో సంతోషించి, అతడి ని తన ఆస్థాన వైద్యునిగా నియమించుకుని, సభ ఏర్పరచి లక్ష వరహా లను కానుకగా ఇవ్వగా, బిషగ్వరుడు" ప్రభూ ! ఈ కానుక కోసం కాదు నేను తమకు వైద్యం చేసింది.మీఆరోగ్యం సరైతే అందరికీ ఆయుర్వేద వైద్య విలువతెలిసి అంతా హాయిగా,ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే. ఈధనంతో మన జమీలో ఒక ఉచిత ఆయుర్వేద వైద్యశాల నిర్మించి పేద లందరికీ వైద్యం అందించే ఏర్పాటు చేయమని నా మనవి, అంతే కాక నేను ప్రజావైద్యశాలపేర మీరు నిర్మించే వైద్యశాలలో పేదలందరి కీ ఉచిత వైద్యం అందించాలని కోరుకుంటున్నాను." అనగానే సభ అంతా కరతాళ ధ్వనులతో మారు మ్రోగిపోయింది.

***

మరిన్ని కథలు

Saralamaina dhyasa
సరళమైన ధ్యాస
- బివిడి ప్రసాద రావు
Praptam
ప్రాప్తం
- బోగా పురుషోత్తం.
Phone poyindi
ఫోన్ పోయింది
- జి.ఆర్.భాస్కర బాబు
Amma
అమ్మ
- B.Rajyalakshmi
Prema oka natakam
ప్రేమ ఒక నాటకం
- బొబ్బు హేమావతి
Vupayam tho tappina apaayam
ఉపాయంతో తప్పిన అపాయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.